Thursday 16 April 2015

తినే బంగారం :: డా. జి వి పూర్ణచందు

తినే బంగారం
డా. జి వి పూర్ణచందు
బంగారు చెంచానోట్లో పెట్టుకుని పుట్టాడని అదృష్టవంతుల గురించి చెప్పుకుంటూ ఉంటాం బంగారు చెంచా నోట్లో పెట్టుకుంటే ఏమౌతుంది...? బంగారానికి స్పర్సామాత్రంగానే పనిచేసే గుణం ఉంది. మెళ్ళో గొలుసులు అలంకారం కోసం మాత్రమే కాదు. బంగారం స్పర్శతో కలిగే ఆరోగ్యం కోసం కూడా! తినే బంగారాన్ని గురించి చెప్పుకోబోయే ముందు బంగారంస్పర్శ ప్రాముఖ్యం గురించి చెప్పుకోవాలి. బంగారం కంచంలో భోజనం చేయటం, బంగారు గిన్నెలో పాయసం తాగటం ఆ స్వర్ణస్పర్శా భాగ్యం పొందటానికే! మధ్య తరగతి మందభాగ్యత వలన బంగారు పువ్వునో, చుక్కనో పెట్టించి వెండి కంచాలు చేయించుకుంటారు, కుడిచేతి వేళ్ళకు రాళ్ళు లేని బంగారు ఉంగరం పెత్తుకొని భోజనం చేసినా స్పర్శా భాగ్యం దక్కుతుంది.
తగిలితే చాలు ఇంత మేలు చేసే ఈ బంగారాన్ని తినగలిగితే ఇంకెంత గొప్ప మేలు చేస్తుందో కదా... తినే బంగారం గురించి మనం చెప్పుకోవాలసినవి చాలా ఉన్నాయి.తినే బంగారం ఎలా తయారవుతుంది, దాన్ని ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నాళ్ళూ తినాలి... ఇవన్నీ బంగరం లాంటి ప్రశ్నలే!
బంగారు రేకులు
తినేందుకు వీలైన బంగారం పలుచని రేకులా ఉంటుంది. ఈ రేకుల్ని 5,000 ఏళ్ళ క్రితమే ఈజిప్షియన్లు తయారు చేయటం ప్రారంభించారని చరిత్ర చెప్తోంది. 2,000యేళ్ళక్రితం మనవాళ్ళు బంగారు రేకులతో స్వర్ణభస్మం తయారుచేసి వైద్యానికి ఉపయోగించటం నేర్చారు. బంగారాన్ని తయారు చేసే (ఆల్కెమీ) క్రమంలో పాదరసం, వంగం, నాగం అభ్రకం లాంటి లోహాల వైద్య గుణాలు తెలుసుకున్నారు.  అలా తెలుగు నేలమీద రసశాస్త్రం పుట్టింది. పాదరసం కలిగిన రసౌషధాలను తెలుగు మందులు అంటారందుకే! సిద్ధ నాగార్జునుడు ఈ శాస్త్ర ప్రవక్త. తెలుగువాళ్ళు లోహాలమీద మొదటి నుండీ విశేష పరిశోధనలు చేశారు. వంటింట్లో ఆవిరిమీడ కుడుములు వండినట్టు, నిప్పులమీద అప్పడాలు కాల్చినట్టు రకరకాలైన వంటపద్ధతుల్లో లోహాలను వండి ఔషధాలు తయారు చేశారు. అందుకని రసౌషధాలను వంటౌషధాలంటారు. ముఖ్యంగా ‘తినేబంగారం’ మీద తెలుగు వారికి అనుభవం ఎక్కువ.
మొదట్లో తిరగలు రాళ్ళమధ్య బంగారపు బిళ్లను ఉంఛి రేకులాగా సాగ దీసేవాళ్లట. తర్వాతి కాలంలో మందపాటి తోలు అట్టల మధ్య బంగారపు బిళ్ళనుంచి, గట్టి చెక్కసుత్తితో కొట్టి ఆకుపలచని రేకులాగా సాగదీసే పద్ధతి మొదలయ్యింది. ప్రపంచం అంతా ఇదే పద్ధతిలోనే స్వర్ణపత్రాలను తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో యంత్రసాయాలు వచ్చినా బంగారపు రేకు తయారీ కుటీర పరిశ్రమగానే సాగుతోంది. చిన్న విషయాన్ని కొట్టీ కొట్టీ సాగదీస్తున్నాడనే మాట బంగారాన్ని సాగదీయటాన్ని బట్టే వచ్చింది.
బంగారం రేకు తయారు చేయటానికి స్వఛ్ఛమైన బంగారం కావాలి. 23.5 కేరెట్ల బంగారాన్ని సాగదీత కోసం ఎంచు కుంటారట. ఆ 0.5 కేరెట్టు వెండిని గానీ, రాగిని గానీ దృఢత్వం కోసం కలుపుతారు. ఎక్కువ కలిపితే కేరెట్లు తగ్గిన బంగారం వన్నె కోల్పోతుంది. నిప్పుల మీద కాల్చటమే బంగారానికి శుద్ధి. కాల్చిన బంగారాన్ని మేలిమి అంటారు. ఇది చక్కని తెలుగు మాట. మేలిమి బంగారం అనటం అలవాటైంది. మేలిమి బంగారాన్ని సాగకొట్టి అంగుళం అంత సన్నని ముక్కలుగానో, అటుకులంత చిన్న ముక్కలుగానో కత్తిరించి లిట్మస్ పేపర్ల మధ్యన ఉంచి భద్రపరుస్తారు. పెద్దలకు అంగుళం పొడవున్న సన్న ముక్క, చంటి పిల్లలకు అటుకంత చిన్నముక్క సరిపోతాయి.
కంచంలో వేడి వేడి అన్నం కొద్దిగా వడ్డించి, దానిమీద ఈ బంగారం ముక్కని  ఉంచితే ఆ వేడికి బంగారపు రేకు పేరుకున్న నెయ్యిలా కరిగిపోతుంది.  ఆ అన్నాని నెయ్యి వేసుకుని తింటారు. బంగారం అన్నం తినే పద్ధతి ఇది. చంటి బిడ్డలకు మాత్రం తేనె, కొద్దిగా నెయ్యి కలిపి రంగరించి వేలికొచ్చినంత భాగాన్ని నాలుక మీద రాసి నాకించాలి. ఇదే స్వర్ణప్రాశనం లేదా స్వర్ణలేహ్యనం  అనే ప్రక్రియ.
కాశ్యపసంహిత అనే ప్రాచీన ఆయుర్వేద వైద్య గ్రంథంలో దీని గురించి చాలా విపులమైన చర్చ ఉంది. “ఆ మథ్యా మధు సర్పిభ్యం లేహ్యతే కనకం శిశుః సువర్ణప్రాశన హి ఏతత్ మేథాగ్ని బలవర్థనం ఆయుష్యం  మంగళం పుణ్యం వృష్యం గ్రహాపకం” అని బంగారపు రేకుని తినిపిస్తే కలిగే ప్రయోజనాలను వివరించిందీ గ్రంథం.  దీనివల్ల పిల్లల IQ , ఙ్ఞాపకశక్తి, ఏకసంథాగ్రాహ్యత పెరుగుతాయి. పోలియో లాంటి జబ్బులురావు. జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరం బలసంపన్నం అవుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. మంగళకరంగా, పుణ్యప్రదంగా ఉంటుంది. గ్రహదోషాల పీడ ఉండదు. పుష్యమీ నక్షత్రం రోజున బంగారంలో వైద్య గుణాలు వృద్ధిలో ఉంటాయి కాబట్టి, ఆ రోజున విరేచనాలు, జ్వరం లేకుందా చూసి ప్రొద్దున పూట స్వర్ణప్రాశన చేయాలని ఈ గ్రంథం సూచించింది.
బిడ్డ పుట్టినప్పటినుండీ వరుసగా చేసే జాతకర్మల్లో ఈ స్వర్ణప్రాశన కూడా ఒకటి.  వాగ్భటుడు బిడ్డ పుట్టిన నాలుగో రోజే బంగారపు రేకి తినిపించేయమన్నాడు. మూడో నెలలోనో ఆరోనెలలోనో చేస్తే మంఛిదని మరికొందరి అణిప్రాయం. చిన్న బంగారపు రేకుముక్కని చాలా స్వల్పంగా నెయ్యీ, దానికన్నా కొద్దిగా ఎక్కువగా తేనె వేసి రంగరించి వేలికొచ్చినంత మోతాదులో బిడ్దచేత నాకించటమే స్వర్ణప్రాశన! అదేపనిగా నాకించితే అన్నప్రాశనరోజునే ఆవకాయ పెట్టినట్టౌతుంది. పదహారో ఏడు వచ్చేవరకూ పిల్లలకు  అప్పుడప్పుడు బంగారపు రేకు తినిపించవచ్చని శాస్త్రం చెప్తోంది. బంగారపు రేకుకు బదులుగా స్వర్ణభస్మాన్ని తేనె నెయ్యిలతో తినిపిచటాన్ని స్వర్ణబిందుప్రాశన అంటారు. స్వర్ణభస్మం తయారీక్కూడా బంగారపు రేకు అవసరం అవుతుంది. కాబట్టి రేకుని తినిపించ టానికి ప్రాథాన్యత నివ్వాఅలని మరికొందరు చెప్తారు.
ఆధునిక వైద్య శాస్త్రం బంగారాన్ని biologically inert metal”అంటుంది. ఆయుర్వేద శాస్త్రం ఇది స్పర్శామాత్రంగా, దీర్ఘకాలం పాటు శరీరం మీద పనిచేస్తుందని చెప్తోంది. బంగారపు రేకుని గానీ స్వర్ణభస్మాన్ని గానీ తీసుకున్న 24 గంటల లోపు జీర్ణకోశం లోంచి పూర్తిగా బయటకు విసర్జించ బడుతుందని రెండు వైద్య శాస్త్రాలూ చెప్తున్నాయి. ఒక రోజుపాటు అది మన శరీరంలో ఉన్నంత మాత్రానికే అది జీవితానికి సరిపడా శక్తి నిస్తుందన్నమాట.
ఇది తెలిసిన తరువాత బంగారు రేకుల్ని తినే అలవాటు ఒక ధనిక సంస్కృతిగా మారిపోయింది. ప్రపంచంలో  అబూదాబీ స్వర్ణపత్రాల భక్షణలో అగ్రగామిట. ఎమిరేట్స్ ప్యాలేశ్ హోటల్ కొచ్చిన అతిథులకు 2008 ఏడాది కాలంలో 5,00,000 బంగారు రేకులు వడ్డించినట్టు ఒక సర్వే చెప్తోంది. తినే బంగారం కథ ఇది. కొన్నాళ్లకు బంగారం ధర స్థిరీకరించబడితే మనం కూడా బంగారు రేకుల్ని పూతరేకుల్లా తినవచ్చు.
విదేశాల్లో ప్రస్తుతం బంగారు రేకు అంటించిన స్వీట్లూ, చాక్‘లేట్లూ, క్యాండీలూ దొరుకుతున్నాయి. బంగారపు రేకులు కరిగించి కలిపిన మద్యం కూడా దొరుకుతుంది.
ఇదంతా చూసి, స్వీట్లకూ కిళ్ళీలకూ పలుచని రేకులు చుట్టి అమ్ముతున్నారు, ఇది వెండి రేకు అనే భ్రమలో మనం వాటిని తింటున్నాం. కానీ అది నికెల్ సీసం లాంటి లోహాల రేకు కావచ్చు. దానివలన లెడ్ పాయిజనింగ్ జరిగి కిడ్నీ, లివరు, పళ్ళూ కళ్ళూ దెబ్బతింటాయని హెచ్చరించాల్సిన అవసరం ఉంది.


No comments:

Post a Comment