చల్లగా చేసే చల్ల: డా|| జి వి పూర్ణచందు
ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో 15-8-2021న ప్రచురితం
కైలాసే యది తక్రమస్తి గిరీశః కిం నీలకంఠో భవేత్
వైకుంఠేయది కృష్ణతా మనుభవేదద్యాసి కింకేశవః
ఇంద్రోదుర్భగతాం క్షయం ద్విజపతి ర్లంబోదరత్వం గణః
కుష్ఠీత్వంచ కుబేరకో దహనతా మగ్నిశ్చ కిం విందతి
(యోగరత్నాకరం)
మంచుకొండల్లో పాలు తోడుకోకపోవటాన అక్కడ పెరుగు, చల్ల దొరికే అవకాశాల్లేవు. కాబట్టి, కైలాసవాసి శివుడికి, చల్ల త్రాగే అలవాటు లేక ఆయన నీలకంఠు
డయ్యాడు. పాలసముద్రం పైనుండే విష్ణుమూర్తికి చల్ల దుర్లభం. కాబట్టి, ఆయన నల్లవాడయ్యాడు. ‘సుర’ తప్ప చల్ల త్రాగకపోవటంతో ఇంద్రుడు
బలహీనుడయ్యాడు. చల్ల త్రాగే అలవాటే ఉంటే, చంద్రుడుకి
క్షయవ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం వచ్చేవే కాదు…అని ‘యోగరత్నాకరం’ వైద్యగ్రంథంలో ఈ చమత్కార శ్లోకం
వివరిస్తుంది. చల్ల త్రాగేవాళ్లకి ఏ జబ్బులూ రావనీ, విషదోషాలు, దుర్బలత్వం చర్మరోగాలు, క్షయ, స్థూలకాయం, వేడి తగ్గుతాయనీ, చర్మానికి మంచి రంగు కలుగుతుందనీ భావం. దేవతల కోసం అమృతాన్నీ, మానవుల కోసం చల్లనీ భగవంతుడు సృష్టించాడంటారు.
గడ్డపెరుగుని మీగడతో సహా చిలికిన చిక్కటి మజ్జిగని ‘ఘోలం’
అనీ, మీగడ తీసేసి చిలికిన మజ్జిగని ‘మధితం’ అనీ, 3 గ్లాసుల పెరుగుకి 1 గ్లాసు నీరు
కలిపి చిలికితే ‘తక్రం’ అనీ, సగం నీరు కలిపి చిలికితే ఉదశ్విత్తు అనీ పిలుస్తారు.
వీటిలో తక్రమే శ్రేష్ఠమైనది. జీర్ణశక్తిని పెంచుతుంది. కంటి జబ్బుల్ని పోగొడుతుంది.
ప్రాణశక్తి నిస్తుంది. రక్త మాంసాలను వృద్ధి చేస్తుంది. అజీర్తి దోషాలను కలగ నీయదు.
“తక్రం త్రిదోష శమనం రుచి, దీపనీయం” అంటే మూడు దోషాల్ని శమింప చేసి, నోటికి రుచిని, కడుపులో జాఠరాగ్నినీ పెంపు చేస్తుంది. ఎంతటి శ్రమనైనా తట్టుకునే శక్తినిస్తుంది. వడదెబ్బను తట్టుకునేలా చేస్తుంది. కడుపులో ఆమ్లాలు పలచబడి, మంట, ఉబ్బరం, పేగుపూత, గ్యాసు, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్ధత, పేగులకు సంబంధించిన వ్యాధులు అదుపులో కొస్తాయి. పెరుగుకు మూడు రెట్లు నీళ్లు కలిపి
చిలికి, రాత్రంతా ఫ్రిజ్జులో కాకుండా బైటే పెట్టి ఉంచిన ‘చల్ల’ని నిద్రలేస్తూనే
త్రాగితే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి.
చల్లలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. తెలుగువారికి చల్లంటే అమితప్రీతి. తెలుగు కృష్ణుడు పెరుగులమ్మే వారి వెంట
కాకుండా చల్లలమ్మ బోయే అమ్మాయిల వెంటపడతాడు. అతిథులకు కాఫీ టీలకు బదులు చెంబుడు చల్ల
ఇచ్చి, ‘కాస్త దాహం (చల్ల) పుచ్చుకోండి’ అనేవాళ్ళు. చలిపందిరి లేదా చలివేంద్రాల్లో చల్లకుండ
లుండేవి ఆరోజుల్లో!
నాలుగు చల్ల చుక్కలు కలపటం వలన పాలు తోడుకుని పెరుగు అవుతోన్నాయి. అందువలన “ఉపయోగపడే బాక్టీరియా” కూడా చేరుతుంది. అందుకని పెరుగు/చల్లని ‘ప్రోబయటిక్ ఔషధం’ అంటారు. పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా చిలికిన చల్ల ఉత్తమమైనవి! చల్ల కలిపిన అన్నాన్ని చలిదన్నం లేదా చద్దన్నం
అంటారు. “అయ్యా! మీరు చల్దివణ్నం తించారా?” అని కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ గిరీశాన్ని
అడుగుతుంది. పూర్వం రోజుల్లో వృత్తి వ్యాపకాలకు
బైటకెళ్లేవారంతా ఉదయాన్న చల్దివణ్ణమే తినేవాళ్లు. ప్రొద్దున్నే వేడన్నంలో చల్ల కలిపిన ‘చలిదివణ్ణం’ తింటే అనారోగ్యాలు కలగవు. మనం తినే టిఫిన్లన్నీ జీర్ణశక్తిని చంపే
junk foods లాంటివే! స్కూళ్లకు వెళ్లేప్పుడు పిల్లలకు చల్లన్నం
పెడితే వాళ్లు బలంగా పెరుగుతారు.
వారి మేథాశక్తి కూడా
పెరుగుతుంది. అమ్మకడుపు
చల్లగా, అయ్య కడుపు చల్లగా సమస్త మానవాళినీ చల్లగా చూసేది, చల్లగా చేసేదీ చల్ల!
విదేశీ ‘యోగర్టు(Yogurt)’లలో ఉపయోగపడే బాక్టీరియాని జన్యుమార్పిడి
చేసి అమ్ముతున్నారు. ఈ యోగర్టు అనే పెరుగుతో మనం ఇంట్లో పాలను తోడుపెడితే
తోడుకోవు. మర్నాడు మళ్లీ ఇంకో యోగర్టు ప్యాకెట్టు కొనుక్కోవా లనేది మార్కెటింగ్
స్ట్రేటజీ. ఇలాంటి అన్యాయాలు భవిష్యత్తులో ముంచుకు రానున్నాయి. మన ప్రభుత్వాలు ఆ
కంపెనీలకు స్వాగతం పలుకుతాయి కూడా! మన ‘చల్ల’ని, మన పెరుగుని మనమే
కాపాడుకోవాలి.
No comments:
Post a Comment