Thursday, 16 September 2021

ప్రొద్దున్నే చలిదన్నం: డా|| జి. వి. పూర్ణచందు

 ప్రొద్దున్నే చలిదన్నం: డా|| జి. వి. పూర్ణచందు

ఆదివారం ఆంధ్రజ్యోతి తినరా మైమరచి శీర్షికన 25-7-2021 ప్రచురితం

మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు నూరుఁగాయలు దినుచుండు నొక్క;

డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి  `చూడు లేదని నోరు చూపునొక్కఁ;

డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి  కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ;

డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;

`కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి పరు మ్రోల

మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;

నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు;

ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు. (పోతనగారి భాగవతం 10.1-496)

కృష్ణుడు మధ్యన కూర్చున్నాడు. తామర పూరేకుల్లా గోప బాలురు చుట్టూరా కూర్చున్నారు. రాతి పలకలు, తామరాకులు, వగైరాలను కంచాలుగా చేసుకుని అందరూ కలిసి ఒకరిదొకరు పంచుకుంటూ చల్దు లారగిస్తున్నారు. ఇలా సమూహంగా భోంచేయటాన్ని సంస్కృతంలో ‘సగ్ధి’ అంటారు. ‘గ్ధి:’ అంటే తినటం. ‘స-గ్ధిః’ అంటే అందరూ కలిసి పంచుకుని తినటం తెలుగులో ‘బంతి కుడుపు’, చాపకూడు, ఇంగ్లీషులో Potluck అంటారు. సగ్ధిపదమే తెలుగులో సద్ది (చద్ది)గా మారి ఉండవచ్చు.

రాత్రంతా చల్లలో నానిన అన్నాన్ని చలిదన్నం అంటారు. ఈ చలిదికి సంక్షిప్త రూపం ‘చద్ది’. రాత్రి మిగిలిన అన్నాన్ని చల్లలో వేసి నానించిన అన్నం కూడా చద్ది అన్నమే! ఉదయాన్నే వండిన అన్నంలో పెరుగు లేదా చల్ల కలిపిన అన్నాన్నీ ‘చలిది’ అనే అంటారు. అమ్మవారికి లేదా గ్రామదేవతలకు పెట్టే చలిది (చద్ది) నివేదన ఇదే! గోపబాలురు తిన్నది కూడా మీగడ పెరుగు కలిపిన చద్ది (చలిది)నే!

“చల్దులారగించే ఒకడు వ్రేళ్ళ మధ్య మాగాయ ముక్క పెట్టుకొని చూపిస్తూ పక్కవాడిని ఊరించాడు. ఇంకొకడు పక్కవాడి ఆకులోది చటుక్కున లాక్కొని మింగేసి ఏం లేదు చూడు’ అంటు ఖాళీ నోరు చూపించాడు. మరొకడు పందెం కాసి ఐదారుమంది చల్దుల్ని కుక్కుకొని ఒక్కడే తిన్నాడు. స్నేహ మంటే పంచుకోడమేరాఅంటూ అందరి ఆకుల్లోదీ కొంచెంకొంచెం తింటూ ‘బంతెన గుళ్లు’ ఆడుతున్నాడింకొకడు” అని వ్రాశారు పోతనగారు. బంతి అంటే అందరూ పంక్తిగా కూర్చుని తినటం. ఈ బంతిలో అందరిదీ తీసుకు తినటమే బంతెనగుండు ఆట’ ఇంకో కుఱ్ఱాడు కృష్ణుణ్ణి చూడమంటూ అటు చూపించి ఇటు, ఇంకొకడి ఆకులోది గుటుక్కున మింగేశాడు. ఒకడు నవ్వుతున్నాడు. ఇంకొకడు నవ్విస్తున్నాడు, మరొకడు ముచ్చట్లాడుతుంటే, వేరొకడు మురిసిపోతున్నాడు. ఇలా సాగిందా ‘సగ్ధి’ (Potluck) అనే చద్ది.

ఒడీసాలో గంజి, ఉల్లిముక్కలు, మిర్చి, నిమ్మ ఆకులు కలిపి రాత్రంతా అన్నం పులియ బెట్టి, ప్రొద్దున్నే ఆవనూనె తాలింపు పెట్టుకుని త్రాగుతారు. దీన్ని పఖాలీ అంటారు. ఇదొక రకం చద్ది. రాయలసీమలో ‘సద్దిపొద్దు’న (అంబటి పొద్దు) జొన్నంబలి లేదా, పులంబలి త్రాగుతారు. ఉత్తరాంధ్రలో ‘రైతోడి అన్నం’, ‘ఆలబొద్దు’ అంటారు. తెలంగాణాలో రాగంబలి, గోదావరి జిల్లాల్లో తరవాణి ప్రసిద్ధి.

కన్యాశుల్కం నాటకంలోఅయ్యా! మీరు చల్దివణ్నం తించారా...?” అని గిరీశాన్ని బుచ్చమ్మ అడుగుతుంది.  ఆ రోజుల్లో ప్రొద్దున్నే పిల్లల కోసం అత్తెసరు అన్నం విడిగా వండేవారు. అందులో పెరుగు కలిపినదే చల్దివణ్ణం. రాత్రి మిగిలిపోయిన అన్నంకాదు. ఇది పేగుపూత, కామెర్లు, అమీబియాసిస్, వాత వ్యాధుల మీద పనిచేస్తుంది. బలకరం. రక్తాన్ని, జీర్ణశక్తినీ పెంచుతుంది!

మీ పిల్లలకు ప్రొద్దున్నే ఇలాంటి చల్దివణ్ణం పెట్టండి. మీరూ తినండి. ప్రొద్దున్నే పెరుగన్నం తినటానికి నామోషీ పడకండి. అందులో జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వగైరా చేర్చి, పండ్ల ముక్కలు కలిపి కమ్మగా తాలింపు పెట్టి, దానికిజంజంచంచంఅని చైనా పేరు పెట్టండి. పిల్లలు లొట్టలు వేస్తూ తింటారు. అది ఇమ్యూనిటీ బూష్టర్ కూడా! ప్రొద్దున్నే పెరుగన్నం ఒక భోగం. టిఫిన్లు పెద్ద రోగం.

No comments:

Post a Comment