Wednesday 13 October 2021

 నులివెచ్చని ఆహారం:: డా|| జి వి పూర్ణచందు

తినరా మైమరచి శీర్షిక 18-4-21 ఆదివారం సంచిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితం

                          పునుగుం దావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతో జట్టి చు

                             య్యను నాదారని కూర గుంపు ముకు మందై యేర్చునావం జిగు

                             ర్కొను పచ్చళ్ళును బాయసాన్నములు నూరుంగాయలున్ జే సురు

                             క్కనునేయుం జిరుపాలు వెల్లువుగ నాహారం బిడున్సీతునన్

    శీతాకాలంలో ఇంటికొచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు ఎలాంటి భోజనం వడ్డించాడో రాయలవారు ఆముక్తమాల్యదలోని ఈ పద్యంలో చెప్తున్నాడు. శీతాకాలంలో ఎలాంటి పదార్ధాలు తినాలో ఒక సూచన ఇందులో కనిపిస్తుంది

1.  పునుగుం దావి నవోదనంబు: అక్కుళ్లు మసూరీలు అని ఇప్పుడున్నట్టే ఆ రోజుల్లో పునుగుదావులనే ఒక రకం బియ్యం ఉండేవి. ఇవి కొంచెం వేడిని కలిగిస్తాయి కాబట్టి, చలికాలంలో వాటితో వండిన వేడి అన్నం.

2. మిరియంపుం బొళ్ళతో జట్టి చుయ్యను నాదారని కూరగుంపు: మిరియాలపొడితో చట్టి (కుండ)చుయ్యనే చప్పుడు ఆగకుండా వండిన కూరగుంపులు అంటే రకరకాల కూరలు

3. ముకు మందై యేర్చునావం జిగుర్కొను పచ్చళ్ళు: కొద్దిగా ఆవపిండి లేదా ఆవాలపిండి చేర్చి, ఉరిన తరువాత తింటే మూర్ధన్యాలు అదిరేంత ఘాటురుచి కలుగుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బూడిదగుమ్మడి, సొర, పొట్ల, బీర, కంద లాంటి కూరల్ని ఉడికించి అందులో పెరుగు, ఆవపిండి కలిపి తాలింపుపెట్టి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దాన్ని ఆవపచ్చడి అంటారు. ఘాటైన ఈ ఆవపచ్చడి జలుబు రొంప బాధలకు ముక్కుమందు లాగా ఉపయోగిస్తుందని శీతాకాలంలో ఇలాంటివి తినాలని కవిగారి భావన.

4. పాయసాన్నములు: రకరకాల పాయసాలు

5. ఊరుంగాయలు: వేసవికాలం ఊరుగాయల సీజన్. జాడీలకు వాసెనగట్టి ఊరుగాయల్ని 3-4 నెలలు మాగనిచ్చి అప్పుడు తినేవారు. ఊరుగాయల్ని శీతాకాలంలో తినటం కోసమే పెట్టుకునేవాళ్లు. మనం వేసవిలోనే తిని పొట్ట పాడు చేసుకుంటున్నాం.

6. చే సురుక్కనునేయుం: చేతిపైన పడితే చురుక్కనేలా బాగా కాచిన వేడివేడి నెయ్యి. అరచేతిని గుంటలా పట్టి అందులో నెయ్యి వడ్డించుకుని అన్నం మీద ధారగా పోసి కలుపుకునేవాళ్లు. పాడి పంటల్ని ఈసడించే ఈ కాలీయులకు ఆ భాగ్యం ఎక్కడిది?

7. చిరుపాలువెల్లువుగ: సగం మరిగేంత వరకూ చిక్కగా కాచిన పాలను చిరుపాలంటారు. శీతాకాలపు భోజనంలో మిరియాల పొడి వేసి కాచిన చిరుపాలను వెల్లువగా వడ్డించేవాళ్లట. బహుశా, శీతాకాలంలో పెరుగు బదులు పాలు, పంచదార అన్నంలో కలుపుకుని తినటం అలవాటుగా ఉండేదేమో! 

లక్ష్మణవఝులవారి ఇంటి హోటల్లో ఒక రూక తీసుకుని వడ్డించిన పదార్థాలను శ్రీనాథుడు ఒక చాటువులో వర్ణిస్తాడు. అందులో గుప్పెడు పంచదార కూడా ఉంది. పంచదార ఎందుకంటే, ఇలా పాలుగానీ, పెరుగు గానీ వడ్డించినప్పుడు అందులో కలుపుకోవటానికే!

శీతాకాలంలో యిలాంటి భోజనం నిస్సందేహంగా ఆరోగ్యదాయకం.

తన పాఠకులకు నాలుగు మంచి విషయాలు చెప్పి మంచీ చెడుల గురించిన అవగాహన కల్పించాలనే కోరిక ప్రతీ కవికీ ఉంటుంది. ఆ తపన లేకపోతే ఇంత కావ్యం వ్రాయవలసిన అగత్యం కవికి ఏముంటుంది? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలాలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పాఠకులకు తెలియచెప్పటం రాయలవారి లక్ష్యం. విష్ణుచిత్తుడనే భక్తుడు తన ఇంటికి వచ్చిన అతిథులకు ఏ కాలంలో ఎలాంటి భోజనం తినాలో అవే వండించి వడ్డించినట్టు ఈ కావ్యంలో వివరిస్తాడాయన!

ఆముక్తమాల్యద ఒక భక్తి ప్రబంధం మాత్రమే కాదు, ఒక సామాజిక విఙ్ఞాన సర్వస్వం కూడా! ఇందులో 500 యేళ్ల తరువాత కూడా ఇప్పటి కాలానికి పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. మనం వాటిని ఆ కోణంలోంచి పరిశీలించగలగాలి. అంతే!

 

No comments:

Post a Comment