Wednesday 1 May 2019

అలనాటి ఘుమఘుమలు డా. జి వి పూర్ణచందు


అలనాటి ఘుమఘుమలు
డా. జి వి పూర్ణచందు
ఒక కొన్ని వడియంబు లొక కొన్ని వరుగులు/నొకకొన్ని తెఱఁగుల యొలుపుఁ పప్పు
లొకకొన్ని ద్రబ్బెడ లొకకొన్ని తాలింపు/లొకకొన్ని  విధముల యొఱ్ఱచేరు
లొకకొన్ని కలకల్పు లొకకొన్ని బజ్జులు/నొకకొన్ని రీతుల యూర్పువగలు
నొకకొన్ని సిగరులు నొకకొన్ని యంబళ్లు/నొకకొన్ని  వహులవూపోత్కరములు
వివిధ ఫలకందమూలలంబు లవియుఁ గొన్ని
యూరుఁబిండులు నొకకొన్ని యొక్కకొన్ని
యూరుఁ గాయలు బచ్చళ్లు నొక్కకొన్ని
పెరుగు పాల్ తేనె నేఁతులు పెచ్చుపెరుగ
(పాండురంగ మహాత్మ్యము -4-184)
తెనాలి రామకృష్ణుని కేవలం వికటకవిగానూ, కొంటెకవిగానూ చూస్తారు గానీ, 500 యేళ్ల క్రితం నాటి ఆంధ్రప్రజల ఆహార విహారాలు, వాళ్ల సామాజిక జీవన పరిస్థితుల గురించి పెద్దన కవిత్వంలోకన్నా ఈయన కవిత్వంలో చాలా విశేషాలు కనిపిస్తాయి. విషయంలో రామలింగకవి, కృష్ణదేవరాయలు పోటీ పడ్డారని చెప్పవచ్చు కూడా!
సీసపద్యంలో రామలింగకవి సుశీల అనే ఆవిడ వండిన కొన్ని వంటకాలను ప్రస్తావించాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర కర్తలు ఈ వంటకాలలో చాలా వాటిని గుర్తించలేదు. విఙ్ఞుల పరిశీలనకు వదిలేశారు. వాటిని వరుసగా పరిశీలిద్దాం:
1.     వడియాలు: మినప్పిండి చిన్న ముద్దలుగా పెట్టి ఎండలో ఎండిస్తే వడియాలంటారు. వీటిని ఎండిన తరువాత నూనెలో వేయించవచ్చు. లేదా కూరల్లో కలగలుపుగా చేర్చవచ్చు.
2.    వరుగులు: వరుగైనవంటే ఎండి శుష్కించినవని అర్థం. కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు రాసి నీరు తీసేసి గలగలలాడేలా ఎండిస్తే వాటిని వరుగు లంటారు. వంగవరుగులు, కాకరవరుగులు, మామిడి వరుగులు, చేప వరుగులు (ఎండు చేప) తెలుగిళ్లలో ప్రసిద్ధి. కూరగాయలు దొరకని కాలంలో కూడా కూర వండుకోవటానికి ఈ వరుగులు ఉపయోగపడతాయి.
3.    వొలుపు పప్పులు: పొట్టు తీసిన కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు లేదా శనగపప్పుతో వండిన పప్పు.
4.    ద్రబ్బెడలు: ఈ వంటకం గురించి ఏ నిఘంటువులోనూ వివరాలు కనిపించలేదు. అయితే, పోతనగారు “మాడు ద్రబ్బెడ”ను ప్రస్తావించాడు. మూలభాగవతంలో ‘స్థాలీపురీషం’ అనే పదానికి ఇది పోతనగారి అనువాదం. స్థాలీపురీషం అంటే కుండలోపల అంటుకుని ఉన్న అన్నం మాడు. అన్నం మాడితే అది మాడు ద్రబ్బెడ అవుతుంది. అన్నం మాడకుండా సుగంధ ద్రవ్యాలతో వేగితే అది ద్రబ్బెడ అవుతుంది కదా! బహుశా ఫ్రైడ్ రైస్, పలావ్ లేదా బిరియానీ లాంటి వంటకం ద్రబ్బెడ కావచ్చు.
5.    తాలింపులు: సుగంథ ద్రవ్యాలను చేర్చి ఘుమాయించేలా తిరుగమోత లేదా తాలింపు పెట్టి వండిన ఇగురుకూరలు.
6.    యొర్రచేరులు: బాగా ఘాటుగా కాచిన మిరియాల చారు (రసం).
7.    కలకల్పులు: పప్పన్నం అంటే ఉత్తపప్పు అన్నమే! ఈ పప్పులో మామిడికాయ లేదా బీర, సొర, దోస లాంటి కూరగాయలు, ఆకు కూరల్లో దేన్నైనా చేర్చి వండిన పప్పును కలకలుపు పప్పు అంటారు.
8.    బజ్జులు: వంకాయ, దోసకాయ లాంటి కూరగాయల్ని నిప్పుల మీద కాల్చి ఉప్పు కారం కలిపి తాలింపు పెట్టిన పచ్చడిని బజ్జు లేదా బజ్జీపచ్చడి అంటారు.
9.    ఊర్పువగలు: ఉలవచారు లేదా పచ్చిపులుసు. దీన్నే పడిదం అనికూడా పిలిచేవారు. వెన్నపడిదం అంటే క్రీము కలిపిన ఉలవచారు.
10.  సిగరులు: ఇది శిఖరిణి అనే తీపి లస్సీ లాంటీ పానీయానికి తెలుగు రూపం.
11.  అంబళ్ళు: రకరకాల సూపులు
12.  పూపోత్కరములు: పూపాలు అంటే అపూపాలు అని ఋగ్వేదంలో పిలువబడిన అప్పచ్చులు. వీటినే అప్పాలు అని పిలుస్తున్నాం. అపూప అనేది ద్రావిడ భాషా పదం అనీ, ఋగ్వేదంలోకి చేరిన అరువుపదం అనీ ఎఫ్ బీ జే క్వీపర్ అనే పండితుడు నిరూపించాడు.
13.  ఊరుబిండులు: ఊర్బిండి అనేది మినప్పప్పును రుబ్బి అందులో తగినంత ఉప్పుకారాలు చేర్చి, తాలింపు పెట్టుకుని అన్నంలో పచ్చడిలాగా తింటారు. పెసరపప్పు లేదా శనగపప్పుతో కూడా ఊర్బిళ్లు చేసుకోవచ్చు.
తెనాలి రామకృష్ణుడు అటు నవరసాలూ, ఇటు షడ్రసాలూ తెలిసిన రసికుడు. సుశీల వండిన ఈ కమ్మని వంటకాల ఘుమఘుమలు మీదికి ఆకాశం వైపుకు వ్యాపిస్తుంటే, మైమరచి ఆకాశంలోంచి దేవతలు పూలవానలు కురిపించారు. కిందికి వ్యాపిస్తున్న ఈ పూల పరిమళాలూ, పైకి విస్తరిస్తున్న ఆ ఘుమఘుమలూ మధ్యలో కలుసుకుని పరస్పరం ఆలింగనం చేసుకున్నా యంటాడు.
శ్రీనాథుడి తరువాత అంత గొప్పగా సామాజిక జీవనాన్ని ప్రతిఫలించేలా కావ్యరచన చేసిన వాడు ఈయనే! ఈ
తరానికి తెలియని కొన్ని వంటకాలను ఈ పద్యంలో ఆయన ప్రస్తావించాడు. మన పూర్వులు ఇప్పటి మనలాగానే  ఫ్రైడ్ రైసు తిన్నారు. పచ్చిపులుసుని వెన్నతో కలిపి తిన్నారు. కానీ, వాటికి గల ద్రబ్బెడ, ఊర్పు లాంటి పేర్లు అదృశ్యం అయిపోయాయి. 500 యేళ్ల కాలంలో ఇంత మంచి పేర్లను ఎలా మరిచిపో గలిగామో ఆశ్చర్యమే!
భాష మరణించటం ఇలాగే జరుగుతుంది! భాషాపదాలు జనం వాడకం లోంచి తప్పుకుంటే అది భాషాపరమైన  ఆత్మహత్యా సదృశమే అవుతుంది.  
మన కళ్ళు పీజ్జా లాంటి ఇటాలియన్ వంటకాల కోసం వెదుకుతుంటే దేశీయం ఎలా గుర్తుంటుందీ? 

No comments:

Post a Comment