Wednesday 1 May 2019

జనతా జనార్దనులు డా. జి వి పూర్ణచందు


జనతా జనార్దనులు
డా. జి వి పూర్ణచందు
రాష్ట్రవర్థన మెద గోరు రాజు మేలు
రాష్ట్రమును గోరు, దాన గార్యమె యనంగ
రాదు, బ్రహ్మోత్తరములైన ప్రజల యేక
ముఖపు గోర్కి దదంతరాత్ముండొనగడె!
(శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద 4-205)
సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ఆముక్తమాల్యద ప్రబంధకావ్యం పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. విష్ణుచిత్తీయం అనే మరో పేరుకూడా ఈ కావ్యానికుంది. ఈ పద్యంలో రాయలవారు రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి ఉండవలసిన ముఖ్యలక్షణాలు చెప్తున్నాడు.
యామునుడు ఓ వైష్ణవ పండితుడు. పాండ్యరాజు పరమ శైవుడు. యామునుడు పాండ్యసభలో శైవులమీద గెలిచి అర్థరాజ్యం సంపాదించుకున్నాడు. బ్రాహ్మణూడైనప్పటికీ రాజ సుఖాలు మరిగి శ్రీరామ మిశ్రుడనే చిన్ననాటీ స్నేహితుడిద్వారా వైరాగ్యాన్ని పొంది, చేసిన తప్పులు తెలుసుకుని, తనకొడుక్కి రాజ్యభారాన్ని అప్పగించి, తాను సన్యాసం స్వీకరిస్తాడు. పదవి దిగిపోతూ కొడుక్కి పాలనా మెళకువలు కొన్ని చెప్తాడు. అవన్నీ నేటికీ వర్తించే రాజధర్మాన్నీ, రాజనీతినీ తెలియచెప్తాయి.
ఉగాది నాడు పంచాంగ శ్రవణం లాగే, అప్పుడప్పుడూ ఈ యామునుడి సూక్తులు కూడా చెప్పించుకుని రాజకీయ పక్షాలవాళ్లు వింటూ ఉంటే కొంతయినా పాలనావ్యవస్థ పటిష్టంగా నడుస్తుంది.
          ‘రాష్ట్రం’ అంటే తన ఏలుబడిలో ఉన్న ప్రదేశం. దేశం అంటే మట్టి కాదు, మనుషులుకదా! రాష్ట్రం అంటే ప్రజలే! రాష్ట్రవర్థనాన్ని అంటే ప్రజల అభివృద్ధినీ, సంక్షేమాన్నీ మనస్సులో పెట్టుకుని (ఎదగోరి) పాలనా వ్యవహారాలు నడిపించా లంటాడు. అలా ప్రజా సంక్షేమం కోరిన పాలకుడికి తిరిగి అలాంటి మేలే కలగాలని ప్రజలు కోరుకుంటారు...! ప్రజలకు కీడు కలిగేలా పాలిస్తే పాలకుడిక్కూడా అలానే కీడు కలగాలని కోరుకుంటారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అని కదా సూక్తి! 500 యేళ్ళ క్రితమే, రాయలవారు ప్రజాక్షేమం కోరి పాలిస్తే ప్రజలు మళ్లీ మళ్లీ నిన్నే కోరుకుంటారని ఈనాటి పాలకులకు అర్థం అయ్యేలా యామునుడనే పాత్రద్వారా చెప్పించారు. కవి అయినవాడి దార్శనికత అలా ఉంటుంది.  
ప్రజల నామజపం ఎల్లవేళలా నేటి రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారుగానీ, ఒక్క మేలూ ప్రజలదాకా చేరే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పాతాళభైరవిలో రాజుగారి బామ్మర్దిలాంటి పాత్రలు పాలకుల చుట్టూ కమ్ముకుని ఉంటాయి. వాళ్లని దాటి ప్రజలవైపుకు చూడగిలిగేంత సావకాశం పాలకులకు ఉందదు. అదే చివరికి కొంప ముంచుతుంది.
“వాళ్లకు కళ్ళూ, చెవులకన్నా చేతులు ముఖ్యం! చేతిలో ఏది పడిందనేదే ప్రధానం. ఎంత చేసినా ఈ జనం అంతే! ఒక్కడికీ కృతఙ్ఞత ఉండదు, రెండుసార్లు ఇస్తే మూడోసారి ఇవ్వలేదుగా అంటారు. చిన్నపిల్లల తంతే!” అన్నాడు ఈ ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి.
“సరిగ్గా ఎన్నికల ముందు రోజు జనానికి డబ్బు చేర్చాం కాబట్టి మాకే ఓటు వేశారు. నాలుగురోజులు ముందే ఈ డబ్బు వాళ్లకు చేరి ఉంటే మా పార్టీ గంగలో కలిసిపోయుండేది. ఓటు వేసే నాటికి జనం అన్నీ మరిచిపోయుండేవారు” అని ఓ అభ్యర్థిగారి కన్నతండ్రి. ఇంకో అభ్యర్థిగారి పెదతండ్రి, ఎంపీ పదవిలోంచి దిగిపోబోతున్న ఓ పెద్దాయన పబ్లీగ్గానే అన్నాడు.
“చేసిన మేలుని మరిచిపోయే బాపతు ఈ జనం” అంటూ జన నింద చేసే రాజకీయనాయకులు కూడా ప్రజాస్వామ్యంలో ఉంటారని రాయలవారు ఊహించే, ఈ పద్యంలో ఇలాంటి పిచ్చివాగుడు వాగొద్దని పాలకులను హెచ్చరించాడు. “దాన గార్యమె యనంగరాదు” అన్నాడు. “జనానికి మేలు చేస్తే మనకేం ఒరుగుతుందని ఎప్పుడూ అనకు” అని హెచ్చరిక చేశాడు. ప్రజలే పరమాత్మ! ప్రజాభీష్టమే పరమాత్మ అభీష్టం. “బ్రహ్మోత్తరములైన ప్రజల యేకముఖపు గోర్కి” బ్రాహ్మణులు మొదలైన సమస్త సామాజికవర్గ ప్రజల కోర్కెల్ని “దదంతరాత్ముం డొనగడె” తత్=ఆ, అంతరాత్మ= దేవుడు, ఒనగడే= ఒనగూర్చకుండా ఉంటాడా ...? అంటున్నాడు.  
పాలించేవాడివి నువ్వు కాబట్టి, ప్రజలు ముందుగా నిన్నడుగుతారు. నువ్వు విని నెరవేర్చావా నీకే జేజేలంటారు. నువ్వు వినిపించుకో లేదనుకో భగవంతుడే వాళ్లను అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఐపు-అజ లేకుండా పోతావు అనే తీవ్రమైన హెచ్చరిక ఈ పద్యంలో కనిపిస్తోంది.
నువ్వు మింగిన కోట్లాది రూపాయలూ నీ నిజమైన బలం కాదు. దాన్ని మొత్తాన్నీ వెదజల్లినా నువ్వు తిరిగి గెలవ లేవు. నువ్వు గెలుస్తావనే నమ్మకంతో మాత్రమే నీ వెనక జేరి, నువ్వు తిట్టమన్నవాణ్ణి తిట్టమన్నప్పుడల్లా నోటికొచ్చినట్టు తిట్టిపెట్టే నీ వందిమాగథులు ఎవ్వరూ నీ నిజమైన బలం కాదు. తెల్లారేసరికి వైరిపక్షంలో చేరి నిన్ను తిడుతూ టీవీల్లో కనిపిస్తారు. తిట్టడం నీవు నేర్పిన విద్యే కదా! ప్రజాబలమే నీ నిజమైన బలం. ప్రజలు నిన్ను కోరుకుంటే నువ్వు పదవిలో ఉంటావు. అదే భగవదనుగ్రహం అంటే! ప్రజల్నే పరమాత్మ అనీ, జనార్దనుణ్ణి జనతా జనార్దనుడనీ, భావించి పాలిస్తే, పది కాలాలపాటు అంటే కనీసం రెండు పర్యాయాలు అధికారంలో ఉంటావని ఈ పద్యం స్పష్టంగా చెప్తోంది. ఇది కేంద్రం నుండి రాష్ట్రాలవరకూ పాలక ప్రతిపక్షాలందరికీ వర్తించే పద్యం.
   

No comments:

Post a Comment