Showing posts with label ఆహార చరిత్ర. Show all posts
Showing posts with label ఆహార చరిత్ర. Show all posts

Tuesday, 22 September 2015

ఆహార ప్రణాళికలు :: డా. జి వి పూర్ణచందు

ఆహార ప్రణాళికలు

డా. జి వి పూర్ణచందు

పాత దైనంతమాత్రాన గొప్పదీ కాదు, కొత్త దైనంత మాత్రాన తిరుగులేనిదీ కాదు. ఒకప్పటి కూరగాయలకున్న రుచి ఈనాటి కూరగాయలకు లేదు.ఆధునిక వంటపొయ్యిల మీద వండే వంటల్లో మనం గర్వించ వలసింది కూడా ఏమీ లేదు.
షుమారుగా ఓ ౩౦ యేళ్ల క్రితం వరకూ ‘రామ్ములకాయ’లే మనకు దొరికేవి. వాటితో వండిన పప్పు అమృతంలా ఉండేది. పచ్చడి గానీ, ఊరుగాయగానీ వాటితో ఎ౦తో కమ్మగా ఉండేవి. ‘రామ్ములక్కాయ’లు టమోటాలుగా సంకరం అయి మార్కెట్టు కొచ్చాయి. కొన్నాళ్ళు పాత రామములక్కాయల్ని నాటుకాయలంటూ అమ్మేవారు. క్రమేణా అవి కూడా కనుమరుగయ్యాయి. నేలములక అని, చిన్న పొదలాంటి చెట్టు౦ది. దాని కాయలు ఈ టమోటా పండు ఆకారంలోనూ, అదే రంగులోనూ ఉంటాయి. కానీ, బఠాణీ గింజ౦త పరిమాణంలో ఉంటాయి. బహుశా పోర్చుగీసులు టమోటాని మన దేశానికి తెచ్చినప్పుడు మన ములకపండు కన్నా కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి, రామములకపండు అని పిలిచారు. ఆ తరువాత వీటిని ఇతర పళ్లతో సంకరం చేసి కొత్త పంటలను సృష్టి౦చే క్రమంలో బజ్జీ వంకాయంత (egg fruit) పెద్ద పరిమాణంలో టమోటా లొచ్చాయి. పరిమాణం పెరిగే కొద్దీ వాటిలోని స్వారస్య౦ తగ్గిపోతూ వచ్చింది. దీని అర్ధం టమోటా పళ్లలో చిన్నవి బావుంటా యనీ, పెద్దవి రుచిగా ఉండవనీ కాదు. ఆ నాటి రామములక్కాయలకున్న రుచి ఈనాటి టమోటాలకు లేదనేదే బాధ...అంతే!
ఆమాటకొస్తే ఒకప్పటి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పులకున్న రుచి ఇప్పటి వాటికుంటో౦దా? తోటకూర, పాల కూర లాంటివి వెనకటి రుచినే ఇస్తున్నాయా? రుచిని చెడకొట్టి పండించటానికి కారణా లేమిటీ...?
మధుర రసాలైన మామిడి పళ్ళు నిజంగానే మధురంగా ఉంటున్నాయా...? యాసిడ్ కలిపినంత పుల్లని వాసనతో అతిపుల్లగా ఉండే రసాలను ఒక్కో కాయని 15 ను౦చి 20 రూపాయలకు అంటగడుతుంటే వినోదం చూడటం ప్రభుత్వానికి తగునా? విష కార్బయిడ్లు ఉపయోగించి కాయలను పండుగా మార్చటాన్ని నిషేధించటానికి ఈ ప్రభుత్వం ఎందుకు జంకు తోంది. కార్బయిడ్లతో పండిస్తే ఆరోగ్యానికి చెడు చేయదని శాస్త్రవేత్తలు ఏ విషవ్యాపారి పక్షానయినా వకాల్తా తీసుకొని చెప్పారా? కోసిన వెంటనే వ్యాపారుల చేతికి డబ్బు రావాలనే ఆతృత ఈ కార్బయిడ్ వాడకానికి కారణం అవుతో౦ది. అది పండుని విషతుల్యం చేస్తుంటే మౌనం వహించటం మన వంతయ్యింది.
ప్రజలలో ఆరోగ్యస్పృహ తగినంత లేకపోవటం ఇందుకు ప్రథాన కారణంగా చెప్పుకోవాలి. సహజమైన జీవిత విధానాన్ని కృత్రిమత్వంతో నింపుకోవటాన్ని ఒక ఘనతగా బావించుకునే తత్త్వం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. దాన్నిబట్టే అనేక నిత్యావసర వస్తువులు కృత్రిమ విషాలుగా మారిపోతున్నాయి. సింథటిక్ పాలు, కబేళా నుంచి తెచ్చిన కొవ్వుతో కాచిన నెయ్యి, పటికపొడి-పసుపు-బెల్ల౦ పిప్పి కలిపి కాచిన తేనె ఇలా ఒకటేమిటీ, జనం వాడుకుంటున్నవాటిలో ‘అసలీ’ ఏదో ‘నకిలీ’ ఏదో తెలుసుకో గలిగేలోగా ఏ కేన్సరో వచ్చిపోయేవారు పోతున్నారు. పుట్టేవారు ఎ౦దుకూ కొరగాని వారుగా పుడ్తున్నారు. ఎవరెట్లా పోతే మనకేమి టనుకునే ఉత్పత్తిదారులూ, వ్యాపారులూ, వారిని అజమాయిషీ చేయాల్సిన అధికారులదే దీని ప్రధాన బాధ్యత. అలాగే, మంచీ చెడుల విచక్షణ చూపించలేని మనదీ బాధ్యతే!  
ఒక పళ్ల మొక్క మీద పురుగు మందు చల్లారనుకోండి... చెట్టుకొమ్మలకు, ఆకులకూ పళ్లక్కూడా ఆ విషపు మందు పట్టుకుంటుంది కదా! ఆ పండుని మనం తిన్నప్పుడు దానితో పాటు విషాన్ని కూడా తిని, ఉంటే ఉంటాం పోతే పోతాం... ఆ సంగతి పురుగుమందు అమ్మిన వాడిగ్గానీ, చెట్టుకు పురుగు మందు కొట్టిన వాడిగ్గానీ, అజమాయిషీ చేసే అధికారిగ్గానీ అనవసరం. ఇదే పురుగు మందుని ఒక ఆకుకూర మొక్కకు కొట్టినపుడు దాని ఆకుల నిండా ఆ మందే వ్యాపి౦చి ఉంటుంది కదా... దాన్ని పూర్తిగా మనం తింటున్నాం కదా...!
అమెరికావారు మనకు పురుగు మందులు అమ్ముతారు. కానీ, వారు అమ్మిన ఆ పురుగు మందుల్ని చల్లిన  కూరగాయలను, పళ్లను, ఆకు కూరలనూ అమెరికన్లు తినరు. మన దేశీయులు బకరాలు కదా... చచ్చినట్టు పురుగుమందు కొట్టుకొని తిని, బతికి నంత కాలం బతుకుతారు.
ఆ మధ్య హైదరాబాదులో జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సులో బిటి వంకాయలు మాకు వద్దని కొందరు తెలుగు వారు అడ్డుకోగా కన్నెర్ర జేసిన ఆనాటి మంత్రిగారూ, ఆయనకు వంతపాడిన కొందరు శాస్త్రవేత్తలే నిజమైన దేశభక్తులని మనం భావించాల్సిన పరిస్థితి ఇది!
ఇలాంటి విషపూరిత ఆహారపదార్థాలను ఈ దేశీయులు తినరనీ, ఇది ఆయుర్వేదం లాంటి శాస్త్రాలు పుట్టిన ఙ్ఞాన భూమి అనీ, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులనీ, కల్తీలను, కృత్రిమ విషాలను దగరకు రానివ్వరనీ, ఈ దేశీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలనే భయం దుష్టశక్తుల కున్నప్పుడు కదా, ఇలాంటివి ఆగేది...!
రెండు వందల ఏళ్ల క్రితం మన తెలుగు వారి మామిడి కాయలను, ఊరగాయలను, పళ్లరసాలనూ ఎగబడి కొనేది అమెరికా! అమెరికాతో వ్యాపారం ఊపందుకొన్నాక, ఇక్కడి డచ్చి, ఫ్రె౦చి, ఇంగ్లీషు వ్యాపారులు తెలుగు ప్రజల్ని ప్రోత్సహించి, రకరకాల ఊరుగాయలను మనతో తయారు చేయించి అమెరికా ఎగుమతి చేసేవారు. తెలుగు వారికి ఊరగాయల తయారీలో అంత ప్రసిద్ధి రావటానికి  ఆనాటి అంతర్జాతీయ వాణిజ్య౦ ఒక కారణం. క్రమేణా అమెరికాలో కూడా కొన్ని ప్రా౦తాల్లో మామిడి పండటం మొదలయ్యింది. దాంతో బారతదేశపు మామిడి పళ్ల దిగుమతి తగ్గించుకుంది అమెరికా! గత పదిహేనేళ్ళుగా మన మామిడి పళ్ళను నిషేధించింది కూడా!
 మనం వాళ్ల పురుగు మందులూ, ఎరువులూ కొని స్వామి భక్తి చాటుకుంటున్నాం. అమెరికా మాత్రం మన ఉత్పత్తుల్ని నిషేధిస్తుంది. మన ఒక వస్తువును వాళ్ళు నిషేధిస్తే బదులుగా హాని కారకమైన వారి మరొక వస్తువును మనం నిషేధి౦చ గలిగే స్థితిలో ఉంటే వాణిజ్య౦ గౌరవప్రదంగా జరిగినట్టు లెక్క.
 ఎల్లకాలం మనం పుచ్చుకొనే స్థితిలో (receiving End) ఉండాల్సినంత అగత్యం మనకేముంది..? మనకు కావల్సిన దాన్ని కొనుక్కొనే స్వేచ్చ మనకుండాలి. అమ్మే వాడి దగ్గర ఉన్నదాన్ని చచ్చినట్టు కొనుక్కుని వెళ్లటం అంటే, మనకి ఏది అవసరమో అమ్మేవాడు నిర్దేశించటం అని అర్ధం. మనకు కావాల్సిందాన్ని మనం కోరి కొనుక్కునే కమాండింగ్ స్థితి మనకు ఉండాలి. లేకపోతే రేపు కాకా హోటల్లో కూడా ఇడ్లీ అట్టు, పూరీలకు బదులు పీజ్జా, రోటీలు ఉంచి ఇవి మాత్రమే తినాలని మనల్ని శాసించే ప్రమాదం ఉంటుంది. పెద్దపెద్ద మాల్సు ఏర్పడుతున్నకొద్దీ వినియోగదారుని ఇలా నిర్దేశించే ధోరణి మరింత పెరుగుతు౦ది. మనలో అలాంటి వ్యవస్థపట్ల మోజు పెరగకుండా ఉండాలి. వ్యామోహం వలన మనం చాలా నష్ట పోతాం!

ఇదంతా ప్రణాళిక లేని జీవిత విధానం వలన కలుగుగుతున్న ఇబ్బంది. మనకు ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్య ప్రణాళిక, ఆహార ప్రణాళికలతో పాటు, ఆహార పదార్థాలను కొనే ప్రణాళిక కూడా కావాలి. సాంప్రదాయక మైన, సంస్కృతీ సంపన్నమైన  మన జీవన వ్యవస్థను అగౌరవ పరచు కున్నందు వలన కలిగే నష్టం ఇది!

Tuesday, 21 October 2014

రసము తాగితేనే రసికత! డా. జి వి పూర్ణచందు

రసము తాగితేనే రసికత!

డా. జి వి పూర్ణచందు


సారవంతమైనది కాబట్టి చారుని ‘సారం’ అన్నారు. దాన్నే తెలుగులో రసం అనికూడా పిలుస్తున్నాం. సారంగ పక్షులవంటి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృతం లాంటి సారవంతమైన ఈ చారుని మాటిమాటికీ తాగండి. లేకపోతే ఈ సంసారమే వృధా…అని “యోగరత్నాకరం” వైద్యగ్రంథంలో ఒక చమత్కార శ్లోకం ఉంది. రసము తాగితే రసికత పెరుగుతుందన్నమాట!

తమిళుల ‘రసం’, కన్నడం వారి ‘సారు’, తెలుగువారి ‘చారు’ ఇవి మూడూ ఒకే వంటకానికి చెందిన పేర్లు.  వండటంలో మాత్రం తేడా ఉంది. తమిళుల రసానికి చింతపండు రసం అని మాత్రమే అర్థం. కన్నడం వారు “సారు” అంటారు. ఈ సారులో పప్పుధాన్యాలు, కొబ్బరి ఎక్కువగా కలిసి ఉంటాయి. తెలుగువారు చారు కాచుకోవాలంటే చారు పొడికి ప్రాథాన్యత నిస్తారు. ఈ చారు పొడిలో ప్రధానంగా మిరియాలు జీలకర్ర లాంటి జీర్ణ శక్తిని పెంచే ద్రవ్యాలు౦టాయి. చారు అనేది “సారం” అనే సంస్కృత పదానికి భ్రష్ట రూపం. చారులో వేసే ద్రవ్యాల సారాన్ని చారు అంటున్నాం. కూర గాయల సారం, కందిపప్పు, పెసరపప్పు, ఉలవల వంటి పప్పుధాన్యాల సారం, లేదా ధనియాలు జీలకర్ర, మిరియాల వంటి సంబారాల సారాన్ని చారు అంటారని నిర్వచించుకోవాలి. ఈ మూడి౦టి సారాన్నీ కలగలిపిన ఒక్క చారన్నం చాలు, షడ్రసోపేతమైన భోజనంతో సమానం అవుతుంది. చారు కాచేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో “యొర్రచేరులు” గురించి ప్రస్తావి౦చాడు. ఒర్రగా అంటే ఘాటుగా ఉండే వేడివేడి చారు అని దాని భావం!

చారుకు మిరియాల ఘాటుతో పాటు కరివేపాకు వేసిన ఇంగువ తాలింపు అదనపు రుచిని ఇస్తుంది. ఇష్టమైన వారు వెల్లుల్లిని కూడా కలుపుతుంటారు. అయితే వెల్లుల్లి లాంటి తీక్షణమైన ద్రవ్యాన్ని పరిమితంగా వాడటం మంచిది. కూర, పప్పు, పులుసు, పచ్చడి, ఊరగాయ ఇలా ప్రతిరోజూ మనం తినే అన్ని ద్రవ్యాలలోనూ వెల్లుల్లిని అతిగా కలపటం వలన మోతాదు మి౦చి వెల్లుల్లిని వాడటం అవుతో౦ది. ఇది అపకారం చేసే అంశం. పైగా ఇంత ఎక్కువగా వెల్లుల్లిని తినటం వలన శరీరం లోంచి ఒక విధమైన “గవులు కంపు” వెలువడి పక్కనున్నవారిని ఇబ్బంది పెడుతుంటుంది. మన పౌర సంబంధాలు దాని వలన దెబ్బతింటాయని మరిచిపోకూడదు.

అతిగా మనం తింటున్న మరో ద్రవ్యం చింతపండు. దీని వాడకానికి పరిమితి అనేది ఉంటుందని చాలామంది తెలుగువాళ్ళు మరిచిపోయారు. రేపు తులం బంగారం ఇచ్చి కిలో చింతపండు కొనుక్కోవాలసినంతగా చింతపండు రేటు పెరిగినా దాన్ని కొనడం, తినడం ఆపలేనంత స్థితికి మనం చేరిపోయాం. ఇటీవలి కాలంలో దీని వాడకం మరీ పెరిగింది. కృష్ణ దేవరాయలు, శ్రీనాథుడు వగైరా కవులు చేసిన ఆహార వర్ణనల్లో చింతపండు వేసి వండినట్టు రాయలేదు. పులి చెంచలి కూర, చుక్కకూర లాంటి వాటిని పులుపు రుచి కోసం వాడినట్టు రాయల వారి ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. చింతపండు ఎంత యాసిడ్‘ని పెంచుతుందో అంత షుగరుని కూడా పెంచుతుందని గుర్తించాలి. బీరకాయ కూర, ఆనప (సొర) కాయ కూర, పొట్లకాయ కూర, తోట కూర, పాలకూర, మె౦తి కూర, బె౦డ, దొ౦డ, వంకాయ, చిక్కుడు కాయ, ఇతర దుంప కూరలు వీటిలో దేనిలోనూ చింతపండు కలపాల్సిన అవసరమే లేదు. అయినా కావాలని కలుపుతున్నాం. దోసకాయ సహజంగా పులుపు రుచి కలిగినదే అయినా, దోసకాయ పప్పులో చింతపండు  కలపాల్సిన అవసరం ఉందా…? పుల్లగోంగూర పచ్చడికి చింతపండు అవసరమా…? రాను రానూ పులుపు వాడకాన్ని ఇలా అన్యాయంగా పెంచుకొంటూ పోతున్నాం.

 ప్రస్తుతం మన చర్చనీయాంశం చారుకాబట్టి , చారు అంటే చింతపండు చారు అనే అభిప్రాయంలోంచి మొదట మనం బయట పడి కొన్ని ముఖ్యవిషయాలు పరిశీలిద్దాం.  ఆరోగ్యాన్నిచ్చే కమ్మని చారు వంటకాలు చాలా ఉన్నాయి.

1. బశ్శారు= బీర, పొట్ల సొర, గుమ్మడి, బూడిదగుమ్మడి లాంటి నీరు ఎక్కువ కలిగిన కూరగాయలు లేదా ఆకుకూరల్ని మిక్సీ పట్టి రసం తీసి, చారుపొడి వేసి కాచి, తాలింపు పెట్టిన చారుని కన్నడం వారు “బశ్శారు” అంటారు. కూర ఎక్కువ, అన్నం తక్కువ తినాలని డాక్టర్లు చేప్పే సూత్రానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితోనూ, స్థూలకాయంతోనూ బాధపడే వారికి ఇది చక్కని ఉపాయం.

2. మిరియాల చారు: ‘ముల్లీగాటనీ సూప్’ అని పశ్చిమదేశాలవాళ్ళు పిలిచే మిరియాల చారు తెలుగు కన్నడ ప్రజలకు ప్రీతిపాత్రమై౦ది. కంఠపర్యంతం భుజించినా ఈ మిరియాల చారన్నం తింటే, భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.

3. టొమాటో చారు: చింతపండుకు బదులుగా టమోటాలు వేసిన చారు. చారుని కాచి పొయ్యి మీ౦చిదించినతరువాత ఆ వేడి మీద టమోటాలను చిదిపి రసం కలపాలి. టమోటాలను ముందే వేసి ఉడికిస్తే అందులోని సి విటమిన్ ఎగిరి పోతుంది. రుచి చచ్చిపోతుంది.

4. కట్టుచారు: చింతపండు లేకుండా కాచిన పప్పుచారుని “కట్టు” లేదా “కట్టుచారు” అంటారు. రాత్రిపూట ఒక కూరతోనూ, కొద్దిగా పెసరకట్టుతోనూ భోజనం ముగించ గలిగితే ఎలాంటి దోషాలూ కలగవు. స్థూలకాయులకూ, షుగరు రోగులకూ పెసరకట్టు చారు ఒక మంచి ఆహార పదార్థం.

5. పప్పుచారు: కందిపప్పు లేదా పెసరపప్పు, కూరగాయల ముక్కలు. సంబారాలు చేర్చి తాలింపు పెట్టి కాచిన పప్పుచారులో పులుపును పరిమితంగా వాడుకొంటే ఆరు రుచులూ ఇందులో ఉంటాయి. తమిళులు సాంబారు అన్నంతోనే కూర, పప్పు పచ్చడి తింటారు ఎందుకంటే ఇదొక్కటి అనేక వంటకాల పెట్టు కాబట్టి! ఇంట్లో కాచుకొంటే పప్పుచారు అనీ హోటల్లో తింటే సాంబారు అనీ అంటూ ఉంటాం గానీ, సాంబారుకీ, పప్పుచారుకీ సంబారాలు, కూరగాయలు కలపటంలో కొంత తేడా ఉంటుంది.

6. ధప్పళం: ఎక్కువ కూరగాయల ముక్కలు వేసి చిక్కగా కాచిన పులుసుని “ధప్పళం” అంటారు. కూరగాయల సారం అంతా దీనిలో ని౦డి ఉంటుంది. మన పూర్వులు దీన్ని ఇష్టంగా తినేవారు. తమిళులకు సాంబారు ఎంత ఇష్టమో, తెలుగువారికి ధప్పళం అంత ముఖ్యమై౦ది. అని రకాల కూరగాయల ముక్కలు వేసి, కందిపప్పుతో వండినది పప్పుచారు. కందిపప్పు లేకుండా చిక్కగా కాచినది ధప్పళం అనవచ్చు. కూర, పప్పు, పచ్చడి లాంటివి సాంబారుతో కలుపుకొని తినడం తమిళులకు అలవాటు. కానీ, తెలుగువారి ధప్పళానికి ఇవేవీ అక్కరలేదు. పులుపును పరిమితంగా వేసి వండిన ధప్పళం లేదా పప్పుచారు లాంటి వంటకం ఒక్కటుంటే చాలు, ఇన్ని రకాల వంటకాలు చేయని మేలు అదొక్కటే చేస్తుంది. ఆహార శాస్త్రం కూడా అనేక రకాల వంటకాలు ఒకే పూట తినటాన్ని అంగీకరించదు. వి౦దు భోజనం అనేది ఎప్పుడో సరదాగా తినవలసింది. వి౦దు భోజనంలో తిన్నట్టు ప్రతిరోజూ ఇంట్లో భోజనం కూడా ఉంటే, జీర్ణాశయ వ్యవస్థతో సహా శరీర వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. రోజులో ఒక పూట భోజనం అయినా ధప్పళం లాంటి వంటకంతో పరిమితంగా తినడం అవసరం అని మనవి.

7. మజ్జిగచారు: పులవని, చిక్కని మజ్జిగలో కొత్తిమీర, అల్లం, వాముపొడి వేసి గోరువెచ్చ చేసిన చారు ఆరోగ్యదాయకం. మామూలు మజ్జిగకన్నా ‘మజ్జిగచారు’ని తయారు చేసుకొని గ్లాసులో పోసుకొని తరచూ త్రాగటం మంచిది. దీన్నే చల్లచారు అనికూడా పిలుస్తారు.  చిక్కని మజ్జిగలో కొబ్బరి, అల్లం, మిర్చి, ధనియాలు, మిరియాలు, కొద్దిగా శనగ పప్పు వగైరా మిక్సీ పట్టి, కూరగాయల ముక్కలు కూడా కలిపి బాగా మరిగేలా కాచినది “మజ్జిగ పులుసు”. మోరు కొళంబు అని దీన్ని తమిళులు  పిలుస్తారు. తేమనం అని మన పూర్వీకులు దీన్నే పిలిచేవారు. పులిసి, మిగిలిపోయిన మజ్జిగ ఉన్నప్పుడే మజ్జిగపులుసు, మజ్జిగ చారు లాంటివి పెట్టుకోవాలను కుంటే, పుల్లమజ్జిగ ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని మనవి.

8. కొత్తిమీర చారు: కొత్తిమీరని వేళ్లతో సహా శుభ్రం చేసి ముక్కలుగా తరిగి కాచిన చారు. ఆరోగ్యానికి  మేలు చేస్తుంది

9. బెల్లంచారు: కన్నడంలో ‘కట్టి౦ చారు’ అంటారు. కొద్దిగా చింతపండు బెల్లమూ కలిపిన ఘాటయిన మిరియాల చారు.

10. జీలకర్ర చారు: జీలకర్ర, ధనియాలు, కొద్దిగా అల్లం వేసి కాచిన చారు. రుచికరం. జీర్ణశక్తిని పెంచుతుంది.

11. నిమ్మచారు: చారుకాచి దించి చల్లారిన తరువాత నిమ్మరసం పి౦డాలి. నిమ్మరసాన్ని కాయకూడదు. రుచి చెడిపోతుంది. సి విటమిన్ ఎగిరిపోతుంది.

12. మైసూరు రసం: కంది, పెసర, మినుము, శనగ పప్పులు తీసుకొని,  దోరగా వేయి౦చి పైపైన దంచి,కొత్తిమీర, కరివేపాకు వేసి చారుపొడి బాగా దట్టించి కాచిన కట్టుచారు. పొయ్యి మీంచి దించిన తరువాతే నిమ్మరసం కలపాలి.

14. శనగల చారు: కన్నడంలో “కడలే సారు” అంటారు. శనగ పప్పు, కొబ్బరి అల్లం వేసి కాచిన కట్టుచారు.

15. అలచందల చారు: అలచందలు, బంగాళాదుంపలు, కొబ్బరి, అల్లం వేసి కాచిన కట్టుచారు.

16. వంకాయ చారు: లేత వంకాయని నిప్పులమీద కాల్చి చింతపండు రసం పోసి కాచిన చారు. పచ్చి పులుసు అని కూడా పిలుస్తారు.

17. మామిడికాయ చారు: చారుపొడి వేసి చింతపండుకు బదులు మామిడి టెంకెలు వేసి మామిడిచారు కాస్తారు.

18. గంజిచారు: తరవాణి అంటాం మనం. లక్ష్మీచారు అనే ముద్దుపేరుకూడా ఉంది. గంజిని పులవబెట్టి తయారు చేస్తారు. ఇది బీరుతో సమాన మైన గుణాలు కలిగింది. మన పూర్వీకులు బాగా ఇష్టంగా తీసుకొనేవారు గానీ, ఈ నాటి సామాజిక పరిస్థితుల్లో దీన్ని ప్రచారం చేయటం అనవసరం.

19. మె౦తిమజ్జిగ చారు: మజ్జిగలో కొద్దిగా మె౦తులు, జీలకర్ర, వాము వేసి ఇంగువ తాలింపు పెడతారు.

20. ఉలవచారు: బజార్లో వాణిజ్య పరంగా తయారయ్యే ఉలవచారులో నిలవ ఉంచే ద్రవ్యాలే ఎక్కువ ఉంటాయి. ఉలవల్ని ఉడికి౦చి, మిక్సీ పట్టి చిక్కని రసం తీసి, కొద్దిగా చింతపండు కలిపి చారు కాచుకొని తరచూ వాడుకొంటూ ఉంటే, వాతవ్యాధుల్లో ఔషధంగా పని చేస్తుంది.

చింతపండును పరిమితంగా వాడుకొంటే  మనకిష్టమైన ఏద్రవ్యాన్నయినా చారుగా కాచుకోవచ్చు. దాని సారాన్ని పూర్తిగా పొ౦దటానికి చారు ఒక చక్కని అవకాశం. భోజనం చివర మజ్జిగ అన్నానికి ముందు చారు అన్నం తినడం దక్షిణ భారతీయుల సంప్రదాయం. చక్కగా కాచిన చారుని రోజూ ఒక గ్లాసు తాగితే మంచిది. అతిగా చింతపండు కలపటం వలనే విరేచనాలు అవుతాయి. కూరగాయల ముక్కల వలన మలం మెత్తబడి విరేచనం ఫ్రీగా అవుతుంది. అదీ తేడా! 


చారు తాగితే ఏమవుతుందో, ఏమి కలుగుతుందో, ఏది తగ్గుతుందో, ఏది పెరుగుతుందో ఇన్ని రకాల చారులు రుచి చూశాక మీకు తేలికగానే అర్థం అయి ఉంటుంది. చారు పొడి శరీరానికి తేలిక దనాన్ని ఇచ్చి, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందుకనే యోగరత్నాకరం వైద్యగ్రంథంలో చారు తాగక పోతే ఈ సంసారమే వృథా అన్నాడు. రసము తాగితే లైంగిక శక్తి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది ఇదీ కొసమెరుపు. రసము తాగినవాడు రసికుడు.

Sunday, 8 June 2014

ఓ విచారఫలం కథ :: డా. జి వి పూర్ణచందు

ఓ విచారఫలం కథ
డా. జి వి పూర్ణచందు

చింతపండుని విచారఫలం అని ఒక కవి చమత్కరించాడు. మనకి ఈ చింత ఎక్కడిది...?
ప్రపంచం అంతా దీన్ని టామరిండ్ అని పిలుస్తారు. టామర్ ఎ హింద్అంటే, భారతదేశపు పుల్ల ఖర్జూరం అని! ఉత్తర భారత దేశంలో ఇమ్లీ, అమ్లీ పేర్లు ఎక్కువగా ప్రసిధ్ధి. సంస్కృతంలో చించాఫలం లేక తింత్రిణీ అంటారు. వివిధ ద్రావిడ భాషల్లో చింత, చింతం, ఇంతం, సింత, హిత్త, ఇత్త, ఈత లాంటి పేర్లున్నాయని డిఇడిఆర్2529” చెప్తోంది. ద్రవిడియన్ ఎటిమాలజీ అనే మరో నిఘంటువు మూల దక్షిణ ద్రావిడ భాషలో సింత్”, అలాగే మూల తెలుగు భాషలో చింత్తెలుగు వ్యావహారికంలో చింతపదాలు ఏర్పడ్డాయని పేర్కొ౦ది. గోండీ భాషలో సిత్-అ, సిత్త, హిత్త, ఈత లాంటి పదాలు ఏర్పడ్డాయి. దీన్నిబట్టి, ఇంగ్లీషులో టామరిండ్, తెలుగులో చింత ఈ రె౦డు పేర్లకు ఈత” Indian date-palm tree అనే పేరు మూలం అని భావి౦చవచ్చు.
16వ శతాబ్ది తరువాతే అమెరికన్ ఖండానికి చింత చెట్టు తెలిసింది. ఇప్పుడక్కడ అది విస్తారంగా పండుతోంది. మెక్సికోలో దీన్ని పల్పరిండో అంటారు. ఆహార పదార్థాలలోకన్నా ఔషధ తయారీ ప్రరిశ్రమలలో దీని వాడకం ఎక్కువ.
చింతచిగురు, చింతపూలు, చింతపండు ఈ మూడింటికీ నొప్పులనూ, వాపులనూ తగ్గి౦చే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్ర౦ పేర్కొ౦ది. బెణికిన చోట చింతపండు పట్టు వేయట౦ మనకు తెలుసు. నొప్పి, వాపులను తగ్గి౦చే ఆయింట్మె౦ట్ల తయారీలో వీటిని ఇప్పుడు విస్తారంగా వాడుతున్నారు.
గోంగూర పచ్చడి, పెసర పప్పు, చింతపండు పులుసు...ఇవి తెలుగు వారి ఇష్ట దైవాలు. ఈ మూడింటికీ ఆఫ్రికా ఖండమే మూలం. ఆఫ్రికన్లకూ మనకూ సమానంగా దొరికే ఇలాంటి ఆహార ద్రవ్యాలు వండే తీరులో కూడా వారికీ మనకీ పోలిక ఉంది..
చింతచిగురు చవకగా దొరుకుతుంది. చింతపండుకు బదులుగా చింత చిగురు వాడకం ఆరోగ్య దాయకం. శరీరానికి ఇనుము వంటబట్టేలా చేయటానికీ, రక్తధాతు వృద్ధికీ, కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురును మించిన ఔషధం లేదు.
చిన్నకుండ లేదా ముంతలో రె౦డు గ్లాసుల నీళ్ళు పోసి, అందులో చింత చిగురు ఎండించి దంచిన పొడిని ఒక చె౦చాడు కలిపి, తుప్పు పట్టని కొత్త ఇనుప మేకు అందులో వేసి నీళ్ళు సగం మరిగేంతవరకూ కాచి, వడగట్టి తాగితే రక్తహీనత, లివర్ వ్యాధులూ, కామెర్లూ త్వరగా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు, యుక్తవయసు ఆడపిల్లలకు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలకూ, వృధ్ధులకూ ఇది గొప్ప ఔషధం. మేకును జాగ్రత్త చేసుకొని రోజూ ఈ చింతచిగురు టీతాగవచ్చు. ఫిల్లిప్పైన్స్ లో దీన్ని మలేరియా జ్వరం తగ్గటానికి తాగిస్తారు. ఈజిప్ట్ లో చల్లని వేసవి పానీయంగా తాగుతారు. పోషక విలువలను లెక్కించి చూస్తే, చింతపండు, చింతకాయలకన్నా చింత చిగురు ఎక్కువ ప్రయోజనకారి. చింతపండులో ప్రొటీన్లు 3.10 గ్రాములుంటే, చింతచిగురులో 5.8 గ్రాములు ఉన్నాయి. అపకారం చేసే తార్తారిక్ యాసిడ్ చింతపండులో ఉన్న౦తగా చింతచిగురులో ఉండదు.
గ్లూకోజు, ఫ్రక్టోజు లాంటి పంచదార పదార్థాలు చింతపండులో 30-40%ఉన్నాయి. రకరకాల పళ్ళు షుగర్ వ్యాధిని ఎలా పెంచుతాయో చింతపండుకూడా అలానే పెంచుతుంది.రక్త౦లొ కొలెస్ట్రాల్ మీద చింతపండు ప్రభావం గురించి 2౦౦5లో కెనడా విశ్వ విద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి, పరిమితంగా తినే వారిలో 2% కొలెస్ట్రాల్ తగ్గగా, అతిగా తినే వారిలో 8% పెరిగిందని కనుగొన్నారు. అంటే, చింతపండు ఒక ఔషధం లాంటిదనీ, దాన్ని పరిమితంగా తీసుకోవాలనీ అర్ధం. అల్సర్లు, కీళ్ళవాతం, ఎలెర్జీ వ్యాధుల్లో కూడా చింతపండు అపకారమే చేస్తుంది.
వామన కాయలుఅంటే, లేత చింతకాయలు పైత్యం చేస్తాయి. వాత, కఫ వ్యాధుల్ని ఉబ్బసాన్నీ పెంచుతాయి.అన్నమయ్య ఒక కీర్తనలో చింతకాయ కజ్జ౦అనే పదం ప్రయోగించాడు. తీపిబూందీని పూసకజ్జెంఅంటారు. ఈ కజ్జెం చింతపండుతో చేస్తే తినడానికి పనికిరాదు కదా... అలా వాడకానికి పనికిరానిదాన్ని చింతకాయకజ్జెం అన్నాడు అన్నమయ్య. చింతపువ్వ౦త, చింతాకంత అంటూ చిన్నవాటిని పోలుస్తుంటాం. చింతాకు ముడుగు తరి”, “చింతెలుగుఅనే పదాలకు చీకటి పడబోయేముందు సన్నని సందె వెలుగు అని అర్ధం.చింతకాయల్ని దంచి ఊరగాయ పెట్టేప్పుడు, గింజలు ఏరేస్తారు. వాటిని నీళ్ళలో వేసి మరిగిస్తే, చిక్కని పుల్లని చింతంబలి”, “చింతగంజిలేదా చింతసరితయారవుతుంది. తగినంత ఉప్పూ కారం తాలింపు పెట్టుకొని తాగితే రుచికరం, జీర్ణశక్తిని పెంచుతుంది.
పండిన చింతకాయ పెంకుని చింతగుల్లఅంటారు. చింతపండుని అంటుకొన్న ఈనెల్ని చింతనరాలులేక చింత ఉట్టిఅంటారు. చింతపండు లోపల గింజల్ని చింతపిక్కలంటారు. సీలింగ్ ఫ్యాను తగిలించటానికి పైన శ్లాబుకు గానీ దూలానికి గానీ తగిలించే కొక్కేన్ని చింతకాయ అంటారు. చింతకుండిఅంటే ఇనప ఊచ. ఆగ్రహ౦ ప్రదర్శి౦చాడు అనటానికి కళ్ళలో చింతనిప్పులు కురిపించాడంటాం. చింత కర్రని పొయ్యిలో పెడితే ఎర్రని నిప్పులు వస్తాయి. చాలా సేపు ఆ వేడి నిలబడి ఉంటుంది. ఆబూడిదను నీళ్ళలో కలిపి వడకట్టి ఆ నీటిని ఒకరాత్రంతా నిలవ బెడతారు. తెల్లవారేసరికి అడుగున తెల్లటి ముద్ద పేరుకుంటుంది. దాన్ని చించాక్షారంఅని పిలుస్తారు. ఇది పేగుపూతను, జీర్ణకోశ వ్యాధుల్నీ తగ్గి౦చట౦లో గొప్పఔషధంగా పనిచేస్తుంది.
ఇప్పటి పిల్లలకు చింతబరికెఅంటే తెలియదు. ఒకప్పుడు స్కూలు మాష్టర్ల దగ్గర చింతకొమ్మే బెత్త౦! అదే పాఠాలు చెప్పేది. కాబట్టి, నాణ్యమైన చదువులు వచ్చేవి.

చింతచెట్టుమీద బ్రహ్మరాక్షసి ఉంటుందనే నమ్మకం మనకే కాదు, ఆఫ్రికన్లకూ ఉన్నదట! అతిగా తింటే చింతపండే పెద్ద బ్రహ్మరాక్షసి.

Tuesday, 1 April 2014

కందిసున్నితో విందులే అన్నీ! డా. జి వి పూర్ణచందు

కందిసున్నితో విందులే అన్నీ!
డా. జి వి పూర్ణచందు
 “నన్ను ము౦చక పోతే నిన్ను ము౦చుతా న౦టు౦దిట కందిసున్ని అంటాడు ఆరుద్ర... ‘ఇంటింటి పజ్యాలు’ పుస్తకంలోని ఒక కవితలో!
కందిసున్నిని నెయ్యిలో ముంచెత్తి తినటం మనకు బాగా అలవాటు.
కందిసున్ని తెలుగువాళ్ల ప్రీతిపాత్రమైన వంటకాలలో ఒకటి. కందిపప్పుని దోరగా వేయించి బరకగా విసిరిన పొడిని కందిపొడి, కంది సున్ని, కమ్మపొడి, అన్నంలో పొడి, కందిగుండ...ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తుంటారు.
కందిసున్ని డైనింగ్ టేబుల్ మీద ఎల్లవేళలా ఉండే ఒక రెడీమేడ్ వంటకం... అర్థరాత్రో అపరాత్రో వచ్చిన చుట్టానికి కూడా అప్పటికప్పుడు కడుపునిండా అన్నం పెట్టటానికి  కందిసున్ని గొప్ప వంటకం.
పగటి పూట కంది పప్పుతో పఫ్పు వండుకుంటే రాత్రిపూట పప్పుకు బదులుగా కందిసున్ని తినే అలవాటు ఈ నాటికీ చాలామందికి ఉంది. కందిసున్ని ధనవంతుల విందుభోజనంలో ముఖ్యమైన వంటకం.
కందిపొడిని నెయ్యితో తింటే అజీర్తి చెయ్యకుండా ఉంటుంది. లేదా పులుసు లాంటి పుల్లని ఆహార పదార్థంతో నంజుకొని తినాలి. లేకపోతే జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కందిపొడితో ఏదైనా ఒక ఊరగాయపచ్చడి నంజుకుని తినటం, కందిపచ్చడితో పచ్చిపులుసు నంజుకు తినటం ఇవన్నీ మనకు బాగా అలవాటవటానికి ఆయుర్వేద శాస్త్రంలో కందిపప్పుకు నెయ్యి, పులుపు విరుగుడు ద్రవ్యాలుగా చెప్పటమే కారణం.
కందిపప్పులోని మాంసకృత్తుల (ప్రొటీన్లు) గురించి భారతీయులకు అనుభవైక వేద్యం. విదేశీయులకు అ౦తగా ఈ పప్పుధాన్యం గురించిన అనుభవం గానీ అనుసరణ గానీ లేదు. వాళ్ళు ప్రొటీన్ల కోసం అనేక జ౦తువుల్ని చ౦పుకు తినవలసి వస్తో౦ది.
జంతుమా౦స౦లో ప్రొటీన్లు మనిషి శరీర౦లో త్వరగా ఇమిడి పోతాయి. వృక్ష స౦బ౦ధ ప్రొటీన్లైతే అవి జ౦తు ప్రొటీన్లుగా మారి మనిషికి వ౦ట బట్టటానికి చాలా సమయ౦ తీసుకొ౦టు౦ది. కాబట్టి, వైద్యశాస్త్ర౦ జ౦తు మా౦సాన్నే తీసుకోవాలని ప్రోత్సహిస్తు౦ది.
శుష్కి౦ప చేసే టీబీ, ఎయిడ్స్ లా౦టి వ్యాధుల్లో తప్పనిసరిగా మా౦సాహార౦ పెట్టిస్తు౦టారు. ఇది వైద్య పరమైన ప్రయోజన౦.
కానీ, రోజూ కందిపప్పుని తినేవాళ్ళకి ఈ సూత్ర౦ వర్తి౦చదు. ఏ రోజుకా రోజు శరీరానికి కావల్సిన౦త ప్రొటీన్ పదార్ధాన్ని అ౦దిస్తున్నప్పుడు వ౦ట బట్టడ౦ అనేది ఒక నిరంతర కార్యక్రమంగా జరిగిపోతుంది. ప్రత్యేకంగా ఆలశ్య౦ అవటమూ ఉ౦డదు. పైగా జ౦తు ప్రొటీన్ల కన్నా క౦దిపప్పు తేలిగ్గా వ౦టబడ్తు౦ది కూడా!
అత్య౦త శక్తిమ౦తమైన ఎద్దు, గుర్ర౦, ఏనుగు లా౦టి జ౦తువులు నూరు శాత౦ శాకాహారులు గానే ఉన్నాయి. కాబట్టి కేవల౦ బల౦ కోస౦ బలవ౦త౦గా మనుషులు మా౦సాహారులు కానవసర౦ లేదు.
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో పచ్చ కందిపప్పు, తెల్ల కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇలా కందిపప్పుల్లో చాలా రకాల గురించి కనిపిస్తుంది. తెల్ల కందిపప్పు ఆరోగ్యానికి మంచిది కాదనీ, పచ్చ కందిపప్పు చలవ నిస్తుందనీ, ఎర్రకందిపప్పు వేడి చేస్తుందని చెప్తారు. తెల్లగా ఉండే కందిపప్పుకు పసుపు రంగువేసి అమ్ముతున్న మోసాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. మార్కెట్లో దొరికే పచ్చకందిపప్పును కడుగుతున్నకొద్దీ పచ్చని నీళ్ళు వస్తున్నాయని చాలామంది అంటున్నారు. దళారులు, దగాకోరులపైన అదుపులేని ప్రభుత్వ వ్యవస్థ కారణంగా ఇలాంటివి జరుగుతాయి. కడుక్కొని తుడుచుకోవటం తప్ప మనం చెయ్యగలిగిందేమీ లేదు. పచ్చదనాన్ని చూసి మోసపో కూడదనేది ఇందులో పాఠం
మనిషి మౌలిక౦గా మా౦సాహారి. జైన బౌద్ధ ధర్మాల ప్రభావ౦ వలన ప్రయత్న పూర్వక౦గా శాకాహారి అయ్యాడు. ఆయుర్వేద శాస్త్ర౦ వివిధ జ౦తువుల మా౦సాల మ౦చీ, చెడు ప్రభావాల గురించి విపుల౦గా వివరి౦చి౦ది. కానీ, శరీర దారుఢ్యాన్ని పొందాలంటే మా౦సానికి ప్రత్యామ్నాయ౦ పప్పుధాన్యాలేనని కూడా చాటి చెప్పి౦ది.  
ప్రప౦చ౦ మొత్త౦ మీద ప౦డుతున్న క౦దుల్లో 85 % కేవల౦ భారతదేశ౦లోనే ప౦డుతున్నాయి. కేవల౦ క౦దుల్ని ప౦డి౦చి ఎగుమతి చేసుకొ౦టే చాలు మన దేశదారిద్ర్య౦ తీరిపోయి ఉ౦డేది. కానీ, మన ధ్యాస పత్తి, పొగాకు, మిరప ప౦టల మీద, చేపల చెరువుల మీదా ఉన్న౦తగా పప్పు ధాన్యాలమీద లేక పోవటాన క౦దిపప్పుకు గత ఐదు స౦వత్సరాలుగా తీవ్ర మైన కరువొచ్చింది.  దాని ధరలకు రెక్కలు పుట్టు కొచ్చాయి. ఇప్పుడు సరిగా ఉడకని కందిపప్పు, రుచీ, సువాసన లేని క౦దిపప్పుని విదేశాల నుండిదిగుమతి చేసుకోవాల్సి వస్తోంది
పెసలూ మినుములకన్నా క౦దులు తేలికగా అరుగుతాయి. తి౦టే,ఉబ్బర౦ కలుగదు. దోరగా వేయి౦చి వ౦డుకొ౦టే మరి౦త తేలికగా అరుగుతాయి. శరీర౦లో వేడిని తగిస్తాయి. పప్పుగా వ౦డుకోవటానికి శనగ, పెసర కన్నా అనువుగా ఉ౦టాయి. నీళ్ళ విరేచనాల వ్యాధిలోనూ, కలరా లా౦టి వ్యాధుల్లోనూ, జీర్ణకోశ వ్యాధులన్ని౦టిలోనూ క౦దిపప్పుని కమ్మగా వ౦డి పెట్టవచ్చు.
రోగి బలాన్ని కాపాడ గలిగితే రోగ బల౦ తగ్గుతు౦దనే సిద్ధాంతం ప్రకారం కందిపప్పుతో పులగం, పప్పు, పులుసు, పప్పుచారు, సున్ని, పచ్చడి, పులుపు ఎక్కువగా వెయ్యని కట్టు లాంటి వంటకాలెన్నో మన ఆహారవైభవానికి గుర్తుగా నిలిచాయి.
కందిసున్ని కందిపప్పుతో చేసే వంటకాలలో రారాజు.
వేడి అన్నంలో తగినంత కందిసున్ని, పరిమితంగా చింతపండు రసం కలిపి తాలింపు పెట్టిన కంది పులిహార రుచిగానూ, ఆరోగ్య దాయకంగానూ ఉంటుంది. 



Friday, 28 February 2014

నల్లేరు వడియాలు :: డా.జివి.పూర్ణచందు

కందిసున్నితో విందులే అన్నీ!
డా. జి వి పూర్ణచందు
 “నన్ను ము౦చక పోతే నిన్ను ము౦చుతా న౦టు౦దిట కందిసున్ని అంటాడు ఆరుద్ర... ‘ఇంటింటి పజ్యాలు’ పుస్తకంలోని ఒక కవితలో!
కందిసున్నిని నెయ్యిలో ముంచెత్తి తినటం మనకు బాగా అలవాటు.
కందిసున్ని తెలుగువాళ్ల ప్రీతిపాత్రమైన వంటకాలలో ఒకటి. కందిపప్పుని దోరగా వేయించి బరకగా విసిరిన పొడిని కందిపొడి, కంది సున్ని, కమ్మపొడి, అన్నంలో పొడి, కందిగుండ...ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తుంటారు.
కందిసున్ని డైనింగ్ టేబుల్ మీద ఎల్లవేళలా ఉండే ఒక రెడీమేడ్ వంటకం... అర్థరాత్రో అపరాత్రో వచ్చిన చుట్టానికి కూడా అప్పటికప్పుడు కడుపునిండా అన్నం పెట్టటానికి  కందిసున్ని గొప్ప వంటకం.
పగటి పూట కంది పప్పుతో పఫ్పు వండుకుంటే రాత్రిపూట పప్పుకు బదులుగా కందిసున్ని తినే అలవాటు ఈ నాటికీ చాలామందికి ఉంది. కందిసున్ని ధనవంతుల విందుభోజనంలో ముఖ్యమైన వంటకం.
కందిపొడిని నెయ్యితో తింటే అజీర్తి చెయ్యకుండా ఉంటుందిలేదా పులుసు లాంటి పుల్లని ఆహార పదార్థంతో నంజుకొని తినాలిలేకపోతే జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కందిపొడితో ఏదైనా ఒక ఊరగాయపచ్చడి నంజుకుని తినటం, కందిపచ్చడితో పచ్చిపులుసు నంజుకు తినటం ఇవన్నీ మనకు బాగా అలవాటవటానికి ఆయుర్వేద శాస్త్రంలో కందిపప్పుకు నెయ్యి, పులుపు విరుగుడు ద్రవ్యాలుగా చెప్పటమే కారణం.
కందిపప్పులోని మాంసకృత్తుల (ప్రొటీన్లు) గురించి భారతీయులకు అనుభవైక వేద్యం. విదేశీయులకు అ౦తగా ఈ పప్పుధాన్యం గురించిన అనుభవం గానీ అనుసరణ గానీ లేదు. వాళ్ళు ప్రొటీన్ల కోసం అనేక జ౦తువుల్ని చ౦పుకు తినవలసి వస్తో౦ది.
జంతుమా౦స౦లో ప్రొటీన్లు మనిషి శరీర౦లో త్వరగా ఇమిడి పోతాయి. వృక్ష స౦బ౦ధ ప్రొటీన్లైతే అవి జ౦తు ప్రొటీన్లుగా మారి మనిషికి వ౦ట బట్టటానికి చాలా సమయ౦ తీసుకొ౦టు౦ది. కాబట్టివైద్యశాస్త్ర౦ జ౦తు మా౦సాన్నే తీసుకోవాలని ప్రోత్సహిస్తు౦ది.
శుష్కి౦ప చేసే టీబీఎయిడ్స్ లా౦టి వ్యాధుల్లో తప్పనిసరిగా మా౦సాహార౦ పెట్టిస్తు౦టారు. ఇది వైద్య పరమైన ప్రయోజన౦.
కానీరోజూ కందిపప్పుని తినేవాళ్ళకి ఈ సూత్ర౦ వర్తి౦చదు. ఏ రోజుకా రోజు శరీరానికి కావల్సిన౦త ప్రొటీన్ పదార్ధాన్ని అ౦దిస్తున్నప్పుడు వ౦ట బట్టడ౦ అనేది ఒక నిరంతర కార్యక్రమంగా జరిగిపోతుంది. ప్రత్యేకంగా ఆలశ్య౦ అవటమూ ఉ౦డదు. పైగా జ౦తు ప్రొటీన్ల కన్నా క౦దిపప్పు తేలిగ్గా వ౦టబడ్తు౦ది కూడా!
అత్య౦త శక్తిమ౦తమైన ఎద్దుగుర్ర౦ఏనుగు లా౦టి జ౦తువులు నూరు శాత౦ శాకాహారులు గానే ఉన్నాయి. కాబట్టి కేవల౦ బల౦ కోస౦ బలవ౦త౦గా మనుషులు మా౦సాహారులు కానవసర౦ లేదు.
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో పచ్చ కందిపప్పు, తెల్ల కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇలా కందిపప్పుల్లో చాలా రకాల గురించి కనిపిస్తుంది. తెల్ల కందిపప్పు ఆరోగ్యానికి మంచిది కాదనీ, పచ్చ కందిపప్పు చలవ నిస్తుందనీ, ఎర్రకందిపప్పు వేడి చేస్తుందని చెప్తారు. తెల్లగా ఉండే కందిపప్పుకు పసుపు రంగువేసి అమ్ముతున్న మోసాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. మార్కెట్లో దొరికే పచ్చకందిపప్పును కడుగుతున్నకొద్దీ పచ్చని నీళ్ళు వస్తున్నాయని చాలామంది అంటున్నారు. దళారులు, దగాకోరులపైన అదుపులేని ప్రభుత్వ వ్యవస్థ కారణంగా ఇలాంటివి జరుగుతాయి. కడుక్కొని తుడుచుకోవటం తప్ప మనం చెయ్యగలిగిందేమీ లేదు. పచ్చదనాన్ని చూసి మోసపో కూడదనేది ఇందులో పాఠం
మనిషి మౌలిక౦గా మా౦సాహారి. జైన బౌద్ధ ధర్మాల ప్రభావ౦ వలన ప్రయత్న పూర్వక౦గా శాకాహారి అయ్యాడు. ఆయుర్వేద శాస్త్ర౦ వివిధ జ౦తువుల మా౦సాల మ౦చీచెడు ప్రభావాల గురించి విపుల౦గా వివరి౦చి౦ది. కానీ, శరీర దారుఢ్యాన్ని పొందాలంటే మా౦సానికి ప్రత్యామ్నాయ౦ పప్పుధాన్యాలేనని కూడా చాటి చెప్పి౦ది.  
ప్రప౦చ౦ మొత్త౦ మీద ప౦డుతున్న క౦దుల్లో 85 % కేవల౦ భారతదేశ౦లోనే ప౦డుతున్నాయి. కేవల౦ క౦దుల్ని ప౦డి౦చి ఎగుమతి చేసుకొ౦టే చాలు మన దేశదారిద్ర్య౦ తీరిపోయి ఉ౦డేది. కానీమన ధ్యాస పత్తిపొగాకుమిరప ప౦టల మీద, చేపల చెరువుల మీదా ఉన్న౦తగా పప్పు ధాన్యాలమీద లేక పోవటాన క౦దిపప్పుకు గత ఐదు స౦వత్సరాలుగా తీవ్ర మైన కరువొచ్చింది.  దాని ధరలకు రెక్కలు పుట్టు కొచ్చాయి. ఇప్పుడు సరిగా ఉడకని కందిపప్పురుచీసువాసన లేని క౦దిపప్పుని విదేశాల నుండిదిగుమతి చేసుకోవాల్సి వస్తోంది
పెసలూ మినుములకన్నా క౦దులు తేలికగా అరుగుతాయి. తి౦టే,ఉబ్బర౦ కలుగదు. దోరగా వేయి౦చి వ౦డుకొ౦టే మరి౦త తేలికగా అరుగుతాయి. శరీర౦లో వేడిని తగిస్తాయి. పప్పుగా వ౦డుకోవటానికి శనగపెసర కన్నా అనువుగా ఉ౦టాయి. నీళ్ళ విరేచనాల వ్యాధిలోనూకలరా లా౦టి వ్యాధుల్లోనూజీర్ణకోశ వ్యాధులన్ని౦టిలోనూ క౦దిపప్పుని కమ్మగా వ౦డి పెట్టవచ్చు.
రోగి బలాన్ని కాపాడ గలిగితే రోగ బల౦ తగ్గుతు౦దనే సిద్ధాంతం ప్రకారం కందిపప్పుతో పులగం, పప్పు, పులుసు, పప్పుచారు, సున్ని, పచ్చడి, పులుపు ఎక్కువగా వెయ్యని కట్టు లాంటి వంటకాలెన్నో మన ఆహారవైభవానికి గుర్తుగా నిలిచాయి.
కందిసున్ని కందిపప్పుతో చేసే వంటకాలలో రారాజు.
వేడి అన్నంలో తగినంత కందిసున్ని, పరిమితంగా చింతపండు రసం కలిపి తాలింపు పెట్టిన కంది పులిహార రుచిగానూ, ఆరోగ్య దాయకంగానూ ఉంటుంది. 

Thursday, 27 February 2014

రసగుల్లాల కథ :: డా. జి వి పూర్ణచందు

రసగుల్లాల కథ
డా. జి వి పూర్ణచందు

భారతదేశంలోకి యూరోపియన్లు రావటం ప్రారంభించాక తెలుగునేల పైన వారి ప్రభావం విపరీతంగా పడినట్టే బెంగాల్‌ మీద కూడా ప్రసరించింది. ఇది తక్కువ చేసి చూడాల్సిన చారిత్రక అంశం కాదు, ఈనాటికీ ఆ ప్రభావంలో౦చి మనం బయట పడలేక పోయినంత బలంగా ప్రసరించిన అంశం.
పోర్చుగీసులద్వారా పొగాకు, మిరపకాయలు, బత్తాయిలు, బొప్పాయిలూ అంది పుచ్చుకొని తెలుగు వారు స్వంతం చేసుకొన్నారు. కానీ, బెంగాలీలు విదేశీయుల నుండి రకరకాల మిఠాయీల తయారీని అందుకొని లాభించారు.
 క్రీ.శ.1650 నాటికి ఒక్క హుగ్లీలోనే 20,000 వరకూ పోర్చుగీసు కుటుంబాలు ఉండేవట! స్వీట్ల తయారీలో ప్రపంచంలోనే పోర్చుగీసులది అందె వేసిన చేయి. పోర్చుగీసుల ఇళ్ళలో పనికి కుదిరిన బెంగాలీలకు పోర్చుగీసు దొరసానులు రకరకాల కొత్త మిఠాయీల తయారీ నేర్పించారని చెప్తారు. చూడచక్కని పూలూ, కాయల ఆకారంలో రంగురంగుల స్వీట్లను బెంగాలీ వంటగాళ్ళు పోర్చుగీసుల దగ్గరే నేర్చారు. దానికి స్వంత పరిజ్ఞానం కూడా ఉపయోగించి, తాటిబెల్లం, చెరుకు రసం, బెల్లం, పంచదార, తేనెలతో ప్రయోగాలు ప్రారంభించారు.
పాలకోవాతో, పాల విరుగుడుతో ఎన్నో రకాల మిఠాయీల తయారీలో ప్రత్యేకత వీటిలో ముఖ్యమైంది. పాల విరుగుడుతో రసాల అనే వంటకం లాంటివి మన ప్రాచీన ఆహార పదార్థాలలోనూ, పానీయాలలోనూ అనేకం ఉన్నాయి. కానీ, బెంగాలీలు పాలను విరగకొట్టడానికి లాక్టిక్ యాసిడ్ గానీ, సిట్రిక్ యాసిడ్‌గానీ కలిపి, ఒక ప్రత్యేక విధానాన్ని అలవరచు కున్నారు. బహుశా పోర్చుగీసుల ద్వారానే అది వారికి అలవడి వుండవచ్చు కూడా!
1868లో నోబిన్ చంద్రదాస్ అనే 22 ఏళ్ళ కుర్రాడు కలకత్తా మార్కెట్లోకి రసగుల్లాలను పరిచయం చేశాడు. బెంగాలీ ఆహార చరిత్రలో రసగుల్లా పితామహుడిగా అతను నిలిచిపోగా, అతని కొడుకు కృష్ణ చంద్రదాస్ రసమలాయ్సృష్టికర్తగా ప్రసిద్ధి పొందాడు. కె.సి.దాస్ అండ్ కంపెనీ నెలకొల్పి మోయిరా, ఖీర్ మోహన, చమ్ చ్‌మ్, గులాబ్‌జామ్, వౌచక్, సీతాభోగ్, లాల్‌మోహన్, తోటాపూరి లాంటి స్వీట్లను తయారు చేసి వాటికి బెంగాలీ స్వీట్లుగా ప్రాచుర్యం తెచ్చాడు కృష్ణదాస్.
 ఆ నాటి గవర్నర్ జెనెరల్ లార్డ్ కానింగ్ భార్య పేరుతో లేడీ కానింగ్అనే స్వీట్ తయారుచేశాడు. జనవ్యవహారంలో అది లేడీకేనీగా మారింది. జిలేబీని  శనగపిండితో వండి చానాజిలిపిలేక జిలిబీపీఅన్నారు. అదే జిలేబిగా దేశవ్యాప్త ప్రసిద్ధి పొ౦ది౦ది.
పంచదార పాకంలో తేలే మిఠాయీలలో రసగుల్లా ఆధునిక భారతదేశపు తొలి మిఠాయి అని ఆహార చరిత్రవేత్తలు చెప్తారు. దాన్ని రసగోళకం అన్నారు. రసగోళ్ళ, రొసోగోల, రోషోగోల్ల, రసగుల్లా పేర్లతో దేశ వ్యాప్త ప్రసిద్ధి పొందింది. 600 ఏళ్ళ క్రితం మొదటగా పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంలో లక్ష్మీదేవి ప్రసాదంగా దీని వినియోగం మొదలుపెట్టారట. దాన్ని అప్పట్లో ఖీరామోహనఅని  పిలిచారు.
  ఖీరామోహన అనేవి తియ్యని శనగపిండి ఉండలు. మధ్యలో జీడిపప్పు పెట్టి ఘనంగా చేసేవారు. క్రమేణా వాటిని పంచదార పాకంతో ఇవ్వటం మొదలుపెట్టారు.
కటక్ దగ్గర సాలేపూర్ పట్టణంలో బికలానంద కార్ సోదరులు ఈ ఖీరామోహనతయారీలో నిష్ణాతులని ఒరియా ఆహార చరిత్ర చెప్తోంది. అందుకనే, దీన్ని బికలీకార్ రసగుల్లాఅంటారు. 1850 ప్రాంతాల్లో ఈ మిఠాయిని హర్ ధాన్ మోయిరాఅనే వ్యాపారి ఒరిస్సా నుండి తీసుకు వెళ్ళి బెంగాల్‌కి పరిచయం చేశాడు. దాన్ని నోబిన్ చంద్రదాస్ మెరుగుపరిచి పాల విరుగుడుతో తయారుచేయటం ప్రారంభించాడు. అదే ఈనాటి ప్రసిద్ధ రసగుల్లా అయ్యింది. ఇది రసగుల్లా నేపథ్యం
విరిగిన పాలను ఒక మంచిగుడ్డలో లేదా సంచీలో వడగట్టి ద్రవాన్నంతా పిండేస్తారు. దాన్ని చన్నీళ్ళతో కడిగితే తెల్లని పాలగుజ్జు మిగులుతుంది. దానిలో తీపి కలిపి, ప్రత్యేకమైన మిషన్లమీద సన్నని బంతులుగా చేస్తారు. పలుచని పంచదార పాకంలో ఈ ఉండల్ని నిలవబెడతారు. పంచదార పాకంలో కాకుండా తియ్యని పాలలో నిలవ ఉంచితే అది రసమలాయ్అవుతుంది. రసమలాయిని బూరె అప్పచ్చులుగా చేసి తియ్యని పాలలో ఉంచుతారు.
పాల విరుగుడు అంటే పాలలోని ప్రొటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, కొవ్వు వీటి మిశ్రమం అని అర్థం. విరిగినప్పుడు ఈ ప్రొటీన్ పదార్థం ముద్దగా అయ్యేలా కొవ్వు సహకరిస్తుంది. ఒకవిధంగా అతి చిక్కని పాలతో సమానమైన గుణాలు దీనికి ఉంటాయని చెప్పవచ్చు. పాలు ఎలా విరిగాయన్నదే ఇక్కడ ప్రశ్న. కాయడం ఆలశ్యం అయితే విరిగిన పాలు చేదుగా ఉంటే  రసగుల్లాకు పనికిరావు. అందుకని రసగుల్లా తయారీకి ఆవుపాలను రుచిచెడకుండా ఉండేలా చేసే రసాయనాలతో విరగగొట్టే ప్రక్రియని చేస్తుంటారు.
విరగకొట్టడానికీ, నిలవ ఉంచడానికీ యాసిడ్ల వాడకం పరిమితంగా ఉన్నట్టయితే రసగుల్లాలు ఆరోగ్యానికి మంచివేనని చెప్పాలి. మనకన్నా యూరోపియన్లు గ్రీకు నాగరికత కన్నా ముందు నుండే పాల విరుగుడునీ, చీజ్‌ నీ వాడే అలవటు ఉండేది. గుజ్జుగా కాచిన గోక్షీరాల గురించి అమ్టే పాలకోవాల గురించి శ్రీనాథుడు ప్రస్తావించాడు. కానీ పాల విరుగుడు మనకు అలవాటైన విషయం కాదు. ఆ ఘనత బెంగాలీలదే!

రసాయనాలు కలిపి పాలను విరగ్గొట్టే ప్రక్రియకు బె౦గాలీలే ఆద్యులు. ఇవి మేలు చేస్తాయా కీడు చెస్తాయా అనే అంశం మీద వైద్య పరంగా ఎలాంటి విశ్లేషణా లేదు. రసగుల్లాలు, రసమలాయ్ లాంటి తీపి పదార్థాలకు బె౦గాలీలు అద్భుతమైన ప్రఖ్యాతి తీసుకు వచ్చారు. ప్రపంచ మార్కెట్లో స్వీట్ల తయారీలో శతాబ్దాల మన వెనకబాటుతనాన్ని బెంగాలీలు కేవలం ఒకటిన్నర శతాబ్దాల కాలంలోనే పూరించగలిగారు.