Wednesday, 13 October 2021

లైంగికశక్తిని పెంచే ఓ ఫార్ములా:: డా|| జి వి పూర్ణచందు

 లైంగికశక్తిని పెంచే ఓ ఫార్ములా:: డా|| జి వి పూర్ణచందు

తినరా మైమరచి శీర్షిక  28-3-21 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం

                   చాఱపప్పును గసగస ల్జాజికాయ

                   సెనగలను ములువత్రియు మునుగపువ్వు

                   కొబ్బెరయు మందపాలతోఁ గూర్చి త్రావి

                   యుబ్బు దబ్బఱకాఁడు నీ కబ్బుటగునె!

          లైంగిక సమర్ధతను పెంచే అత్యంత రహస్యమైన ఒక ఫార్ములా ఈ పద్యంలో ఉంది. 16వాబ్దికి చెందిన గణపవరపు వేంకటకవి వ్రాసిన “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము” అనే ప్రబంధంలో సాహిత్య, సాంస్కృతిక వైఙ్ఞానిక విశేషాలు చాలా ఉన్నాయి. ఈ అద్భుతమైన యోగాన్ని చూడండి:

1.     చాఱపప్పు: సారపప్పు అనీ పిలుస్తారు. బాదంపప్పు రుచిలో ఉంటుంది కాబట్టి దీన్ని Almondette అని, చరోలీ అనీ పిలుస్తారు. Buchanania lanzan దీని వృక్షనామం. మసాలా దినుసుల్లో ఒకటిగా దీన్ని వాడుతుంటారు. వీర్యవర్థక గుణం వీటికుంది.

2.      గసగసాలు: నల్లమందు మొక్క గింజలివి. వీర్యస్తంభనకు, వీర్యానికి చలవనిచ్చేందుకు ఉపయోగిస్తాయి.

3.      జాజికాయ: ఆడవారి అందాన్ని, మగవారి లైంగిక సమర్థతని పెంచే ద్రవ్యం ఇది.

4.    సెనగలు:‘ద’ అక్షరం ఆకారంలో ఉండే ఎర్రని చిర్రి శనగలకు వీర్యకణాల సంఖ్యను,సంతానోత్పత్తి శక్తిని పెంచే గుణం ఉంది. గుండ్రటి బఠాణీ శనగలు లేదా బొంబాయి శనగలు పురుషులలో నపుంసకత్వానికి కారణం అవుతాయి. వాటిని తినకండి,

5.    ములువత్రి: ఇది ఏ మూలికో తెలీదు. జాపత్రి కావచ్చు. జాజికాయ జాపత్రి ఇవి రెండూ లైంగికశక్తిని పెంపుచేసే గొప్ప ద్రవ్యాలు. 

6.    మునుగపువ్వులు: మునగ పువ్వుల్ని(సోజ్నెఫూల్) బెంగాలీయులు శెనగలు, ఆలుదుంపలతో వండి ఇష్టంగా తింటారు. లైంగిక సమర్ధతని పెంచుతాయి.

7.    కొబ్బరి: స్త్రీపురుషులలో మూత్రాశయ వ్యవస్థని, జననాంగ వ్యవస్థనీ బలసంపన్నం చేస్తుంది. మెదడుకి చురుకు నిస్తుంది.

8.    మందపాలు: బహుశా ఆవుపాలు కావచ్చు.

చాఱపప్పు, గసగసాలు, జాజికాయ, ఎర్రశనగలు,జాపత్రి, ములక్కాడల పూలు, ఎండుకొబ్బరి వీటన్నింటినీ ఎండించి దేనికదే మెత్తగా దంచి, అన్నింటినీ సమానమైన కొలతతో తీసుకుని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు ఆవుపాలలో అరచెంచా నుండి ఒక చెంచా పొడిని కలిపి ఒకటి రెండు పొంగులు రానిచ్చి, ఒక పలుకు పచ్చకర్పూరం, కావాలనుకుంటే కొద్దిగా పంచదార కలిపి త్రాగి ఉబ్బిన ఈ మోసగాడు నీకు చిక్కుతాడటమ్మా ...అంటుందీ పద్యం.

నిజానికి ఈ ఫార్ములా నిరపాయకరమైనది, బలకరమైనది. రోగాలను ఎదుర్కొనే జీవశక్తిని శరీరానికి కలిగిస్తుంది. వీర్యంలో దోషాలను పోగొట్టి, జీవకణాల వృద్ధికి తోడ్పడుతుంది. శీఘ్రస్ఖలనాలను, నపుంసకత్వాన్నీ జయిస్తుంది. స్త్రీపురుషుల్లో లైంగిక శక్తిని, ఆసక్తిని పెంచుతుంది.కొన్ని ఆయుర్వేద  వైద్యగ్రంథాల్లో  అక్కడక్కడా తెలుగు పద్యాల్లో వైద్యక విషయాలను వ్రాసిన సందర్భాలున్నాయి. అల్లసాని పెద్దనగారు మనుచరిత్రలో అష్టాంగాల గురించి పద్యాలలో వివరిస్తాడు. కాళ్ళాగజ్జీ కంకాళమ్మా అనే బాలక్రీడా గేయంలో కాళ్లకు  వచ్చే ఎగ్జీమా వ్యాధిమీద పనిచేసే ఫార్ములా ఉందని తి. ప. రామానుజస్వామిగారు చెప్పినట్టు ఆచార్య బిరుదురాజు రామరాజుగారు వ్రాశారు. ప్రబంధరాజ శ్రీ వెంకటేశ్వర విజయ విలాసం కావ్యంలో సందర్భవశాత్తూ చెప్పిన ఈ అద్భుత ఔషధం అపురూపమైనదే! కావ్యాలలో ఇలాంటి ఔషధ తయారీ ప్రస్తావన విశేషం కూడా!

No comments:

Post a Comment