Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Monday, 13 December 2021
పూర్ణచందుకు వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి లత సాహితీ పురస్కారం
Wednesday, 13 October 2021
నులివెచ్చని ఆహారం:: డా|| జి వి పూర్ణచందు
తినరా మైమరచి శీర్షిక 18-4-21 ఆదివారం సంచిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితం
పునుగుం దావి నవోదనంబు
మిరియంపుం బొళ్ళతో జట్టి చు
య్యను
నాదారని కూర గుంపు ముకు మందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్ళును బాయసాన్నములు నూరుంగాయలున్ జే సురు
క్కనునేయుం
జిరుపాలు వెల్లువుగ నాహారం బిడున్సీతునన్
శీతాకాలంలో ఇంటికొచ్చిన అతిథులకు
విష్ణుచిత్తుడు ఎలాంటి భోజనం వడ్డించాడో రాయలవారు ఆముక్తమాల్యదలోని ఈ పద్యంలో
చెప్తున్నాడు. శీతాకాలంలో ఎలాంటి పదార్ధాలు తినాలో ఒక సూచన ఇందులో కనిపిస్తుంది
1. పునుగుం దావి నవోదనంబు:
అక్కుళ్లు మసూరీలు అని ఇప్పుడున్నట్టే ఆ రోజుల్లో పునుగుదావులనే ఒక రకం బియ్యం
ఉండేవి. ఇవి కొంచెం వేడిని కలిగిస్తాయి కాబట్టి, చలికాలంలో
వాటితో వండిన వేడి అన్నం.
2. మిరియంపుం బొళ్ళతో జట్టి చుయ్యను
నాదారని కూరగుంపు: మిరియాలపొడితో చట్టి (కుండ)చుయ్యనే చప్పుడు ఆగకుండా
వండిన కూరగుంపులు అంటే రకరకాల కూరలు
3. ముకు
మందై యేర్చునావం జిగుర్కొను పచ్చళ్ళు: కొద్దిగా ఆవపిండి లేదా ఆవాలపిండి
చేర్చి, ఉరిన తరువాత తింటే మూర్ధన్యాలు అదిరేంత ఘాటురుచి కలుగుతుంది. క్యాబేజీ,
క్యాలీఫ్లవర్, బూడిదగుమ్మడి, సొర, పొట్ల, బీర, కంద లాంటి కూరల్ని ఉడికించి అందులో
పెరుగు, ఆవపిండి కలిపి తాలింపుపెట్టి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దాన్ని
ఆవపచ్చడి అంటారు. ఘాటైన ఈ ఆవపచ్చడి జలుబు రొంప బాధలకు ముక్కుమందు లాగా
ఉపయోగిస్తుందని శీతాకాలంలో ఇలాంటివి తినాలని కవిగారి భావన.
4. పాయసాన్నములు:
రకరకాల పాయసాలు
5. ఊరుంగాయలు:
వేసవికాలం ఊరుగాయల సీజన్. జాడీలకు వాసెనగట్టి ఊరుగాయల్ని 3-4 నెలలు మాగనిచ్చి
అప్పుడు తినేవారు. ఊరుగాయల్ని శీతాకాలంలో తినటం కోసమే పెట్టుకునేవాళ్లు. మనం
వేసవిలోనే తిని పొట్ట పాడు చేసుకుంటున్నాం.
6. చే
సురుక్కనునేయుం: చేతిపైన పడితే చురుక్కనేలా బాగా కాచిన వేడివేడి నెయ్యి.
అరచేతిని గుంటలా పట్టి అందులో నెయ్యి వడ్డించుకుని అన్నం మీద ధారగా పోసి
కలుపుకునేవాళ్లు. పాడి పంటల్ని ఈసడించే ఈ కాలీయులకు ఆ భాగ్యం ఎక్కడిది?
7. చిరుపాలువెల్లువుగ:
సగం మరిగేంత వరకూ చిక్కగా కాచిన పాలను చిరుపాలంటారు. శీతాకాలపు భోజనంలో మిరియాల
పొడి వేసి కాచిన చిరుపాలను వెల్లువగా వడ్డించేవాళ్లట. బహుశా, శీతాకాలంలో పెరుగు
బదులు పాలు, పంచదార అన్నంలో కలుపుకుని తినటం అలవాటుగా ఉండేదేమో!
లక్ష్మణవఝులవారి
ఇంటి హోటల్లో ఒక రూక తీసుకుని వడ్డించిన పదార్థాలను శ్రీనాథుడు
ఒక చాటువులో వర్ణిస్తాడు. అందులో గుప్పెడు పంచదార కూడా ఉంది. పంచదార ఎందుకంటే, ఇలా
పాలుగానీ, పెరుగు గానీ వడ్డించినప్పుడు అందులో కలుపుకోవటానికే!
శీతాకాలంలో యిలాంటి భోజనం నిస్సందేహంగా ఆరోగ్యదాయకం.
తన పాఠకులకు
నాలుగు మంచి విషయాలు చెప్పి మంచీ చెడుల గురించిన అవగాహన కల్పించాలనే కోరిక ప్రతీ
కవికీ ఉంటుంది. ఆ తపన లేకపోతే ఇంత కావ్యం వ్రాయవలసిన అగత్యం కవికి ఏముంటుంది?
వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలాలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పాఠకులకు తెలియచెప్పటం
రాయలవారి లక్ష్యం. విష్ణుచిత్తుడనే భక్తుడు తన ఇంటికి వచ్చిన అతిథులకు ఏ కాలంలో
ఎలాంటి భోజనం తినాలో అవే వండించి వడ్డించినట్టు ఈ కావ్యంలో వివరిస్తాడాయన!
ఆముక్తమాల్యద
ఒక భక్తి ప్రబంధం మాత్రమే కాదు, ఒక సామాజిక విఙ్ఞాన సర్వస్వం కూడా! ఇందులో 500
యేళ్ల తరువాత కూడా ఇప్పటి కాలానికి పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. మనం వాటిని ఆ
కోణంలోంచి పరిశీలించగలగాలి. అంతే!
ఉగాది పచ్చడి:: డా|| జి వి పూర్ణచందు
తతినరా మైమరచి శీర్షిక 4-4-21 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం
“అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య
దాయకమ్” (ధర్మసింధు)
“సంవత్సరం మొదటి రోజు ప్రొద్దున్నే
వేపపూవు, పంచదార,
చింతపండు, నెయ్యి కలిపిన ప్రసాదాన్ని తింటే ఆ
ఏడాదంతా సౌఖ్యదాయకంగా ఉంటుంది” అంటుంది ఈ
ఆర్యోక్తి. ప్రొద్దున్నే తలంటుకుని, కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని
ప్రార్థించుకుని, పరగడుపున ఈ వేపపూల ప్రసాదాన్ని తిని, ధ్వజారోహణం, పంచాంగ
శ్రవణాలు చేయాలని ధర్మసింధు గ్రంథం చెప్తోంది. తెలుగు భాషా సంస్కృతుల ప్రాభవాన్ని
చాటే పండుగ ఇది. అందుకని ధ్వజారోహణం అనే పదానికి తెలుగు జెండా ఎగరేయటం అని భాష్యం
చెప్పుకోవాలి
తీపి కోసం బెల్లం లేదా పంచదారని, పులుపు
కోసం చింతపండు లేదా ఇంకేదైనా పుల్లని ద్రవ్యాన్ని, ఉప్పదనం కోసం సైంధవ లవణాన్ని,
కారం కోసం మిరియాల పొడిని, వగరు కోసం లేత మామిడి వడపిందెల్ని, చేదు కోసం
వేపపువ్వుని కలిపి ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. నెయ్యి కూడా కొద్దిగా
కలపాలంటూన్నారీ శ్లోకంలో! నెయ్యి చేరిస్తే, ఏ ఆహార పదార్ధమైనా సౌమ్యంగా పనిచేస్తుంది. ‘అశోకకళికాప్రాశనం’
అంటే అశోక (నరమామిడి చెట్టు) పత్రాలతో కూడా ఒకప్పుడు ఉగాది పచ్చడి చేసేవారు
కాబోలు.
ఉత్తరాది
వారి ‘హోలీ’, మహారాష్ట్రుల ‘గూడీపాడవా’, అస్సామీల ‘రొంగాలిబిహూ’, తమిళుల
‘పుత్థాండు’, మళయాళీల ‘విషు’, మణిపూరి వారి ‘చైరావోబా’, కాశ్మీరీల ’నప్ రే’,
గుజరాతీయుల ‘బేస్తువారాస్’, రాజస్థానీయుల థప్న, సింధ్రీల ’చేతి చాంద్’
హిమాచలప్రదేశ్ వారి ‘చైత్తి’, పంజాబీల వైశాఖి, నేపాలీల పహ్లీ వైశాఖి ఇవన్నీ ఆయా
భాషీయుల సంవత్సరాది పండుగలు. వాటిని వాళ్లు తీపి భక్ష్యాలతో చేసుకుంటారు.
తెలుగువారి ఉగాదికి వేపపూల ప్రసాదమే ప్రధానం. చేదు రుచి ప్రాధాన్యతని
గుర్తింపచేయటమే మనవారి ఆంతర్యం. తమిళులు మాత్రం మామిడికాయ పచ్చడి అంటారు. మనం
వేపపూల పచ్చడి అంటాం.
ఆరు రుచులూ తగు నిష్పత్తుల్లో ఉంటేనే
అది షడ్రసోపేతమైన భోజనం. పులిహోరనే తీసుకోండి. అందులో కేవలం పులుపు, ఉప్పు, కారం
మాత్రమే కలిపితే అది ఆరోగ్యానికి చెడు చేస్తుంది. వగరు, చేదు రుచుల కోసం కొద్దిగా
ఆవపిండిని, మెంతిపిండిని, తీపి కోసం కొంచెం బెల్లాన్ని కలిపితే ఆ పులిహోర రుచి
పెరగటమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చేదిగా ఉంటుంది. ఆరు రుచులూ లేకుండా కేవలం పులుపు,
కేవలం కారం, కేవలం తీపి ఇలా తినవద్దని ఈ ఉగాది ప్రసాదం మనకు సూచిస్తోంది.
ఆధునిక వైద్య శాస్త్రం విటమిన్లు,
ఖనిజాలు, లవణాల్లాంటి పోషకాల తూకాన్ని బట్టి ఆహార ద్రవ్యాల పోషక విలువల్ని లెక్క
గడుతుంది. ఇది ఒక పద్ధతి. ఆరు రుచుల సిద్ధాంతాన్ని అనుసరించి ఆయుర్వేద శాస్త్రం
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ ఉంటేనే అది పోషక ఆహారం
అవుతుందని చెప్తుంది. ఈ వైద్యరహస్యాన్ని ఉగాది ప్రసాదం గుర్తు చేస్తోంది. ఆంగ్లేయ
విధానంలో పోషకాల కొలతలు, ఆయుర్వేదీయ విధానంలో ఆరు రుచుల కొలతల్ని పోల్చి చూస్తే,
రెండూ సమానమే అవుతాయి. శాకాహార పదార్ధాల్లో కార్బోహైడ్రేట్లే తీపి రుచిని
అందిస్తాయి. అలాగే ఇతర రుచులకు వాటిలోని విటమిన్లు ఖనిజాలు, లవణాలు వగైరా ఆయా
ద్రవ్యాలకు ఆ రుచుల్ని ఇస్తున్నాయి. మన భోజనంలోనూ, భోజన పదార్ధాలలోనూ ఆరు రుచులూ ఉండేలా
చూసుకుంటేనే మనం షడ్రసోపేతమైన ధనిక, పోషక భోజనం చేసినట్టవుతుంది.
ఏడాది పొడవునా వేపపూలను అన్నంలో
తినటానికి ప్రభావంతమైన ఒక ఫార్ములా చెప్తాను: 1 చెంచా ఇంగువ, 2 చెంచాల అల్లం ముద్ద,
4 చెంచాల మిరియాల పొడి, 8 చెంచాల జీలకర్ర, 16
చెంచాల పసుపు, 32 చెంచాల ధనియాలపొడి, అంతే కొలతలో అంటే 32 చెంచాలు ఎండించిన వేపపూల
పొడి, వీటికి తగినంత ఉప్పు చేర్చిన
కారప్పొడి రుచిగా ఉంటుంది. శరీరంలో విషదోషాలను పోగొడుతుంది. టానిక్కులా
శక్తిదాయకంగా ఉంటుంది. జీర్ణశక్తిని పదిలం చేస్తుంది. చేదురుచి ప్రాధాన్యతని
గుర్తించగలిగితే ఉగాదులన్నీ మనకు ఉషస్సులే!
లైంగికశక్తిని పెంచే ఓ ఫార్ములా:: డా|| జి వి పూర్ణచందు
లైంగికశక్తిని పెంచే ఓ ఫార్ములా:: డా|| జి వి పూర్ణచందు
తినరా మైమరచి శీర్షిక 28-3-21 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం
చాఱపప్పును గసగస ల్జాజికాయ
సెనగలను
ములువత్రియు మునుగపువ్వు
కొబ్బెరయు
మందపాలతోఁ గూర్చి త్రావి
యుబ్బు
దబ్బఱకాఁడు నీ కబ్బుటగునె!
లైంగిక సమర్ధతను పెంచే అత్యంత రహస్యమైన
ఒక ఫార్ములా ఈ పద్యంలో ఉంది. 16వాబ్దికి చెందిన గణపవరపు వేంకటకవి వ్రాసిన
“ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము” అనే ప్రబంధంలో సాహిత్య, సాంస్కృతిక వైఙ్ఞానిక
విశేషాలు చాలా ఉన్నాయి. ఈ అద్భుతమైన యోగాన్ని చూడండి:
1. చాఱపప్పు: సారపప్పు అనీ పిలుస్తారు.
బాదంపప్పు రుచిలో ఉంటుంది కాబట్టి దీన్ని Almondette అని, చరోలీ అనీ పిలుస్తారు. Buchanania lanzan దీని
వృక్షనామం. మసాలా దినుసుల్లో ఒకటిగా దీన్ని వాడుతుంటారు. వీర్యవర్థక గుణం
వీటికుంది.
2. గసగసాలు: నల్లమందు మొక్క గింజలివి.
వీర్యస్తంభనకు, వీర్యానికి చలవనిచ్చేందుకు ఉపయోగిస్తాయి.
3. జాజికాయ: ఆడవారి అందాన్ని, మగవారి
లైంగిక సమర్థతని పెంచే ద్రవ్యం ఇది.
4. సెనగలు:‘ద’ అక్షరం ఆకారంలో ఉండే
ఎర్రని చిర్రి శనగలకు వీర్యకణాల సంఖ్యను,సంతానోత్పత్తి శక్తిని పెంచే గుణం ఉంది.
గుండ్రటి బఠాణీ శనగలు లేదా బొంబాయి శనగలు పురుషులలో నపుంసకత్వానికి కారణం అవుతాయి.
వాటిని తినకండి,
5. ములువత్రి: ఇది ఏ మూలికో తెలీదు.
జాపత్రి కావచ్చు. జాజికాయ జాపత్రి ఇవి రెండూ లైంగికశక్తిని పెంపుచేసే గొప్ప
ద్రవ్యాలు.
6. మునుగపువ్వులు: మునగ పువ్వుల్ని(సోజ్నెఫూల్)
బెంగాలీయులు శెనగలు, ఆలుదుంపలతో వండి ఇష్టంగా తింటారు. లైంగిక సమర్ధతని పెంచుతాయి.
7. కొబ్బరి: స్త్రీపురుషులలో మూత్రాశయ
వ్యవస్థని, జననాంగ వ్యవస్థనీ బలసంపన్నం చేస్తుంది. మెదడుకి చురుకు నిస్తుంది.
8. మందపాలు: బహుశా ఆవుపాలు కావచ్చు.
చాఱపప్పు, గసగసాలు, జాజికాయ, ఎర్రశనగలు,జాపత్రి,
ములక్కాడల పూలు, ఎండుకొబ్బరి వీటన్నింటినీ
ఎండించి దేనికదే మెత్తగా దంచి, అన్నింటినీ సమానమైన కొలతతో
తీసుకుని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు
ఆవుపాలలో అరచెంచా నుండి ఒక చెంచా పొడిని కలిపి ఒకటి రెండు పొంగులు రానిచ్చి,
ఒక పలుకు పచ్చకర్పూరం, కావాలనుకుంటే కొద్దిగా
పంచదార కలిపి త్రాగి ఉబ్బిన ఈ మోసగాడు నీకు చిక్కుతాడటమ్మా ...అంటుందీ పద్యం.
నిజానికి ఈ ఫార్ములా నిరపాయకరమైనది, బలకరమైనది. రోగాలను
ఎదుర్కొనే జీవశక్తిని శరీరానికి కలిగిస్తుంది. వీర్యంలో దోషాలను పోగొట్టి, జీవకణాల వృద్ధికి తోడ్పడుతుంది. శీఘ్రస్ఖలనాలను, నపుంసకత్వాన్నీ
జయిస్తుంది. స్త్రీపురుషుల్లో లైంగిక శక్తిని, ఆసక్తిని
పెంచుతుంది.కొన్ని ఆయుర్వేద
వైద్యగ్రంథాల్లో అక్కడక్కడా తెలుగు
పద్యాల్లో వైద్యక విషయాలను వ్రాసిన సందర్భాలున్నాయి. అల్లసాని పెద్దనగారు
మనుచరిత్రలో అష్టాంగాల గురించి పద్యాలలో వివరిస్తాడు. కాళ్ళాగజ్జీ కంకాళమ్మా అనే
బాలక్రీడా గేయంలో కాళ్లకు వచ్చే ఎగ్జీమా
వ్యాధిమీద పనిచేసే ఫార్ములా ఉందని తి. ప. రామానుజస్వామిగారు చెప్పినట్టు ఆచార్య
బిరుదురాజు రామరాజుగారు వ్రాశారు. ప్రబంధరాజ శ్రీ వెంకటేశ్వర విజయ విలాసం కావ్యంలో
సందర్భవశాత్తూ చెప్పిన ఈ అద్భుత ఔషధం అపురూపమైనదే! కావ్యాలలో ఇలాంటి ఔషధ తయారీ
ప్రస్తావన విశేషం కూడా!
వేసవిలో రాయల పానీయం:: డా|| జి వి పూర్ణచందు
వేసవిలో రాయల పానీయం:: డా|| జి వి పూర్ణచందు
తినరా మైమరచి శీర్షిక 21-3-21 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం
తెలి నులివెచ్చ యోగిరము దియ్యని
చారులు దిమ్మనంబులున్
బలుచని
యంబళు ల్చెరకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీత జలముల్వడ పిందెలు నీరు జల్లయు
న్వెలయగ
బెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్
వేసవికాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు
విష్ణుచిత్తుడు వడ్డించిన వంటకాలను రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలోని ఈపద్యంలో
వివరించారు:
1. తెలి
నులివెచ్చ యోగిరము= నులివెచ్చగా ఉన్న తెల్లన్నం అంటే వరి అన్నం. తేలికగా
అరుగుతుంది. వడకొట్టదు.
2. దియ్యని
చారులు=తియ్యని చారు అంటే, చింతపండు వెయ్యని రసం. తమిళనాడులో
దీన్ని ‘టిక్కాచారు’ అంటారు
3. తిమ్మనంబులున్:
తేమనం, తిమ్మనం ఈ రెండింటికీ ఒక రకమైన ద్రవ వంటకం(సాస్) అని
సంస్కృత నిఘంటు అర్థం. తెలుగు నిఘంటువులు తేమనం అంటే మజ్జిగ పులుసు అని వ్రాసాయి.
బియ్యప్పిండి, కొబ్బరి, అల్లం,
మిరియాలు, వాము వగైరాలను పాలతో ముద్దగా కలిపి చిన్న ఉండలుగా చేసి
మరుగుతున్న మజ్జిగపులుసులో వేసి ఉడికిస్తే అవి ‘తిమ్మనలు’
కావచ్చు. అన్నంలో తినటానికి బావుంటాయి. వేసవిలో చలవనిస్తాయి.
4. పలుచని
అంబలి= వరి లేదా జొన్న నూకల జావ (Porridge). అంబకళము,
పులియంబళకము ఇలా అంబలిని పులియబెట్టి తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇవి
వడదెబ్బ తగలకుండా చేస్తాయి.
5. చెరకుపాలు=
చెరకు రసం. వేసవి తాపానికి విరుగుడు పానీయం ఇది.
6. రసావళుల్ఫలంబులు=
బాగారసం నిండిన తియ్యమామిడిపండ్లు
7. సుగంధిశీతజలాలు=
ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క
లాంటి సుగంధ ద్రవ్యాల పొడిని నీళ్లలో వేసి కాచి, చల్లార్చి
కుండలో పోసిన చల్లని నీళ్లు. తమిళనాడు, కేరళలలో
పచ్చి మంచినీళ్లకు బదులుగా జీరావాటర్, ధనియావాటర్,
దాల్చినివాటర్, వాంవాటర్ లాంటివి ఈనాటికీ త్రాగే అలవాటుంది. వడదెబ్బకు
విరుగుడు పానీయాలివి.
8. వడపిందెలు=లేతమామిడి
పిందెలు. వగరుగా ఉంటాయి వీటిని తరిగి ఉప్పు వేసి ఊరబెట్టి, మిరియాలపొడితో
అన్నంలో తింటారు. వడపిందెలు వడకొట్టకుండా కాపాడతాయి.
9. నీరుచల్ల:
బాగా చిలికి 3 రెట్లు నీళ్లు కలిపి కనీసం 5-6
గంటలు కదల్చకుండా ఉంచిన మజ్జిగ నీటిని ‘నీరుచల్ల’
అంటారు. దీన్నిండా ఉపయోగపడే బాక్టీరియాలు ఉంటాయి. చలవనిచ్చి,
పేగులను సంరక్షిస్తాయి. ఉత్తమ వేసవి పానీయం.
ఈ పద్యం చూస్తే విష్ణు చిత్తుడు అతిథుల్ని
బ్రతిమాలి పిలిచి, చెరకురసం, గంజినీళ్లు, చారునీళ్లు,
మజ్జిగనీళ్లు పోసి అన్నం
పెట్టాడని మనం అపార్థం చేసుకోకూడదు. ఎండలో పడి వచ్చిన
అతిథికి ఇవి స్వాగతపానీయాలు (welcome Drinks). చందనచర్చ
అంటే మంచిగంథం పూసి వడదెబ్బ నుండి సేదతీర్చి,
అప్పుడు భోజనం పెట్టేవాడన్నమాట.
ఇంటికొచ్చిన అతిథి షుగరు రోగి అయినా,
బలవంతంగా స్వీట్లు పెట్టి, ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర
అదనంగా వేసుకోండని
ఉచిత సలహాలిచ్చే తరహా ‘అతిమర్యాదలు’
విష్ణుచిత్తుడు చేయలేదు. కాలానికి తగ్గ ఆహార పదార్థాలను ఇంపుగా వడ్డించే
వాడాయన.
కావ్యాలు
చదివితే కలిగే ప్రయోజనం ఇదే! చెయ్యవలసినవి, చెయ్యకూడనివి
రెండూ తెలుస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈపద్యంలో వేసవిలో వడకొట్టనీయని ఆహార పదార్ధాల
పట్టిక ఇచ్చాడు. వాటిని మనం అవశ్యం గమనించాలి.
భోజన మర్యాద:: డా|| జి వి పూర్ణచందు
భోజన మర్యాద:: డా|| జి వి పూర్ణచందు
తినరా మైమరచి శీర్షిక 14-3-21 ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితం
ఎదురేగి సాష్టాంగ మెరగి పాద్యం బిచ్చి/నారికేళ కటాసనముల
నునిచి
నును బోక
పొత్తి గుట్టిన దొప్ప గమితోడ/రంభ విశాల పర్ణములు వరిచి
శాల్యన్న
సూపాజ్య కుల్యా బహువ్యంజ/నక్షీర
దధులర్పణంబు జేసి
వార్చిన పిదప సంవాహన మంఘ్రుల/కొనరిచి తాంబూల మొసగి కుశల
మడిగి పోయెద
మన్న దవ్వనిచి సిరికి/దగిన సత్కృతి జేసి ఖేదమున మగిడి
యర్చన గావింతు
రెపుడు నిట్లతిథులైన/భాగవతులకు నప్పురి భాగవతులు
ఆముక్తమాల్యద
కావ్యంలో ఆనాటి భోజన మర్యాదల గురించి రాయలవారి వర్ణన ఇది. అతిథు లైన భాగవతులకు
ఎదురేగి, కుశలప్రశ్నలు వేసి, సాష్టాంగ
పడి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తారు. కాళ్లు కడుగుతారు. కొబ్బరీనెలతో అల్లిన చాపలు
వేస్తారు. పెద్ద అరిటాకుల్లో వడ్డిస్తారు. తినని వాటిని పడేయటానికి వక్కచెట్ల
ఆకుల్తో కుట్టిన డొప్పల్ని పక్కన ఉంచుతారు. విస్తట్లో వరి అన్నం,
పప్పు వడ్డించి, కాలువలు కట్టేంతగా నెయ్యి పోస్తారు. పప్పుతోపాటుగా అనేక
వ్యంజనాలు అంటే “వ్యంజనాని ఓదనార్థాని”-తినటానికి
ఉద్ధేశించిన కూరలు, పచ్చళ్లు, పులుసులు కొద్దికొద్దిగా వడ్డిస్తారు. పాలతో
వండిన పాయసాలు, పెరుగు, ఉప్పు, పంచదార సహా వడ్డనకు సిద్ధంగా ఉన్న వంటకాలన్నీ వడ్దనయ్యాక,
ఇంక కలుపుకోండని గృహస్తు కోరతాడు. గోవిందనామస్మరణ చేసి,
పెద్దవాళ్లు కలుపుకున్నాక అప్పుడు తక్కిన వారు తినేవాళ్లు.
భోజనానంతరం
నడుము వాల్చేందుకు శయ్య ఏర్పాటు చేసి, కాళ్ళు
నొక్కి సేద తీరుస్తారు. వెళ్లేప్పుడు తాంబూల సత్కారాలు చేస్తారు. అల్లంత దూరం
వెళ్లి ఆ అతిథి దేవుణ్ణి సాగనంపి, బాధగా వెనక్కు వచ్చి అప్పుడు ఆ గృహస్తు భోజనం చేసేవాడట.
ఒక భాగవతుడికి ఇంకో భాగవతుడి అతిథి అర్చన ఇదని వ్రాశారు రాయలవారు.
వడ్డించటానికే
కాదు తినటానికీ మర్యాదలున్నాయి. గుటుకూగుటుకూ మంటూ ‘జల్దీభోజనం’
చేస్తూ, బంతిలో మిగతావాళ్ళు
కూరలో ఉండగానే సాంబార్‘ తెమ్మని కొందరు అరుస్తుంటారు. భోజనాన్ని ఆస్వాదిస్తూ
తినేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది.
వడ్డించింది
వడ్డించినట్టు నోట్లో వేసుకోవటం అమర్యాద ఆనాడు. అతిథులు తిన్నాకే గృహస్థు
భోంచేయటంలో ఒక భక్తి భావన ఉంది. ఇంగ్లండులో ముందు గృహస్తు ముద్ద నోట్లో
పెట్టుకున్నాకే అతిథి తింటాడట. అది శబరిభక్తి లాంటి మర్యాద.
ఎడం చేత్తో
రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకు తినటం ఒక గొప్ప కొందరికి. కానీ, అది
చూసేవారికి అసహ్యం అనిపిస్తుంది. ఫోర్కుని ఎడంచేత్తోనూ, కత్తిని
కుడిచేత్తోనూ పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి మర్యాద. గోరుతో పోయే
దానికి గొడ్డలి వాడినట్టు, ఇడ్లీ, అట్టుల్ని కూడా అలా ఫోర్కుతో తినటం ఇప్పటి విచిత్రం.
చెంచాతో కాకుండా ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని థాయి ప్రజలు
తప్పుపడతారు. చెంచాను నోట్లోకి తోసి, నాకటాన్ని
యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు.
కూర్చుని,
పళ్ళెం మీదకు వంగి ఆహారాన్ని తినాలే గానీ, నిలబడి
పళ్ళేన్ని నోటి దగ్గరకు తీసుకురాకూడదు. పప్పన్నం, పప్పుచారు
లాంటివి అలా తినటానికి అనువైనవి కాదు. కాబట్టి, ఆ అలవాటు మన పూర్వులకు లేదు.
ఇంట్లో అయితే
సరేగాని, ఎంగిలిచేత్తో గరిటెని పుచ్చుకుని వడ్డించుకోవటం లాంటివి
హోటళ్ళ కొచ్చినప్పుడు కూడా చేయటం అమర్యాదకరమే!
Sunday, 10 October 2021
రాయల యుగం సీమ వంటలు:: డా|| జి. వి. పూర్ణచందు
రాయల యుగం సీమ వంటలు
డా|| జి. వి. పూర్ణచందు
పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు పుళియోరెము వెన్న బూరియలును
సరడాల పాశముల్(?) చక్కెర పులగముల్ నువ్వుమండిగలు మనోహరములు
అప్పము లిడ్డెన లతిరసాల్ హోళిగల్ వడలు దోసెలు గలవంటకములు
శాకముల్ సూపముల్ చాఱు లంబళ్లు శుద్ధోదనములును సద్యోఘృతమ్ము
పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును/మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండఁ
బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె/ శత్రు సంహార వెంకటాచల విహార (వెంకటాచల విహార శతకం)
పాలు, వెన్న, బకాళబాతు, దధ్యోదనం, పులిహోర, వెన్నబూరెలు, సరడాలపాశం, చక్రపొంగలి, నువ్వు మండిగలు, మనోహరాలు, అప్పాలు, ఇడ్డెనలు, అతిరసాలు(అరిశెలు), హోళిగలు(బొబ్బట్లు) వడలు, దోసెలు, కలవంటకాలు(చిత్రాన్నాలు), శాకములు(కూరలు), సూపము(పప్పు), చారు(రసము), అంబళ్లు(అంబలి), శుద్ధోదనం(తెల్లన్నం), సద్యోఘృతం(తాజానెయ్యి), పండ్లు, తేనెలు, బొబ్బట్లు, పచ్చళ్లు ఇన్ని వంటకాల్ని నైవేద్యంగా పెట్టి “ఇవన్నీ మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు (గుగ్గిళ్లు) మ్రింగుచుండఁ బర్వసేయవు(పట్టించుకోవు) నీవంటి బ్రదుకు గాదె” అని నిలదీస్తౌన్నాడు కవి. సుల్తానులు చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింప చేయాలని కోరుతూ, 15-16 శతాబ్దాల నాటి ఓ అఙ్ఞాత కవి ఈ ‘వెంకటాచల విహారశతకం’ వ్రాశాడు. నిందాస్తుతితో రాసినపద్యాలివి. కొండపైన నువ్వు, కొండ దిగువన మీ అన్న గోవిందరాజస్వామి లేవనైనా లేవకుండా మొద్దు నిద్ర పోతున్నారంటాడీ కవి. ఈ పద్యంలో ఆనాటి రాయలసీమ వంటకాలు అనేకం కనిపిస్తాయి. వీటిలో చాలా భాగం మనం ఎరిగినవే! వీటిలో ఇప్పటి మన వాడకంలో లేని ఓ నాలుగు వంటకాలను పరిశీలిద్దాం:
1. బకాళబాతు: బిసిబేలీబాత్ లాంటిదే ఇది. కన్నడం వారికి బాత్ అంటే ద్రవంగా వండిన అన్నం అని! వారు ‘బగాళాబాత్’ పేరుతో
సేమియా పెరుగు కలిపిన వంటకంగా చేస్తున్నారు. తృణధాన్యాలతో చేసిన ‘కర్డ్ రైస్‘ని కూడా వారు ‘బగాళాబాత్’ అనే పిలుస్తున్నారు. అయితే, ఈ పద్యంలో దధ్యోదనం కూడా ఉంది కాబట్టి ఇది ఏదైనా ధాన్యవిశేషంతో పెరుగు కలిపి చేసిన బాత్ అయి ఉంటుంది.
2. సరడాల పాశము: ఈ గ్రంథాన్ని పరిష్కరించిన వేటూరి ప్రభాకర శాస్త్రిగారు సరడాలపాశం దగ్గర ఒక ప్రశ్నార్థకాన్ని ఉంచారు. ఈ
వంటకం ఏదైనదీ తెలీదు. పాశం అంటే పాయసం. అన్నమయ్య అక్కుళ్లుతో వండిన పాయసాన్ని అక్కాలపాశం అనీ, శ్రీనాథుడు సేమియాతో చేసిన పాయసాన్ని సేవెపాయసం అనీ అన్నారు. హంసవింశతి కావ్యంలో ‘సరడాలు’ అనే వంటకం పేరు కనిపిస్తుంది. సరడాలనే బియ్యంతో కాచిన పాయసం సరడాల పాశెం కావచ్చు. ఒకరకం వంకీల గొలుసుకు సరడాలనే(శరణ్డః) పేరుంది. బహుశా మరుగుతున్న పాలలో పిండిని వంకీలుగా వత్తి వండిన ‘పాలతారికలు’ లాంటి వంటకం ఇది కావచ్చు.
3. మనోహరాలు: బియ్యప్పిండి, మినప్పిండి, పెసరపిండి కలిపి, చిన్న బలపం ముక్కలుగా చేసి, బెల్లంపాకం పట్టినవి మనోహరాలు.
మెల్కోటే, మధురై, తిరునెల్వేలీలలో బలపాల్లాంటి మనోహరాల్నే ప్రసాదంగా పెడతారు. పాలక్కాడులో తీపిబూందీని మనోహరా లంటారు. వీటిని లడ్డూలుగా కూడా ఉండచుడతారు. ఈ లడ్డూల్ని తమిళులు “మనోహరం ఉరుండై” టారు. 16వ శతాబ్దిలో మనోహరపడి పేరుతో తిరుపతిలో ఈ లడ్డూల్ని ప్రసాదంగా పెట్టేవారని చెప్తారు.
4. నువ్వు మండిగలు: మండిగె (మండిగ) అంటే తప్పాలచెక్కల మాదిరి చేసిన బియ్యప్పిండి రోటీ. దీనికి నువ్వులద్ది కాల్చినవి
నువ్వు మండిగలు కావచ్చు. "కుడుముల్ గారెలు బెల్లపు మండిగెలు” అనే కవి ప్రయోగ్గాన్ని బట్టి తీపి మండిగలు ఉండేవని తెలుస్తోంది.
5. హోలిగ: బొబ్బట్టు, ఓలిగ అని తెలుగులోనూ, హోలిగె, ఒబ్బట్టు అని కన్నడంలోను, ‘పూరన్ పూరీ’ అని గుజరాతీలోనూ, పోలి అని తమిళంలోనూ, పూరణ్ పోలి అని మరాఠీలోనూ, ‘పోలె’లని తెలంగాణాలోనూ, ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఈ పద్యంలో హోళిగనీ హొబ్బట్టునీ రెండింటినీ ప్రస్తావించటాన్ని బట్టి, బహుశా దీన్ని పెనంపై కాల్చే విధానంలో తేడా ఉండొచ్చు. నెల్లూరు బొబ్బట్లు పెద్ద పరిమాణంలో పొడిపొడిగా ఉంటాయి. తినేప్పుడు నేతితో తడిపి తింటారు. ప్రాంతాల్నిబట్టి వేర్వేరు పేర్లు ఉండవచ్చు.
Saturday, 18 September 2021
రామాయణంలో పలావు:: డా|| జి. వి. పూర్ణచందు,
రామాయణంలో పలావు:: డా|| జి. వి. పూర్ణచందు,
19-09-2021 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచికలో తినరామైమరచి శీర్షికన ప్రచురితం
సురాఘట సహస్రేణ మాంసభూతోదనేన చ
యక్షే త్వామ్ ప్రయతా దేవీ పురీమ్ పునరుపాగతా (అయోధ్యకాండ 2-52-89)
అడవులకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు గంగను దాటేప్పుడు సీతాదేవి గంగామాతకు అనేక మొక్కులు మొక్కింది. వాటిలో ఒకమొక్కుని ఈ శ్లోకంలో వర్ణించాడు ఆదికవి వాల్మీకి. “ఓ గంగామాత! రాముడు, లక్ష్మణుడూ, నేనూ క్షేమంగా అడవుల నుండి తిరిగి వస్తే, వెయ్యి కుండల సురని. మాంసంతో వండిన అన్నాన్ని (మాంసోదనం) సమర్పించుకుంటాను” అని దీని భావం. వెయ్యి కుండల సురని అలాగే, మాంసంతో వండిన పలావునీ తెచ్చి గంగానదిలో గుమ్మరించి నదిని కలుషితం చేస్తానందని దీని అర్థం ఎంతమాత్రమూ కాదు. దీనికి ముందు చెప్పిన శ్లోకంలో “గవాం శత సహస్రాణి వస్త్రాణి అన్నం చ పేశలం| బ్రాహ్మణేభ్యః ప్రదాస్యమి తవ ప్రియ చికీర్షియా||” లక్ష ఆవుల్ని, కొత్తబట్టల్ని, అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టి, నిన్ను సంతృప్తి పరుస్తాను తల్లీ” అని సీత మొక్కు కుందని వివరించాడు వాల్మీకి. అంటే, శాకాహారులకు ఆవుల్ని, కొత్తబట్టల్ని, అన్నాన్ని దానం చేస్తానని, మాంసాహారులకు సురని, మాంసోదనాన్ని దానం చేస్తానని, ఈ దానాలతో గంగామాత సంతృప్తి చెందుతుందని సీత భావించింది.
వాల్మీకి కాలానికే శాకాహారులు, మాంసాహారులు, మద్యపానం చేసేవారు, చేయనివారు ఇలా స్పష్టమైన విభజన ఏర్పడిందని దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. నిన్నమొన్నటి దాకా అన్ని కులాలవాళ్లూ తిన్నా, శాకాహార హోటళ్ళను బ్రాహ్మణ భోజన హోటలనీ, మాంసాహార హోటళ్ళని మిలిటరీ హోటలనీ అనేవాళ్లు కదా! సీతాదేవి బ్రాహ్మణులకు ఆవుల్ని, బట్టల్నీ, అన్నాన్ని దానంగా ఇస్తాననటం కూడా బ్రాహ్మణ భోజన హోటల్లో బ్రాహ్మణ శబ్దం లాంటిదే! దాన్ని కుల పరంగా కాక, శాకాహారుల కని అన్వయించాలి.
మాంసాన్ని
అన్నంతో కలిపి వండే వంటకాలలో పలావు, బిరియానీ మన దేశంలో ఆదినుండీ ఉన్నాయి. వాటి
పేర్లు తర్వాత వచ్చాయి కానీ, వంటకాలు పాతవే!
పాకశాస్త్రానికి సంబంధించిన గ్రంథాల్లో
నలచక్రవర్తి ‘పాకదర్పణం’
ప్రాచీనమైనది. ఇది 9-10వ శతాబ్ది నాటిది
కావచ్చు. ఇందులో పలావు తయారీ విధానం ఉంది. అన్నాన్ని మాంసాన్ని కలిపి వండుతారు
కాబట్టి, దీన్ని నలుడు “మాంసోదనం” అన్నాడు. సీతాదేవి కూడా “మాంసభూతోదనం” (మెత్తగా
ఉడికించిన మాంసం కలిపిన అన్నం) తయారు చేయించి
అన్నదానం చేస్తానంది.
మాంసాన్ని పసుపు, ధనియాలు ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి మెత్తగా ఉడికించాలి. ఇది మాంసానికి శుద్ధి. ఉత్తమమైన తెల్ల బియ్యాన్ని ఎసట్లో పోసి, ఉడుకుతుండగా అందులో ఈ శుద్ధిచేసిన మాంసాన్ని, తగినంత సైంధవలవణాన్ని వేసి నెయ్యి కలిపి పొయ్యి మీంచి దింపబోయే ముందు కొన్ని అప్పడం ముక్కలు, కొద్దిగా కొబ్బరినీళ్లు, నెయ్యి, కస్తూరి, పచ్చకర్పూరం, మొగలి పూరేకులు చేర్చి పరిమళాలు బయటకు పోకుండా వాసెనగట్టి సన్న సెగన ఉమ్మగిల నివ్వాలి. ఇదీ నలుడి మాంసోదనం. “ఈ మాంసోదనం చాలా రుచిగా శక్తినిచ్చేదిగా ఉంటుంది. తేలికగా అరుగుతుంది. ధాతువుల్ని వృద్ధి చేస్తుంది. ఆపరేషన్లు అయిన వారికి, యుద్ధంలో గాయపడ్ద సైనికులకు వ్రణాలు త్వరగా తగ్గుతాయి” అన్నాడు నలుడు.
ఇంగ్లీషు పదం pilaf, టర్కీ pilav, పర్షియన్ pilāvలోంచి పలావు వచ్చిందని భాషావేత్తలు చెప్తారు. 16వ శతాబ్దిలో palāv, pilāv, లేక pulāv పదాలు ఏర్పడ్డాయి. అంతకు మునుపు మాంసోదనం అనే అనేవారు. ‘స్థాలీ పులాక న్యాయం’లో‘పులాక’ అంటే సంస్కృతంలో అన్నం మెతుకు అని! ఇదే పులావ్ పదానికి మూలం అని కొందరంటారు. కానీ, తెలుగులో ‘పొల’ లేదా ‘పొలసు’ అంటే మాంసం. “పొలపెట్టు లేకపోవటం” అంటే మాంసం లేని భోజనం చేయటం అని ప్రయోగం ఉంది. ‘పొలగాలి’ అంటే నీచువాసన వేస్తోన్న గాలి. ‘పొలదిండి’ అంటే మాంసాహారి. ‘పొల పెట్టిన అన్నం’ అంటే మాంసోదనం అని. పలావ్ లేదా పులావులో తెలుగు మూలాలు కూడా ధ్వనిస్తున్నాయి. పలావ్ తెలుగు పదమే అయినా ఆశ్చర్యం లేదు. ఈ పలావు మొగలాయీలవాలన మనకు వచ్చిందని చరిత్రకారులు చెప్తారు. కానీ రామాయణ కాలంనుండీ మాంసోదనాలు మనకూ ఉన్నాయి.
Thursday, 16 September 2021
గుత్తివంకాయ గుట్టు: డా|| జి వి పూర్ణచందు
గుత్తివంకాయ గుట్టు: డా|| జి వి పూర్ణచందు
ఆదివారం సంచిక ఆంధ్రజ్యోతి 4-7-21లో తినరా మైమరచి శీర్షికన ప్రచురితం
గుత్తివంకాయ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూర లోపలా నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా! (బసవరాజు అప్పారావుగారి గీతం)
గుత్తివంకాయ కూరని తన బావకి ఇష్టం అని వలపంతా కూరి వండిందట...కోరికతో
తినమని ఆహ్వానిస్తోంది మరదలుపిల్ల.
తెలుగు వారికి కూరల్లో రారాజు వంకాయే! “వంకాయ వంటి కూరయు/పంకజముఖి సీతవంటి
భామామణియున్/శంకరుని వంటి దైవము/లంకాధిపు వైరివంటి రాజును గలడే”… అని మెచ్చుకుంటూ, ఆహాహోలు పలుక్కొంటూ, లొట్టలు వేసుకుంటూ తినే కూరరాజము’
వంకాయే! వంకాయ కూరకి వరికూటికి విసుగులేదని సామెత.
వంకాయల్ని(Solanum melongena L) అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కెనడాలలో ఎగ్‘ప్లాంట్ అనీ, పశ్చిమ యూరప్ దేశాలలో ఆబర్జైన్ అనీ, దక్షిణ ఆసియా, సౌత్ ఆఫ్రికాలలో బ్రింజాల్ అనీ,
సంస్కృతంలో ‘వార్తాక’ అని పిలుస్తారు.
ఊదారంగు,
కాషాయం, నీలిరంగు
కలిగిన వంకాయలన్నింట్లోనూ విషదోషాల్ని పోగొట్టే యాంథోసయనిన్ ఉంటుంది. అందుకని, లేతవంకాయల్ని
అన్ని జబ్బుల్లోనూ తినవచ్చని ఆయుర్వేదం “బాలవార్తాకం
సదాపథ్యం” అని చెప్పింది.
మన నుండి మొదట టర్కీకి వంకాయలు చేరినప్పుడు
వాళ్లు దాని రుచికి మైమరచి ఎగిరిగంతు లేశారట. కానీ, ఇటలీకి పరిచయం చేసినప్పుడు
ఉమ్మెత్త మొక్క లాగా ఉందని, తింటే పిచ్చెక్కుతుందని భయపడి దీన్ని mad apple అని పిలిచారట! ఈ భయంతోనే
అమెరికన్లు కూడా అనేక శతాబ్దాల పాటు వంకాయ మొక్కల్ని (ఎగ్‘ప్లాంట్) క్రోటన్
మొక్కలుగానే పెంచారు
సొలనేసీ కుటుంబానికి చెందిన మొక్కల్లో
వంకాయ, క్యాప్సికమ్, ఆలూ దుంపలు, టమోటాలు. పొగాకు ముఖ్యమైనవి. వీటిలో
సొలనైన్ అనే ఆల్కలాయిడ్ ఉంది. కాలీఫ్లవర్, బ్రొకోలీ లాంటీ వాటిలో కూడా ఇది ఉంది.
కీళ్లవాతం, వాపులు, థైరాయిడ్ జబ్బు ఉన్న వారిమీద సొలనైన్ చెడు
ప్రభావాన్ని కలిగిస్తుంది. రోజూ అదేపనిగా సొలనైన్ కలిసిన వాటిని తింటే దాని మోతాదు
ఎక్కువై ముప్పు ఏర్పడుతుంది. అందుకే, వంకాయ ఆలూదుంపలు, టమోటా క్యాలీఫ్లవర్ వీటిని
కలిపిన (mixed)
కూరలు అతిగా తినకుండా ఉంటే మంచిది. ఆలూ, వంకాయ ఈ రెండింటినీ పచ్చిగా అసలు
తినకూడదు. వంకాయల్ని తరుగుతూనే పసుపునీళ్ళలో
వెయ్యాలి. బైట వాతావరణంతో కలిస్తే కణరెక్కుతాయి.
చాలా తెలుగు ప్రాంతాలవారు వంకాయను
పితృకార్యాలలో వాడరు. అది విశ్వామిత్ర సృష్టి అనే అపప్రథ ఎంచేతో ఏర్పడింది. కానీ,
అన్ని ప్రాంతాలవారూ వంకాయ కూరని ముఖ్యంగా గుత్తొంకాయ కూరని తప్పనిసరిగా పెళ్లి
విందు భోజనాల్లో వండి వడ్డిస్తారు.
గుత్తొంకాయని చెట్టునే ఉంచి కూరగా వండే
ఓ గమ్మత్తయిన విధానం ఉంది. లేత గుత్తొంకాయలు గుత్తులుగా ఉన్న మంచి వంగ
మొక్కని కడిగి అలంకరించిన పూలకుండీలో
పాతండి. వంకాయల్ని ఆ మొక్కకే ఉంచి నిలువుగా పక్షాలుగా చీల్చి, అందులో కూరకారం కూరి
మళ్లీ దగ్గరగా నొక్కేయండి. ఇప్పుడు పొడవుగా ఉండే ఓ గ్లాసులో వేడివేడి నెయ్యి
తీసుకుని ఈ చెట్టుదగ్గరకు తెచ్చి, ఒక్కో కాయ మునిగే లాగా పట్టి ఉంచండి. ఆ నేతి
వేడికి వంకాయ చక్కగా ఉమ్మగిలుతుంది. గుడ్డతో
అ కాయని తుడిచేస్తే వండినట్టే తెలియదు. పెళ్లివారు ఆశ్చర్యంగా ఒక్కో కాయని
కోసుకుని కమ్మగా ఆస్వాదిస్తూ తింటారు. ఇది వంకాయని చెట్టునే ఉంచి వండేపద్ధతి.
కనీసం 12 రకాల వంకాయ కూరలు చేయగలిగిన
అమ్మాయినే చైనా వాళ్లు పెళ్లి చేసుకుంటారట!
ఈ వంగకూరల సంఖ్య విషయంలో చైనీయుల పోటీ మనతోనే! లేతవంకాయల్ని పరిమితంగా
తినేట్లయితే వంకాయల మీద ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు.