Wednesday, 1 May 2019

పెట్టెలో న్యాయం డా. జి వి పూర్ణచందు


పెట్టెలో న్యాయం
డా. జి వి పూర్ణచందు
తల ముచ్చుట్టులు దిరిగినఁ దలపోయఁగ నోరిలోనిదయ కడి యన్న
ట్లిల నే తెఱఁగులఁ దిరిగినఁ గలుగదు గతి విష్ణుసేవ గావింపకయున్
(పాండురంగ మహత్మ్యము చతుర్థాశ్వాసము-276)
అధికారం సిద్ధాన్నం లాంటిది. చక్కగా వండి, వార్చి, వడ్డించి, ఇంక తింటానికి సిద్ధంగా ఉన్నది సిద్ధాన్నం. గెలిచి అధికారంలోకి వచ్చింతర్వాత ఐదేళ్లు ఎలా తిరిగినా ఎంతవాడైనా చివరికి మోక్షం కోసం బ్యాలెట్ పెట్టెలో పడక తప్పదు. మన రాజ్యాంగం అలా రాసి పెట్టింది. ఇంద్రపదవి లాగా ప్రజాస్వామ్య పదవులకు శాశ్వత హక్కు భుక్తాలు లేవు కదా!
ఒక వేళ ఏ కారణం చేతయినా, ఇంద్రుడు మారవలసి వచ్చినా, ఇంద్రాణి మారదట! పాత ఇంద్రుడి రాణి కొత్త ఇంద్రుడితో సంసారం కొనసాగిస్తుంది!! సిద్ధాన్నం అంటే ఇదే! ఇంద్రాణి ఎన్నటికీ విధవకాదు అని కదా ఆర్యోక్తి!.
ప్రజాస్వామ్యంలో కూడా పాత ఇంద్రుడే కొత్తగా వచ్చినా లేక, కొత్త ఇంద్రుడే కొత్తగా వచ్చినా పాత ఇంద్రాణి సిద్ధంగా ఉంటుంది. అధికారం, అధికార గణం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. అధికారం కొత్తగా రావచ్చు గానీ, ఇంద్రాణిలా పాత అధికారగణమే కొనసాగుతుంది. కొత్త సీసాలో పాత సారా లాగా పాత సంసారాన్నే కొత్త ఇంద్రుడు కొత్తగా చేయాల్సి వస్తుంది. తనకు నమ్మకం ఉన్నా, లేకపోయినా పాత పోలీసులతోనే, పాత అధికారులతోనే కొత్త ఇంద్రుడు కొత్తకాపురం చేయకా తప్పదు.
అధికారానికి ఆఖరి మజిలీ బ్యాలెట్ పెట్టె! దాంట్లో పడకుండా ఒక్క అంగలో ఆవలిగట్టుకు దూకేద్దామని ఎవరైనా అనుకుంటే కుదరదు. అధికారాన్ని, అధికారగణాన్నీ అదుపులో పెట్టుకుని ప్రజలే దేవుళ్లనే భావనతో సేవచేసుకుంటే చివరి మజిలీలో ప్రజాదేవతలు మోక్షం ప్రసాదిస్తారు!
పాండురంగ మహత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు పైన పేర్కొన్న పద్యంలో పరోక్షంగా ఈ సందేశాన్నే ఇస్తున్నాడు: “అన్నం ముద్ద చేతిలో పుచ్చుకుని మూడుసార్లు తలచుట్టూ తిప్పి వెదికినా దాన్ని వేసేందుకు నోరు తప్ప ఇంకో చోటు దొరకదు...ఎంత ఆలోచించినా! ఎలా తిరిగినా చివరికి మోక్షం కోసం విష్ణుసేవ తప్పదు...” అని పై పద్యానికి తాత్పర్యం! దాన్ని నేటి కాల మాన పరిస్థితులకు అన్వయించుకో గలగటమే విఙ్ఞత.
“తల ముచ్చుట్టులు దిరిగినఁ దలపోయఁగ నోరిలోనిదయ కడి” చేత్తో అన్నం ముద్ద పుచ్చుకుని, మూడుసార్లు తలంతా వెదికినా నోరు తప్ప ఇంకో చోటు దొరకదు దాన్ని వెయ్యటానికి! అధికారం అనే సిద్ధాన్నం కూడా అంతే! చివరికి అది బ్యాలెట్ పెట్టెలోకి చేరక తప్పదు! ఎలా వండావు? ఎలా వడ్డించావు? ఎలా తిన్నావు? నీ వంటకం రుచి ఏమిటి? అది ఘాటా? చేదా? తీపా? అనేవి నిర్థారణ అయ్యేది అక్కడే!
ప్రత్యర్థులమీద వీరంగం ఆడుతూ, వేపమండలు పుచ్చుకుని ఆడే గణాచారిలాగా వేసిన చిందుల్ని కాదు, చేసిన జనపూజకే మార్కులు పడతాయని దీని భావం.
నీ వంటకంలో స్వార్థం ఉంటే బ్యాలెట్ పెట్టె నిన్ను నరకానికి తోస్తుంది. సేవ ఉంటే, చేవ ఉంటే నిన్ను స్వర్గానికి మోసుకెడ్తుంది. దేహానికి నోరు ఎలాంటిదో దేశానికి బ్యాలెట్ పెట్టె అటువంటిది. అధికారం అనే సిద్ధాన్నాన్ని కులమతాలతో రంగరించి వండి ఆ బ్యాలెట్ పెట్టెలో వేస్తే, మలమూత్రాలు తప్ప సారం ఏదీ లేక మోక్షప్రాప్తి జరగదనే హెచ్చరిక ఇందులో ఉంది. భక్తిప్రపత్తులతో మడిగా, శుచిగా వండి ప్రజాదేవతకు మహానివేదన పెట్టిన ‘జనసేవాభోజనం’ మోక్షప్రాప్తినిస్తుంది!
ఇది రాజకీయ బేతాళులకు మాత్రమే వర్తించే సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో మనకూ వర్తిస్తుంది. చచ్చాక రంభాదుల్తో కులుకునే మోక్షం  అనే భావనని మన మునిపుంగవాలు మనలో భాగా ఎక్కించారు. కన్యాశుల్కం  నాటకంలో
కరటక శాస్త్రి “కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్నవూళ్లో యాంటీనాచి, పరాయివూళ్లో
ప్రోనాచి; కొందరు శరీరదార్ఢ్యం వున్నంత కాలం ప్రోనాచి, శరీరం చెడ్డతరవాత యాంటీనాచి; కొందరు బతికివున్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయిన తరువాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చిన తరవాత కూడా ప్రోనాచే. అనగా యజ్ఞంచేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్పప్రజ్ఞకలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె” అంటాడు.
ఇక్కడో(భూమ్మీద)  అక్కడో(స్వర్గంలో)ఎక్కడో ఒకచోట ప్రోనాచ్చి అనగా వ్యభిచారం చేయాలనే యావ తప్ప మోక్షానికి మరో అర్థం లేదు! ఎటు తిరిగీ తిరిగి అధికారం వచ్చే అవకాశం లేదనే నమ్మకంతోనే అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి, యాంటీనాచ్చిగా ఉండి ఏం ప్రయోజనం...? అంటాడు!
మూటలు కట్టుకోవటానికి రాజ్యాంగం ఐదేళ్ళ సుదీర్ఘ వ్యవధి ఇచ్చింది. ఆ తరువాత తట్టాబుట్టా సర్దుకునేప్పుడు హడావిడి పడి సాధించేదేం ఉంది? అధికారంలో ఉన్నవాడు ప్రజలే దేవుళ్ళుగానూ, జనసేవే విష్ణుసేవగానూ భావించుకుంటే బ్యాలెట్ పెట్టె న్యాయం చేస్తుందని, ఆ ‘పెట్టెలో న్యాయం’ కోసం పాకులాడాలి!

No comments:

Post a Comment