కాలానికి నిలిచే విమర్శ
డా. జి వి పూర్ణచందు, 9440172642
“ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధురీ/ చారు ప్రౌఢిమ జెప్పి పంప, విని మాత్సర్యంబు వాటించి, న
త్కీరుం డూరకె తప్పు పట్టెనట-యేదీ! లక్షణంబో యలం/కారంబో పదబంధమో, రసమొ? చక్కంజెప్పుడీ తప్పునన్”
తెలుగువారికి విమర్శను సహృదయంగా స్వీకరించే గుణం ముందునుండీ లేనట్టుంది. అందుకని, తెలుగు కావ్యాలలో పాత్రలు కూడా విమర్శనా అసహిష్ణుతనే ఎక్కువగా ప్రదర్శిస్తుంటాయి, సాక్షాత్తూ పరమేశ్వరుడైనా అంతే!
పూటగడవని ఓ పూజారి మీద జాలిపడి శివుడు ఓ పద్యం వ్రాసిచ్చి, “దీన్ని రాజకొలువులో చదివి వినిపించు. రాజు గారు మెచ్చుకొని ఆదరిస్తా”రని పంపించాడు. ఆ కొలువులో నత్కీరుడు కూడా ఉన్నాడు. ఆయన లేచి, “కవితా పద్ధతులకీ కవిసమయాలకీ నువు చెప్పిన కవిత్వం ఒప్పదు. కవిత్వం ఇలా వ్రాయకూడదు” అన్నాడు. పూజారి నిరాశగా వెళ్ళి శివుడితో ‘భలే కవిత్వం చెప్పావయ్యా” అంటూ బావురుమన్నాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. ఆ పూజారిని వెంటబెట్టుకుని, రాజకొలువుకు వెళ్ళిన సందర్భంలోది ధూర్జటి చెప్పిన ఈ పద్యం.
“ఈ రాజుమీద నేనో కవిత చెప్పి పంపాను. నత్కీరుడనేవాడు ఎవడో మాత్సర్యంతో నా అందమైన పద్యాన్ని తప్పు బట్టాడట. ఏదీ నాముందు చెప్పమనండి. నా కవితలో చందో వ్యాకరణ, అలంకార దోషాలున్నాయా? పదబంధాలు సరిగా లేవా? రసభంగం అయ్యిందా?” అంటూ నిలేసి అడిగాడు.
కుందుర్తి ఎప్పుడూ అనేవాడు- “రచయితలు పాఠకుడికన్నా ఒకమెట్టు పైన ఉన్నాననుకునే రచనలు చేయా”లని! విమర్శకుడు కూడా అంతే! రచయితకన్నా ఒక మెట్టు పైనే ఉన్నాననుకుని విమర్శించాలి. ఈ విమర్శ శ్రుతి మీరిన ఘటనలూ ఉన్నాయి. అంతమాత్రాన విమర్శకు గురైన వాళ్ళంతా ఇలా సభల్లో హుంకరించలేదు. రచయిత విమర్శను గౌరవించాలి. విమర్శకుడు కూడా తన కళ్ళతో కాకుండా వేరే సిద్ధాంతాల కళ్లజోళ్ళలోంచి చూస్తూ రచయితల మీద ఒంటికాలుతో లేవటమూ ధర్మం కాదు. ఒక రచన మంచీ చెడుల్ని ఫలానా విమర్శకుడి కన్నా కాలం ఎక్కువగా నిగ్గు తేలుస్తుంది. కాలానికి నిలిచిన విమర్శలు ఎన్ని ఉన్నాయన్నదిప్రశ్న.
ఇంతకీ నత్కీరుడు పట్టిన తప్పు విలువైనదే! “సిందురరాజ గమనా థమ్మిల్ల బంధంబు సహజ గంధంబు” సిందురం అంటే ఏనుగు. సిందురరాజ గమనం అంటే గజగమనం కలిగిన ఆమె ‘థమ్మిల్లబంధం’ అంటే జుట్టుముడి సహజ సువాసనతో విలసిల్లుతోందని దాని భావం. సాంబ్రాణీ లాంటి సుగంధ ధూపాలు గానీ, సంపెంగ లాంటి సువాసనలున్న తైలాలు గానీ తలకు పట్టించక పోతే జుట్టుకు సహజగంథం ఎక్కడిదనేది నత్కీరుడి ఆక్షేపణ. దాంతో శివుడు నాలుక కరచు కున్నాడు. ‘మా ఆవిడ పార్వతి పొడవైన జుత్తుకి సహజ గంధమే ఉంది’ అన్నాడు.
“మీ ఆవిడ సంగతి మా కెందుకయ్యా! లోకంలో ఎవరి ఆవిడ జుత్తుకీ ఇది వర్తించదు. లూలా మాటలు చెప్పకు పొ’’ మ్మన్నాడు నత్కీరుడు. శివుడి అహంకారం దెబ్బతింది. తన నిజ రూపం చూపించాడు. అయినా నత్కీరుడు పట్టు విడవ కుండా నుదుటి కన్నే కాదు, తలచుట్టూ కళ్ళున్నా సరే, వాటిని తెరిచినా సరే, నీ తప్పు ఒప్పవదని ఎదురు తిరిగాడు. విమర్శకుడికి అంత అహంకారం పనికి రాదని శివుడు నత్కీరుడికి కుష్టువ్యాధి వచ్చేలా శపిస్తాడు.
తనకు తెలియనిది లోకంలో లేదనే అహంకారం విమర్శకుడికి రాకూడనిది. "అది అసంబవం కాదు, మా ఆవిడే సాక్ష్యం" అని రచయిత మొత్తుకున్నా విమర్శకుడు వినిపించుకోకపోవటమూ తప్పే కదా!
ఈ కథలో సార్వజనీనమైన ఒక లోకనీతి ఉంది- రచయిత ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాయాలి, విమర్శకుడు నోరు దగ్గర పెట్టుకుని విమర్శించాలని! లోకంలో రచయితలంతా ఇలా శపిస్తే విమర్శకులంతా డెర్మటాలజీ క్లినిక్కుల చుట్టూ తిరగాల్సి రావటం, విమర్శకుడి దాడితో రచయితకి హార్ట్ ఎటాక్ రావటం రెండూ సమంజసం కాదు.
తెలుగులో విమర్శకీ, సమీక్షకీ, పుస్తక పరిచయానికీ, పుస్తకాల ముందుమాటలకీ తేడా లేని ఒక విచిత్ర పరిస్థితి నడుస్తోంది. చాలా పత్రికలు సమీక్ష పేరుతో పుస్తక పరిచయాలే వేస్తున్నాయి. సంచలనాల పేరిట ‘తిట్టటమే విమర్శ’ అనే ఒక అభిప్రాయం కొందరిలో బలంగా ఉంది. తమ వర్గానికి చెందిన వారిని మహాకవులుగా చిత్రించటమే ‘వర్గ దృక్పథం’గా చెలామణి అవుతోంది. దీనికి ప్రాంతీయత కూడా తోడవుతోంది.
రాసినవాడు శివుడూ, విమర్శించిన వాడు నత్కీరుడూ కాని స్థితిలో ఒక్కో రచన, ఒక్కో విమర్శ చదువుతుంటే కుష్టు రోగి పుళ్ళే గుర్తుకు వస్తుంటాయి.
సాహిత్యాన్ని ఆరోగ్యదాయకం చేసే విమర్శ కావాలి. లోకంలో కుష్టును కడిగే రచనలు కావాలి.
No comments:
Post a Comment