పాయసం మహత్తు: డా|| జి. వి. పూర్ణచందు
భూపాల! నీదుభార్యల
కీ పాయస మారగింప నిమ్మీ తనయుల్
శ్రీపతి పుత్త్రసమానులు
రూపసు లుదయింతు రమిత స్ఫూర్తిన్ (మొల్ల రామాయణం)
దశరధుడు పుత్రకామేష్ఠి యాగం చేసినప్పుడు యఙ్ఞపురుషుడు ఒక
బంగారు పాత్రలో పాలన్నం నింపి, దశరధుడికిచ్చి,
నీ భార్యల చేత త్రాగిస్తే, విష్ణువుతో సమానంగా
రూపసులైన పుత్రులు కలుగుతారని చెప్తాడు. పాయసానికి సహజంగా దివ్యశక్తి ఉంది కాబట్టి,
దేవుడు పాయస రూపంలోనే వరం ఇచ్చాడు. పయస్సు(పాలు)
పోసి వండినది పాయసం. హిందీవాళ్లు ‘ఖీర్’ అంటారు. క్షీరం నుంచి ఏర్పడిన పదం ఇది! భోజన
పదార్థాల్లో పరమ(ప్రధాన)మైంది కాబట్టి, దీన్ని ‘పరమాన్నం’ లేదా పరవాణ్ణం అని తెలుగువాళ్లం
పిలుస్తాం. మొఘల్స్ వచ్చాక ఉత్తరాదిలో ‘ఫిర్ణీ’, ‘ముహల్లబియా’ పేర్లు అలవాటయ్యాయి.
యఙ్ఞయాగాదుల్లో హోమానికి నెయ్యి ప్రధానం. నేతితో వండినది
పవిత్రమైందనే పెద్దల నమ్మకం. పచ్చికూరగాయల్ని కచ్చా (raw), పక్వం చేసిన వాటిని పక్కా(cooked) అంటారు. నేతితో వండిన పాయసం పక్కా ప్రసాదం. దేవుణ్ణి అతిథిగా
పిలిచి భోజనం పెట్టి మర్యాద చేస్తాడు భక్తుడు. దేవుడు తినగా మిగిలిందాన్ని
ప్రసాదంగా భావిస్తాడు. శాకాహారం కూడా మొక్కల్ని హింసించే వండేదే. కానీ, పాయసం అహింసాత్మకంగా తయారౌతుందని బౌద్ధులు
భావిస్తే, పాలను కాచినప్పుడు అందులోని సూక్ష్మజీవులను చంపటం
కూడా హింసే అవుతుందని జైనులు బావించారు. ఈ వివాదం అలా ఉంచితే, ఒక తల్లి పిల్లలకు పచ్చిపాలు ఇవ్వలేదు కదా! భక్తుడూ దేవుణ్ణి తన బిడ్డ
అనుకుని పాయసం కాచి నైవేద్యం పెడతాడు. ఈ ధాన్యం, ఈ పాలు, ఈ నెయ్యి దేవుడిచ్చినవ
భావనతో పాడిపంటల సమృద్ధిని కోరి పాయసాన్ని నివేదనపెట్టి అందరూ ప్రసాదంగా పంచుకోవటం
ధనిక బీద. రాజు బంటు తేడాల్లేని సామ్యవాదానికి ప్రతీక.
కేరళలో ప్రాచీన కాలంలో ‘అంబలప్పుఝా’ నగరాన్ని పాలించే రాజు దగ్గరకు
కృష్ణుడు ఒక వృద్ధ పండితుడి రూపంలో వెళ్లి రాజుని చదరంగంలో ఓడిస్తానంటాడు. తాను
గెలిస్తే చదరంగం బోర్డు మీద మొదటి గడిలో ఒక బియ్యపు గింజ, రెండో
గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, నాలుగో
గదిలో ఎనిమిది ఇలా రెట్టింపు చేసుకుంటూ వెళ్లి చివరి గడి వరకూ ఉన్న ధాన్యం అంతా
తనకు ఇప్పించమని అడుగుతాడు. రాజు ఇంతేనా అనుకున్నాడు. కానీ, పందెంలో
ఒడిపోయి, ప్రతీ గడికి రెట్టింపు గింజలు ఇవ్వాల్సి వచ్చేసరికి
సగం బోర్డుకే అతని ధాన్యాగారంలో ఉన్న ధాన్యం నిండుకుంది. అప్పుడా పండితుడు మిగిలిన
ధాన్యం అప్పుని నెమ్మదిగా తరువాత తీర్చవచ్చంటాడు. ఎన్ని యుగాలు గడిచినా పక్క
గడిలోకి వెళ్లేసరికి రెట్టింపు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, తాను
ఆ అప్పు తీర్చలేనని రాజుకు అర్థం అయ్యింది. అప్పుడు కృష్ణుడు నిజరూపం ధరించి,
నిత్యం ఈ ‘అంబాలప్పుఝ’ గుడికి
వచ్చే భక్తులకు నేతిపాయసం ప్రసాదంగా పెడుతూ ఉంటే ఋణవిముక్తిడి వౌతావంటాడు.
అప్పటినుండి కృష్ణాలయాల్లో పాయసం ఒక ప్రసాదం అయ్యిందని ఐతిహ్యం. ఇదే
గురువాయూరులోనూ, ఒడీసా జగన్నాథదేలయంలోనూ, ఇంకా ఇతర వైష్ణవాలయాల్లో కూడా పాటిస్తారు.
పాయసాన్ని కుంకుమపువ్వు, పచ్చకర్పూరం, బాదం, జీడిపప్పు,
పిస్తాలాంటి పోషకాలతో వండితే బలకరంగా ఉంటుంది. పెసరపప్పు కూడా కలిపి
వండుతారు. ఏ ఔషధ ద్రవ్యంతో పాయసం కాచినా అది రెట్టింపు
శక్తితో పని చేస్తుంది. గర్భాశయ పోషక ద్రవ్యాలను చేర్చి
పాయసం వండి, భక్తితో తీసుకుంటే స్త్రీలకు సంతానోత్పత్తి
కలుగుతుంది. పురుషుల్లో జీవకణాలను పెంపుచేస్తుంది.
ధవళాక్షు లన్నమాట నిజం చేయటానికి ఆ ముగ్గురు రాణుల కళ్లు
తెలుపెక్కాయని, నీలకుంతలలు అనే మాట
నిలపటానికి జుట్టు నల్లబడటం మొదలయ్యిందని, ‘గురుకుచ’ లన్నది నిజం అన్నట్టుగా రొమ్ములు నిండి పెరిగాయనీ, మంజుభాషిణు
లనుమాట తప్పదన్నట్టు ఆ స్త్రీల పలుకులు మృదువు లయ్యాయనీ గర్భిణీ లక్షణాలను మొల్ల
వర్ణిస్తుంది. గర్భవతులు కాకపోయినా పాయసం
త్రాగితే ఈ లక్షణలు కనిపిస్తాయి. నడివయసువారు కూడా
యవ్వనవంతు లౌతారని తాత్పర్యం.
No comments:
Post a Comment