Showing posts with label పద్యానుభవం. Show all posts
Showing posts with label పద్యానుభవం. Show all posts

Wednesday, 1 May 2019

పెట్టెలో న్యాయం డా. జి వి పూర్ణచందు


పెట్టెలో న్యాయం
డా. జి వి పూర్ణచందు
తల ముచ్చుట్టులు దిరిగినఁ దలపోయఁగ నోరిలోనిదయ కడి యన్న
ట్లిల నే తెఱఁగులఁ దిరిగినఁ గలుగదు గతి విష్ణుసేవ గావింపకయున్
(పాండురంగ మహత్మ్యము చతుర్థాశ్వాసము-276)
అధికారం సిద్ధాన్నం లాంటిది. చక్కగా వండి, వార్చి, వడ్డించి, ఇంక తింటానికి సిద్ధంగా ఉన్నది సిద్ధాన్నం. గెలిచి అధికారంలోకి వచ్చింతర్వాత ఐదేళ్లు ఎలా తిరిగినా ఎంతవాడైనా చివరికి మోక్షం కోసం బ్యాలెట్ పెట్టెలో పడక తప్పదు. మన రాజ్యాంగం అలా రాసి పెట్టింది. ఇంద్రపదవి లాగా ప్రజాస్వామ్య పదవులకు శాశ్వత హక్కు భుక్తాలు లేవు కదా!
ఒక వేళ ఏ కారణం చేతయినా, ఇంద్రుడు మారవలసి వచ్చినా, ఇంద్రాణి మారదట! పాత ఇంద్రుడి రాణి కొత్త ఇంద్రుడితో సంసారం కొనసాగిస్తుంది!! సిద్ధాన్నం అంటే ఇదే! ఇంద్రాణి ఎన్నటికీ విధవకాదు అని కదా ఆర్యోక్తి!.
ప్రజాస్వామ్యంలో కూడా పాత ఇంద్రుడే కొత్తగా వచ్చినా లేక, కొత్త ఇంద్రుడే కొత్తగా వచ్చినా పాత ఇంద్రాణి సిద్ధంగా ఉంటుంది. అధికారం, అధికార గణం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. అధికారం కొత్తగా రావచ్చు గానీ, ఇంద్రాణిలా పాత అధికారగణమే కొనసాగుతుంది. కొత్త సీసాలో పాత సారా లాగా పాత సంసారాన్నే కొత్త ఇంద్రుడు కొత్తగా చేయాల్సి వస్తుంది. తనకు నమ్మకం ఉన్నా, లేకపోయినా పాత పోలీసులతోనే, పాత అధికారులతోనే కొత్త ఇంద్రుడు కొత్తకాపురం చేయకా తప్పదు.
అధికారానికి ఆఖరి మజిలీ బ్యాలెట్ పెట్టె! దాంట్లో పడకుండా ఒక్క అంగలో ఆవలిగట్టుకు దూకేద్దామని ఎవరైనా అనుకుంటే కుదరదు. అధికారాన్ని, అధికారగణాన్నీ అదుపులో పెట్టుకుని ప్రజలే దేవుళ్లనే భావనతో సేవచేసుకుంటే చివరి మజిలీలో ప్రజాదేవతలు మోక్షం ప్రసాదిస్తారు!
పాండురంగ మహత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు పైన పేర్కొన్న పద్యంలో పరోక్షంగా ఈ సందేశాన్నే ఇస్తున్నాడు: “అన్నం ముద్ద చేతిలో పుచ్చుకుని మూడుసార్లు తలచుట్టూ తిప్పి వెదికినా దాన్ని వేసేందుకు నోరు తప్ప ఇంకో చోటు దొరకదు...ఎంత ఆలోచించినా! ఎలా తిరిగినా చివరికి మోక్షం కోసం విష్ణుసేవ తప్పదు...” అని పై పద్యానికి తాత్పర్యం! దాన్ని నేటి కాల మాన పరిస్థితులకు అన్వయించుకో గలగటమే విఙ్ఞత.
“తల ముచ్చుట్టులు దిరిగినఁ దలపోయఁగ నోరిలోనిదయ కడి” చేత్తో అన్నం ముద్ద పుచ్చుకుని, మూడుసార్లు తలంతా వెదికినా నోరు తప్ప ఇంకో చోటు దొరకదు దాన్ని వెయ్యటానికి! అధికారం అనే సిద్ధాన్నం కూడా అంతే! చివరికి అది బ్యాలెట్ పెట్టెలోకి చేరక తప్పదు! ఎలా వండావు? ఎలా వడ్డించావు? ఎలా తిన్నావు? నీ వంటకం రుచి ఏమిటి? అది ఘాటా? చేదా? తీపా? అనేవి నిర్థారణ అయ్యేది అక్కడే!
ప్రత్యర్థులమీద వీరంగం ఆడుతూ, వేపమండలు పుచ్చుకుని ఆడే గణాచారిలాగా వేసిన చిందుల్ని కాదు, చేసిన జనపూజకే మార్కులు పడతాయని దీని భావం.
నీ వంటకంలో స్వార్థం ఉంటే బ్యాలెట్ పెట్టె నిన్ను నరకానికి తోస్తుంది. సేవ ఉంటే, చేవ ఉంటే నిన్ను స్వర్గానికి మోసుకెడ్తుంది. దేహానికి నోరు ఎలాంటిదో దేశానికి బ్యాలెట్ పెట్టె అటువంటిది. అధికారం అనే సిద్ధాన్నాన్ని కులమతాలతో రంగరించి వండి ఆ బ్యాలెట్ పెట్టెలో వేస్తే, మలమూత్రాలు తప్ప సారం ఏదీ లేక మోక్షప్రాప్తి జరగదనే హెచ్చరిక ఇందులో ఉంది. భక్తిప్రపత్తులతో మడిగా, శుచిగా వండి ప్రజాదేవతకు మహానివేదన పెట్టిన ‘జనసేవాభోజనం’ మోక్షప్రాప్తినిస్తుంది!
ఇది రాజకీయ బేతాళులకు మాత్రమే వర్తించే సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో మనకూ వర్తిస్తుంది. చచ్చాక రంభాదుల్తో కులుకునే మోక్షం  అనే భావనని మన మునిపుంగవాలు మనలో భాగా ఎక్కించారు. కన్యాశుల్కం  నాటకంలో
కరటక శాస్త్రి “కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్నవూళ్లో యాంటీనాచి, పరాయివూళ్లో
ప్రోనాచి; కొందరు శరీరదార్ఢ్యం వున్నంత కాలం ప్రోనాచి, శరీరం చెడ్డతరవాత యాంటీనాచి; కొందరు బతికివున్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయిన తరువాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చిన తరవాత కూడా ప్రోనాచే. అనగా యజ్ఞంచేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్పప్రజ్ఞకలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె” అంటాడు.
ఇక్కడో(భూమ్మీద)  అక్కడో(స్వర్గంలో)ఎక్కడో ఒకచోట ప్రోనాచ్చి అనగా వ్యభిచారం చేయాలనే యావ తప్ప మోక్షానికి మరో అర్థం లేదు! ఎటు తిరిగీ తిరిగి అధికారం వచ్చే అవకాశం లేదనే నమ్మకంతోనే అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి, యాంటీనాచ్చిగా ఉండి ఏం ప్రయోజనం...? అంటాడు!
మూటలు కట్టుకోవటానికి రాజ్యాంగం ఐదేళ్ళ సుదీర్ఘ వ్యవధి ఇచ్చింది. ఆ తరువాత తట్టాబుట్టా సర్దుకునేప్పుడు హడావిడి పడి సాధించేదేం ఉంది? అధికారంలో ఉన్నవాడు ప్రజలే దేవుళ్ళుగానూ, జనసేవే విష్ణుసేవగానూ భావించుకుంటే బ్యాలెట్ పెట్టె న్యాయం చేస్తుందని, ఆ ‘పెట్టెలో న్యాయం’ కోసం పాకులాడాలి!

దొందూ దొందే! డా. జి వి పూర్ణచందు


దొందూ దొందే!
డా. జి వి పూర్ణచందు
పరైః పరిభవేత్‌ ప్రాప్తే వయం పంచోత్తరం శతం
పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే!
పాండవులు అరణ్యవాసం చేస్తూన్నారు. అడవుల్లో ఆకులు, అలములు తిని జీవించాలన్నది నియమం. ఆ మాత్రం తిండి కూడా వాళ్లకు దొరక్కుండా చేయాలని దుర్యోధనుడు తన తమ్ముల్ని వెంటేసుకుని పాండవులున్న అడవికి వచ్చాడు.
అడవుల్లో చిన్నచిన్న పల్లెలుంటాయి. మనుషులు ప్రకృతిలో ప్రకృతిగా జీవిస్తుంటారక్కడ. పాండవులు వాళ్లతో కలిసిపోయి సుఖంగానే జీవిస్తున్నారన్నది వార్త. ఆ సమయంలో పాండవులు ఓ చిన్నపల్లెలో ఉన్నారు. ఆ ఊరి పేరు ఘోష. పాండవుల్ని అక్కణ్ణించి వెళ్లగొట్టాలన్నాడు దుర్యోధనుడు. కోడ్ అమల్లో ఉంది. పాండవులు అడవుల్లోనే ఉండాలి. జనంలో ఉంటే నిస్సందేహంగా కోడ్ ఉల్లంఘనే...” అనేది దుర్యోధనుడి నిశ్చితాభిప్రాయం.
ఆ సమయంలో ధర్మరాజు ఓ నదికి ఈవలి తీరంలో యజ్ఞం చేస్తున్నాడు. కోడ్ అమల్లో ఉండగా యఙ్ఞం ఏమిటీ? యఙ్ఞం అనేది డబ్బుతోనూ, మనుషుల్తోనూ కూడుకున్న వ్యవహారం. డబ్బునీ, మనుషుల్నీ సంపాదించే విధంగా జీవిస్తే అది అరణ్యవాసం ఎలా అవుతుంది...? ధర్మరాజు కోడుని ఉల్లంఘించాడు... అనేది దుర్యోధనుడి వాదన.
 ఆ నదికి ఆవలి తీరంలో విడిది చేశాడు దుర్యోధనుడు. అక్కణ్ణింఛి ఇక్కడ జరిగే తంతునంతా గమనిస్తున్నాడు. కోడ్ దాటినట్టు నిరూపించటానికి తగిన ఆధారాలు వెదుకుతున్నాడు. అవతల భీష్మ ద్రోణాదులు ఇప్పటి ఎలక్షన్ కమీషన్ లాగా విరోధి పార్టీకే అనుకూలంగా ఉన్నారు. మొత్తం నిఘా యంత్రాగాన్ని వాళ్ల గుప్పెట్లో పెట్టుకోవటంతో దుర్యోధనుడే స్వయంగా రంగంలోకి దిగి తన సర్వేలేవో తాను చేసుకుంటూ తన ఆత్మఘోష వెళ్ల గ్రక్కుకుంటున్నాడు.
 దుర్యోధనుడు ఇలా కోడు గీతల్ని లెక్కించే పనిలో ఉండగా, కౌరవ సోదరులు ఊరికే కూర్చోలేక అక్కడున్న ఓ సరస్సులో ఈతలు కొట్టేందుకు దిగారు. నిజానికి ఆ సరస్సు చిత్రసేనుడనే గంధర్వుడిది. మా అనుమతి లేకుండా సరస్సులో దిగారని గంధర్వులు కౌరవ సోదరుల మీద దాడి చేసి బంధించారు. దుర్యోధనుణ్ణి ఓ రథస్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు.
అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోధనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. దానికి భీముడు కాగల కార్యం గంధర్వులు తీర్చారుఅన్నాడు. కానీ, ధర్మరాజు అలా అనవద్దని వారిస్తూ, ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు. మనలో మనం కొట్టుకునేప్పుడు వాళ్లు వందమంది, మనం ఐదుగురిమే! కానీ ఉమ్మడి శత్రువు వచ్చినప్పుడు మనం కూడా ఉమ్మడిగా ఉండి నూట ఐదుగురం అనుకోవాలని హితబోధ చేస్తాడు. పై పద్యానికి నేపథ్యం ఇది.
జాతీయ సమైక్యత, దేశ సార్వభౌమాధికారాల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొన్ని ఈ మౌలిక సూత్రాన్ని పట్టించుకోకపోవటం నిస్సందేహంగా కోడు ఉల్లంఘనే!
“దేశభక్తి మాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్” అంటూ గురజాడ తన సమకాలీన రాజకీయ నాయకుల్లో తిలక్ ని అన్నాడో సురేంద్రనాథ్ బెనర్జీని అన్నాడో తెలీదు. “ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్” అంటూ గురజాడవారు దేశభక్తి గీతంలో ఎన్నో సుద్దులు చెప్పారు. 110 యేళ్ళ తరువాత కూడా ఈ సుద్దులు నేర్పించాల్సిన రీతిలో మన రాజకీయ పక్షాలు నడుస్తున్నాయంటే మనలో పురోగతి ఏమీ లేదనే అర్థం.
ప్రఙ్ఞాసాధ్వి అనే సన్యాసిని వుంది. ప్రఙ్ఞా సింఘ్ ఠాకూర్ ఆమె అసలు పేరు. ఆమె పైకి సన్యాసినేగానీ భయంకరమైన బాంబు ప్రేలుళ్ళ కేసుల్లో ఉన్న ఘనత ఆమెది! ఒకప్పుడు ముంబై యాంటీ టెర్రస్టు స్క్వాడ్  అధిపతి హెమంత్ కర్కరె ఆవిణ్ణి తనదైన పద్ధతిలో ప్రశ్నించి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత 2008 ముంబై పేలుళ్ళ సమయంలో ఈపోలీసు అధికారి ఉగ్రవాదులతో పోరాడి అమరుడయ్యాడు. ప్రభుత్వం ఆయనకు మరణానంతరం అశోక్ చక్ర ప్రదానం చేసి గౌరవించింది.
ఈ ప్రఙ్ఞాసాధ్వి గారు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సదరు కర్కరేగారు విచారణ పేరుతో తనను శారీరకంగా ఎంతలా హింసించాడో కథలుకథలుగా చెప్తూ కన్నీరోడుతూ, సానుభూతి పొందాలని ప్రయత్నిస్తోంది. అతను పెట్టిన హింసను తట్టుకోలేక “నాశనమైపోతావని శపించాను. అలానే పోయాడు” అంది. ఈమె భావనలో పాకిస్థానీ ఉగ్రవాదులు అతన్ని చంపటం సబబే అని! కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారనేది ఆమె అభిప్రాయం. ఆ విధంగా పాకిస్తాన్ మంచిపనే చేసిందంటుందావిడ.
ఆమె ప్రత్యర్థిగా పోటి చేస్తున్న మరో పెద్దమనిషి ఇంకో అడుగు ముందుకు వేసి హిందూ తీవ్రవాదులవలన తన ప్రాణానికి ముప్పు ఉందని కర్కరే తనతో ఏనాడో చెప్పినట్టు ప్రకటించాడు. హిందూత్వ వాదులు పాకిస్థాన్ కన్నా ప్రమాదం  అనడం ద్వారా పాకిస్థానే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన ప్రకటించాడు.
దేశ సార్వభౌమాధికారం గురించి ఏ మాత్రం పట్టని ఈ ఇరుపక్షాలూ ధర్మరాజు చెప్పిన ‘వయం పంచ శతం-మేం నూట ఐదుగురం అనే సూత్రాన్ని మరిచిపోయారు. అందరూ కలిసి చివరికి పాకిస్థాన్ మంచినే కోరుతున్నారు. దొందూ దొందే!

జనతా జనార్దనులు డా. జి వి పూర్ణచందు


జనతా జనార్దనులు
డా. జి వి పూర్ణచందు
రాష్ట్రవర్థన మెద గోరు రాజు మేలు
రాష్ట్రమును గోరు, దాన గార్యమె యనంగ
రాదు, బ్రహ్మోత్తరములైన ప్రజల యేక
ముఖపు గోర్కి దదంతరాత్ముండొనగడె!
(శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద 4-205)
సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ఆముక్తమాల్యద ప్రబంధకావ్యం పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. విష్ణుచిత్తీయం అనే మరో పేరుకూడా ఈ కావ్యానికుంది. ఈ పద్యంలో రాయలవారు రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి ఉండవలసిన ముఖ్యలక్షణాలు చెప్తున్నాడు.
యామునుడు ఓ వైష్ణవ పండితుడు. పాండ్యరాజు పరమ శైవుడు. యామునుడు పాండ్యసభలో శైవులమీద గెలిచి అర్థరాజ్యం సంపాదించుకున్నాడు. బ్రాహ్మణూడైనప్పటికీ రాజ సుఖాలు మరిగి శ్రీరామ మిశ్రుడనే చిన్ననాటీ స్నేహితుడిద్వారా వైరాగ్యాన్ని పొంది, చేసిన తప్పులు తెలుసుకుని, తనకొడుక్కి రాజ్యభారాన్ని అప్పగించి, తాను సన్యాసం స్వీకరిస్తాడు. పదవి దిగిపోతూ కొడుక్కి పాలనా మెళకువలు కొన్ని చెప్తాడు. అవన్నీ నేటికీ వర్తించే రాజధర్మాన్నీ, రాజనీతినీ తెలియచెప్తాయి.
ఉగాది నాడు పంచాంగ శ్రవణం లాగే, అప్పుడప్పుడూ ఈ యామునుడి సూక్తులు కూడా చెప్పించుకుని రాజకీయ పక్షాలవాళ్లు వింటూ ఉంటే కొంతయినా పాలనావ్యవస్థ పటిష్టంగా నడుస్తుంది.
          ‘రాష్ట్రం’ అంటే తన ఏలుబడిలో ఉన్న ప్రదేశం. దేశం అంటే మట్టి కాదు, మనుషులుకదా! రాష్ట్రం అంటే ప్రజలే! రాష్ట్రవర్థనాన్ని అంటే ప్రజల అభివృద్ధినీ, సంక్షేమాన్నీ మనస్సులో పెట్టుకుని (ఎదగోరి) పాలనా వ్యవహారాలు నడిపించా లంటాడు. అలా ప్రజా సంక్షేమం కోరిన పాలకుడికి తిరిగి అలాంటి మేలే కలగాలని ప్రజలు కోరుకుంటారు...! ప్రజలకు కీడు కలిగేలా పాలిస్తే పాలకుడిక్కూడా అలానే కీడు కలగాలని కోరుకుంటారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అని కదా సూక్తి! 500 యేళ్ళ క్రితమే, రాయలవారు ప్రజాక్షేమం కోరి పాలిస్తే ప్రజలు మళ్లీ మళ్లీ నిన్నే కోరుకుంటారని ఈనాటి పాలకులకు అర్థం అయ్యేలా యామునుడనే పాత్రద్వారా చెప్పించారు. కవి అయినవాడి దార్శనికత అలా ఉంటుంది.  
ప్రజల నామజపం ఎల్లవేళలా నేటి రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారుగానీ, ఒక్క మేలూ ప్రజలదాకా చేరే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పాతాళభైరవిలో రాజుగారి బామ్మర్దిలాంటి పాత్రలు పాలకుల చుట్టూ కమ్ముకుని ఉంటాయి. వాళ్లని దాటి ప్రజలవైపుకు చూడగిలిగేంత సావకాశం పాలకులకు ఉందదు. అదే చివరికి కొంప ముంచుతుంది.
“వాళ్లకు కళ్ళూ, చెవులకన్నా చేతులు ముఖ్యం! చేతిలో ఏది పడిందనేదే ప్రధానం. ఎంత చేసినా ఈ జనం అంతే! ఒక్కడికీ కృతఙ్ఞత ఉండదు, రెండుసార్లు ఇస్తే మూడోసారి ఇవ్వలేదుగా అంటారు. చిన్నపిల్లల తంతే!” అన్నాడు ఈ ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి.
“సరిగ్గా ఎన్నికల ముందు రోజు జనానికి డబ్బు చేర్చాం కాబట్టి మాకే ఓటు వేశారు. నాలుగురోజులు ముందే ఈ డబ్బు వాళ్లకు చేరి ఉంటే మా పార్టీ గంగలో కలిసిపోయుండేది. ఓటు వేసే నాటికి జనం అన్నీ మరిచిపోయుండేవారు” అని ఓ అభ్యర్థిగారి కన్నతండ్రి. ఇంకో అభ్యర్థిగారి పెదతండ్రి, ఎంపీ పదవిలోంచి దిగిపోబోతున్న ఓ పెద్దాయన పబ్లీగ్గానే అన్నాడు.
“చేసిన మేలుని మరిచిపోయే బాపతు ఈ జనం” అంటూ జన నింద చేసే రాజకీయనాయకులు కూడా ప్రజాస్వామ్యంలో ఉంటారని రాయలవారు ఊహించే, ఈ పద్యంలో ఇలాంటి పిచ్చివాగుడు వాగొద్దని పాలకులను హెచ్చరించాడు. “దాన గార్యమె యనంగరాదు” అన్నాడు. “జనానికి మేలు చేస్తే మనకేం ఒరుగుతుందని ఎప్పుడూ అనకు” అని హెచ్చరిక చేశాడు. ప్రజలే పరమాత్మ! ప్రజాభీష్టమే పరమాత్మ అభీష్టం. “బ్రహ్మోత్తరములైన ప్రజల యేకముఖపు గోర్కి” బ్రాహ్మణులు మొదలైన సమస్త సామాజికవర్గ ప్రజల కోర్కెల్ని “దదంతరాత్ముం డొనగడె” తత్=ఆ, అంతరాత్మ= దేవుడు, ఒనగడే= ఒనగూర్చకుండా ఉంటాడా ...? అంటున్నాడు.  
పాలించేవాడివి నువ్వు కాబట్టి, ప్రజలు ముందుగా నిన్నడుగుతారు. నువ్వు విని నెరవేర్చావా నీకే జేజేలంటారు. నువ్వు వినిపించుకో లేదనుకో భగవంతుడే వాళ్లను అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఐపు-అజ లేకుండా పోతావు అనే తీవ్రమైన హెచ్చరిక ఈ పద్యంలో కనిపిస్తోంది.
నువ్వు మింగిన కోట్లాది రూపాయలూ నీ నిజమైన బలం కాదు. దాన్ని మొత్తాన్నీ వెదజల్లినా నువ్వు తిరిగి గెలవ లేవు. నువ్వు గెలుస్తావనే నమ్మకంతో మాత్రమే నీ వెనక జేరి, నువ్వు తిట్టమన్నవాణ్ణి తిట్టమన్నప్పుడల్లా నోటికొచ్చినట్టు తిట్టిపెట్టే నీ వందిమాగథులు ఎవ్వరూ నీ నిజమైన బలం కాదు. తెల్లారేసరికి వైరిపక్షంలో చేరి నిన్ను తిడుతూ టీవీల్లో కనిపిస్తారు. తిట్టడం నీవు నేర్పిన విద్యే కదా! ప్రజాబలమే నీ నిజమైన బలం. ప్రజలు నిన్ను కోరుకుంటే నువ్వు పదవిలో ఉంటావు. అదే భగవదనుగ్రహం అంటే! ప్రజల్నే పరమాత్మ అనీ, జనార్దనుణ్ణి జనతా జనార్దనుడనీ, భావించి పాలిస్తే, పది కాలాలపాటు అంటే కనీసం రెండు పర్యాయాలు అధికారంలో ఉంటావని ఈ పద్యం స్పష్టంగా చెప్తోంది. ఇది కేంద్రం నుండి రాష్ట్రాలవరకూ పాలక ప్రతిపక్షాలందరికీ వర్తించే పద్యం.