Wednesday 1 May 2019

కళకళలు డా. జి వి పూర్ణచందు


కళకళలు
డా. జి వి పూర్ణచందు
"గాహాణయ గేయాణయతంతీ సద్దాణ పోఢ మహిళాణ
తాణం సొచ్చియ దండో జే తాణ రసం సయాణంతి"(గాథాసప్తశతి)
"గాథలందు గేయ గతులందు వీణెల
పలుకులందుఁ బ్రోడ మెలఁతలందుఁ
గలుగు మేలి రసము గనుఁ గొనలేనివా
రవని నున్న వారి కదియె శిక్ష" (రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారి తెనిగింపు)
గాథలు(కథతో కూడిన చిన్నకవితలు), గేయాలు, వీణ లాంటి వాయిద్యాలు వెలువరించే శ్రావ్యమైన సంగీత ధ్వనులు, అందమైన మగువలు వీటి స్వారస్యాన్ని కనుగొని ఆస్వాదించలేనివాడికిదే శిక్ష...అంటోంది గాథాసప్తశతిలోని ఈ గాథ. సంగీత సాహిత్యాది కళలను ఆస్వాదించలేనివాడి జన్మ వృధా అనేది దీని సారాంశం.
ఛాందోగ్యోపనిషత్తులో అష్టాదశ విద్యల గురించి ఉంది. ఈ 18 విద్యల్లో “దేవజనవిద్య” ఒకటి. శంకరభాష్యం దీనికి నృత్య, గీత వాద శిల్పాది విద్యలు” అని అర్థాన్నిచ్చింది. నారదుడు తాను ఈ పద్దెనిమిది విద్యలూ నేర్చానని అంటాడు. ఈ దేవవిద్యల్నే మనం లలిత కళలు అంటున్నాం. చతుష్షష్టి కళల్లోంచి  చిత్రలేఖనం శిల్పం, సంగీతం నృత్యం, కావ్యం ఈఐదింటినీ వేరుచేసి వాటికి లలిత కళలని పేరు పెట్టారు.
నిజానికి లలితకళ అనే పదాన్ని మొదటగా సృష్టించినవాడు కాళిదాసు. “గృహిణీ సచివస్సఖీమిథః/ ప్రియశిష్యా లలితేకళావిధౌ/కరుణావిముఖేనమృత్యునా/హరతాం త్వాం బత, కిం నమేహృతం” రఘువంశంలోని ఈ శ్లోకంలో లలితకళ గురించి ప్రస్తావించాడు. ఈ పదాన్నే కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇంగ్లీషు FINE ARTS కు సమానార్థకంగా ప్రాచుర్యానికి తెచ్చారు. “చిత్రవిద్య, సంగీతము, కవిత్వము, నాట్యము, శిల్పము అనువానిని కవికులగురువైన కాళిదాసుడులలిత కళలన్నందున మనమా పేరునే నిలుపుదము” అని వ్రాశారాయన.
ఆంగ్ల సాంప్రదాయంలో ఫైన్ ఆర్ట్సు గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం. దేవజన విద్యల గురించి మనం ఆలోచించింది తక్కువ. ఈ విద్యలన్నీ గాల్లోంచి ఊడిపడ్దవి కాదుకదా! వాటి మూలాలు, వాటి వెనుక చారిత్రక నేపథ్యం ఉంది.! నారదుడంతటి   వాడు దేవజనవిద్యలు తనకు తెలుసని సగర్వంగా చెప్పుకున్నాడు. కళలు కూడు పెడతాయా అనే ప్రశ్న ఆనాడూ ఉంది.
“ఆకలితో ఉన్నవాడికి వ్యాకరణం కడుపు నింపుతుందా? దాహంతో ఉన్నవాడికి కావ్యరసం దప్పిక తీరుస్తుందా? విద్యతో కులం వృద్ధి చెందుతుందా? డబ్బుతో అన్నీ వర్థిల్లుతాయేగానీ కళలతో ఏమీ కాదు. ముందు డబ్బు సంపాదించు” అని మాఘుడు అంటే, “ఇది దారిద్ర్యం వలన కలిగిన ఒక దైన్య స్థితిలో చెప్పిన మాటేనని క్షేమేంద్రుడు ఖండిస్తాడు. కళలవలన సర్వ సంపత్తులూ కలుగుతాయని చెప్పాడు.  అలాంటి కళలను నిర్వహించే కలావేత్తల్ని ఏ కారణం చేతో  సంస్కృత భారతంలో “అపాంక్తేయులు” లేదా పంక్తి బాహ్యులు అన్నారు. అంటే మనతో కలిసి కూర్చని భోజనమ్ చేయటానికి అర్హులు కారని!
ఒక వేద వేదాంగ విదుడికన్నా, ఒక ప్రభుత్వోద్యోగికన్నా,  ఒక రాజుకన్నా, ఒక రాజకీయ వేత్తకన్నా ఒక కళాకారుడు ఎక్కువ గుర్తింపు పొందుతాడు. “సుకవి నిలుచు ప్రజల నాల్కలందు” అని కదా జాషువాగారి పద్యం! కావ్య రచన ళాకారుల్ని  పంక్తిబాహ్యుల్ని చేయటం అనేది ఈ ఆధిపత్య భావం లోంచే పుట్టి ఉంటుంది. కళలకు నైచత్వాన్ని ఆపాదించటం అనేది శ్లోకాలు వ్రాయటం నేర్చిన పండితుల కుట్ర.
పరమశివుడి నాట్య సమయంలో ఆయన చేతి డమరుక ధ్వని నుండే మాహేశ్వర సూత్రాలు, తద్వారా అఆఇఈ వర్ణమాల, వ్యాకరణ సూత్రాలూ ఏర్పడ్డాయని పాఅణిని వ్రాశాడు. నాట్యం లయ, లాశ్యం, గీతం, గానం ఇవి నీచాలనటానికి వచ్చినదాన్ని నోరుకాదు మోరీ అనాలి!
ఇతరుల సంగతి మనకెందుకనుకున్నారేమో, “ననృత్యే దధవా గాయేన్నవాదిత్రాణి వాదయేత్...”బ్రాహ్మణుడు నాట్యమాడరాదు, పాటపాడరాదు, వాద్యములు వాయించరాదు, భుజాలు ఎగరేయరాదు, ఆహావోహో అంటూ కళలను ప్రశంసించరాదు. దొంగలు గాయకులు, శైలూషులు, నావికులు, నటులు ఇలాంటి వారి అన్నం నీచాన్నం. దాన్ని భుజించరాదు ... అని నిషేధాలు విధించారు.
వీటిలో భక్తికన్నా రక్తి ఎక్కువగా ఉండటం, ఇవీ నేర్చినవాడు మహా పండితుడికన్నా వేగంగా ప్రాచుర్యంలోకి రావటం, వీళ్లకు రాజాదరణం, అగ్రహారాలు పొందటం ఇలాంటివి జరిగితే తమకు పోటీ వాటాదారులు పెరుగుతారనే భయం, విదేశాలకు పోయి ధనార్జన చేసి ఇక్కడకు వచ్చి అధికులుగా చెలామణి కావటం లాంటి కారణాలే కాదు ఇంకో చారిత్రక వాస్తవం కూడా ఉంది. ఈ కళలు ఆర్యేతరులలో ఎక్కువ. ఆర్యులకు విగ్రహారాధన లేదు, గుళ్లూ గోపురాల నిర్మాణం, శిల్పకళాచాతుర్యం, గుళ్లో అర్చనావిధానం, గుడిసేవ చేసే నట గాయక నాట్య కళలకు ద్రావిడులు మూలపురుషులు. ఆర్య ద్రావిడ వైరుధ్యాలు ఆర్య సాహిత్యంలో మొత్తం కళలనే నీచమైనవని వ్రాసేలా చేశాయి. ఆర్య వ్యతిరేకత నిండిన బౌద్ధులు కళలను ప్రశంసించారు. వాత్స్యాయనుడు చతుష్షష్టి కళలను నిర్వచించాడు. గుప్తులకాలంలో కళలకు విశేష ప్రాధాన్యత లభించింది.
ఇంతగా కళలమీద విషం గక్కిన తరువాత కళలకు శాస్త్ర రూపం కల్పించే సమయానికి సంస్కృతాధిపత్యం ప్రవేశించింది. పండితుల ప్రమేయం పెరిగింది. చివరికి కళల మూలరూపాలను దేశీ అని, వాటి సంస్కృత రూపాల్ని మార్గ అనీ ముద్ర వేసి, మన అసలు కళల్ని కమ్మేశారు. చిత్రకళ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ, సురవరం ప్రతాపరెడ్డిగారు “చిత్రంలో చిత్రమేమన మనలో ప్రాచీన చిత్రములు మాయమైనవి” అని వ్రాశారు.
లలిత కళలు మనవే! తొలి ద్రావిడులు తెలుగు నేలమీమ్ఛే ఉత్తరాదికి సింధునాగరికత దాకా విస్తరించి, సింధూ నగరాల నిర్మాణంలో పాలుపంచుకున్నారని, వీరు నిర్మాణరంగంలో నిపుణులనీ ఫ్రాంక్లిన్ సి సౌత్‘వర్త్ అనే పరిశోధకుడు వ్రాశాడు. తెల్ అనే ధాతువుకు తెలియజేయు అనే అర్థం. అనాటి ఆర్యసమాజంలో తెలియచెప్పే పాత్ర పోషించినవారు తెలుగువారు. వాళ్లు ఆ రోజుల్లో కళలకు కాణాచి! తెలుగింట కళకళలాడిన కళలు లబలబలాడుతున్నాయి.  
ఆరోజుల్లోనేకాదు ఈ రోజుల్లోనూ కళలకు హృద్యపూర్వక గుర్తింపు గౌరవాలు ఇస్తున్నారా అనేదే ప్రశ్న!    

No comments:

Post a Comment