రామాయణంలో పలావు:: డా|| జి. వి. పూర్ణచందు,
19-09-2021 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచికలో తినరామైమరచి శీర్షికన ప్రచురితం
సురాఘట సహస్రేణ మాంసభూతోదనేన చ
యక్షే త్వామ్ ప్రయతా దేవీ పురీమ్ పునరుపాగతా (అయోధ్యకాండ 2-52-89)
అడవులకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు గంగను దాటేప్పుడు సీతాదేవి గంగామాతకు అనేక మొక్కులు మొక్కింది. వాటిలో ఒకమొక్కుని ఈ శ్లోకంలో వర్ణించాడు ఆదికవి వాల్మీకి. “ఓ గంగామాత! రాముడు, లక్ష్మణుడూ, నేనూ క్షేమంగా అడవుల నుండి తిరిగి వస్తే, వెయ్యి కుండల సురని. మాంసంతో వండిన అన్నాన్ని (మాంసోదనం) సమర్పించుకుంటాను” అని దీని భావం. వెయ్యి కుండల సురని అలాగే, మాంసంతో వండిన పలావునీ తెచ్చి గంగానదిలో గుమ్మరించి నదిని కలుషితం చేస్తానందని దీని అర్థం ఎంతమాత్రమూ కాదు. దీనికి ముందు చెప్పిన శ్లోకంలో “గవాం శత సహస్రాణి వస్త్రాణి అన్నం చ పేశలం| బ్రాహ్మణేభ్యః ప్రదాస్యమి తవ ప్రియ చికీర్షియా||” లక్ష ఆవుల్ని, కొత్తబట్టల్ని, అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టి, నిన్ను సంతృప్తి పరుస్తాను తల్లీ” అని సీత మొక్కు కుందని వివరించాడు వాల్మీకి. అంటే, శాకాహారులకు ఆవుల్ని, కొత్తబట్టల్ని, అన్నాన్ని దానం చేస్తానని, మాంసాహారులకు సురని, మాంసోదనాన్ని దానం చేస్తానని, ఈ దానాలతో గంగామాత సంతృప్తి చెందుతుందని సీత భావించింది.
వాల్మీకి కాలానికే శాకాహారులు, మాంసాహారులు, మద్యపానం చేసేవారు, చేయనివారు ఇలా స్పష్టమైన విభజన ఏర్పడిందని దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. నిన్నమొన్నటి దాకా అన్ని కులాలవాళ్లూ తిన్నా, శాకాహార హోటళ్ళను బ్రాహ్మణ భోజన హోటలనీ, మాంసాహార హోటళ్ళని మిలిటరీ హోటలనీ అనేవాళ్లు కదా! సీతాదేవి బ్రాహ్మణులకు ఆవుల్ని, బట్టల్నీ, అన్నాన్ని దానంగా ఇస్తాననటం కూడా బ్రాహ్మణ భోజన హోటల్లో బ్రాహ్మణ శబ్దం లాంటిదే! దాన్ని కుల పరంగా కాక, శాకాహారుల కని అన్వయించాలి.
మాంసాన్ని
అన్నంతో కలిపి వండే వంటకాలలో పలావు, బిరియానీ మన దేశంలో ఆదినుండీ ఉన్నాయి. వాటి
పేర్లు తర్వాత వచ్చాయి కానీ, వంటకాలు పాతవే!
పాకశాస్త్రానికి సంబంధించిన గ్రంథాల్లో
నలచక్రవర్తి ‘పాకదర్పణం’
ప్రాచీనమైనది. ఇది 9-10వ శతాబ్ది నాటిది
కావచ్చు. ఇందులో పలావు తయారీ విధానం ఉంది. అన్నాన్ని మాంసాన్ని కలిపి వండుతారు
కాబట్టి, దీన్ని నలుడు “మాంసోదనం” అన్నాడు. సీతాదేవి కూడా “మాంసభూతోదనం” (మెత్తగా
ఉడికించిన మాంసం కలిపిన అన్నం) తయారు చేయించి
అన్నదానం చేస్తానంది.
మాంసాన్ని పసుపు, ధనియాలు ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి మెత్తగా ఉడికించాలి. ఇది మాంసానికి శుద్ధి. ఉత్తమమైన తెల్ల బియ్యాన్ని ఎసట్లో పోసి, ఉడుకుతుండగా అందులో ఈ శుద్ధిచేసిన మాంసాన్ని, తగినంత సైంధవలవణాన్ని వేసి నెయ్యి కలిపి పొయ్యి మీంచి దింపబోయే ముందు కొన్ని అప్పడం ముక్కలు, కొద్దిగా కొబ్బరినీళ్లు, నెయ్యి, కస్తూరి, పచ్చకర్పూరం, మొగలి పూరేకులు చేర్చి పరిమళాలు బయటకు పోకుండా వాసెనగట్టి సన్న సెగన ఉమ్మగిల నివ్వాలి. ఇదీ నలుడి మాంసోదనం. “ఈ మాంసోదనం చాలా రుచిగా శక్తినిచ్చేదిగా ఉంటుంది. తేలికగా అరుగుతుంది. ధాతువుల్ని వృద్ధి చేస్తుంది. ఆపరేషన్లు అయిన వారికి, యుద్ధంలో గాయపడ్ద సైనికులకు వ్రణాలు త్వరగా తగ్గుతాయి” అన్నాడు నలుడు.
ఇంగ్లీషు పదం pilaf, టర్కీ pilav, పర్షియన్ pilāvలోంచి పలావు వచ్చిందని భాషావేత్తలు చెప్తారు. 16వ శతాబ్దిలో palāv, pilāv, లేక pulāv పదాలు ఏర్పడ్డాయి. అంతకు మునుపు మాంసోదనం అనే అనేవారు. ‘స్థాలీ పులాక న్యాయం’లో‘పులాక’ అంటే సంస్కృతంలో అన్నం మెతుకు అని! ఇదే పులావ్ పదానికి మూలం అని కొందరంటారు. కానీ, తెలుగులో ‘పొల’ లేదా ‘పొలసు’ అంటే మాంసం. “పొలపెట్టు లేకపోవటం” అంటే మాంసం లేని భోజనం చేయటం అని ప్రయోగం ఉంది. ‘పొలగాలి’ అంటే నీచువాసన వేస్తోన్న గాలి. ‘పొలదిండి’ అంటే మాంసాహారి. ‘పొల పెట్టిన అన్నం’ అంటే మాంసోదనం అని. పలావ్ లేదా పులావులో తెలుగు మూలాలు కూడా ధ్వనిస్తున్నాయి. పలావ్ తెలుగు పదమే అయినా ఆశ్చర్యం లేదు. ఈ పలావు మొగలాయీలవాలన మనకు వచ్చిందని చరిత్రకారులు చెప్తారు. కానీ రామాయణ కాలంనుండీ మాంసోదనాలు మనకూ ఉన్నాయి.
No comments:
Post a Comment