Saturday 3 April 2021

మన భోజన విధి :: కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S. 9440172642

 

మన భోజన విధి

కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S.

9440172642

          ఆల ఘృతంబు వేడియగు నన్నము నుల్చిన  ముద్దపప్పు క్రొం

            దాలిపు కూర అప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్

            మేలిమి పిండివంటయును మీగడతోడి దధి ప్రకాండముల్

            నాలుగు మూడుతోయములనంజులు గంజదళాక్షి పెట్టగన్

                                                        (తెనాలి రామకృష్ణుడు హరిలీలా విలాసం)

తెనాలి రామకృష్ణుడు హరిలీలా విలాసం అనే కావ్యం కూడా వ్రాశాడని చెప్తారు. ఇలాంటి కొన్ని పద్యాలే తప్ప ఆ కావ్యం అలభ్యం. తామర రేకులవంటి కన్నులు కలిగిన ఓ ఇల్లాలు వండి వడ్డించిన వంటకాల పట్టిక ఈ పద్యంలో ఉంది:

1) ఆలఘృతంబు=ఆవునెయ్యి; 2) వేడియగు నన్నము=వేడివేడి అన్నం; 3) నుల్చిన ముద్దపప్పు= నులించు అంటే to crush విసరటం. కందుల్ని దోరగా వేయించి విసిరి పొట్టు తీసి వండిన ముద్దపప్పుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే తేలికగా అరుగుతుంది. 4) క్రొందాలింపు కూర=వడ్డించబోయే ముందు తాలింపు పెట్టిన కూర. 5) అప్పడము= తమిళంలో పప్పటం, అప్పళం; మళయాళంలో పప్పటం; కన్నడంలో పప్పడి, అప్పడ, అప్పళ; సంస్కృతం పర్పట పేర్లతో కనిపించే అప్పడం మన ప్రాచీన వంటకం. అపూపం(ఋగ్వేద వంటకం), అప్పాలు అనే తీపి భక్ష్యం, ఈ అప్పడం ఇవన్నీ ద్రావిడ నామాలే! పెసరపిండి, మినప్పిండి లేదా కందిపిండిలో సర్జక్షారం, సైంధవలవణం, మిరియాలపొడి కలిపి, వత్తి నిప్పుల మీద కాల్చి, నెయ్యి రాసుకుని అన్నంలో తింటారు;

6) ద్రబ్బెడ= ద్రబ్బెడ అనేది ఒక అన్నపు వంటకం. నూక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాఁడు ద్రబ్బెడ ఇలాంటి ద్రవ్యాలను ఎవరు తెచ్చిపెట్టినా అమృతంలా తింటున్న జడభరతుడి గురించి పోతనగారు భాగవతంలో (5-1) వ్రాశాడు. మూలభాగవతంలో కణ పిణాక పలీకరణ కుల్మాష స్థాలీపురీషాదీఅనే ప్రయోగ౦లో స్థాలీపురీష౦(అన్నపు కు౦డలో అడుగు మాడు)ని పోతనగారు మాడు ద్రబ్బెడఅని అనువది౦చాడు. మాడితే మాడు ద్రబ్బెడ! అన్న౦లో కమ్మని స౦బారాలు కలిపి మాడకు౦డా వేయిస్తే అది ద్రబ్బెడ (ఫ్రైడ్ రైస్?) కావచ్చు కదా! 

7) చారులు: చారంటే రసం (సారం). ధనియాలు, మిరియాలు, జీలకర్రల సారం. దీన్ని ఉలవలు, కాయగూరల రసాలతో కూడా కాయవచ్చు. చారులు అన్నది అందుకే! 8) పానకంబులు: అన్నపానాలు అనేది జంటపదం. అన్నమూ, పానమూ రెండూ తీసుకునేవారు. పాయసం, రసాల, శిఖరిణి, జంబీరపానకం(నిమ్మ షర్బత్) లాంటి తియ్యని పానీయాలను భోజనం చివర్లో సేవించేవాళ్లు. భోజనాంతే మధురసం భోజనం చివర తీపి తీసుకోవాలి అని సూత్రం.

9) మేలిమి పిండివంటయున్= రుబ్బిన పిండితో చేసిన వంటకాలు. ఇడ్లీ దోసె వడ వగైరా పిండివంటల్ని పూర్వం భోజనంలో ఒక భాగంగా తినేవారు. ఆనాటి వాళ్ళకి టిఫిన్లు తెలీవు.

10) మీగడతోడి దధి ప్రకాండముల్= గోప్రకాండము అంటే an excellent cow అని! ఇది మీగడతో కూడిన ఆవుపెరుగు

11) నాలుగు మూడు తోయముల నంజులు= నంజుకునే పచ్చడిని నంజు అంటారు. తోయమువారు అంటే companions అని! తోయముల నంజులు అంటే నాలుగైదు కూరగాయలు కలిపి చేసిన పచ్చళ్ళు కావచ్చు.

మన భోజన విధానంలో భక్ష్యాలు (కొరికి తినే గారె బూరెలు), భోజ్యాలు (నమిలి తినే పులిహోర, ద్రబ్బెడ లాంటివి) ఖాద్యాలు (చప్పరించే పచ్చళ్ళు) చోష్యాలు(చారు, సాంబార్ లాంటివి) లేహ్యాలు(నాలుకతో నాకి తినే నంజులు) ఇవీ పంచభక్ష్యపరమాన్నా లంటే!  మొదటిగా మృదువైనవీ, మధ్యలో కఠినమైనవీ, చివరిలో ద్రవ్పదార్థాలూ తీసుకోవటం తెలుగువారి ఆహార సంస్కృతి. పప్పు, కూర, పచ్చడి, పులుసు/చారు, పెరుగు ఈ వరుసలో తినటం మన విధానం. ఈ పద్యం మన సంపూర్ణ భోజన విధానాన్ని సూచిస్తోంది.

No comments:

Post a Comment