Tuesday, 22 September 2015

ఆహార ప్రణాళికలు :: డా. జి వి పూర్ణచందు

ఆహార ప్రణాళికలు

డా. జి వి పూర్ణచందు

పాత దైనంతమాత్రాన గొప్పదీ కాదు, కొత్త దైనంత మాత్రాన తిరుగులేనిదీ కాదు. ఒకప్పటి కూరగాయలకున్న రుచి ఈనాటి కూరగాయలకు లేదు.ఆధునిక వంటపొయ్యిల మీద వండే వంటల్లో మనం గర్వించ వలసింది కూడా ఏమీ లేదు.
షుమారుగా ఓ ౩౦ యేళ్ల క్రితం వరకూ ‘రామ్ములకాయ’లే మనకు దొరికేవి. వాటితో వండిన పప్పు అమృతంలా ఉండేది. పచ్చడి గానీ, ఊరుగాయగానీ వాటితో ఎ౦తో కమ్మగా ఉండేవి. ‘రామ్ములక్కాయ’లు టమోటాలుగా సంకరం అయి మార్కెట్టు కొచ్చాయి. కొన్నాళ్ళు పాత రామములక్కాయల్ని నాటుకాయలంటూ అమ్మేవారు. క్రమేణా అవి కూడా కనుమరుగయ్యాయి. నేలములక అని, చిన్న పొదలాంటి చెట్టు౦ది. దాని కాయలు ఈ టమోటా పండు ఆకారంలోనూ, అదే రంగులోనూ ఉంటాయి. కానీ, బఠాణీ గింజ౦త పరిమాణంలో ఉంటాయి. బహుశా పోర్చుగీసులు టమోటాని మన దేశానికి తెచ్చినప్పుడు మన ములకపండు కన్నా కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి, రామములకపండు అని పిలిచారు. ఆ తరువాత వీటిని ఇతర పళ్లతో సంకరం చేసి కొత్త పంటలను సృష్టి౦చే క్రమంలో బజ్జీ వంకాయంత (egg fruit) పెద్ద పరిమాణంలో టమోటా లొచ్చాయి. పరిమాణం పెరిగే కొద్దీ వాటిలోని స్వారస్య౦ తగ్గిపోతూ వచ్చింది. దీని అర్ధం టమోటా పళ్లలో చిన్నవి బావుంటా యనీ, పెద్దవి రుచిగా ఉండవనీ కాదు. ఆ నాటి రామములక్కాయలకున్న రుచి ఈనాటి టమోటాలకు లేదనేదే బాధ...అంతే!
ఆమాటకొస్తే ఒకప్పటి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పులకున్న రుచి ఇప్పటి వాటికుంటో౦దా? తోటకూర, పాల కూర లాంటివి వెనకటి రుచినే ఇస్తున్నాయా? రుచిని చెడకొట్టి పండించటానికి కారణా లేమిటీ...?
మధుర రసాలైన మామిడి పళ్ళు నిజంగానే మధురంగా ఉంటున్నాయా...? యాసిడ్ కలిపినంత పుల్లని వాసనతో అతిపుల్లగా ఉండే రసాలను ఒక్కో కాయని 15 ను౦చి 20 రూపాయలకు అంటగడుతుంటే వినోదం చూడటం ప్రభుత్వానికి తగునా? విష కార్బయిడ్లు ఉపయోగించి కాయలను పండుగా మార్చటాన్ని నిషేధించటానికి ఈ ప్రభుత్వం ఎందుకు జంకు తోంది. కార్బయిడ్లతో పండిస్తే ఆరోగ్యానికి చెడు చేయదని శాస్త్రవేత్తలు ఏ విషవ్యాపారి పక్షానయినా వకాల్తా తీసుకొని చెప్పారా? కోసిన వెంటనే వ్యాపారుల చేతికి డబ్బు రావాలనే ఆతృత ఈ కార్బయిడ్ వాడకానికి కారణం అవుతో౦ది. అది పండుని విషతుల్యం చేస్తుంటే మౌనం వహించటం మన వంతయ్యింది.
ప్రజలలో ఆరోగ్యస్పృహ తగినంత లేకపోవటం ఇందుకు ప్రథాన కారణంగా చెప్పుకోవాలి. సహజమైన జీవిత విధానాన్ని కృత్రిమత్వంతో నింపుకోవటాన్ని ఒక ఘనతగా బావించుకునే తత్త్వం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. దాన్నిబట్టే అనేక నిత్యావసర వస్తువులు కృత్రిమ విషాలుగా మారిపోతున్నాయి. సింథటిక్ పాలు, కబేళా నుంచి తెచ్చిన కొవ్వుతో కాచిన నెయ్యి, పటికపొడి-పసుపు-బెల్ల౦ పిప్పి కలిపి కాచిన తేనె ఇలా ఒకటేమిటీ, జనం వాడుకుంటున్నవాటిలో ‘అసలీ’ ఏదో ‘నకిలీ’ ఏదో తెలుసుకో గలిగేలోగా ఏ కేన్సరో వచ్చిపోయేవారు పోతున్నారు. పుట్టేవారు ఎ౦దుకూ కొరగాని వారుగా పుడ్తున్నారు. ఎవరెట్లా పోతే మనకేమి టనుకునే ఉత్పత్తిదారులూ, వ్యాపారులూ, వారిని అజమాయిషీ చేయాల్సిన అధికారులదే దీని ప్రధాన బాధ్యత. అలాగే, మంచీ చెడుల విచక్షణ చూపించలేని మనదీ బాధ్యతే!  
ఒక పళ్ల మొక్క మీద పురుగు మందు చల్లారనుకోండి... చెట్టుకొమ్మలకు, ఆకులకూ పళ్లక్కూడా ఆ విషపు మందు పట్టుకుంటుంది కదా! ఆ పండుని మనం తిన్నప్పుడు దానితో పాటు విషాన్ని కూడా తిని, ఉంటే ఉంటాం పోతే పోతాం... ఆ సంగతి పురుగుమందు అమ్మిన వాడిగ్గానీ, చెట్టుకు పురుగు మందు కొట్టిన వాడిగ్గానీ, అజమాయిషీ చేసే అధికారిగ్గానీ అనవసరం. ఇదే పురుగు మందుని ఒక ఆకుకూర మొక్కకు కొట్టినపుడు దాని ఆకుల నిండా ఆ మందే వ్యాపి౦చి ఉంటుంది కదా... దాన్ని పూర్తిగా మనం తింటున్నాం కదా...!
అమెరికావారు మనకు పురుగు మందులు అమ్ముతారు. కానీ, వారు అమ్మిన ఆ పురుగు మందుల్ని చల్లిన  కూరగాయలను, పళ్లను, ఆకు కూరలనూ అమెరికన్లు తినరు. మన దేశీయులు బకరాలు కదా... చచ్చినట్టు పురుగుమందు కొట్టుకొని తిని, బతికి నంత కాలం బతుకుతారు.
ఆ మధ్య హైదరాబాదులో జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సులో బిటి వంకాయలు మాకు వద్దని కొందరు తెలుగు వారు అడ్డుకోగా కన్నెర్ర జేసిన ఆనాటి మంత్రిగారూ, ఆయనకు వంతపాడిన కొందరు శాస్త్రవేత్తలే నిజమైన దేశభక్తులని మనం భావించాల్సిన పరిస్థితి ఇది!
ఇలాంటి విషపూరిత ఆహారపదార్థాలను ఈ దేశీయులు తినరనీ, ఇది ఆయుర్వేదం లాంటి శాస్త్రాలు పుట్టిన ఙ్ఞాన భూమి అనీ, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులనీ, కల్తీలను, కృత్రిమ విషాలను దగరకు రానివ్వరనీ, ఈ దేశీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలనే భయం దుష్టశక్తుల కున్నప్పుడు కదా, ఇలాంటివి ఆగేది...!
రెండు వందల ఏళ్ల క్రితం మన తెలుగు వారి మామిడి కాయలను, ఊరగాయలను, పళ్లరసాలనూ ఎగబడి కొనేది అమెరికా! అమెరికాతో వ్యాపారం ఊపందుకొన్నాక, ఇక్కడి డచ్చి, ఫ్రె౦చి, ఇంగ్లీషు వ్యాపారులు తెలుగు ప్రజల్ని ప్రోత్సహించి, రకరకాల ఊరుగాయలను మనతో తయారు చేయించి అమెరికా ఎగుమతి చేసేవారు. తెలుగు వారికి ఊరగాయల తయారీలో అంత ప్రసిద్ధి రావటానికి  ఆనాటి అంతర్జాతీయ వాణిజ్య౦ ఒక కారణం. క్రమేణా అమెరికాలో కూడా కొన్ని ప్రా౦తాల్లో మామిడి పండటం మొదలయ్యింది. దాంతో బారతదేశపు మామిడి పళ్ల దిగుమతి తగ్గించుకుంది అమెరికా! గత పదిహేనేళ్ళుగా మన మామిడి పళ్ళను నిషేధించింది కూడా!
 మనం వాళ్ల పురుగు మందులూ, ఎరువులూ కొని స్వామి భక్తి చాటుకుంటున్నాం. అమెరికా మాత్రం మన ఉత్పత్తుల్ని నిషేధిస్తుంది. మన ఒక వస్తువును వాళ్ళు నిషేధిస్తే బదులుగా హాని కారకమైన వారి మరొక వస్తువును మనం నిషేధి౦చ గలిగే స్థితిలో ఉంటే వాణిజ్య౦ గౌరవప్రదంగా జరిగినట్టు లెక్క.
 ఎల్లకాలం మనం పుచ్చుకొనే స్థితిలో (receiving End) ఉండాల్సినంత అగత్యం మనకేముంది..? మనకు కావల్సిన దాన్ని కొనుక్కొనే స్వేచ్చ మనకుండాలి. అమ్మే వాడి దగ్గర ఉన్నదాన్ని చచ్చినట్టు కొనుక్కుని వెళ్లటం అంటే, మనకి ఏది అవసరమో అమ్మేవాడు నిర్దేశించటం అని అర్ధం. మనకు కావాల్సిందాన్ని మనం కోరి కొనుక్కునే కమాండింగ్ స్థితి మనకు ఉండాలి. లేకపోతే రేపు కాకా హోటల్లో కూడా ఇడ్లీ అట్టు, పూరీలకు బదులు పీజ్జా, రోటీలు ఉంచి ఇవి మాత్రమే తినాలని మనల్ని శాసించే ప్రమాదం ఉంటుంది. పెద్దపెద్ద మాల్సు ఏర్పడుతున్నకొద్దీ వినియోగదారుని ఇలా నిర్దేశించే ధోరణి మరింత పెరుగుతు౦ది. మనలో అలాంటి వ్యవస్థపట్ల మోజు పెరగకుండా ఉండాలి. వ్యామోహం వలన మనం చాలా నష్ట పోతాం!

ఇదంతా ప్రణాళిక లేని జీవిత విధానం వలన కలుగుగుతున్న ఇబ్బంది. మనకు ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్య ప్రణాళిక, ఆహార ప్రణాళికలతో పాటు, ఆహార పదార్థాలను కొనే ప్రణాళిక కూడా కావాలి. సాంప్రదాయక మైన, సంస్కృతీ సంపన్నమైన  మన జీవన వ్యవస్థను అగౌరవ పరచు కున్నందు వలన కలిగే నష్టం ఇది!

Monday, 21 September 2015

కాలానికి నిలిచే విమర్శ డా. జి వి పూర్ణచందు,

కాలానికి నిలిచే విమర్శ
డా. జి వి పూర్ణచందు, 9440172642

“ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధురీ/ చారు ప్రౌఢిమ జెప్పి పంప, విని మాత్సర్యంబు వాటించి, న
త్కీరుం డూరకె తప్పు పట్టెనట-యేదీ! లక్షణంబో యలం/కారంబో పదబంధమో, రసమొ? చక్కంజెప్పుడీ తప్పునన్”
తెలుగువారికి విమర్శను సహృదయంగా స్వీకరించే గుణం ముందునుండీ లేనట్టుంది. అందుకని, తెలుగు కావ్యాలలో పాత్రలు కూడా విమర్శనా అసహిష్ణుతనే ఎక్కువగా ప్రదర్శిస్తుంటాయి, సాక్షాత్తూ పరమేశ్వరుడైనా అంతే!
పూటగడవని ఓ పూజారి మీద జాలిపడి శివుడు ఓ పద్యం వ్రాసిచ్చి, “దీన్ని రాజకొలువులో చదివి వినిపించు. రాజు గారు మెచ్చుకొని ఆదరిస్తా”రని పంపించాడు. ఆ కొలువులో నత్కీరుడు కూడా ఉన్నాడు. ఆయన లేచి, “కవితా పద్ధతులకీ కవిసమయాలకీ నువు చెప్పిన కవిత్వం ఒప్పదు. కవిత్వం ఇలా వ్రాయకూడదు” అన్నాడు. పూజారి నిరాశగా వెళ్ళి శివుడితో ‘భలే కవిత్వం చెప్పావయ్యా” అంటూ బావురుమన్నాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. ఆ పూజారిని వెంటబెట్టుకుని, రాజకొలువుకు వెళ్ళిన సందర్భంలోది ధూర్జటి చెప్పిన ఈ పద్యం.
“ఈ రాజుమీద నేనో కవిత చెప్పి పంపాను. నత్కీరుడనేవాడు ఎవడో మాత్సర్యంతో నా అందమైన పద్యాన్ని తప్పు బట్టాడట. ఏదీ నాముందు చెప్పమనండి. నా కవితలో చందో వ్యాకరణ, అలంకార దోషాలున్నాయా? పదబంధాలు సరిగా లేవా? రసభంగం అయ్యిందా?” అంటూ నిలేసి అడిగాడు.
కుందుర్తి ఎప్పుడూ అనేవాడు- “రచయితలు పాఠకుడికన్నా ఒకమెట్టు పైన ఉన్నాననుకునే రచనలు చేయా”లని! విమర్శకుడు కూడా అంతే! రచయితకన్నా ఒక మెట్టు పైనే ఉన్నాననుకుని విమర్శించాలి. ఈ విమర్శ శ్రుతి మీరిన ఘటనలూ ఉన్నాయి. అంతమాత్రాన విమర్శకు గురైన వాళ్ళంతా ఇలా సభల్లో హుంకరించలేదు. రచయిత విమర్శను గౌరవించాలి. విమర్శకుడు కూడా తన కళ్ళతో కాకుండా వేరే సిద్ధాంతాల కళ్లజోళ్ళలోంచి చూస్తూ రచయితల మీద ఒంటికాలుతో లేవటమూ ధర్మం కాదు. ఒక రచన మంచీ చెడుల్ని ఫలానా విమర్శకుడి కన్నా కాలం ఎక్కువగా నిగ్గు తేలుస్తుంది. కాలానికి నిలిచిన విమర్శలు ఎన్ని ఉన్నాయన్నదిప్రశ్న.
ఇంతకీ నత్కీరుడు పట్టిన తప్పు విలువైనదే! “సిందురరాజ గమనా థమ్మిల్ల బంధంబు సహజ గంధంబు” సిందురం అంటే ఏనుగు. సిందురరాజ గమనం అంటే గజగమనం కలిగిన ఆమె ‘థమ్మిల్లబంధం’ అంటే జుట్టుముడి సహజ సువాసనతో విలసిల్లుతోందని దాని భావం. సాంబ్రాణీ లాంటి సుగంధ ధూపాలు గానీ, సంపెంగ లాంటి సువాసనలున్న తైలాలు గానీ తలకు పట్టించక పోతే జుట్టుకు సహజగంథం ఎక్కడిదనేది నత్కీరుడి ఆక్షేపణ. దాంతో శివుడు నాలుక కరచు కున్నాడు. ‘మా ఆవిడ పార్వతి పొడవైన జుత్తుకి సహజ గంధమే ఉంది’ అన్నాడు.


“మీ ఆవిడ సంగతి మా కెందుకయ్యా! లోకంలో ఎవరి ఆవిడ జుత్తుకీ ఇది వర్తించదు. లూలా మాటలు చెప్పకు పొ’’ మ్మన్నాడు నత్కీరుడు. శివుడి అహంకారం దెబ్బతింది. తన నిజ రూపం చూపించాడు. అయినా నత్కీరుడు పట్టు విడవ కుండా నుదుటి కన్నే కాదు, తలచుట్టూ కళ్ళున్నా సరే, వాటిని తెరిచినా సరే, నీ తప్పు ఒప్పవదని ఎదురు తిరిగాడు. విమర్శకుడికి అంత అహంకారం పనికి రాదని శివుడు నత్కీరుడికి కుష్టువ్యాధి వచ్చేలా శపిస్తాడు.
తనకు తెలియనిది లోకంలో లేదనే అహంకారం విమర్శకుడికి రాకూడనిది. "అది అసంబవం కాదు, మా ఆవిడే సాక్ష్యం" అని రచయిత మొత్తుకున్నా విమర్శకుడు వినిపించుకోకపోవటమూ తప్పే కదా!
ఈ కథలో సార్వజనీనమైన ఒక లోకనీతి ఉంది- రచయిత ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాయాలి, విమర్శకుడు నోరు దగ్గర పెట్టుకుని విమర్శించాలని! లోకంలో రచయితలంతా ఇలా శపిస్తే విమర్శకులంతా డెర్మటాలజీ క్లినిక్కుల చుట్టూ తిరగాల్సి రావటం, విమర్శకుడి దాడితో రచయితకి హార్ట్ ఎటాక్ రావటం రెండూ సమంజసం కాదు.
తెలుగులో విమర్శకీ, సమీక్షకీ, పుస్తక పరిచయానికీ, పుస్తకాల ముందుమాటలకీ తేడా లేని ఒక విచిత్ర పరిస్థితి నడుస్తోంది. చాలా పత్రికలు సమీక్ష పేరుతో పుస్తక పరిచయాలే వేస్తున్నాయి. సంచలనాల పేరిట ‘తిట్టటమే విమర్శ’ అనే ఒక అభిప్రాయం కొందరిలో బలంగా ఉంది. తమ వర్గానికి చెందిన వారిని మహాకవులుగా చిత్రించటమే ‘వర్గ దృక్పథం’గా చెలామణి అవుతోంది. దీనికి ప్రాంతీయత కూడా తోడవుతోంది.
రాసినవాడు శివుడూ, విమర్శించిన వాడు నత్కీరుడూ కాని స్థితిలో ఒక్కో రచన, ఒక్కో విమర్శ చదువుతుంటే కుష్టు రోగి పుళ్ళే గుర్తుకు వస్తుంటాయి.
సాహిత్యాన్ని ఆరోగ్యదాయకం చేసే విమర్శ కావాలి. లోకంలో కుష్టును కడిగే రచనలు కావాలి.

Thursday, 17 September 2015

గ-జ-మోక్షం డా. జి వి పూర్ణచందు,

గ-జ-మోక్షం

డా. జి వి పూర్ణచందు, 9440172642

“కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణముల పాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడి వాడు కలడో లేడో”

బండి నల్లేరు మీద పరిగెడుతున్నంత సేపూ ఉన్నాడో లేడో అనే మీమాంసే ఉండదు. తనబలహీనత బయటపడి, విసిగి వేసారినప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో అనే సందేహం తప్పకుండా పుడుతుంది.

తనకొచ్చే ప్రతీ కష్టానికీ ఎవరో ఇతరులు కారణం అనుకోవటం అనేది మానవ సహజ లక్షణం! దైవం అనుకూలించ లేదంటాడే గానీ, తన ప్రయత్నం లోపించిందని ఒప్పుకోడు. “మార్కులు తక్కువొచ్చా యేమిటని అడిగితే మిస్సుగారు సరిగా పాఠం చెప్పలేదనే అంటాడు విద్యార్ధి! ఇలా ఎవరి మీదకూ నెట్టేందుకు అవకాశం దొరకనప్పుడు దైవం అనుకూలించ లేదని చెప్పుకుంటాడు. అలా చెప్పుకోవటం చాలామందికి ఒక ‘తుత్తి’. అక్కడిడితో ఆగడు... దీనులకోసం కలడు, పరమయోగుల కోసం కలడు, అన్ని దిక్కుల్లోనూ కలడు...ఇలా కలడు కలడు అంటున్నారు, ఆ కలడనే వాడు నిజంగా కలడా... లేడా... అనడుగుతాడు. గజేంద్రుడికి కూడా ఇలానే సందేహం వచ్చింది. మొసలి పట్టుకునే సరికి గజేంద్రుడు విష్ణువుకు మొరపెట్టు కున్నాడు. ఆయన వచ్చి విడిపించలేదు. ఎంత మొత్తుకున్నా రాలేదు. దేవుడు ఉన్నాడా అనే సందేహం కలిగింది గజరాజుకి..
నిజానికి ఇది క్షీరసాగరానికిసంబంధించిన కథ. ఆ సముద్రంలో త్రికూటాచలం అనే పెద్ద కొండ ఉంది. దానికి బంగారం, వెండి, ఇనుము తాపడం చేసిన మూడు శిఖరా లున్నాయి. ఆ పర్వతం మీద ఏనుగుల మందలు ఎక్కువ. ఆ ఏనుగుల రాజు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. చాలా దూరం తిరిగాడు. దప్పిక అయ్యింది. నీటి కోసం చాలా చోట్ల వెతికాడు. చివరకు ఒక అద్భుత సరోవరం కనిపిస్తే. తన పరివారంతో సహా నీళ్ళలోకి దిగాడు. అప్పుడు ఆ గజరాజుకి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. తొండం నిండా నీళ్ళు గట్టిగా పీల్చాడు. ఆ నీటివేగంతో చేపలు, మొసళ్ళు, పీతలు అన్నీ తొండంలోకి వెళ్ళిపోయాయి. తొండాన్ని పైకెత్తి నీళ్ళను ఆకాశం మీదకి చిమ్మేసరికి తొండంలో వున్న చేపలన్నీ మీన రాశిలోకీ, పీతలన్నీ కర్కాటక రాశిలోకీ మొసళ్ళు మకర రా లోకీ వెళ్ళి పడ్డాయి. అలా ఏనుగులందరూ కలిసి సరోవరంలో నీళ్ళు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తు న్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఆ నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగుల అల్లరి మితిమీరిందని దానికి కోపం వచ్చింది. నీటి లోపల్నించి వెళ్ళి గజరాజు కాలు పట్టేసుకుంది. అదీ కథ.

“అకారణంగా నీళ్ళలోకి దిగాననే పశ్చాత్తాపం అప్పుడు కలిగింది గజరాజుకి! వెనకాల అంతమంది పరివారం ఉన్నారు. ఒక్కడూ సాయపడక పోవటం ఈ కథకు కొసమెరుపు. ‘రారూ రారూ ఎవ్వరూ నీకోసం’ అనే ఙ్ఞానోదయం అయ్యింది. దేవుడూ పట్టించుకోలేదు. అందుకని సందేహం వచ్చింది, కలడు కలండనెడివాడు కలడో లేడో...అని!

మనక్కూడా ఇలా చాలా ‘కలవు’. కలవు కలవనేవి కలవో లేవో తెలియనన్ని కలవు. ‘కలవాటి’లో ప్రజాస్వామ్యం ఒకటి. పరిపాలనలో స్వఛ్ఛత ఒకటి. అవినీతి నిర్మూలన ఒకటి. రుణాల మాఫీ ఒకటి. తెలుగు భాషాభివృద్ధి ఒకటి. ఒకటేమిటీ ఇలాంటి ‘కలవు’లు చాలా ‘కల’వు. వాటిని నమ్ముకున్న గజరాజులు ఋణమాఫీ అవుతుంది లెమ్మని ఉన్న నగలు తాకట్టు పెట్టి అవసరం లేకుండా అప్పులు చేసి ఉప్పు పప్పులకు ఖర్చు పెట్టేశారు. పది రెట్లు రేటున్న ఇళ్ళస్థలం దక్కు తుందని ఉన్న పొలాలను దారాదత్తం చేయటం లాంటి అల్లరి పనులన్నీ చేసేశారు. ఇప్పుడు బాకీల మొసళ్ళు పట్టుకుంటే కలడు కలండనెడి వాడు కలడో లేడో అని ఎదురు చూసే స్థితిలో పడ్డారు.

కలవాడికీ, ఇలాంటి ‘కలవు’లు కలవాడికీ తేడా ఉందన్న సంగతి కృష్ణయొడ్డు గజరాజులకు తెలీలేదు. తెల్సినా ప్రయోజనం లేదు. పెన్ను మరిచిపోయి పరిక్షల కొచ్చిన స్టూడెంట్ కుర్రాడి లాగా ఆయుధాలు లేకుండా విష్ణుమూర్తి వచ్చి ఈ గజాలకు సాయం చేయగలిగిందీ లేదు.

గజాల లెక్కలో భూమిని ఇచ్చి, అడుగుల్లెక్కల్లో బదులు తీసుకోవటమే అసలైన గజేంద్ర మోక్షం. ‘గ’ అంటే గఛ్ఛతి-రావటం. వస్తే ఓ అడుగు వస్తుంది. ‘జ’ అంటే జాయతే-పోవటం. ఓ గజం పోతుంది. రావటాలు పోవటాలకు మధ్య సంధి గ-జ- మోక్షం.

సాంఖ్య యోగంలో మనో విశ్లేషణ డా. జి వి పూర్ణచందు

సాంఖ్య యోగంలో మనో విశ్లేషణ

డా. జి వి పూర్ణచందు


ఆంధ్రభూమి సాహితీ పేజీలో ప్రచురించిన నా వ్యాసం "ఏకవీరలో సాంఖ్యయోగం" విద్వాంసుల ప్రశంసలు పొందింది. రెండు రోజుల పాటు పెద్దలనుండి నిర్విరామంగా ఫోనుల్లో ప్రశంసలు వచ్చాయి.
అయితే సాంఖ్య సిద్ధాంతాలకు ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ లంకె ఉందన్న విషయం ఏ కారణంగానో మరుగున పడింది.
సాంఖ్యంలో సైకో ఎనాలిసిస్ గురించిన అధ్యయనం సరిగా జరగలేదు. 1980లోనే ఈ అంశం పైన నేను కొన్ని ప్రతిపాదనలను చేశాను. ఎవరూ పట్టించుకోక పోవటం నా దురదృష్టం.
సమాచార సేకరణా పరిఙ్ఞానం కరతలామలకం అయినందున ఈ రోజుల్లో దీనిపైన దృష్టి సారించటం సులువే! పెద్దలకు ఆమేరకు విఙ్ఞప్తి చేస్తున్నాను.
డా. బన్న సంజీవరావు గారు ఆత్మీయంగా ఇ-మెయిల్లో వ్రాసిన ఒక లేఖను ఇక్కడ పోష్టు చేస్తున్నాను:
Dear Dr.Purnachand garu,
Good Morning. Recenly one person known to me from neibhouring village of my native place got Ph.d in telugu on your works under Prof Velamala Smmanna of the same village.
I read one of your article on Viswanath garu in Sahiti page of Andhra Bhoomi and noted some points relating to philosophy. I thought you are Doctorate in Telugu. To my surprise I have seen your article in Sanjeevani page of Bhoomi and confirmed the ph nos are same and came to know that you are of Ayurvedic faculty. I felt happy to know that you are one of very few doctor writters
As per your article comparing Psychiatry and Trigunas, Ed, Ego and Super ego are related to Tam,Rajo and Sattva gunas. Ego converts Manonigraha to Manobalam. If Super Ego(Sattva) over works and Ego (Rajo) fails Ed(Tamo) will destroy human beeing and may become criminal, hysteria or may suicide. I understood the so called Sattvaguna also not good when excess. That is why some scriptures say that Jnani behaves like Bala Unmatta pisachavat.
Some years back Sri Neelamraju Laxmipati garu wrote one artcle in Andhra Bhoomi Sunday magazine which I noted. I am giving gyst. Britsh Journal of Psychiatry says that there is relation between Creative excellence andMental Instability. Some may have disease, over alcohoic, depression, violent sex, over emotion and scizophrenia. " Bhagavat prasada maina pratibhanu, anugrahinchina varanni Atadi seva lone viniyoginchna variki, atadine prajalaku sphurima chesina variki Unmadi sthiti rakapovachhu "
Pl give your version.
Dr.Banna Sanjeeva Rao, BDS(osm), Retd Civil Surgeon(Dental) & Former Medical Supdt, RIMS General Hospital, Srikakulam, Ph : 9490170033


డాక్టరుగారికి, నమస్తే!
1980లో నేను మెడిసిన్ 4 సం.లో ఉన్నప్పుడు నా మొదటి పుస్తకం ‘అమలిన శృంగారం’ వచ్చింది. అందులో చివరి అధ్యాయం "మనిషీ-మనసూ". ఈ అధ్యాయంలో తొలిసారిగా సాంఖ్య శాస్త్రాన్ని ఫ్రాయిడ్ పరిశీలనతో అధ్యయనం చేస్తే మన పూర్వులు చెప్పిన సైకాలజీ అర్ధం అవుతుందని వ్రాశాను
కాశ్యప సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో "సత్త్వం ప్రకాశకం విద్ధి" అనే సూత్రంలో త్రిగుణాలను వివరిస్తూ, సత్త్వగుణం (super ego or ego ideal) ప్రకాశకం అనే గుణాన్ని, రజో గుణం(Ego) ప్రవర్తకం అనే గుణాన్ని, తమో గుణం (id-జర్మన్ భాషలో it (ఇది) అని అర్ధం) నియామకం అనే గుణాన్నీ కలిగి ఉంటాయనీ, ఈ మూడున్నూ అన్యోన్య మిథున ప్రియాన్నీ అంటే, కలిసికట్టుగా పనిచేయటం ద్వారా మనసును, మనిషి నడవడినీ ప్రబావితం చేస్తాయనీ చెప్పారు.
ఫ్రాయిడ్ కూడా తన త్రిగుణాలకు (id, ego, ego ideal) వరుసగా నియామక, ప్రవర్తక, ప్రకాశక గుణాలనే చెప్పాడు. మొత్తం మనొవిశ్లేషణ సిద్ధాంతం కేవలం ఈ సూత్రం మీదే ఆధారపడి ఉంది.
ఫ్రాయిడ్ రచనలు ఇంగ్లీషులోకి 1924లో వచ్చాయి. విశ్వనాథవారి ఏకవీర అంతకన్నా ముందే వచ్చింది. కాబట్టి, విశ్వనాథ పైన సాంఖ్య సిద్ధాంతాల ప్రభావమే ఉందని ఆ వ్యాసం వ్రాశాను.
మీరు ఆసక్తిగాలేఖ వ్రాసినందుకు ధన్యవాదాలు.
మీ మెయిల్ లేఖని, నా సమాధానాన్నీ ఫేస్‘బుక్‘లో పోష్ట్ చేయటానికి మీకు అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను. నమస్తే!
డా. జి వి పూర్ణచందు

Tuesday, 15 September 2015

ఏకవీరలో సాంఖ్యయోగం డా. జి వి పూర్ణచందు Sankhya yoga in the Novel EKAVEERA of Visvanatha satyanarayana

14-09-2015 ఆంధ్రభూమి సాహితీపేజీలో "ఏకవీరలో సాంఖ్యయోగం" అనే నా వ్యాసం అచ్చయ్యింది. ఆ వ్యాసాన్ని ఇక్కడ అందిస్తున్నాను. నాతో ఈ వ్యాసాన్ని వ్రాయించిన పెద్దలు, ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎం వి ఆర్ శాస్త్రిగారికి నా నమోవాకాలు.
Sankhya Yoga in the novel EKAVEERA of Visvanatha Satyanarayana

ఏకవీరలో సాంఖ్యయోగం
డా. జి వి పూర్ణచందు

విశ్వనాథ సత్యనారాయణ త్రికాల కవి. తన కాల౦తో పాటు, వెనక కాల౦, ము౦దు కాలాలకు కూడా చె౦దిన వ్యక్తి. ఆయన మూడు కాలాల్ని భూతకాల౦ కళ్ళలో౦చి మాత్రమే చూశాడని అభ్యుదయ వాదుల ఆరోపణ. ఆయన మూడో కన్నుతో కూడా చూడగలడనీ, ఆధునిక దృష్టి, శాస్త్రీయ దృష్టి ఆయనకు పుష్కల౦గా ఉన్నాయనీ ఆయనను చదివినవారు భావిస్తారు.

తనను పూర్వాచార పరాయణుడనీ, ఆధునికుడు కాడనీ, ప్రవాహమున కెదురీదే వాడనీ తన గురించి అజ్ఞులైనవారంటారనీ, అలా అనటం వ౦చనా శిల్పంలో భాగం అంటాడు విశ్వనాథ. ఇంగ్లీషు సాహిత్యాన్ని చాలామంది కన్నా ఎక్కువే ఆపోశన పట్టా డాయన. పాశ్చాత్య భావజాలాన్ని కాకుండా భావాన్ని మాత్రమే స్వీకరించి దేశీయం చేయటంలో విశ్వనాథ ఘటికుడు. “నిజానికి శిల్పము కానీ, సాహిత్యము కానీ, జాతీయమై యు౦డ వలయును. విజాతీయమై యు౦డ రాదు. వ్రాసిన వానికి ముక్తి, చదివిన వారికి రక్తి, ముక్తి! ఎ౦త సముద్రము మీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత. ఇది స౦ప్రదాయము” అనేది ఆయన సిద్ధాంతం.

విశ్వనాథకు సిగ్మ౦డ్ ఫ్రాయిడ్ బాగా తెలుసు. సా౦ఖ్య సిద్ధా౦తాలు కూడా క్షుణ్ణ౦గా ఎరిగినవాడు కావటాన మనోవిశ్లేషణ సూత్రాలను దేశీయ౦ చేసి చెప్పగల నేర్పరితన౦ ఆయనకు౦ది. ఆడ్లర్, యూ౦గ్, ఎరిక్సన్ లా౦టి కొత్త ఫ్రాయిడియన్ల కన్నా ముందునాటి వాడు విశ్వనాథ. గోపీచ౦ద్, బుచ్చిబాబుల కన్నా ఎ౦తో ము౦దే, సిగ్మ౦డ్ ఫ్రాయిడ్ సిద్ధా౦తాలను నవలీకరి౦చే ప్రయత్న౦ చేశాడాయన. రాయప్రోలు వారి అమలిన శృ౦గార సిద్ధా౦తానికి ‘ఏకవీర’ నవల ఒక కొనసాగి౦పు. అమలిన శృంగార ప్రేమ తత్త్వం ప్రభావం ఏకవీర నవలలో నాలుగు ప్రధాన పాత్రల మీదా కనిపిస్తుంది. 

విశృంఖలించిన కోరికలు సమాజ నీతికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనసులో చెలరేగే ఘర్షణని చిత్రించటం ‘ఏకవీర’ నవల లక్ష్యం. “నిగ్రహం కావాలి. అదే భారతీయత” అని చెప్పాలని ఆయన తపన. అప్పటికాయన వయసు చిన్నది, కొత్తగా నవలలు వ్రాస్తున్న రోజులవి. అయినా, భారతీయత మీద గట్టి అభిమానం గూడు కట్టుకుని ఉంది. ఏ పరిస్థితులు హిష్టీరియా లాంటి మనో దౌర్బల్యాలకు కారణ మౌతాయని ఫ్రాయిడ్ సిద్ధాంతం చెప్తుందో అచ్చంగా ఆ పరిస్థితుల్నే కుట్టాన్, మీనాక్షి, భూపతి, ఏకవీర పాత్రల చుట్టూ కల్పించారాయన.

మనోనిగ్రహం సాధ్యం కావాలంటే మనోబలం కావాలంటాడు ఫ్రాయిడ్. ఇందుకు సా౦ఖ్య సిద్ధా౦తాలే ఆధారాలు. ఫ్రాయిడ్ తన గురువు గ్రాడ్రెక్ ద్వారా ఈ సాంఖ్య సిద్ధాంతాల అవగాహన పొందినవాడే! సా౦ఖ్యులు తమోగుణ౦, రజోగుణ౦, సత్వగుణ౦, అనే మూడు గుణాలను చెప్పారు. సాంఖ్యులు మనిషి మనసును ఈడ్, ఈగో, సూపర్ ఈగో అనే మూడు ముఖ్య గుణాలుగా విభాగి౦చాడు. ఈ రెండు సిద్ధాంతాలను సమన్వయం చేస్తే, ఈడ్ అనే తమోగుణ౦ లో౦చి కోరికలు నిర౦తర ప్రవాహ౦లా వస్తు౦టాయనీ, వాటిని అణిచే౦దుకు ‘ఈగో’ అనే రజోగుణ౦ తన శక్తిన౦తా ఉపయోగిస్తు౦దనీ, ఈ ‘ఈగో’ని సమాజ నీతికి అనుగుణ౦గా తీర్చిదిద్దేది సూపర్ ఈగో అనే సత్వగుణ౦ అనీ అర్ధం అవుతుంది. సూపర్ ఈగో కలిగించే మనో నిగ్రహాన్ని ఈగో మనోబలంగా మారుస్తుంది. సూపర్ ఈగో అతిగా పనిచేసినా, ఈగో సరిగా పనిచేయకపోయినా కోరికలను పుట్టించే తమోగుణం(ఈడ్) మనిషిని పతనం చేస్తుంది. ఏకవీర నవలలో ఫ్రాయిడ్ సిద్దాంతాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి గానీ, అందులో సాంఖ్యులు ఇలా తొంగి చూస్తున్న వైనాన్ని మరచి పోకూడదు. ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాంఖ్యయోగం కళ్ళతో చదివాడు విశ్వనాథ. ఫ్రాయిడ్ కళ్ళజోడు లేదా మార్క్సు కళ్లజోడు లోంచి చూస్తే ఈ నవల సరిగా సాగినట్టనిపించదు. సమాజనీతి బలమైంది. దాన్ని వ్యతిరేకించాలంటే మనిషి క్రిమినల్ కావాలి. లేదా, మనోబలహీనతతోనో, హిష్టీరియా తోనో ఆత్మత్యాగం చేయాల్సి వస్తుంది.

ఏకవీర నవలలో ప్రధాన పాత్రలలో ఈ సూపర్ ఈగో అతిగా పనిచేసి౦ది. ‘ఈగో’ దారుణంగా విఫలం అయ్యింది. ఫలితంగా నాలుగు పాత్రలూ జీవితాలను భవిష్యత్తుని నాశనం చేసుకున్నాయి. చేతనత్వానికి (కాన్షియస్) భిన్నమైన లోపలి మనసు మరొకటి ఉ౦ది. దాన్ని అచేతన (అన్ కాన్షియస్) అన్నాడు ఫ్రాయిడ్. ఈ లోపలి మనసులోకి తోసేసి, కోరికను అణచి వేయటాన్ని మనో నిగ్రహం (రిప్రెషన్) అ౦టారు. పత౦జలి యోగశాస్త్రంలో మొదటి సూత్రమే ‘యోగ శ్చిత్తవృత్తి నిరోధకః’ అంటుంది. అణచి వేసుకున్న కోరికని మనసు శక్తిగా మలచు కుంటుంది. దాన్నే ‘యోగ’ అన్నారు. ఈ మార్పిడి ప్రక్రియని ఫ్రాయిడ్ ‘సబ్లిమేషన్’ అన్నాడు. పత౦జలి యోగ సూత్రానికి ఫ్రాయిడ్ ఒక శాస్త్రీయమైన వివరణ ఇచ్చినట్టు దీన్ని భావించాలి. మనోబల౦ తక్కువగా ఉన్న అతి సున్నిత మనస్కులలో ఈ ‘సబ్లిమేషన్’ అనే యోగప్రక్రియ సక్రమ౦గా జరగనప్పుడు ఏకవీరలా ఆత్మత్యాగాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట! లిబిడో, సమాజనీతి విరుద్ధమైన వైతే, మనసులో చెలరేగే ఘర్షణకు తట్టుకోలేని వాళ్ళ జీవితాలు ఇలానే బలహీనమై పోతాయి. అందుకే, “దేశీయమైన సామాజిక నీతిని నిర్లక్ష్యం చేయ కండి. మానసిక బలహీనత ఏర్పడుతుంది. జీవితాలు నిరర్థకం అవుతా”యనే సందేశం ఇస్తాడీ నవలలో విశ్వనాథ. 

నిజానికి సేతుపతి, మీనాక్షి; వీరభూపతి, ఏకవీరలు ప్రేమలో పడి, ఒకరినొకరు వదిలి ఉండలేనంత స్థితి ఏర్పడటానికి కావలసి నన్ని సన్నివేశాలేవీ చిత్రించకుండా సూచించి వదిలేశాడు. సేతుపతి, ఏకవీరనూ, భూపతి మీనాక్షినీ పెళ్ళి చేసుకో వలసి వస్తు౦ది. అక్కడ నుండీ ఆ నలుగురి మనసుల్లో చెలరేగే ఘర్షణని చిత్రించటానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తాడాయన. అణగారక నెరవేరక, మిగిలి ఉన్న కోరికకూ, సమాజ నీతికి ప్రభావితమయ్యే చేతనకీ మధ్య స౦ఘర్షణ వలన ఆ నలుగురిలో ఎవరూ సుఖ౦గా కాపుర౦ చేయలేక పోతారు. ఆ నలుగురూ సున్నిత మనస్కులే! వారు లోకనీతికి అనుగుణంగా నిగ్రహించుకో లేక పోవటాన వాళ్లలో సబ్లిమేషన్ యోగప్రక్రియ విఫలం అయ్యింది. కథాంతంలో వీరభూపతీ, ఏకవీర ఏకా౦త౦లో కలిసిన సన్నివేశం ఉంది. ఆ ఇద్దరూ కౌగిలించుకుంటారు. అక్కడికి లిబిడో గెలిచినట్టయ్యింది. కానీ, సబ్లిమేషన్ జరగలేదు కాబట్టి, ‘వ్యవస్థాధర్మ౦’ ముక్కచెక్కలై పోయి౦దనే భావన ఆ ఇద్దరినీ పీడిస్తు౦ది. “నేను” తత్వ౦ నశి౦చి (ఇగో ఫెయిల్యూర్) పోవడంతో మానసిక అవ్యవస్థ ఏర్పడి ఏకవీర వైగై నదిలోపడి ప్రాణ త్యాగం చేస్తుంది. 

ఎక్కువ స౦ఘర్షణకు లోనయిన పాత్ర కాబట్టి, మనస్తత్వ శాస్త్ర ప్రకారమే ఏకవీర ఆత్మహత్య నిర్ణయ౦ తీసుకు౦ది. అతిసున్నిత మనస్కురాలిగా, మనో స౦ఘర్షణలకు లోనయ్యే పాత్రగా ఏకవీరను చిత్రించటం వలన మనో విశ్లేషణ చేయటానికి ఏకవీర పాత్ర ఎక్కువ అనువు అయ్యింది. నాలుగు ప్రథాన పాత్రలు ఉ౦డగా నవలకు ఏకవీర పేరే పెట్టటానికి కారణ౦ ఇదే! ఏకవీర ఒక స౦స్థానాధీశుడి కూతురు. త౦డ్రి దుష్టుడు. అనేక హి౦సల మధ్య చిన్నప్పటి ను౦చీ అతి సున్నిత౦గా పెరిగి౦ది. ఆ అతి సున్నితత్వమే ఆమెలో “ఇగో ఫెయిల్యూరు”కి దారితీసి౦ది. ఫలితమే ఆమె ఆత్మహత్య. 

ఆమె తన ప్రాణమిత్రుడి భార్య అని తెలిసాక కూడా గాఢ౦గా పరిష్వ౦గి౦చిన౦దుకు వీరభూపతి సన్యాస౦ స్వీకరిస్తాడు. అది కూడా ఆత్మహత్య లా౦టి స్వీయశిక్షే! ఎవరో తెలియని బాటసారులను ప్రేమి౦చిన పాత్రలు మీనాక్షీ, ఏకవీరలు. అయితే, పేరుకి యోధులే గానీ ఏకవీర నవల పురుష పాత్రలు కుట్టాన్ సేతుపతి, వీరభూపతి ఈ ఇద్దరూ కూడా గొప్ప మనోబల స౦పన్నులేమీ కాదు. స్త్రీల కోరికలు ఎటుతిరిగీ నెరవేరవు కాబట్టి ఏకవీర, తన భర్త కుట్టాన్‘తో సర్దుకుపోయి కాపుర౦ చేద్దామని ప్రయత్నిస్తు౦ది. సేతుపతే పడనీయడు. తన మనసులో వేరే స్త్రీ ఉ౦ద౦టాడు. నువ్వు ఎవరినయినా ప్రేమి౦చి ఉ౦టే ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తు౦దని రెట్టిస్తాడు. అంతలోనే భార్యను అలక్ష్య౦ చేస్తున్నానని తాపం పడి, “నేను కష్టపడి నిన్ను ప్రేమి౦చుటకు ప్రయత్ని౦చెదను” అ౦టాడు. ఏకవీర తన రె౦డు చేతులూ ఆయన మెడ చుట్టూ వేసి “ప్రేమి౦చుము, ఇప్పుడే ప్రేమి౦చుము” అ౦టు౦ది. ప్రేమకోస౦ చిన్ననాటి ను౦చీ మొహవాచి ఉన్నదామె. దాన్ని అతను ప౦చినట్టయితే, ఏకవీర మనసు లో౦చి భూపతి ఏనాడో అదృశ్య౦ అయిపోయేవాడు. మీనాక్షి కూడా సేతుపతి ఙ్ఞాపకాల పొరల్లో౦చి కాలక్రమ౦లో మరుగున పడిపోయి ఉ౦డేది. ఇద్దరి సంసారాలు కుదుట పడి ఉ౦డేవి. ఇందుకు అవకాశం లేకుండా చేసిన వాడు సేతుపతే! తన మానసిక ఘర్షణని ఏకవీర పైన రుద్దాడతను. సేతుపతి ఇ౦క తనను ప్రేమి౦చడని నిర్థారి౦చుకున్నాకే ఏకవీరలో తొలిప్రేమ పల్లవి౦చిన భూపతి గుర్తుకు రాసాగినట్టు చిత్రిస్తారు విశ్వనాథ.

ఇక్కడ చరిత్రకు స౦బ౦ధి౦చిన ఒక ఉద౦తాన్ని చెప్పాలి. తమిళనాడులో ఈ నాటి రామనాథ పురం జిల్లా ప్రాంతాన్ని మధుర సామంతులుగా సేతుపతి వంశీకులు పాలిస్తుండే వాళ్ళు. మధుర సింహాసానికి వీర విధేయులు. తమ సార్వభౌములు తెలుగువారు కాబట్టి రామనాథ్‘లో తెలుగుని అధికార భాషగా ప్రకటించారని రామనాథపురం డిస్ట్రిక్ట్ గెజిటీర్‘లో ఉంది. రామేశ్వర౦ వెళ్ళే యాత్రికులను కలైయార్ కోవిల్, పట్టమ౦గళ౦, రామ్‘నాథ్ ప్రా౦తాల్లో దారి కాచి దోచుకొ౦టున్న కొ౦దరు తమిళ తిరుగుబాటుదారుల్ని అణచి వేయటానికి మధుర మహారాజు ముత్తుకృష్ణప్ప నాయకుడు కుట్టాన్ ను నియోగిస్తాడు. అతను ప్రయాణంలో ఉండగా ముత్తుకృష్ణప్ప నాయకుడు మరణి౦చిన వార్త తెలుస్తుంది. అయినా రాజధానికి కాకు౦డా బాధ్యతగా యుధ్ధానికే వెళ్ళిన రాజభక్తి పరాయణుడు కుట్టాన్. ఆ విషయాన్ని నవలలో విశ్వనాథ చెప్పారు కూడా! మెకె౦జీ వ్రాత ప్రతుల ప్రకార౦, 1613లో దళవాయి సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి అధికార౦లోకి వచ్చాడు. 1614 మార్చిలో కుట్టాన్ వేయి౦చిన శాసన౦ ఇ౦దుకు సాక్ష్య౦.(“హిష్టరీ ఆఫ్ నాయక్స్ ఆఫ్ మధుర” - ఆర్. సత్యనాథ అయ్యర్) రామ్నాద్, పోగలూరులలో పటిష్టమైన కోటలు నిర్మి౦చాడు కుట్టాన్.

ఏకవీర ఇతివృత్తం కోసం 500 యేళ్ళు వెనక్కి పోయి, తమిళనాడులో మధురా రాజ్యంలో వైగై నది దాకా పోవలసిన అవసరం కనిపించదు. కానీ, పాఠకుడి ఉత్కంఠే నవల విజయానికి ప్రాణం కదా! 

అతినిగ్రహం వలన పరాజయం దక్కుతుందన్నాడుగానీ, కుట్టాన్, భూపతి ఇద్దరూ భార్యల్ని మార్చుకుని సుఖంగా జీవించినట్టూ, చివరికి ప్రేమే గెలిచినట్టూ వ్రాయలేక పోయాడు విశ్వనాథ. విశ్వనాథను చదవకుండానే ఆయనను ఛాందసవాదిగా మాట్లాడేవాళ్ళు మాత్రం అలాంటి ‘ఇండీసెంట్ ప్రపోజల్’ని వ్రాయగలరా?

Friday, 11 September 2015

BANGALORE UNIVERSITY Invitation

బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు దక్షిణాది లోని నాలుగు ప్రధాన భాషా సంస్కృతుల సామీప్యతలు మరియు సమకాలీనతల పైన ఒక అద్భుతమైన సెమినార్ నిర్వహిస్తున్నారు. 2015 సెప్టెంబర్ 11, 12 తేదీలలో ఈ సదస్సు జరుగుతోంది. దీని ముగింపు సదస్సులో నన్ను అతిథిగా పిలిచారు. నేను తెలుగు, తమిళ కన్నడ మళయాల ప్రజల ఆహార అలవాట్ల పైన ఒక తులనాత్మక అథ్యయన పత్రాన్ని సమర్పిస్తున్నాను. వారి ఆహ్వానం చాలా అందంగా సంపన్నంగా ఉంది. అందులోని అక్షరాలు మాత్రమే పోష్టు చేయటానికి వీలైంది. సదస్సు నిర్వాహకులు కొలకలూరి ఆశాజ్యోతి గారికి అభినందనలు.

BANGALORE UNIVERSITY
Department of studies in Telugu
 Cordially invites for a two day National Seminar on

CONFLUENCE AND CONTEMPORARY ISSUES IN
SOUTH INDIAN LANGUAGES 

(Telugu,Kannada,Tamil,Malayalam)
In Commemoration of Golden Jubilee of BANGALORE
Inauguration 11thSEPTEMBER 2015

Chief Guest

Sri Mandali Budha Prasad
Dy Speaker ,A P Assembly
President 
Prof.B.Thimme Gowda
Vice –Chancellor BUB
Guest of Honor
Sri K.Gopinath
MLA Hosur, Tamil Nadu
Key Note Address
Prof. Rachapalem Chandrashekar Reddy
Central Sahithya Academy Award Winner
Distinguished Guests
Prof. Sidhalingaiah POET
Director, Ambedkar Studies BUB

Prof. Katyayani Vidmahe
Central Sahitya Academy Award Winner

Sri Telakapalli Ravi
Critic, Columnist and Political analyst

VALEDICTORY 12th SEPTEMBER 2015
Saturday 4pm

Chief Guest
Prof. K.K. Seethamma
Registrar BUB
Valedictory Address
Prof. Mrinalini
P.S. Telugu University, Hyderabad
Distinguished Guests
Sri Adhepalli Rama Mohan Rao
Poet, Critic

Sri Gorati Venkanna
Folk Artist

Dr. G.V. Purnachand
Popular Ayurvedic Physician

DR. N. Bhaktavatsala Reddy
Professor (Rtd) P.S. Telugu University


Prof. K.R. Iqbal Ahmed
Pro – Vice Chancellor Urdu University, HYD.


Sri Tanguturi Ramakrishna
President, World  Vysya Federation, Chennai


Sri Kota Nageswara Rao
Ex official, Govt of India
Felicitation to
Prof. Tangirala Subbarao

Prof. C. Jayalakshmi

VENUE:Jnana Jyothi Auditorium
Central College Campus      
              
Prof.  Asha Jyoti. KBangalore University, Bangalore         
Seminar Director




 


 




Sunday, 6 September 2015

విశ్వనాథ వారి సాహితీ వైభవం – జాతీయసదస్సు

ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో
కృష్ణాజిల్లా రచయితల సంఘం
పి. బి. సిద్దార్థ కళాశాల తెలుగు శాఖ నిర్వహిస్తున్న
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 111 జయంతి
విశ్వనాథ వారి సాహితీ వైభవం – జాతీయసదస్సు
10-09-2015 గురువారం ఉదయం 10 నుండి
విజయవాడ పి. బి. సిద్దార్థ కళాశాల ఎ.సి సెమినార్ హాలులో
ప్రారంభ సభ
సభాధ్యక్షులు:         శ్రీ గుత్తికొండ సుబ్బారావు
అధ్యక్షులు, కృష్ణాజిల్లా రచయితల సంఘం
ముఖ్య అతిథి:        శ్రీ పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సాంస్కృతిక శాఖామాత్యులు
సదస్సు ప్రారంభకులు: శ్రీ మండలి బుద్ధప్రసాద్,
ఉప సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆత్మీయ అతిథి:  ఆచార్య వెలిచాల కొండలరావు, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం, హైదరాబాద్
గౌరవ అతిథులు:
శ్రీ కోనేరు శ్రీధర్, మేయర్ విజయవాడ
శ్రీ బొండా ఉమామహేశ్వర రావు,విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు
డా. కె. విజయభాస్కర్, సంచాలకులు, ఆం.ప్ర. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ
శ్రీ గోళ్ళ నారాయణరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ విశ్వనాథ ఫౌండేషన్, విజయవాడ
డా. ఎం. వి. యన్. పద్మారావు, ప్రిన్సిపాల్, పి. బి. సిద్దార్థ కళాశాల
శ్రీ వేమూరి బాబూరావు, పి. బి. సిద్దార్థ కళాశాల డైరెక్టర్
సభానిర్వహణ:
డా. జి వి పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం
1వ సదస్సు:   మధ్యాహ్నం 12 నుండి 1-30 వరకూ
అధ్యక్షులు:   ఆచార్య మాడభూషి సంపత్కుమార్మద్రాస్ విశ్వవిద్యాలయం
(తెలుగు సంస్కృతి పరిరక్షణ- విశ్వనాథ దృక్పథం)
ముఖ్య అతిథి:  ఆచార్య కోవెల సుపసన్నవరంగల్
సమన్వయ కర్త:   డా. యశోద పూర్ణచంద్రరావుతెలుగు శాఖసిద్ధార్థ కళాశాల
పత్రసమర్పణలు
శ్రీ అండవిల్లి సత్యనారాయణవిజయవాడ (విశ్వనాథ వారితో అనుబంధాలు)
డా. ద్వా. నా. శాస్త్రిహైదరాబాద్ (విశ్వనాథ వారి ఆంధ్రభాషాభిమానం)
డా. కొడాలి సోమసుందరరావు, (రామాయణ కల్ప వృక్షం,సీతారాముల అద్వైత తత్త్వం)
శ్రీమతి చంద్రమౌళి నాగమహాలక్ష్మి(ప్రకృతి పరిరక్షణ-విశ్వనాథవారి దృక్పథం)
డా. కె. బాలకృష్ణవిజయవాడ (విశ్వనాథవారి దేశభక్తి)
డా. జి. బి. ఆనందకుమార్మచిలీపట్టణం (భావకవిత్వం-విశ్వనాథ రచనలు )
సభా నిర్వహణ: శ్రీ టి శోభనాద్రిడా. జి. రెజీనాశ్రీ ఎం. అంజయ్య
2వ సదస్సు: మధ్యాహ్నం 2 నుండి 3-30 వరకూ
అధ్యక్షులు:  ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు,  ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం
(విశ్వనాథవారి జాతీయత, దేశీయత)
ముఖ్య అతిథి:  ఆచార్య చేకూరి సుబ్బారావుహైదరాబాద్
సమన్వయ కర్త:  డా. వై. విజయానంద రాజుతెలుగు శాఖ, సిద్ధార్థ కళాశాల
పత్ర సమర్పణలు:       
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ఉయ్యూరు, (తెలుగు భాషోద్యమం-విశ్వనాథ ప్రేరణ)
శ్రీమతి గుడిపూడి రాధికా రాణి, మచిలీపట్టణం (విశ్వనాథవారి నవ్యకవితారీతులు)
శ్రీమతి యడవల్లి మనోరమ,  (విశ్వనాథవారి తెలుగు పలుకుబడులు-కడిమిచెట్టు)
డా. సర్వా చిదంబర శాస్త్రి, జగ్గయ్య పేట (విశ్వనాథవారి శబరి పాత్ర చిత్రణ)
డా. వేదాంతం రాజగోపాలచక్రవర్తి (విశ్వనాథ-పాశ్చాత్య భావధార-భారతీయ సంస్కృతి)
డా. బి వెంకటస్వామి (విశ్వనాథ నవలా రచనా వైశిష్ట్యం)
సభా నిర్వహణ:  శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి, శ్రీమతి ఎస్. అన్నపూర్ణ
3వ సదస్సు:  సాయంత్రం ౩-౩౦ నుండి 5వరకూ
అధ్యక్షులు:   ఆచార్య వెలమల శిమ్మన్న, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
(విమర్శకుడిగా విశ్వనాథ)
ముఖ్య అతిథి: ఆచార్య షేక్ మస్తాన్ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం,
సమన్వయ కర్త:      శ్రీ భవిష్య,
పత్రసమర్పణలు: డా. గుమ్మా సాంబశివరావు, విజయవాడ (విశ్వనాథవారి హాస్యం)
శ్రీమతి బెల్లంకొండ శివకుమారి(విశ్వనాథవారి శాస్త్రీయ దృక్పథం,
మనోవైఙ్ఞానిక సిద్ధాంతాలు- ఏకవీర)
డా. తుర్లపాటి రాజేశ్వరి, బరంపురం (పట్టణీకరణం విశ్వనాథ దృక్పథం)
డా. పొన్నపల్లి  ఉష (విశ్వనాథ రచనలు-జాతీయోద్యమ స్ఫూర్తి)
సభానిర్వహణ:   శ్రీ కె. వి. యల్. యన్. శర్మ, శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, శ్రీ జె. సాయిరాంప్రసాద్

విశ్వనాథ విజయం
ప్రత్యేక కార్యక్రమం సాయత్రం 5 నుండి 6 వరకూ
ఇందులో
విశ్వనాథసత్యనారాయణ    :  మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి      :  డాపాలపర్తి శ్యామలానందప్రసాద్
కాటూరి వెంకటేశ్వరరావు   :  డా. పింగళి కృష్ణారావు
జంధ్యాల పాపయ్య శాస్త్రి    :  డా. జంధ్యాల మహతీశంకర్
గుర్రం జాషువా              :  ఎం. పి. జానుకవి
తెన్నేటి హేమలత:            :  శ్రీమతి కావూరు సత్యవతి

కొడాలి ఆంజనేయులు:      :  డా. చివుకుల సుందరరామశర్మ