Thursday, 17 September 2015

గ-జ-మోక్షం డా. జి వి పూర్ణచందు,

గ-జ-మోక్షం

డా. జి వి పూర్ణచందు, 9440172642

“కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణముల పాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడి వాడు కలడో లేడో”

బండి నల్లేరు మీద పరిగెడుతున్నంత సేపూ ఉన్నాడో లేడో అనే మీమాంసే ఉండదు. తనబలహీనత బయటపడి, విసిగి వేసారినప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో అనే సందేహం తప్పకుండా పుడుతుంది.

తనకొచ్చే ప్రతీ కష్టానికీ ఎవరో ఇతరులు కారణం అనుకోవటం అనేది మానవ సహజ లక్షణం! దైవం అనుకూలించ లేదంటాడే గానీ, తన ప్రయత్నం లోపించిందని ఒప్పుకోడు. “మార్కులు తక్కువొచ్చా యేమిటని అడిగితే మిస్సుగారు సరిగా పాఠం చెప్పలేదనే అంటాడు విద్యార్ధి! ఇలా ఎవరి మీదకూ నెట్టేందుకు అవకాశం దొరకనప్పుడు దైవం అనుకూలించ లేదని చెప్పుకుంటాడు. అలా చెప్పుకోవటం చాలామందికి ఒక ‘తుత్తి’. అక్కడిడితో ఆగడు... దీనులకోసం కలడు, పరమయోగుల కోసం కలడు, అన్ని దిక్కుల్లోనూ కలడు...ఇలా కలడు కలడు అంటున్నారు, ఆ కలడనే వాడు నిజంగా కలడా... లేడా... అనడుగుతాడు. గజేంద్రుడికి కూడా ఇలానే సందేహం వచ్చింది. మొసలి పట్టుకునే సరికి గజేంద్రుడు విష్ణువుకు మొరపెట్టు కున్నాడు. ఆయన వచ్చి విడిపించలేదు. ఎంత మొత్తుకున్నా రాలేదు. దేవుడు ఉన్నాడా అనే సందేహం కలిగింది గజరాజుకి..
నిజానికి ఇది క్షీరసాగరానికిసంబంధించిన కథ. ఆ సముద్రంలో త్రికూటాచలం అనే పెద్ద కొండ ఉంది. దానికి బంగారం, వెండి, ఇనుము తాపడం చేసిన మూడు శిఖరా లున్నాయి. ఆ పర్వతం మీద ఏనుగుల మందలు ఎక్కువ. ఆ ఏనుగుల రాజు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. చాలా దూరం తిరిగాడు. దప్పిక అయ్యింది. నీటి కోసం చాలా చోట్ల వెతికాడు. చివరకు ఒక అద్భుత సరోవరం కనిపిస్తే. తన పరివారంతో సహా నీళ్ళలోకి దిగాడు. అప్పుడు ఆ గజరాజుకి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. తొండం నిండా నీళ్ళు గట్టిగా పీల్చాడు. ఆ నీటివేగంతో చేపలు, మొసళ్ళు, పీతలు అన్నీ తొండంలోకి వెళ్ళిపోయాయి. తొండాన్ని పైకెత్తి నీళ్ళను ఆకాశం మీదకి చిమ్మేసరికి తొండంలో వున్న చేపలన్నీ మీన రాశిలోకీ, పీతలన్నీ కర్కాటక రాశిలోకీ మొసళ్ళు మకర రా లోకీ వెళ్ళి పడ్డాయి. అలా ఏనుగులందరూ కలిసి సరోవరంలో నీళ్ళు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తు న్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఆ నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగుల అల్లరి మితిమీరిందని దానికి కోపం వచ్చింది. నీటి లోపల్నించి వెళ్ళి గజరాజు కాలు పట్టేసుకుంది. అదీ కథ.

“అకారణంగా నీళ్ళలోకి దిగాననే పశ్చాత్తాపం అప్పుడు కలిగింది గజరాజుకి! వెనకాల అంతమంది పరివారం ఉన్నారు. ఒక్కడూ సాయపడక పోవటం ఈ కథకు కొసమెరుపు. ‘రారూ రారూ ఎవ్వరూ నీకోసం’ అనే ఙ్ఞానోదయం అయ్యింది. దేవుడూ పట్టించుకోలేదు. అందుకని సందేహం వచ్చింది, కలడు కలండనెడివాడు కలడో లేడో...అని!

మనక్కూడా ఇలా చాలా ‘కలవు’. కలవు కలవనేవి కలవో లేవో తెలియనన్ని కలవు. ‘కలవాటి’లో ప్రజాస్వామ్యం ఒకటి. పరిపాలనలో స్వఛ్ఛత ఒకటి. అవినీతి నిర్మూలన ఒకటి. రుణాల మాఫీ ఒకటి. తెలుగు భాషాభివృద్ధి ఒకటి. ఒకటేమిటీ ఇలాంటి ‘కలవు’లు చాలా ‘కల’వు. వాటిని నమ్ముకున్న గజరాజులు ఋణమాఫీ అవుతుంది లెమ్మని ఉన్న నగలు తాకట్టు పెట్టి అవసరం లేకుండా అప్పులు చేసి ఉప్పు పప్పులకు ఖర్చు పెట్టేశారు. పది రెట్లు రేటున్న ఇళ్ళస్థలం దక్కు తుందని ఉన్న పొలాలను దారాదత్తం చేయటం లాంటి అల్లరి పనులన్నీ చేసేశారు. ఇప్పుడు బాకీల మొసళ్ళు పట్టుకుంటే కలడు కలండనెడి వాడు కలడో లేడో అని ఎదురు చూసే స్థితిలో పడ్డారు.

కలవాడికీ, ఇలాంటి ‘కలవు’లు కలవాడికీ తేడా ఉందన్న సంగతి కృష్ణయొడ్డు గజరాజులకు తెలీలేదు. తెల్సినా ప్రయోజనం లేదు. పెన్ను మరిచిపోయి పరిక్షల కొచ్చిన స్టూడెంట్ కుర్రాడి లాగా ఆయుధాలు లేకుండా విష్ణుమూర్తి వచ్చి ఈ గజాలకు సాయం చేయగలిగిందీ లేదు.

గజాల లెక్కలో భూమిని ఇచ్చి, అడుగుల్లెక్కల్లో బదులు తీసుకోవటమే అసలైన గజేంద్ర మోక్షం. ‘గ’ అంటే గఛ్ఛతి-రావటం. వస్తే ఓ అడుగు వస్తుంది. ‘జ’ అంటే జాయతే-పోవటం. ఓ గజం పోతుంది. రావటాలు పోవటాలకు మధ్య సంధి గ-జ- మోక్షం.

No comments:

Post a Comment