Thursday, 16 September 2021

దేవుడికేది పెట్టాలి? డా|| జి వి పూర్ణచందు

 దేవుడికేది పెట్టాలి? డా|| జి వి పూర్ణచందు

ఆదివారం ఆంధ్రజ్యోతి తినరా మైమరచి శీర్షికన 18-7-21ప్రచురితం

ఏ పొద్దు చూచిన దేవుఁ డిట్లానె యారగించు

రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెను     ॥పల్లవి॥

మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు

సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు

ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను

బోరన చుక్కలు రాసి పోసినట్లుండెను        ఏపొ॥

పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు

వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు

బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను

అలరు వెన్నెలరసమందించినట్లుండెను       ॥ఏపొ॥

పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును

వండి యలమేలుమంగ వడ్డించఁగా

అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ

దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను        ॥ఏపొ॥

రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి ‘అధ్యాత్మసంకీర్తనలు-అన్నమాచార్య రచితములు” 9వ సంపుటంలోని ఈ కీర్తనలో దేవుడికి రెండు పూటలా నైవేద్యం పెట్టే వంటకాల వివరాలు ఉన్నాయి.

ఏ పొద్దు చూసినా దేవుడిట్లానె ఆరగిస్తాడు, చూడగానే అవి పదివేల రుచుల్లా అనిపిస్తాయి. వాటిలో మేరు లేదా మందర పర్వతం అంత ఎత్తున పోగు పోసిన ఇడ్డెనలు(ఇడ్లీలు), సూర్య, చంద్ర బింబాల్లాంటి ‘చుట్టుబళ్లేలు’ ఉన్నాయి. గోళాకారంలో చేసిన పునుగుల్ని చుట్టువడ లంటారు. జనం నోట ఇవి చుట్టుబడులు-చుట్టుబళ్లు- చుట్టుబళ్లేలుగా మారి ఉండవచ్చు. కొందరు వ్యాఖ్యాతలు ఇవి  చక్రాలని వ్రాశారు గానీ, అవి సూర్యచంద్రుల్లా అనిపించవు కదా! ఇంక మంచి బియ్యంతో వండిన వేడివేడి అన్నాన్ని అందుపై వడ్డించారు. అది చూస్తే ఆకాశంలో చుక్కలన్నీ వచ్చి పోగుపడినట్టుంది.

బంగారం, వెండి గిన్నెల్లో పాయసాలు అనేక సముద్రాల్ని ఒకేచోట చేర్చినట్టున్నాయి. వెలిగొండలంత ఎత్తున వెన్నముద్దలు (‘కోవాకజ్జికాయ’ లాంటి తీపి భక్ష్యాలు) పోగుపోశారు. బలసిన చిలుపాలు అంటే  చిలుప+పాలు= పంచదార కలిపిన పాలను నీరంతా మరిగే వరకూ కాచిన చిక్కని పాలగుజ్జు (బాసుంది)ని కుప్పగా వడ్డించారు. ఇది వెలుగువెన్నెల రసం అందించినట్లుంది. ఎన్ని రకాల కూరగాయలు పండుతాయో అన్నింటితోనూ పచ్చళ్లు, కూరలు వండి, పక్కనే కూర్చుని అలమేలు మంగ వడ్డిస్తుంటే, దయాళువైన శ్రీ వెంకటేశుడు ఆరగించి, మిగిలింది తన భక్తులకు దాచిపెట్టాడా అన్నట్టుగా ఉన్నాయి సిద్ధం చేసిన ఈ వంటకాలు.

క్రీ.శ.1408 -1503 మధ్య జీవించిన అన్నమయ్య కాలం నాటి ప్రజల ఆహార విధానం ఇలా ఉండేదని ఈ కీర్తన చాటి చెప్తోంది. ఇడ్లీలను, పునుగులను అన్నంలో ఒక పిండివంటగా తినటమే గానీ, ఉదయాన్న అల్పాహారంగా తినే అలవాటు ఆనాడు లేదు. కఠినంగా అరిగేవి అల్పాహారం కాలేవు కదా! ఉదయం పూట కొద్దిగా పెరుగన్నం లేదా జొన్నంబలి, రాగంబలి తరవాణి లాంటివి తీసుకోవటమే మన ఆహార సంస్కృతి. అన్నానికి బదులుగా టిఫిన్లను తినే విధానం మనది కాదు. ఈ టిఫిన్లు అనే ఝంక్ ఫుడ్సుని తెచ్చి ఎక్కడ నైవేద్యం పెడతామో ననే భయంతో “ఏ పొద్దు చూచిన దేవుఁ డిట్లానె యారగించు” అని అంత ఖచ్చితంగా ప్రకటించాడు అన్నమయ్య.

No comments:

Post a Comment