ప్రాచీనకాలం నాటి పాకపూరీ
డా|| జి. వి. పూర్ణచందు
“ఆఁడుదాని
జంపిన తఁడేక వింశతి/ దూష్య నరకవాస దుఃఖ మొందు
నన్న దధి పయో ఘృతాపూప హరణముల్/
మక్షికాది కీటమయత సేర్చు”
మహాభారతం అనుశాసనిక పర్వంలో
స్త్రీని చంపితే ఇరవై ఒక్క నరకాల్లో ఉన్నంత దుఃఖం కలుగుతుందని, అన్నం, పెరుగు, పాలు, నెయ్యి, అపూపాలు వీటిని కల్తీ చెయ్యటం లేదా
దొంగిలించటం వలన ఈగల్లా దోమల్లా పుడతారనీ ఉంది. అన్నం, పెరుగు,
పాలు, నెయ్యి, అపూపాల్లో
కల్తీలు మోసాలకు పాల్పడే దొంగలందరికీ ఈ శాపం తగుల్తుంది.
ఋగ్వేద కాలంలో తీపి కలిపి కాల్చిన
మందపాటి రొట్టెల్ని అపూపా లన్నారు. అప్పచ్చులు, అప్పాలంటే ఇవే!
స్వీట్ షాపుల్ని అపూపశాల అనీ, స్వీట్స్ మార్కెట్‘ని అపూప విపణి అని, షడ్రసోపేతమైన భోజనాన్ని
అపూపభోజనం అనీ అనేవాళ్లు. ఈనాటి రకరకాల స్వీట్లకి ఈ అపూపాలే మూలం. అపూప –పూప-పువా-మాల్‘పువా గా ప్రసిద్ధమయ్యాయి.
ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే
తలనొప్పి వ్యాధిలో మెడ, కళ్ళు, కణతలు,
దవడల దగ్గర విపరీతంగా నొప్పి ఏర్పడుతుంది. ఆయుర్వేదంలో దీన్ని
అనంతవాతం అన్నారు. ఈ వ్యాధికి ఔషధాలతో పాటుగా “మధుమస్తక
సంయావ ఘృతపూరైశ్చ భోజనం” అంటూ మూడు రకాల తీపి వంటకాల్ని కూడా
తినాలని సుశ్రుత సంహిత (ఉత్తరస్థానం) సూచించింది. మధుమస్తక అంటే తేనెతో బొబ్బట్లు,
సంయావ అంటే గోధుమపిండి హల్వా, ఘృతపూర అంటే
మాల్పువా వీటిని తింటే తలనొప్పి తీవ్రత తగ్గుతుందని ఉంది.
అపూప, ఘృతపూర, ఘేవర, రసపూరీ, మాల్ పువా,
పూప ఇలా వివిధ కాలాలలో వివిధ రకాల పేర్లతో దీన్ని పిలిచారు. బెల్లం,
గోధుమపిండి కలిపి మర్దించి వేగించినచిన పూరీల్ని పాకంలో నానబెడితే
దాన్ని పూపాలిక అన్నారు. దేశవ్యాప్తంగా మాల్‘పువా అనే
అప్పచ్చిగా ఇది ఇప్పుడు ప్రసిద్ధి, బంగ్లాదేశ్ వాళ్లు
అరటిపండు, కొబ్బరి, గోధుమపిండి,
పాలు పోసి మాల్‘పువాని అరిశల మాదిరిగా వండి
పాకంలో నానబెడ్తారు. ఒడీసాలో తీపి పూరిని వేగించి పంచదార పాకంలో నానిస్తారు.
పాకిస్తాన్లో పూరీనీ, హల్వానీ కలిపి నంజుకుంటారు.
‘పాకంలో నానబెట్టిన పూరీ’ అనే అర్థంలో తెలుగు వాళ్లు నిన్నమొన్నటి దాకా వీటిని “పాకపూరీ”లనేవాళ్లు. ఇటీవలి కాలంలో ఈ పేరు వదిలేసి
మాల్‘పూరీ అంటున్నారు. పాలలో పంచదార వేసి గుజ్జుగా ఆయ్యేలా
మరిగిస్తే బాసుందీ లాగా పల్చని పాలకోవా వస్తుంది. శ్రీనాథుడు దీన్ని ‘గుజ్జుగా కాచిన గోక్షీరపూరంబు’ అన్నాడు ఇందులో
నేతితో వేగించిన గోధుమపిండి, కొద్దిగా ఏలకులపొడి, పచ్చకర్పూరం తగినంత నెయ్యి లేదా వెన్నకలిపి పక్కన ఉంచుకోవాలి. పంచదార
జారుపాకం పట్టి ఓ గిన్నెలో పోసి, వేగించిన మందపాటి పూరీల్ని
ఒక్క టొక్కటే ఈ పాకంలో మునిగేలా ఉంచాలి. పూరీ మెత్తబడ్డాక దానికి ఒకవైపు దట్టంగా
పాలకోవా పట్టించి మధ్యకు మడిస్తే, అదే ‘మాల్ పూరీ’! మడిచిన తీపి పూరీ కాబట్టి ఇది
తెలుగువారి స్పెషల్ ‘మాల్‘పువా’
అనొచ్చు. కృష్ణాగుంటూరు జిల్లాల్లో దీనికి ప్రసిద్ధి.
అపూపని బార్లీ పిండితో, ఘేవరని బియ్యప్పిండితో, మాల్పువాని గోధుమపిండితో
చేసేవాళ్లు. గత శతాబ్ది కాలంలో హానికారక మైదాపిండి వచ్చాక ఇంక గోధుమపిండి కనుమరుగై
పోసాగింది. క్షేమకుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథంలో “సుశాలి
పిష్టం దుగ్ధేతు క్వధితం” అంటే బియ్యప్పిండిని చక్కెర
పానకంతో పూరీవత్తి నేతితో వేగించి పంచదార పాకంలో నాననిస్తే, దాన్ని
ఘృతపూరీ అన్నాడు. ప్రస్తుతం ఉత్తరాదిలో మాల్‘పువ పేరుతో
వీటినే అమ్ముతున్నారు. వీటికి మన ‘పాకపూరీలా’ పాలకోవా లేపనం ఉండదు.
“ఘృతపూరో గురువృష్యో హృద్యం పిత్తానిలపః|
సద్యః ప్రాణప్రదో బల్యః సురుచ్యోఽగ్నిప్రదీపనః” ఈ పాకపూరీ లేదా మాల్‘పూరీ వంటకానికి వేడిని వాతాన్ని
తగ్గించే శక్తి ఉంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆలస్యంగా అరుగుతుంది. దండిగా
ఉంటుంది. తక్షణ శక్తినిస్తుంది.
ప్రాణప్రదమైనదని క్షేమకుతూహలం పేర్కొంది. సాధ్యమైనంత వరకూ మైదాపిండి,
శనగపిండి కలవకుండా ఉంటే ఇది మేలు చేస్తుంది. ఎదిగే పిల్లలకు,
కృశించిపోయే వ్యాధులున్నవారికి ఇలాంటి వంటకాలు మంచి నిస్తాయి.
No comments:
Post a Comment