అక్కభాష
డా. జి వి పూర్ణచందు
తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును
దానివలన కొంతగానంబడియె
కొంతదాన కలిగెనంతయు నేకమై
తెనుగు బాస నాగ వినుతికెక్కె!
(ఆంధ్రభాషాభూషణము)
కేతన రాసిన ఆంధ్రభాషాభూషణమే మొట్టమొదటి తెలుగు
వ్యాకరణ గ్రంథం. ఆయన కాలానికి సంస్కృతమే అన్ని భాషలకూ తల్లి అని అంగీకరించి
తీరాలనే భావన ఉండేది. ఎవరైనా మనబోటి కవి కాదంటే చాలా తీవ్రపరిస్థితులు
ఎదుర్కోవలసివచ్చేది. సంస్కృతం దేవభాష కాబట్టి, దాన్ని ఏ రకంగా తక్కువ చేసినా
దైవనిందగా భావించేవారు. భక్తి ప్రాధాన్యత సంస్కృతంతో పెనవేసుకుని సాగింది కాబట్టి!
ధర్మరాజు “అశ్వత్థామ హత:-కుంజరః” అన్నట్టుగా కేతన
కవి ఆంధ్రభాషాభూషణం అనే తెలుగు వ్యాకరణ గ్రంథంలో ఈ పద్యాన్ని వీణ నొక్కులు
నొక్కుతూ చెప్పాడు. అన్ని భాషాలకూ తల్లి సంస్కృతమే ఆంటారుగానీ, సంస్కృతంలోంచి కొంత
పదసంపద తెలుగులోకి చొరబడినమాట నిజమే కానీ, “కొంతదాన కలిగె” కొంతయిన దానికంటూ ప్రత్యేకమైన
వ్యాకరణం వగైరా తెలుగు భాషకు ఉన్నాయి-అనేది పై పద్యంలో అంతరార్థం. తెలుగు
స్వతంత్రభాషేగానీ, అందులోకి సంస్కృతం చొరబడి దాని స్వభావాన్ని మార్చేసిందని కేతన
కవి మనసులోని మాటగా మనం అర్థం చేసుకోవచ్చు.
“తెలుగున గల భేదంబులుఁ/తెలుగై సంస్కృతము చెల్లు
తెఱఁగులుఁ దత్సం/ధులును విభక్తులు నయ్యై /యలఘు సమాసములుఁ గ్రియలు నవి యెఱిఁగింతున్”
అంటూ, తెలుగు భాషకు స్వంతం అనదగిన అంశాల్ని, తెలుగుగా మారిపోయిన సంస్కృత విశేషాల్నీ,
ఈ రెండు భాషల్లో ఉండే సంధుల్ని, విభక్తుల్ని, సమాసలనూ, క్రియలనూ తన ఆంధ్రభూషణము
వ్యాకరణ గ్రంథంలో తెలియజేస్తానని ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాడు కేతన కవి.
ఆధునిక యుగంలో తెలుగు భాష కోసం అంకితమై
జీవించిన త్యాగధనుల్లో మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు ఒకరు. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా తెలుగుమాటల
సృష్టికోసం ఎక్కువగా ప్రయత్నించిన మహనీయు డాయన. ఆయన సృష్టించిన చక్కని తెలుగుపదాలు మచ్చుకు కొన్నిచూడండి:
చెయిరి’=‘క్రియ’
ఎక్కటి చేయి=‘అకర్మక క్రియ’
తొలిరూపు=ప్రాచీన పదము, మూలము
నాటినుడి=దేశ్యము
నుడితీర్పు=వ్యాకరణము
పేరుతోడు=విశేషణము
పేరునుడి=నామవాచకము
మచ్చు=ఉదాహరణము
సరిమణి=తత్సమము
పొత్తముల గుడి= గ్రంథాలయము
తెలుగులో చాలా విషయాలకు మాటలు కుదరక
సంస్కృతాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ప్రయత్నిస్తే మన తెలుగుకూ
మాటలు కరవు కాదనీ, లోపం మన ప్రయత్న లేమిదేగానీ, భాషదు కాదనీ రామచంద్రశాస్త్రిగారు అనేవారు.
కేతనకవి “కొంతదాన కలిగె” అన్నాడు కదా! తెలుగుకు
స్వంతం అయిన ‘ఆ కొంత’... తెలుగు భాషలోకి సంస్కృతం రాకముందు కలిగిందైతే, సంస్కృతం
తెలుగుకు చెల్లి కావాలే గాని తల్లి ఎలా అవుతుం?దని ప్రశ్నించారాయన. మిగతా భారతీయ
భాషలకు, ముఖ్యంగా ఉత్తరాది భాషల్లో చాలావాటికి సంస్కృతం తల్లి అయితే కావచ్చు.
కానీ, తెలుగు భాషకు మాత్రం సంస్కృతం చెల్లే అవుతుంది. మనది అక్కభాషే గానీ పిల్లభాష
కాదు!
ఇటీవలే పరమపదించిన ప్రసిద్ధ విమర్శకుడు డా.
ద్వా.నా.శాస్త్రి. మారేపల్లి
రామచంద్రశాస్త్రిగారి భాషా సేవ మీద ఎంఫిల్ పరిశోధన చేసినవాడు. తన మరణానికి కొద్ది
రోజులముందు డా. ద్వానాశాస్త్రి “తెలుగు పలుకుల కొలువరి మారేపల్లి
రామచంద్రశాస్త్రి(కవిగారు)” అనే లఘు గ్రంథాన్ని ప్రచురించాడు. కావాలని పట్టుబట్టి
నాతో దానికి నాలుగు పరిచయవాక్యాలు వ్రాయించాడు. అచ్చులో వెలువడిన ఆయన ఆఖరి పుస్తకం
ఇదే! ఈ పుస్తకంలో మారేపల్లివారి భాషా సేవగురించి ఈ తరం భాషావేత్తలకు,
భాషోద్యమకార్యకర్తలకు ఉపయోగపడే సమాచారం చాలా ఉంది. తమను తాము ఎక్కువ భాషాసేవకులుగా
చిత్రించుకుంటూ, వాడేం చేశాడు? వీడేం చేస్తున్నాడు లాంటి మాటలతో కాలక్షేపం చేసే
భాషోద్యమ వీరులు ఎక్కువయిన ఈ రోజుల్లో భాషే శ్వాసగా జీవించిన మహనీయుడు మారేపల్లి
రామచంద్రశాస్త్రిగారికి దక్కాల్సిన కీర్తి దక్కలేదు. గిడుగువారి వ్యావహారిక
భాషోద్యమానికి సమాంతరంగా తెలుగు భాషా పరిరక్షణోద్యమాన్ని ఆయన నడిపించారు.
వాడుకభాషా
యోధులు పురిపండా అప్పలస్వామిగారు మారేపల్లివారిని తెలుగు నలువ (బ్రహ్మ) అన్నారు. జాతీయోద్యమ
కాలంలో కాంగ్రెస్ ప్రచారం పక్కన పెట్టి, తెలుగుతల్లి కొలువే తమ మనుగడ పనిగా
చేసికొని ఆ తల్లిని గద్దె నెక్కించే లక్ష్యంతో “తెలుగు గుడి” పని ముఖ్యం అనుకుని
పాటుపడ్డా రాయన! ఆ మహనీయుడి కృషిని పదిలపరిచే ప్రయత్నం చేసిన ద్వా. నా. శాస్త్రి
చిరంజీవి!
No comments:
Post a Comment