Wednesday, 17 May 2017

‘తెలుగు భాష – కొత్త రూపు:: మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’:: జాతీయ సదస్సు

ఆహ్వానం:
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ
కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో నిర్వహిస్తున్న
‘తెలుగు భాష – కొత్త రూపు:: మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’
జాతీయ సదస్సు
04-06-2017 ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకూ
విజయవాడ గాంధీనగరంలోని హోటల్ ఐలాపురంలో
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి మూడేళ్ళైన సందర్భంగా ‘తెలుగు భాష – కొత్త రూపు :: మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు” అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ జాతీయ సదస్సు నిర్వహిస్తోంది.
04-06-2017 ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకూ విజయవాడ హోటల్ ఐలాపురంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో జరిగే ఈ సమ్మేళనంలో తప్పక పాల్గొన వల్సిందిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం.
భాషా సంస్కృతుల పరంగా కొందరు నిపుణుల పత్ర సమర్పణలతో పాటు భాషావేత్తలు, సాంకేతిక నిపుణులు, భాషాభిమానులైన ప్రముఖుల అభిప్రాయాలను కూడా ఆహ్వానిస్తున్నాం.
1. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషలో తీసుకురావలసిన మార్పులు
2. నూతన సాంకేతికతా ప్రయోజనాలను ఇంగ్లీషుతో సమానంగా తెలుగు భాషకు కూడా అందించేందుకు చేయవలసిన కృషి
3. పాలనా భాషగా తెలుగు అమలులో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారం
4. తెలుగు మాధ్యమ విద్యాలయాల పరిరక్షణకు, పరిపుష్టికి చేపట్టవలసిన చర్యలు
 5. ప్రాంతీయ పదాలుగా ముద్రపడి, నిరాదరణకు గురౌతున్న మాండలిక పదాలను తెలుగు జాతీయ పదాలుగా గుర్తింపు తెచ్చే విషయమై మీ సూచనలు
6. వ్యావహారిక భాష-వ్యాకరణాంశాలు
7. సర్వ సమగ్ర తెలుగు నిఘంటు నిర్మాణం
8. కొత్త తెలుగు నుడి ప్రయోగాలు-పదనిథి
9. యంత్రానువాద ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారం
10. తెలుగు బోధనా విధానం నవీకరణ విషయమై మీ సూచనలు
11. పాఠ్యపుస్తకాల్లో తెలుగు భాష-నవీకరణ
12. జన సామాన్యంలో వాడుకలో ఉన్న ఇతర భాషా పదాల స్వీకారం
13. సాంకేతికంగా తెలుగు లిపి నవీకరణ
14. శాసనాలు, ఇతర సాహిత్యాధారాలలో కనిపించే ప్రాచీనకాలం నాటి తెలుగు పాలనా పదాలను నేటి వ్యవస్థకు తగిన రీతిలో పునర్నిర్వచించుకో గలగటం.
15. తెలుగు భాష విషయంలో ప్రసార మాధ్యమాల స్వీయ నియంత్రణ-కట్టుబాట్లు
16. వాణిజ్య ప్రకటనల్లో తెలుగు భాష విషయంలో స్వీయ నియంత్రణ-కట్టుబాట్లు.
17. సినిమాలలో తెలుగు భాష స్వీయ నియంత్రణ-కట్టుబాట్లు
18. పొరుగు రాష్ట్రాలలో తెలుగు భాష
19. ప్రజలో, ముఖ్యంగా యువతలో తెలుగు భాషానురక్తిని, తెలుగు సాహిత్యంపట్ల అభిరుచిని పెంపొందింపచేసేందుకు చేపట్టవలసిన విస్తృత కార్యక్రమాలు
20. తెలుగు భాషా పరిరక్షణ కేంద్రాలుగా గ్రంథాలయాల సేవలను వినియోగించటం, గ్రంథాలయ వ్యవస్థకు పరిపుష్టి కలిగించటం.
21. ఇవి కాక తెలుగు భాష నవీకరణకు సంబంధించి ఇంకా ఏదైన కొత్త అంశం పైన కూడా మీ అభిప్రాయాలను వ్రాసి పంపవచ్చు.
మీ అభిప్రాయాలను, సూచనలను apdirectorculture@gmail.comకు గానీ,
శ్రీ గుత్తికొండ సుబ్బారావు, అధ్యక్షులు కృష్ణాజిల్లా రచయితలసంఘం, guttikondasubbarao@gmail.com కు గానీ,
డా. జి వి పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితలసంఘం purnachandgv@gmail.com కు గానీ పంపవచ్చు.
ఈ సదస్సుకు విచ్చేయవలసిందిగా మీకు మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము.
కార్యక్రమం
04-06-2017 ఆదివారం
ఉదయం 10 నుండి 11.30 వరకు: ప్రాంరంభ సభ.
 ఉదయం 11.30 నుండి 1 గంటవరకు: మొదటి సదస్సు
మధ్యాహ్నం 1 గంటనుండీ 2.30 వరకు: రెండవ సదస్సు
సాయంత్రం 2.30 నుండి నుండి 4 గంటల వరకు: మూడవ సదస్సు
గమనిక
‘‘తెలుగు భాష – కొత్త రూపు::మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’’ జాతీయ సదస్సులో ప్రతినిథిగా పాల్గొనవలసిందిగా మీకు మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం
1. ఈ సదస్సులో ప్రతినిథిగా పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు
2. సదస్సుకు ప్రతినిథులుగా రాగోరేవారు తమ పేర్లను
శ్రీ గుత్తికొండ సుబ్బారావు, సెల్: 09440167697కు గానీ,
డా. జి వి పూర్ణచందు, సెల్: 9440172642కు గానీ చిరుసందేశం ద్వారా తెలియపరచండి.
3. ప్రతినిథులందరికీ భోజనం టీ ఉపాహారాల ఏర్పాట్లు ఉంటాయి. వసతి ఏర్పాట్లు స్వయంగా చేసుకోవలసి ఉంటుంది
డా. దీర్ఘాసి విజయభాస్కర్
సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ

Friday, 10 March 2017

అన్నానికి అన్నమే ప్రత్యామ్నాయం:: డా. జి వి పూర్ణచందు

అన్నానికి అన్నమే ప్రత్యామ్నాయం:: డా. జి వి పూర్ణచందు
మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో దేశం మొత్తం మీద ఒక్క తెలుగు వాళ్ళేఅన్నాన్ని తింటున్నారు. ఉత్తరాది వారికి రోటీలే అన్నం. దక్షిణాదిలో తమిళ, కన్నడ మళయాళీలు సాంబారు ప్రధానంగా ఉండే సాపాటు తీసుకుంటారు. వరి అన్నం తెలుగు వారికి ప్రధాన ఆహారం. వరి అన్నానికి కేలరీలు ఎక్కువ కాబట్టి, వరికి బదులుగా రాగి, జొన్న, సజ్జ, ఆరికెలు ఇలాంటి ఆహార ధాన్యాలతోనూ అన్నం వండుకోవచ్చు. 
అన్నాన్ని తినాల్సిన పద్దతి ఆయుర్వేద గ్రంథాల్లో వివరంగా ఉంది. కఠినంగా అరిగే పదార్థాలను మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను చివరగానూ తినాలని భావప్రకాశ వైద్యగ్ర౦థ౦లో పేర్కొన్నారు. తెలుగు వారి అన్నం తినే పద్ధతి ఇలానే ఉంటుంది. కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ వరుసలోనే మనం భో౦చేస్తున్నాం. కాశీ మొదలైన ఉత్తరాది ప్రా౦తాల ప్రజలు నెయ్యీ, నూనెలు కలిగిన రొట్టెలు ము౦దు తిని, ఆ తరువాత అన్నంతో మృదువైన పప్పు, పచ్చడి, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తింటారని కూడా ఈ వైద్య గ్రంథంలో ఒక వివరణ కనిపిస్తుంది. ఇటీవల కొన్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ము౦దు పూరీ లేదా పుల్కా ఇచ్చి ఆ౦ధ్రాభోజనం అని పిలవటం మొదలు పెట్టారు. ఇది అన్యాయ౦. తెలుగువాళ్ళకు పూరీ చపాతీలతో అన్నం తినే అలవాటు లేనే లేదు. 
అన్నం విషం అనేది అబద్ధం. అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్ని తేలికగా అరిగే అల్పాహారంగా అపోహపడి, అన్నం కంటే వాటినే అధికంగా తింటున్నాం. అన్నం విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగ పరచుకోవటం మీద మన తెలివి తేటలు ఆధారపడి ఉన్నాయి. 
అన్నం వలన ఆయువు, వీర్యపుష్టీ, బలం, శరీరకాంతి, పెరుగుతాయి. దప్పిక, తాపం, బడలిక, అలసట తగ్గుతాయి. ఇంద్రియాలన్నీ శక్తిమంతం అవుతాయి. బియ్యాన్ని దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతుంది. జ్వరంలో కూడా హోటల్ టీఫిన్లకన్నా జావ, లేదా మెత్తగా ఉడికించిన అన్నమే మంచిది. ఆయుర్వేద శాస్త్రంలో జ్వరం వస్తే అన్నానికి బదులు ఇడ్లీ పెట్టాలని చెప్పలేదు. ఉదయం పూట మెతుకు తగలకూడదంటూ రోజూ టిఫిన్లను తినటం జీర్ణకోశాన్ని దెబ్బ కొట్టుకోవటమే అవుతుంది. 
రాత్రిపూట వండిన అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తింటే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు. తిన్నది వంటబట్టని అమీబియాసిస్ వ్యాధి, గ్యాస్ట్రయిటిస్ అనే పేగుపూత వ్యాధి తగ్గుతాయి. వేయించిన బియ్యాన్ని వండిన అన్నంలో మజ్జిగ పోసుకుని తింటే, విరేచనాల వ్యాధిలో ఔషధంగా పని చేస్తుంది.వాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్నం తింటే శరీరంలోని విషదోషాలకు విరుగుడుగా ఉ౦టు౦ది. ఆయా ధాన్యాలను బట్టి కొద్దిగా హెచ్చు తగ్గులున్నప్పటికీ రాగి, జొన్న సజ్జ, గోధుమలతో వండిన అన్నాలకు కూడా ఇవే లక్షణాలు ఉ౦టాయి. 
అల్ల౦+ఉప్పు గానీ, మిరియాలు+ఉప్పుగానీ, ధనియాలు+జీలకర్ర+శొ౦ఠి గానీ మెత్తగా నూరిన పొడిని మొదటి ముద్దగా తినటం తెలుగు వారి సా౦ప్రదాయ౦. విందుభోజనాల్లో మొదట లడ్డూని వడ్డించినా దాన్ని మధ్యలో గానీ చివరికి గానీ తినడం మన పద్ధతి. వడ్డనంతా పూర్తయ్యాకే తినడం మానేసి, వడ్డించింది వడ్డించినట్టుగా తినే అలవాటు వలన స్వీటుతో భోజనం ప్రారంభించే అలవాటు కొత్తగా సంక్రమించింది మనకి! భోజనం చివరి భాగంలో కఫం పెరుగుతుంది కాబట్టి,కఫాన్ని తగ్గించే పచ్చకర్పూరం, లవంగం వగైరా వేసిన తాంబూల సేవనతో తెలుగువారి భోజన ప్రక్రియ ముగుస్తుంది. తమలపాకులకు ఔషధంలోని సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శరీర ధాతువులకు అందించే గుణం ఉంది. దీన్ని సర గుణం (వ్యాపించటం) అంటారు. 
స్థూలకాయ౦, రక్తపోటు, షుగర్ వ్యాధుల్లో జొన్నలతో వంటకాలు మేలు చేస్తాయి. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జి౦కు ఎక్కువగా ఉ౦టాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకు౦డా శక్తినిస్తాయి. కరువు కాల౦లో పండి, అన్నార్తిని తీరుస్తాయి. తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో ఇవి పండుతాయి. ఏ విధమైన రంగూ, రుచీ, వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి, జొన్నపి౦డి వివిధ వంటకాలలో కలుపు కోవటానికి అనువుగా ఉ౦టు౦ది. తెల్ల జొన్న అన్నం బలకరం, రుచికరం, వీర్యవృద్ధినిస్తుంది. లై౦గికశక్తి పె౦చుతుంది. గర్భాశయ దోషాలున్న స్త్రీలకు జొన్నన్నం మేలు చేస్తుంది. తినగానే శరీరానికి వంటబడతుంది. ఆపరేషను జరిగిన వారికి గాయాల పాలిట పడ్డవారికి మంచిది.
 జొన్నంబలి, జొన్న స౦కటి, జొన్న రొట్టెలు, జొన్నరవ్వ ఉప్మా, జొన్న కిచిడీ, జొన్న పేలాలు ఇవన్నీ రుచికరంగా చేసుకోవచ్చు. గోధుమపి౦డితో కలిపి పూరీ పరోటా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు, జొన్నరవ్వ కలిపి వండిన జొన్న పులగం చాలా రుచిగా ఉ౦టు౦ది. జొన్న పేలాలు షుగర్ రోగులకు మంచివి, పేగులకు శక్తినిస్తాయి. వీర్య కణాలు తక్కువగా ఉన్నవారు రోజూ జొన్నపేలాలు తింటూ ఉ౦టే వీర్యానికి చలవనిచ్చి కణాల స౦ఖ్య పెరుగుతాయి. జొన్న పేలాల పి౦డిని పాలలో కలిపి పరమాన్నం కాచుకోవచ్చు. పాలలో వేసి తోడు పెట్టి తిన్నా రుచిగా ఉ౦టు౦ది. తాలి౦పు పెట్టుకొ౦టే కమ్మని “జొన్నదధ్ధ్యోదనం” అవుతుంది. చిన్నపిల్లల్లో కలిగే షుగర్ వ్యాధిలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ధాన్యాలను కూడా తింటూ ఉ౦డటం అవసరం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మొలకెత్తిన సజ్జల్లో ప్రొటీను అనేక రెట్లు వృద్ధి చె౦దుతుంది. వీటి సన్నని రవ్వతో చేసిన ఉప్మా గోధుమలు లేదా పెసలు సజ్జలతో అట్టు, చక్కిలాలు, కారప్పూస లాంటివి కూడా వండుకోవచ్చు. సజ్జల్లో ప్రొటీను, రాగుల్లో కేల్షియం బాగా ఉ౦టాయి. ఈ రె౦డి౦టినీ కలిపి వండుకొ౦టే వరి అన్నానికి నిజమైన ప్రత్యామ్నాయం అవుతాయి. ‘మొలకెత్తిన రాగులు, సజ్జలు’ బొజ్జలు తగ్గడానికి గొప్ప ఆయుధాలని గుర్తి౦చాలి.
టిఫిన్ల తయారీకి కూడా రాగి, జొన్న, సజ్జ ల్లాంటి ప్రత్యామ్నాయ ధాన్యాలకు ప్రాధాన్యతనిస్తే ఆరోగ్యానికి మంచిది. శనగపిండి, చింతపండు, అల్లం వెల్లుల్లి మషాలా, నూనెలు ఇవి తేలిగ్గా అరిగే అన్నాన్ని కష్టంగా అరిగిస్తున్నాయి. వీటిని వలనే అన్నం “హెవీ” అవుతోంది. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, బఠాణీలు, మొక్కజొన్నలు వీటిని ఎక్కువగా తింటున్నాం మనం ఇప్పుడు. 
బియ్యంకన్నా వీటిలో కేలరీలు అతిగా ఉన్నాయి. ఈ పప్పు ధాన్యాల్లో బియ్యం వగైరా కలిపి వండిన ఇడ్లీలు, అట్లు, బజ్జీలు, పునుగులూ అన్నంకన్నా కష్టంగా అరుగుతాయి. వీటికి నెయ్యి,కారప్పొడి, సాంబారు, అల్లపచ్చడి, శనగ/వేరుశనగపచ్చళ్ళు తోడు కావాలి. అవి లేకుండా టిఫిన్లను తినటం సాధ్యం కాదు. ఎప్పుడో సరదాగా పండక్కో పబ్బానికో మాత్రమే తినవలసిన టిఫిన్లను రోజూ తప్పనిసరిగా తింటే పొట్ట చెడుతుంది. టిఫిన్లనేవి మన దినచర్యలో ఒక భాగం కాకూడదు. ఏ విధంగా చూసినా టిఫిన్లకన్నా అన్నమే మెరుగు!
అన్నానికి బదులుగా టిఫిన్లను తినటం ఆకలి తీర్చుకోవటానికి కాదు, ఆకలి చంపుకోవతానికి! భోజనానికి ఇంకా సమయం ఉన్నప్పుడు అందాకా ఓ కప్పు కాఫీ/టీ తాగటం ఆకలిని తీర్చటానికా లేక చంపటానికా అనేది ఆలోచించాలి! టిఫిన్లూ అంతే ఆకలిని చంపుతాయి. అవి అన్నానికి ప్రత్యామ్నాయం ఎంతమాత్రమూ కాదు.

Wednesday, 1 March 2017

మనం మనలా మనాలి :: డా. జి వి. పూర్ణచందు

మనం మనలా మనాలి :: డా. జి వి. పూర్ణచందు
"గాహాణయ గేయాణయ
తంతీ సద్దాణ పోఢ మహిళాణ
తాణం సొచ్చియ దండో
జే తాణ రసం సయాణంతి"
మాట పాట ఆట అన్నీ ఒకదాని వెనక ఒకటిగానే వచ్చాయి. నాదం వీటన్నింటికన్నా ముందు పుట్టింది. ఆమాటకొస్తే మనిషి కన్నాముందే పుట్టింది. కోయిల పాట, నెమలి ఆట సంగీత నాట్యాలకు కులగురువులు. వేదాలు ప్రకృతిని అనుసరించాయి. భారతీయ సంగీతానికి మూలం వేదాలలోని స్వరాలే! సామవేదం భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి సంగతులు, గమకాలూ ఉన్నాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారా స్థాయిలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి.
సంగీత కళకు లక్ష్య లక్షణాలు నిర్మించి వ్యాప్తికి తేవటంలో ఆంధ్రుల పాత్ర గొప్పది. క్రీస్తు పూర్వం చివరి శతాబ్దాలు - క్రీస్తుశకం తొలి శతాబ్దాల నాటి తొలి ఆంధ్రుల చరిత్రని సూచించే అమరావతి, భట్టిప్రోలు నాగార్జునకొండ, గోలి మొదలైన బౌద్ధ స్తూపాలలో ఇంకా ఇతర శిల్ప సంపదలో ఎన్నో రకాల వీణలు, వేణువు, మృదంగం లాంటి వాద్యాలు మనకు కనిపిస్తాయి. శాతవాహన ప్రభువు హాల చక్రవర్తి సంకలనం చేసిన 'గాథాసప్తశతి' లో ఆనాటి ఆంధ్రుల సంగీత ప్రావీణ్యతని తెలియచెప్పే ఆధారాలు దొరుకుతాయి. పైన చెప్పిన పద్యం గాథా సప్తశతిలో ప్రాకృతభాషలో ఉన్న ఒక గాథ. దానికి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు "గాథలందు గేయ గతులందు వీణెల/పలుకులందుఁ బ్రోడ మెలఁతలందుఁ/గలుగు మేలి రసము గనుఁ గొనలేనివా/రవని నున్న వారి కదియె శిక్ష" అని అనువాదం చేశారు.
గాథలు( ఆనాటి ఒక కవితా ప్రక్రియ). గేయాలు, తీగవాయిద్యాలు. అందమైన స్త్రీలు వీళ్ళంతా అందించే మేలి రసాల్ని చవిగొనలేని వాళ్ళు ఈ భూమ్మీద ఉంటే, అలా ఉండటమే వాళ్లకు శిక్ష...అంటుందీ గాథ.
ఒక మాటలోని రసాన్ని, ఒక పాటలోని రసాన్ని ఒక పండులోని రసాన్ని, ఒక వంటకంలోని రసాన్ని, ఆస్వాదించటం చేతకాక పోతే ఆ వ్యక్తి కోల్ఫొయేది ఎక్కువ. అది ఎన్ని లీటర్ల ఆల్కాహాలు తాగినా పొందగలిగేది కాదు. సాధారణంగా ఆల్కాహాలికులు త్రాగని వాళ్ళని పట్టుకుని కించపరుస్తూ “మందు కొట్టవు, సిగరెట్లు తాగవు, మాంసం తినవు, వ్యభిచారం చెయ్యవు...ఇంకెందుకు వెధవ బతుకు బతకటం...” అంటూంటారు.
రెండు వేల యేళ్ళనాటి హాలుడు సేకరించిన ఈ గాథని చెప్పిన ఆంధ్రుడు సంగీతసాహిత్యాలంటే మక్కువ లేని వాళ్ళను అదే మాట అంటున్నాడు...మాట, పాట ఆటల్ని ఆస్వాదించలేని వాళ్ళ జీవితం నిరర్థకం. అలాంటి వాళ్ళకు ఈ భూమ్మీద అలా అంటే రాయిలా జీవించటమే ఒక శిక్ష అని!
భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే రెండు వేల యేళ్ళకు పైగా తెలుగు ప్రజల జీవితాలతో ముడుపడి నడిచిన మన చరిత్ర పరిరక్షణ. సంస్కృతి అనేది మన జీవన విధానం. సంగీత సాహిత్యాది కళలు దానిని ప్రదర్శిస్తాయి. పదిలపరుస్తాయి. ప్రబోధిస్తాయి. కవులూ, కళాకారులూ తమ బాధ్యతను నెరవేరుస్తారు. తరువాత తరానికి ఆ సంస్కృతీ దివ్వెను అందిస్తారు. ఒకతరం నుండి ఇంకో తరం ఆ దివ్వెను అందుకుని మరింత వెలుగులు నింపుకుంటూ సాగిపోతుంది.
మధ్యమధ్య సామాజిక రాజకీయ పరిణామాలు ఒక్కోసారి ఈ దివ్వెను కొడిబారేలా, తడి ఆరేలా చేస్తుంటాయి. కవులు కళాకారులే పూనుకుని దివ్వెను మళ్ళీ మళ్ళీ సంరక్షిస్తుంటారు.
మధ్య యుగాలలో మహమ్మదీయ దాడులు, 18వ శతాబ్దిలో విదేశీ వాణిజ్య కంపెనీల దాడులతో పోలిస్తే అమెరికా ప్రభావిత వ్యామోహ పూరిత పాశ్చాత్య తరహా ఆధునిక జీవన విధానం, అంధప్రపంచీకరణం, కుటుంబ వ్యవస్థ విధ్వంసం ఇలాంటి ఇప్పటి అనర్థాలు తాటాకు చప్పుళ్ళే అవుతాయి. మాతృభాష గతంలో అలాంటి ప్రతి సందర్భంలోనూ ప్రమాదాలను ఎదుర్కొంది. అందువలన సమాజ నవీకరణానికి సంబంధించిన పదజాలం మన భాషలో అభివృద్ధి కాకుండా పోయింది. తొలి యుగాలలో సంస్కృతం, మధ్య యుగాలలో ఉర్దూ పర్షియన్ భాషలు, బ్రిటిష్ యుగంలో ఆంగ్లం దేశీయభాషల్ని అణగద్రొక్కేందుకే కంకణం కట్టుకున్నాయి. వివిధ కళలతో పాటు చేనేత సహా గ్రామీణ సాంకేతిక వృత్తి విద్యలన్నీ విధ్వంసం అయ్యాయి. హిందూస్థానీ సంగీతం ఉత్తరాదిలో భారతీయ సంగీతాన్ని కమ్మేయగా, దక్షిణాదిలో విజయనగర ప్రభువులు, నాయకరాజులు ఇంకా ఇతరులు భారతీయ సంగీత రీతుల్ని పరిరక్షించారు. విజయనగర సామ్రాజ్య కృషి వలనే కర్ణాటక సంగీతం అనే పేరు స్థిరపడినట్టు “తంజావూరు, ది సీట్ ఆఫ్ మ్యూజిక్” గ్రంథం పేర్కొంది. భాషా సాహితీ వేత్తలు, వివిధ రంగాలకు చెందిన కళాకారులే సంగీత సాహిత్యాది కళల పరిరక్షకులు. ప్రజలు వాటిపట్ల మక్కువని పోగొట్టుకోకుండా అభిరుచిని కొనసాగించాలి. కళల పట్ల అభిరుచి అనేది మనిషన్న వాడి కనీస ధర్మం. అది దేశీయంగా ఉండాలి.
అమెరికా అనేది ‘భూతాల’ స్వర్గం అని తేలిపోయాక మన యువతరం ఆలోచనల్లో దేశీయత పట్ల చిన్నచూపు తగ్గుతుంది. ఆరోజు ఎంతో దూరంలో లేదు కూడా! సమాజ పాశ్చాత్యీకరణం, అమెరికా భక్తి, ఆంగ్లభాషా వ్యామోహాలను కావాలని పనిగట్టుకుని తెలుగు సమాజం మీద రుద్దిన పాపం మన విద్యావ్యవస్థదే!
అభివృద్ధి అంటే కాళ్ళదగ్గర పాలకుందని తన్నుకోవటం కాదనీ దాన్ని మెరుగుపరచి అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళటం అనే దిశలో ప్రభుత్వ ఆలోచన సాగితే ఈ నష్టాన్ని తేలికగానే పూడ్చుకో గలుగుతాం. చేనేత, కుమ్మరం, కమ్మరం లాంటి గ్రామీణ సాంకేతిక కళల్ని కులముద్రతో కాకుండా సాంకేతిక కళలుగా అభివృద్ధి చేస్తే, కులాలకతీతంగా అందరూ వాటిని నేర్చుకుంటారు. వారిలో కొందరైనా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలుగుతారు. మార్పు అనేది అక్కణీంచి మొదలు కావాలి.
మనం అమెరికా లాగా మారటం కాదు, మనం మనలా అమెరికాని మించే సాధకులం కావాలని జాతి విద్వేషానికి బలైన అమరుడు కూచిభోట్ల శ్రీనివాస్ మరణం మనకు పాఠాలు నేర్పుతోంది. కళలు, సాంకేతిక కళలే మన ఉనికిని చాటుతాయి. మన అస్థిత్వాన్ని నిలుపుతాయి.
(కూచిభొట్ల శ్రీనివాసుకు నివాళిగా...)

ప్రాచార్య శలాక రఘునాథశర్మ “యామునప్రభు రాజనీతి” గ్రంథావిష్కరణ సభ

కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ- అమరావతి
ఆహ్వానం

ప్రాచార్య శలాక రఘునాథశర్మ వ్యాఖ్యాన రచన
“యామునప్రభు రాజనీతి”
గ్రంథావిష్కరణ సభ

04-03-201 శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు
కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ-అమరావతి, మధుమాలక్ష్మి చాంబర్స్,
మొగల్రాజపురం, విజయవాడ-520010

సభాధ్యక్షులు:
ఆచార్య ఎస్ రామకృష్ణారావు, వైస్ చాన్సలర్, కృష్ణా విశ్వవిద్యాలయం
గ్రంథావిష్కరణ:
డా. పరకాల ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు
కృతిస్వీకారం:
శ్రీ మండలి బుద్ధప్రసాద్, ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్
ఆత్మీయ అతిథి
డా. దీర్ఘాసి విజయభాస్కర్, సంచాలకులు, ఆం.ప్ర. భాషాసాంస్కృతిక శాఖ
గ్రంథ పరిచయం:
డా. బులుసు వేంకట సత్యనారాయణమూర్తి, సంపాదకులు, కళాగౌతమి.
సభానిర్వహణ: డా. జి వి పూర్ణచందు

అందరికీ ఆహ్వానం

సందీప్ మండవ సి ఈ ఓ 
మాలక్ష్మీ ప్రాపర్టీ వెంచర్స్ ప్రై(లి).

డా. ఈమని శివనాగిరెడ్డి, సి ఈ ఓ
ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ& అమరావతి

Friday, 24 February 2017

మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారి ఆహ్వానం

మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు శ్రీ ఆర్కాటు ప్రకాశరావు ధర్మనిథి ఉపన్యాసం కోసం ఆహ్వానించారు. 3-3-2017న విశ్వవిద్యాలయ రజతోత్సవ ప్రాంగణంలో సభ జరుగుతుంది. తెలుగు వారి ఆహార చరిత్ర గురించి ధర్మనిథి ఉపన్యాసం ఇస్తున్నాను. విశ్వ విద్యాలయం వారు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు