ధర్మం తరుగు:
డా. జి వి పూర్ణచందు
“దినదినమును ధర్మంబులు,
ననయము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా
విను వర్ణ చతుష్కములో;
నెనయఁగ ధనవంతుఁ డైన నేలు ధరిత్రిన్”. (పోతన భాగవతం ద్వాదశ స్కంథం)
“దానితో లోకంలో
రోజురోజుకూ ధర్మం తగ్గిపోతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య,
శూద్ర వర్ణాలవారిలో ధనవంతుడే పాలకుడు అవుతాడు” ఇదీ కలియుగంలో జరిగే తంతు
అని పరిక్షిత్తు మహారాజుకు, శుకమహర్షి చెప్పాడు. పరిక్షిత్తు తనకు చావు తప్పదని రూఢీ అయ్యాకే, మోక్ష సంబంధిత
విశేషాల గురించి తెలుసుకోవాలని కుతూహల పడ్డాడు.
కలియుగానికి మునుపటి
యుగాలలో పూరిగుడిసెలో ఉండేవాడికి రాజ్యాధికారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? డబ్బున్నవాడికి రాజ్యాధికారం లేదనే శాసనం ఉండేదా? అని పరీక్షిత్తు మహారాజు అడగలేదు. శుకముని చెప్పనూలేదు.
తాను స్వయంగా వారసత్వ రాజకీయాలలోంచే గదా రాజ్యాధికారంలోకి వచ్చిందీ…!
కాబట్టి ఆ ప్రశ్న ఆయన అడగడు.
మన పురాణేతిహాసాలలో
వారసత్వ రాజకీయాలకీ, ధనరాజకీయాలకీ పెద్దగా స్పర్థ కనిపించదు.
“నా కొడుకే నా వారసుడు” అనేది ఆమోదయోగ్య సిద్ధాంతం
ఆ రోజుల్లో! వారసుడే రాజైతే ఇతర ధనికులకు అందులో పాత్ర ఏముంటుంది?
బ్రిటిష్ యుగంలో
జమీందారీల వారసత్వం ముఖ్యమైన సమస్య అయ్యింది. దాన్ని
తప్పించటానికి బ్రిటిష్ వాళ్లు చేసిన కుట్ర గొప్పడి. ప్రతీ జమీందారు
ఇంట్లోనూ ఓ బ్రీటిష్ అధికారి రెసిడెంటు పేరుతో తిష్ఠ వేసేవాడు. జమీందారుల పిల్లల్ని దగ్గర తీసి చిన్నవయసులోనే వాళ్లకు అన్ని అలవాట్లూ నేర్పేవాడు.
జమీందారు కొడుక్కి యుక్తవయసొచ్చే సరికి సంసారానికి పనికిరాకుండా భ్రష్టుడై
పోయేవాడు. చాలామంది జమీందార్లు నిస్సంతుగా చిన్నవయసులోనే మరణించటానికి
కారణం ఇదే!
తమకు సంతానం లేదనిక
ఎవరినైనా దత్తత తీసుకుంటే ఆ దత్తుడికి రాజ్యాధికారం ఉండదని బ్రిటిషర్లు ఓ శాసనం తెచ్చారు. జమీందారు పోయాక ఆ జమీందారీని రద్దు చేసేవాళ్లు. వారసత్వం రాజకీయాలకు బ్రిటిష్ వాడు కనిపెట్టిన విరుగుడు ఇది! ఝాన్సీ లక్ష్మీబాయి కథ ఇలాంటిదే! వారసత్వ రాజకీయం,
ధనరాజకీయం ఆ నిరంకుశ సంస్కృతిలో చెల్లనివై పోయాయి.
ఆ రోజుల్లో అప్పులు
తీర్చలేక జమీందార్లు తమ జమీలోంచి కొంత భాగాన్ని అమ్ముకోవటం, డబ్బున్న ఇతరులు వాటిని కొనుక్కోవటాలూ జరిగేవి. ఒక ఊరు జమీందారులు కూడా ఉండేవారు ఆ రోజుల్లో! తమ జమీందారీని
రక్షించు కోవటానికి తిరుగుబాటు చేసిన వాళ్లూ ఉన్నారు.
1857లో సిపాయీల
తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర్య పోరాటం అని చెప్తున్నారు. కానీ అంతకు 60
యేళ్లకన్నా ముందే బెజవాడ బాలచంద్రుడిగా బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచిన
కలువకొలను తిరుపతిరావు, నూజివీడు బెబ్బులి
మేకా నరసింహ అప్పారావు బ్రిటిష్ వారిని గడగడలాడించిన కథనాలు చరిత్ర కెక్కలేదు. మన
చరిత్రకారులకి ‘దూర’దృష్టి ఎక్కువ. దగ్గరగా ఉన్న విజయాలను చూడటానికి వాళ్ల కళ్లు
ఇష్టపడవు. అందుకే తెలుగు యోధుల సాహస గాథలకు గుర్తింపు లేకుండా పోయింది.
ప్రజాస్వామ్యం వచ్చాకే
కలియుగం విశ్వరూపం ప్రదర్శితమయ్యింది. డబ్బున్నవాడి బానిసకొడుకులదే రాజ్యం
అయ్యింది. ఇక్కడ కులాలనేవి పైకి కనిపించే ముసుగులు. కులాల్లో డబ్బున్నవాడికి అధికారమే
కులసేవ! అక్కడికదే పదివేలనుకుంటారు కులస్థులు. కడుపు మాడుతున్నా కులమే కావాలాని
జనం చేత అనిపిస్తుంది కలియుగం.
కలియుగంలో ప్రజలు
దురాశ, వ్యభిచారం, దొంగతనాలకు
మొగ్గుతారు. ధనహీనులు పెరుగుతారు. తిండికి
లేక మాడతారు. వారి ఆయుర్ధాయం తరిగిపోతుంది. రాజులు తామే దొంగలై తిరుగుతారు. ఓషధులు ఫలించడం తగ్గిపోతుంది.
మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో
పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మమార్గాన్ని తప్పి పోతుంది.
ఇదీ కలియుగంలో జరిగే ప్రక్రియ. దీనికి ముఖ్య కారణం
డబ్బున్నవాడే రాజు కావటం… అని శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పినట్టు
పోతనగారు ద్వాదశ స్కంథం 11వ వచనంలో స్పష్టంగా వ్రాశారు.
మరి, డబ్బున్నవాడు రాజు కాకూడదు… డబ్బు లేనివాడు
రాజు కాలేడు. రాజ్యం గతి ఏమిటీ? అదే కలియుగంలో
వింత. “ధర్మం తరుగును” అన్నాడు కదా పోతనగారు.
నేటి అవ్యవస్థలన్నీ
కలగలిస్తే దాన్నే‘కలి’ అంటారు. ‘అవ్యవస్థ’ల యుగంలో జీవిస్తూ ‘అవస్థ’ల గురించి మాట్లాడటం అవివేకం. ఇందులో మన పాత్ర ఎంత ఉందని
ఎవరికివారు వితర్కించుకుని వివేకంగా మెలగటమే కులానికి, డబ్బుకీ
విరుగుడు.
No comments:
Post a Comment