Wednesday 1 May 2019

కోడిపోడిమి డా. జి వి పూర్ణచందు


కోడిపోడిమి
డా. జి వి పూర్ణచందు
“పారిజాతపుఁబూవునాఁబరగుఁ జూడు
తామ్రచూడంబు చూడాపథంబు జొత్తు
దర్పభరమున బ్రహ్మరంథ్రంబు నడుము
జించి వెడలిన క్రోథాగ్నిశిఖయుఁబోలె”
(శ్రీనాథుడు క్రీడాభిరామం నుండి)
అజ్జవాలు, అడవికోడి, ఎర్రకోడి, కారుకోడి, బురకోడి, బెగ్గోడి (పెద్ద కోడి), మాముకోడి, మునుగు కోడి, నెమలి కోడి, మెట్టవాలు పిట్ట, శిఖ=కోడి, నీరుకోడి ఆస్ట్రిచ్చ్ పక్షిని ఒంటె కోడి అంటారు. ఇలా కోడి పక్షుల్లో చాలా రకాలున్నాయి. వాటి శరీరావయవాలక్కూడా దేని పేరు దానికుంది. ఆరెబొట్టే అంటే కోడికాలికి వెనకవైపున ఉండే పెద్ద గోరు.
ఈ పద్యంలో శ్రీనాథుడు కోడితో ఇంకో కోడి పోరాడటానికి తలపడినప్పుడు ఆ కోడిలోని పోరితనాన్ని వర్ణిస్తున్నాడు. కోడిపుంజు నెత్తిన ఉండే ఎర్రశిఖని తొడిమ ఎర్రని పారిజాతం పూవుతో పోలుస్తూ, “దర్పభరమున బ్రహ్మరంధ్రంబు నడుము జించి వెడలిన క్రోథాగ్నిశిఖయు బోలె” ఉన్నదంటాడు.
ఈ జగజ్జెట్టి  కోడి పుంజులు మెడలు నిక్కిస్తూ, రెక్క లల్లారుస్తూ, కొక్కొక్కొ అంటూ కాలుదువ్వుతుంటాయి. బాగా కొవ్వుపట్టిన ఆ ఎర్రకోడిపుంజు  తరళ తారకోద్వృత్త రక్తాంత లోచన మండలంలా ఉన్నదంటాడు.
ఒకదానితో ఒకటి ఎగిరి గుద్దుకొంటూ, చురచుర చూస్తూ, కోపాన్ని ప్రదర్శిస్తూన్నాయి.
వాటి కాలివ్రేళ్ల నుండి నెత్తిన ఎర్రశిఖ వరకూ నిక్కించి గాలికెగిరి,  వక్షస్థలాలు పగిలి చిందరవందర అయ్యేలా ఒకదానికొకటి గుద్దుకుని, తలకాయలు పగిలి ధారాపాతంగా నెత్తురుకారేలా పొడిచి కరచి గాయపరుచుకుంటున్నాయి.  
ఒకదాన్నొకటి  అడిచిపెట్టి, ఒడిసిపడుతుంటే, దానికి అందకుండా తప్పించుకుంటూ సడి సప్పుడూ లేకుండా కాళ్లకిందకు దూరి, చీరుతున్నాయి.
మాటిమాటికీ ఘాటఘాట అంటూ  కోళ్లు ఉక్కు కత్తుల్లాంటి ముక్కుల్తో గట్టిగా పొడుస్తున్నాయి. వంకర తిరిగిన కొంకికత్తుల్ని ఎదుటి కోడి కడుపులో దిగేలా పొడిచి, చించి చెండాడుతున్నాయి.
వాటి శౌర్య పరాక్రమాలు, వీరప్రతాపాలు అమోఘం. ఈ కోడి పోడిమిని ప్రదర్శించే వాహ్యాళీ స్థలంలో నెత్తురోడుతుంటే, పోటుగండడులాగా అవి రొప్పుతున్నాయి. గాయాల కారణంగా మూర్ఛాంధకారంలో మునుగుతున్నాయి” అని వర్ణిస్తాడు శ్రీనాథుడు.
“కుమారస్వామి వాహనాల్లారా! మంత్రదేవతా స్వాములారా! సమయానికే నిద్రలేపే కాలవిఙ్ఞానపాక కోవిదులారా! అహల్యను  వేశ్యగా చేయటానికి కారణమైన పక్షులారా! భూతభుక్తి కుంభార్హులారా! బలాత్కార కామందులారా! నిరంకుశ మహాహంకార నిధులార! కామవిజయ కాహళములార!” అంటూ వాటిని కొంచెం పొగుడుతూ కొంచెం తిడుతూ స్తుతించాడు.
ఇంతకీ ఈ కోడిపుంజులూ ఎందుకు కొట్టుకుంటున్నట్టు...? ఒకదానిమీద ఒకటి ఎందుకు కాలు దువ్వుకుంటున్నట్టు...?తాను గెలిచినా తనకు గండపెండేరాలు తొడగరుగదా...? తమ మీద పందాలు కాసినవారికోసం  తామెందుకు గాయాలపాలు కావాలి...? రాజకీయపార్టీల కార్యకర్తలు పార్టీ నాయకుల కోసం తమ బతుకుల్ని నాశనం చేసుకున్నట్టు!
 “హా! ఖగేంద్రములార! కయ్యమున నీల్గి
పోవుచున్నారె దేవతాభువనమునకు
మీరు రంభా తిలోత్తమా మేనకాది 
భోగకార్యార్థమై కోడిపుంజులారా!” 
స్వర్గంలో రంభ, తిలోత్తమ, మేనకాది అప్సర స్త్రీలతో పొందు కోసం ఆత్రపడి కయ్యంలో ఓడి వెళ్లి పోతున్నారా...?” అనడుతున్నాడు శ్రీనాథుడు.
తనను అప్పటిదాకా బాదం, పిస్తా, జీడిపప్పు వగైరా పెట్టి మేపినందుకు కృతఙ్ఞతగా కోడి తన యజమాని కోసం ప్రాణత్యాగం చేస్తోంది. కోడి ఎంత లావుదైనా అది కూరగా మారటం కోసమే పుట్టింది కూరగా మారటానికి ముందు తన యజమానికి పందెంసొమ్ము కూడా ఇప్పించి పోవాలని దాని యావ.
రాజకీయపార్టీల కార్యకర్తలకు ఈ కోడితత్వం ఎక్కువ. ఇప్పుడు రాష్ట్రంలో అన్నీ అన్నలపార్టీలే కదా! తన ‘అన్న’ కోసం రొమ్ము చీల్చుకుని, రుధిరమ్ము కార్చుకుని త్వరగా స్వర్గంలో రమ్ము త్రాగటానికి, రంభను తాకటానికి ఉవ్వుళ్లూరి్పోతుంటారు. తమ అన్నలు పొందులూ, పొత్తులూ ప్రతీ సారీ మార్చేసుకుంటుంటే, తమ్ముడు కోళ్లు అప్పటి దాకా కలిసి తిరిగిన వాడిమీదే కత్తి విసరాల్సి వచ్చినా పట్టించుకోవు.
కోడికి విచక్షణ ఉండదు. కార్యకర్తలకూ ఉండదు. కోళ్లకు “యూ టర్ను”లుండవు. అసలు ఏ టర్నులూ ఉండవు. ఎదురుగా దేన్ని చూపిస్తే దానిమీదకు దూకుతాయి... అచ్చమైన రాజకీయపార్టీ కార్యకర్తల్లా!
తమకోసం, గానీ, తమ జాతికోసం గానీ బావుకునేదేమీ లేకపోయినా,  కోడిరక్తం ఉడుకుతూనే ఉంటుంది...ఎప్పుడూ!


No comments:

Post a Comment