Tuesday 1 July 2014

ఓ ముక్కుపద్యం కథ :: డా. జి వి. పూర్ణచందు

29 జూలై 2014, విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా `పద్యానుభవం' శీర్షికలో వచ్చిన రచన ఇది

ఓ ముక్కుపద్యం కథ
డా. జి వి. పూర్ణచందు
“నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకన్ దపంబంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనః సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్”
          ఇది రామరాజభూషణుడి వసుచరిత్రలో కనిపించే ఒక చమత్కార భరిత పద్యం.
రామరాజభూషణుడి అసలు పేరు భట్టుమూర్తి. కృష్ణదేవరాయల కాలానికి అతను చాలా చిన్నవాడు. క్రీ.శ. 1510-1585 మధ్యకాలంలో జీవించి ఉంటాడని భావిస్తున్నారు. ఇతను కృష్ణదేవరాయలి అల్లుడు అళియరామరాజు ఆస్థానంలో కవి అయి ఉంటాడనీ, భువనవిజయం అష్టదిగ్గజాలలో ఒకడు కాకపోవచ్చనీ పరిశోధకుల భావన! అతను కూడా రాజకవే!
సారంగం అంటే తుమ్మెద. అది నానా సూన వితాన వాసనల్ని అంటే రకరకాల పూల సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆ తుమ్మెద స్పర్శతో పువ్వుపడుచు పులకించిపోవటం అనేది గాఢాలింగనం వలన కలిగే పులకింతతో సమానంగా భావించటం ఒక చక్కని ఊహ. ఈ ఊహతోనే, చలం కూడా తుమ్మెద స్పర్శతో పులకించే పువ్వు మీద గొప్ప కథ రాశారు. అన్ని పువ్వుల మీదా వాలే గండుతుమ్మెద తన దగ్గరకు రాదేమిటని సంపెంగ పువ్వుకు బాధ కలిగింది. వాటిలాగే తనూ సుగంధాన్నిఇస్తున్నప్పటికీ  తనకు లేనిదేవిటో మిగిలిన వాటికి ఉన్నదేవిటో... గండుతుమ్మెద తనని ఒల్లనంటుందేవిటో... ఆ గంధఫలి(సంపెంగ)కు అర్ధం కాలేదు. దాంతో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది:
 బల్కాకన్ దపంబంది- మండు వేసవి ఎండలో కూచుని దేవుడికోసం తపస్సు చేసింది. దేవుడు వచ్చి కనిపించాడు. కోరిన వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావంతో...
యోషా నాసాకృతి దాల్చి... అందమైన ఆడపిల్ల కొనదేలిన ముక్కు లాంటి ఆకారాన్ని అది పొందింది.
సర్వ సుమనః సౌరభ్య సంవాసియై- సృష్టిలోని పువ్వులన్నింటి గుభాళింపుకు అది నెలవయ్యింది! అప్పటివరకూ ఎలాంటి ఆకర్షణా లేక ఎవ్వరి మెప్పూ పొందక అల్లాడిపోయిన ఆ సంపెంగకు రూపలావణ్య సుగంధాలు వరప్రసాదాలయ్యాయి.
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్... ముక్కు ఆకారంలోని ఆ సంపెంగకు ఇర్వంకలా -రెండు వైపులా-మధుకరీ పుంజాలు- గండు తుమ్మెదల బారులు, పూనెన్- పొందటం, ప్రేక్షణ- రోజూ కనిపించే దృశ్యం అయ్యిందట. ఇదీ సంపెంగపూవు పట్టుదలతో సాధించిన ఒక విజయం.
వేసవిలో సంపెంగలు పూయవు. అందుకని వేసవిలో తపస్సు చేసిందనటం ఒక చమత్కారం. తేనెటీగలు వాసనకోసం కాక తేనె కోసం పువ్వులమీద వాల్తాయి. అందుకని కవులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. గండు తుమ్మెదలు మాత్రం ఝుమ్మని నాదం చేస్తూ కాలేజీ కుర్రాళ్ళ మాదిరి పూలచుట్టూ తిరుగుతుంటాయనటం ఇంకో చమత్కారం. కుర్రాళ్ళు సహజంగా కొంచెం నదురుగా కనిపించే అమ్మాయిల చుట్టూ ఎక్కువ తిరుగుతారు. అందుకని సంపెంగ పువ్వు తనకు సువాసన కన్నా చక్కని రూపాన్ని ఎక్కువ కోరుకున్నదనటం మరో చమత్కారం. చివరికి అది అందమైన ఆడపిల్ల కొనదేలిన ముక్కులాంటి రూపాన్ని వరంగా పొందటం, తుమ్మెదల బారు ఒక నిత్య కృత్యం కావటం ఇదంతా గమ్మత్తయిన ఊహ!
తనకు ఉన్నదానితో సంతృప్తి చెందటాన్ని బలమైన కెరీరు కోరుకునే వాళ్ళు సరయిన సిద్ధాంతంగా అంగీకరించరు. ఉన్నదేదో చాలనుకుంటే ఉన్నత శిఖరాలెక్కేవాళ్ళెవరుంటారు...? ఈ కథలో సంపెంగలాగా ఎవరికివాళ్ళు తపస్సు(కృషి) చేసి ఎవరికీ దక్కనిది తనకు మాత్రమే దక్కేలాగా శ్రమించాల్సి ఉంటుందనేది కవి సందేశం. అబ్రహాం లింకన్ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయాడు. చిట్టచివరి సారిగా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించాడు. కాబట్టి పట్టుదల వీడకూడదనే నీతి ఇందులో కనిపిస్తుంది.
లోకం చుట్టు తిరిగితే కాళ్ళరుగుతాయి గానీ ఫలితం ఉండదు. లోకాన్ని తన చుట్టూ తిప్పుకొనే చాతుర్యం కావాలి. అది అదృష్టం కొద్దీ దక్కదు. కృషీ, దీక్షా, పట్టుదలలు కావాలి.
వసుచరిత్రలోని ఈ పద్యాన్ని ‘ముక్కుపద్యం’ అని గమ్మత్తుగా పిలుస్తారు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోమని చెప్పే ముఖ్య పద్యం ఇది!




No comments:

Post a Comment