వడదెబ్బకు విరుగుడు పానీయాలు
డాక్టర్ జి. వి పూర్ణచందు,
9440172642
తెలి నులివెచ్చ యోగిరము దియ్యని
చారులు దిమ్మనంబులున్
బలుచని
యంబళు ల్చెరకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీత జలముల్వడ పిందెలు నీరు జల్లయు
న్వెలయగ
బెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్
వేసవికాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు
వడ్డించిన వంటకాలను రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలోని ఈపద్యంలో వివరించారు:
1. తెలి
నులివెచ్చ యోగిరము= నులివెచ్చగా ఉన్న తెల్లన్నం అంటే వరి అన్నం. తేలికగా
అరుగుతుంది. వడకొట్టదు.
2. దియ్యని
చారులు=తియ్యని చారు అంటే, చింతపండు వెయ్యని రసం. తమిళనాడులో
దీన్ని ‘టిక్కాచారు’ అంటారు
3. తిమ్మనంబులున్:
తేమనం, తిమ్మనం ఈ రెండింటికీ ఒక రకమైన ద్రవ వంటకం(సాస్) అని
సంస్కృత నిఘంటు అర్థం. తెలుగు నిఘంటువులు తేమనం అంటే మజ్జిగ పులుసు అని వ్రాసాయి.
బియ్యప్పిండి, కొబ్బరి, అల్లం,
మిరియాలు, వాము వగైరాలను పాలతో ముద్దగా కలిపి చిన్న ఉండలుగా చేసి
మరుగుతున్న మజ్జిగపులుసులో వేసి ఉడికిస్తే అవి ‘తిమ్మనలు’
కావచ్చు. అన్నంలో తినటానికి బావుంటాయి. వేసవిలో చలవనిస్తాయి.
4. పలుచని
అంబలి= వరి లేదా జొన్న నూకల జావ (Porridge). అంబకళము,
పులియంబళకము ఇలా అంబలిని పులియబెట్టి తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇవి
వడదెబ్బ తగలకుండా చేస్తాయి.
5. చెరకుపాలు=
చెరకు రసం. వేసవి తాపానికి విరుగుడు పానీయం ఇది.
6. రసావళుల్ఫలంబులు=
బాగారసం నిండిన తియ్యమామిడిపండ్లు
7. సుగంధిశీతజలాలు=
ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క
లాంటి సుగంధ ద్రవ్యాల పొడిని నీళ్లలో వేసి కాచి, చల్లార్చి
కుండలో పోసిన చల్లని నీళ్లు. తమిళనాడు, కేరళలలో
పచ్చి మంచినీళ్లకు బదులుగా జీరావాటర్, ధనియావాటర్,
దాల్చినివాటర్, వాంవాటర్ లాంటివి ఈనాటికీ త్రాగే అలవాటుంది. వడదెబ్బకు
విరుగుడు పానీయాలివి.
8. వడపిందెలు=లేతమామిడి
పిందెలు. వగరుగా ఉంటాయి వీటిని తరిగి ఉప్పు వేసి ఊరబెట్టి, మిరియాలపొడితో
అన్నంలో తింటారు. వడపిందెలు వడకొట్టకుండా కాపాడతాయి.
9. నీరుచల్ల:
బాగా చిలికి 3 రెట్లు నీళ్లు కలిపి కనీసం 5-6
గంటలు కదల్చకుండా ఉంచిన మజ్జిగ నీటిని ‘నీరుచల్ల’
అంటారు. దీన్నిండా ఉపయోగపడే బాక్టీరియాలు ఉంటాయి. చలవనిచ్చి,
పేగులను సంరక్షిస్తాయి. ఉత్తమ వేసవి పానీయం.
ఈ పద్యం చూస్తే విష్ణు చిత్తుడు అతిథుల్ని బ్రతిమాలి
పిలిచి, చెరకురసం, గంజినీళ్లు, చారునీళ్లు,
మజ్జిగనీళ్లు పోసి అన్నం
పెట్టాడని మనం అపార్థం చేసుకోకూడదు. ఎండలో పడి వచ్చిన
అతిథికి ఇవి స్వాగతపానీయాలు (welcome Drinks). చందనచర్చ
అంటే మంచిగంథం పూసి వడదెబ్బ నుండి సేదతీర్చి,
అప్పుడు భోజనం పెట్టేవాడన్నమాట.
ఇంటికొచ్చిన అతిథి షుగరు రోగి అయినా,
బలవంతంగా స్వీట్లు పెట్టి, ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర
అదనంగా వేసుకోండని
ఉచిత సలహాలిచ్చే తరహా ‘అతిమర్యాదలు’
విష్ణుచిత్తుడు చేయలేదు. కాలానికి తగ్గ ఆహార పదార్థాలను ఇంపుగా వడ్డించే
వాడాయన.
కావ్యాలు చదివితే కలిగే ప్రయోజనం ఇదే!
చెయ్యవలసినవి, చెయ్యకూడనివి రెండూ తెలుస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు
ఈపద్యంలో వేసవిలో వడకొట్టనీయని ఆహార పదార్ధాల పట్టిక ఇచ్చాడు. వాటిని మనం అవశ్యం
గమనించాలి. *
No comments:
Post a Comment