పదేళ్ళ క్రితమే ఊహించిన రాజధాని అమరావతి -డా. జి వి పూర్ణచందు
కృష్ణా తీరంలోని ప్రాచీన రాజధాని నగరాల గురించి 2005లో మొదలు పెట్టి దాదాపు నలబై వారాలపాటు రేడియో ప్రసంగాలు చేశాను. 2006లో “అలనాటి పట్టణాలు పేరుతో పుస్తక రూపంలో ఈ వ్యాసాలు వచ్చాయి. అందులో అమరావతి గురించి వ్రాస్తూ, “భవిష్యత్తులో ఇది మళ్ళీ తెలుగువారి రాజధాని నగరం అయినా ఆశ్చర్యం లేదనీ, ఆ క్షేత్ర మహాత్మ్యం అలాంటిదనీ వ్రాశాను. ఒకనాటికి అమరావతికి ప్రాధాన్యత వస్తుందనే నమ్మకం గట్టిగా ఉండేది మా జీవిత కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి అవతరించ నుండటం ఆనందంగా ఉంది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏ వూరును పలకరించినా తట్టలకొద్దీ చారిత్రక అంశాలను తవ్వి పోస్తుందనీ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన, మహత్తు కలిగిన క్షేత్రాలనూ, ఆ చరిత్రనూ మనం అలక్ష్యం చేయకూడదని చరిత్ర ఒక పాఠం నేర్పుతోంది. బౌద్ధం,జైనం, శైవాలకు ఆనాటి అమరావతి నెలవుగా ఉండేది. శాతవాహనులతో ప్రారంభించి బ్రిటిషర్ల వరకూ ప్రతి రాజవంశమూ అమరావతి కేంద్రంగా పాలించింది. కాకతీయ ప్రతాప రుద్రుడు చాలా కాలం ఇక్కడే ఉన్నాడు. ఆయన కాలంలో జైనులను మోసపూరితంగా కాశీ పండితులు ఓడించటం, ఓడిన జైనుల్ని గానుగలో వేసి ఆడించటం లాంటి కథలు ఇక్కడే జరిగాయని గుంటూరుజిల్లా కైఫీయత్తుల్లో ఉంది. బ్రిటిషర్ల ప్రోద్బలంతో ౩౦౦ మంది చెంచు జాతి ఆదివాశీలను కుట్రపూరితంగా చంపిన సంఘటన కూడా అమరాతికి సంబంధించిన కథే! వీటిని అలా ఉంచితే ఇది బుద్ధుడు స్వయంగా ఇక్కడకు వచ్చి, కాలచక్ర తంత్రాన్ని నేర్పించాడని తాను నమ్ముతున్నట్టు ప్రకటించిన దలైలామా అమరావతి నగర ప్రశస్తిని లోకానికి చాటాడు.
రెండు శతాబ్దాల క్రితం, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారికి అక్కడ తాను త్రవ్విస్తున్న మట్టి దిబ్బ అడుగున తొలి బౌద్ధ చైత్యారామాలలో ఒకటైన బౌద్ధ స్తూపం ఉందని, దాన్ని ధ్వంసం చేస్తున్నాననే గ్రహింపు లేదు. రాజధాని నిర్మించటమే ఆయన ధ్యేయం. ఇప్పుడుకూడా అదే తప్పు జరక్కూడదు. రాజా వారి కాలాని కన్నా చారిత్రక అవగాహన ఎక్కువగా ఉన్న యుగం ఇది. రాజధాని నిర్మాణ ఆత్రుతలో మట్టితో కప్పబడిన చరిత్రని అప్పటిలాగా తవ్వించేస్తే,విలువైన చారిత్రక వారసత్వ సంపదను నష్టపోయే ప్రమాదం ఉంది. భారతీయ పురావస్తు పరిశోధనల శాఖ(A.S.I.)వారు ముందుగా మేల్కొని చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. జరగకూడని నష్టం జరిగాక అయ్యో అనుకున్నా ప్రయోజనం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అమరావతి అని ఆ ఊరికి వెంకటాద్రి నాయుడు నామకరణం చేయటం గురించి ఘనంగా చెప్పారు. రాజావారి స్ఫూర్తిని మన ముఖ్యమంత్రిగారు పొందినట్టు కనిపిస్తోంది. చారిత్రక స్థలాల పరిరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటే ఇది ఆహ్వానించదగిన అంశమే!
అమరావతి బౌద్ధ స్తూపంలోని మొత్తం ఫలకాలలో పోయినన్ని పోగా ఆనాటి బ్రిటిష్ అధికారులు తస్కరించినన్ని తస్కరించగా, మిగిలినవి కొన్ని ఇప్పటి అమరావతి మ్యూజియంలోనూ, మద్రాస్ మ్యూజియంలోనూ ఉన్నాయి. ఎక్కువ భాగం లండన్ నగరంలోని బ్రిటిష్ మ్యూజియంలో ఒక ప్రత్యేక అంతస్తులో చలువమందిరంలో భద్రంగా ఉన్నాయి. గుడివాడ బౌద్ధ స్తూపంలో దొరికిన బుద్ధుని అస్థికల భరిణలు మూడు కూడా అక్కడే ఉన్నాయి. శ్రీ బుద్ధప్రసాద్ గారితోనూ శాసనమండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణిగారితోనూ కలిసి ఈ బ్రిటిష్ మ్యూజియంను సందర్శించే భాగ్యం నాకు కలిగింది.
No comments:
Post a Comment