Thursday, 16 April 2015

ప్రేమలో పడేసే భాష
“తెమ్ము బంగారు కుండ జలమ్ము లనుచు( / దెమ్ము లతకూన మంచి సుమమ్ము లనుచు(
దెమ్ము బాగైన కొమ్మ ఫలమ్ములనుచు / మించుబోడిని నేరుపు మించ( బలుకు” అని చేమకూర వేంకట కవి విజయవిలాసంలో రెండర్థాల పద్యం ఒకటి వ్రాశాడు. బంగారు కుండలో నీళ్ళు పట్టుకురా! లేతతీగ కున్నమంచిపువ్వులు పట్టుకురా! బాగైనకొమ్మకు కాచిన పళ్ళు పట్టుకురా!” అని, కపట సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడు సుభద్రని ప్రేమలోకి దింపేందుకు వాడిన రెండర్థాల భాష పద్యంలో కనిపిస్తుంది. “బంగారు కుండా! నీళ్ళు పట్టుకురా! లేత తీగలా నాజూకుగా ఉన్నదానా! మంచి పూలు పట్రా! బాగైన కొమ్మా(అందమైన అమ్మాయీ)! పళ్ళు పట్టుకురా!” అనేది ఇంకో అర్థం. బంగారు కుండల్ని కుదురైన స్తనాలతోనూ, పూలను మేను మార్దవంతోనూ, పళ్లను ప్రేమలోని తియ్యదనంతోనూ పోలుస్తున్నాడు అర్జునుడు.
కవులు ఇలా రాస్తారు, సినిమా వాళ్ళు కూడా ఇలానే తీస్తారు గానీ, ఇంతమాత్రానికే ఆడపిల్లలు ఫ్లాట్ అయిపోతారని మగాళ్లు ఊహించటం అన్యాయం. స్త్రీలప్రేమ నీటి బుడగలాంటిదనీ అదిపైపై మెరుగులుచూసే గానీ, అందులో చెప్పుకోదగిన లోతేమీ ఉండదనే భావన ఎక్కువ మందిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 16వ శతాబ్ది నాటి చేమకూర వెంకట కవి గారి కాలానికీ, నేటి సినిమాల కాలానికీ ఈ విధమైన మగభావనలో ప్[ఎద్ద తేడా ఏమీ లేదు.
కానీ, ఒక వాస్తవాన్ని మనం మరిచిపోకూడదు. ప్రేమ పెళ్ళిళ్ళు కానీండి, పెద్దలు చేసిన పెళ్ళిళ్లు కానీండి, మూణ్ణాళ్ళ ముచ్చటగా ముగిసిపోతున్న సందర్భాలు నానాటికీ పెరగటానికి దంపతుల మధ్య ఉత్త ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ కుదరక పోవటం ఒక ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రేమ బలంగా ఉన్నప్పుడు చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది అది లేనప్పుడు రామా అంటే ఏదోలా వినిపించినట్టే అవుతుంది. ‘ప్రేమలో గాఢతతగ్గినప్పుడు అది దేవదాసు ప్రేమలా అస్థిరంగానూ, బలహీనంగానూ, పిరికిగానూ ఉంటుంది.
రతి కార్యానికి ముందు బలమైన ఉత్తేజం కలగటానికిఉపరతిఎలా ఉపయోగ పడుతుందో, బలమైన ప్రేమను పొందటానికిఉపప్రేమవాచకాలు అలా ఉపయోగ పడతాయి. రెండర్థాల సంభాషణ అలాంటి ఒకఉపయోగం. ప్రేమ బలంగా ఉండాలంటేఉపప్రేమఅవసరంసినిమాల్లో చూపించినట్టు  ‘సిటీబస్సు ప్రేమ’ (బస్సులో చూడంగానే ప్రేమించేయటం, స్విజ్జర్లాండు మంచుకొండల్లో డ్యూయెట్టు పాడుకోవటం) లాంటి ప్రేమలు పెళ్ళిదాకా వెళ్ళేవి తక్కువ. వెళ్ళినా ప్రథమ వైవాహిక వార్షికోత్సవం జరుపుకున్నవి కూడా తక్కువే! బలమైన ప్రేమను పొంది, శాశ్వతమైన దాంపత్య బంధాన్ని పెంచుకోగలగాలి! పెద్దలు చేసిన పెళ్ళిళ్లక్కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది
సుభద్రలో తనపైన ప్రేమని రెచ్చగొట్టి, దాన్ని భద్రం చేసుకోవటానికి అర్జునుడు ఎన్ని కష్టాలు పడ్డాడో కావ్యం చదివితే తెలుస్తుంది. ప్రతీదీ సులభమ్ముగా సాధ్యపదదులెమ్ము-నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ముఅని గాలిబ్  గీతాన్ని దాశరథి గారు అనువదించి వ్రాసింది ప్రేమకు కూడా వర్తిస్తుంది. ప్రేమలో పడేయటానికి, ప్రేమలో పడటానిక్కూడా ప్రేమభాష తెలిసి ఉండాలి. నమ్మకాన్ని పెంచటం, నమ్మకాన్ని నిలబెట్టటం, నమ్మగలగటం అనేవి భాషలో ముఖ్యాంశాలు. అవి సుస్థిరంగా ఉండాలి. విడాకుల బారిన పడకుండా ఉండాలంటే ప్రేమికులు నేర్వాల్సింది ప్రేమభాషనే!


No comments:

Post a Comment