భోజన మర్యాద
డాక్టర్ జి.వి. పూర్ణచందు,
9440172642
ఎదురేగి సాష్టాంగ మెరగి పాద్యం బిచ్చి/నారికేళ కటాసనముల
నునిచి
నును బోక
పొత్తి గుట్టిన దొప్ప గమితోడ/రంభ విశాల పర్ణములు వరిచి
శాల్యన్న
సూపాజ్య కుల్యా బహువ్యంజ/నక్షీర
దధులర్పణంబు జేసి
వార్చిన పిదప సంవాహన మంఘ్రుల/కొనరిచి తాంబూల మొసగి కుశల
మడిగి పోయెద
మన్న దవ్వనిచి సిరికి/దగిన సత్కృతి జేసి ఖేదమున మగిడి
యర్చన
గావింతు రెపుడు నిట్లతిథులైన/భాగవతులకు నప్పురి భాగవతులు
ఆముక్తమాల్యద
కావ్యంలో ఆనాటి భోజన మర్యాదల గురించి రాయలవారి వర్ణన ఇది. అతిథు లైన భాగవతులకు
ఎదురేగి, కుశలప్రశ్నలు వేసి, సాష్టాంగ
పడి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తారు. కాళ్లు కడుగుతారు. కొబ్బరీనెలతో అల్లిన చాపలు
వేస్తారు. పెద్ద అరిటాకుల్లో వడ్డిస్తారు. తినని వాటిని పడేయటానికి వక్కచెట్ల
ఆకుల్తో కుట్టిన డొప్పల్ని పక్కన ఉంచుతారు. విస్తట్లో వరి అన్నం,
పప్పు వడ్డించి, కాలువలు కట్టేంతగా నెయ్యి పోస్తారు. పప్పుతోపాటుగా అనేక
వ్యంజనాలు అంటే “వ్యంజనాని ఓదనార్థాని”-తినటానికి
ఉద్ధేశించిన కూరలు, పచ్చళ్లు, పులుసులు,
పాలతో వండిన పాయసాలు, పెరుగు, ఉప్పు, పంచదార సహా వడ్డనకు సిద్ధంగా ఉన్న వంటకాలన్నీ
కొద్దికొద్దిగా వడ్డిస్తారు. ఏ పదార్ధాన్ని తింటుంటే దాన్ని కొసరికొసరి
వడ్డిస్తారు.
భోజనానంతరం
నడుము వాల్చేందుకు శయ్య ఏర్పాటు చేసి, కాళ్ళు
నొక్కి సేద తీరుస్తారు. వెళ్లేప్పుడు తాంబూల సత్కారాలు చేస్తారు. అల్లంత దూరం
వెళ్లి ఆ అతిథి దేవుణ్ణి సాగనంపి, బాధగా వెనక్కు వచ్చి అప్పుడు ఆ గృహస్తు భోజనం చేసేవాడట.
ఒక భాగవతుడికి ఇంకో భాగవతుడి అతిథి అర్చన ఇదని వ్రాశారు రాయలవారు.
వడ్దనయ్యాక,
ఇంక కలుపుకోండని గృహస్తు కోరతాడు. గోవిందనామస్మరణ చేసి,
పెద్దవాళ్లు కలుపుకున్నాక అప్పుడు తక్కిన వారు తినేవాళ్లు. వడ్డించింది వడ్డించినట్టు
నోట్లో వేసుకోవటం అమర్యాద ఆనాడు. అతిథులు తిన్నాకే గృహస్థు భోంచేయటంలో ఒక భక్తి
భావన ఉంది. ఇంగ్లండులో ముందు గృహస్తు ముద్ద నోట్లో పెట్టుకున్నాకే అతిథి తింటాడట.
అది శబరిభక్తి లాంటి మర్యాద.
వడ్డించటానికే
కాదు తినటానికీ మర్యాదలున్నాయి. గుటుకూగుటుకూ మంటూ ‘జల్దీభోజనం’
చేస్తూ, బంతిలో మిగతావాళ్ళు
కూరలో ఉండగానే సాంబార్‘ తెమ్మని కొందరు అరుస్తుంటారు. భోజనాన్ని ఆస్వాదిస్తూ
తినేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది.
ఎడం చేత్తో
రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకు తినటం ఒక గొప్పగా భావించేవారు
కొందరున్నారు. అది చూసేవారికి అసహ్యం అనిపిస్తుంది. ఫోర్కుని ఎడంచేత్తోనూ,
కత్తిని కుడిచేత్తోనూ పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి
మర్యాద. గోరుతో పోయే దానికి గొడ్డలి వాడినట్టు, ఇడ్లీ,
అట్టుల్ని కూడా అలా ఫోర్కుతో తినటం ఇప్పటి విచిత్రం. చెంచాతో కాకుండా
ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని థాయి ప్రజలు తప్పుపడతారు. చెంచాను
నోట్లోకి తోసి, నాకటాన్ని యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు.
కూర్చుని,
పళ్ళెం మీదకు వంగి ఆహారాన్ని తినాలే గానీ, నిలబడి
పళ్ళేన్ని నోటి దగ్గరకు తీసుకెళ్ళకూడదు. పప్పన్నం, పప్పుచారు
లాంటివి అలా తినటానికి అనువైనవి కాదు. కాబట్టి ఆ అలవాటు మన పూర్వులకు లేదు.
ఇంట్లో అయితే
సరేగాని, ఎంగిలిచేత్తో గరిటెని పుచ్చుకుని వడ్డించుకోవటం లాంటివి
హోటళ్ళ కొచ్చినప్పుడు కూడా చేయటం అమర్యాదకరమే!
No comments:
Post a Comment