Friday, 30 September 2016

ఆపరేషన్ రావణ: డా. జి వి పూర్ణచందు

ఆపరేషన్ రావణ:
డా. జి వి పూర్ణచందు
అలసట డస్సి నా కడకు నావహనమాడగ రాకు మెప్డు, మి
క్కుటముగ నింతవాడ ననుకొంచును యుద్ధము చేయబోకు, దోః
పటుతరశక్తి యస్త్రముల పట్టును ధారణచేసి రమ్ము, నెం
తటి రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్
రామరావణ యుద్ధం ముగింపు దశకు వస్తోంది. రోజుకో టెర్రరిష్టు బృందాన్ని రాముడి మీదకు పంపి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న రావణుడు యుద్ధరంగంలో అలిసిపోయాడు. రావణుడి దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. అవి రామదండులో కొంతభాగం సేనను నాశనం చేయగల శక్తిమంతమైనవి. కానీ, రాముడి దగ్గరున్న దివ్యాస్త్రాలు రావణుడితో సహా మొత్తం లంకా రాజ్యాన్నే నాశనం చేయగలవని విభీషణాదులు హితబోధ చేశారు. అయినా రావణుడు టెర్రరిజాన్ని పోషించే విధానాన్ని వదల్లేదు.
ఇప్పుడు పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. యుద్ధం నిరాఘాటంగా సాగుతోంది. అక్కడ రావణుడి తలుతెగి పడ్తుంటే తిరిగి కొత్త తలలు పుట్టుకొస్తు న్నాయి. ఇక్కడ రాముడి దగ్గర సంజీవని ఉంది. చచ్చిన వానర సైన్యం తిరిగి బతికొస్తున్నారు. ఎవరికీ గాయాల బాధ లేదు. గాయం తగలగానే మాయమైపోతోంది. రావణుడిది వంటరి పోరాటం. శుద్ధ భారతీయ వ్యతిరేకత అతని విధానాలకు మూలం. రాముడిది సమూహ శక్తి. తీవ్రవాద వ్యతిరేకత అతని విధానం.
విభీషణుడు ఐక్యరాజ్య సమితి లాగా టెర్రరిజం మంచిది కాదని, అది లంకకే చివరికి చేటు తెస్తుందని చెవినిల్లు కట్టుకు పోరాడు. టెర్రరిజాన్ని ఆరంభించనే కూడదు. ఒకసారి అందులోకి దిగితే బయటకు రాలేరు, ‘ఈత నేర్చినవాడు ఏటిలోనే పోతా’ డనే సామెత మాఫియాలకు, డాన్లకు, టెర్రరిష్టు మూకను ప్రేరేపించే దేశాధి నేతలకు బాగా వర్తిస్తుంది. పాకిస్తాన్ పాలకులెవరికీ సహజ మరణం లేదందుకే! రావణుడి తత్త్వానికి వీళ్ళు ప్రతీకలు కాబట్టే!
యుద్ధం సాగుతున్న దశలో ఆ సాయంత్రం ఘడియల్లో రావణుడి చేతిలో ఆయుధాలన్నీ అయిపోయాయి. తెగిన అవయవాలను అతికించుకునే పనిలో పడ్డాడు. రాముడి బాణాలను తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయింది. తన సైన్యాన్ని, రాజ్యాన్ని కాకుండా తనను రక్షించుకునే పనిలో పడటం ఏ దేశాధినేతకైనా ఇబ్బందే! యుద్ధంలో ఎల్లకాలం గెలుపు మన వైపే ఉంటుందని హుంకరిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.
రావణుడు నిస్సహాయంగా నిలబడి పోయాడు. అలసట అతని ముఖంలో కొట్టొస్తోంది. ఆ సమయంలో రావణాసురుణ్ణి అంతం చేయటం రాముడికి చాలా తేలిక. కానీ, ఆయన అలా చేయలేదు. “తెచ్చుకున్న ఆయుధాలన్నీ అయిపోయాయా...? బాగా అలిసి పోయినట్టున్నావు...నేడు పోయి రేపు రా” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన పద్యం ఇది.
“రావణా! అలిసి పోయాక కూడా నా ముందు నిలబడే సాహసం ఇంకెప్పుడూ చెయ్యకు. ఆయుధాలన్ని అయిపోయి దిక్కు తోచకపోయినా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని అహంకరించాలనుకోకు. ఇంటికి పోయి కాసేపు పడుకో...నీ చేతులకు కాస్త శక్తి వస్తుంది. అప్పుడు మళ్ళీ రా! వచ్చేప్పుడు నీ దివ్యాస్త్రాల మంత్రాలన్నీ ఒకసారి చదువుకురా! ఒక్క దెబ్బకు దిమ్మతిరిగి మంత్రం మర్చిపోతావు. అవతలి వాడి శక్తిని అంచనా వేయటం చేతకాని వాడివి...నువ్వేం వీరుడివి...? ఇవ్వాళ్టికి పోయి రేపు రా!” అన్నాడు.
ఇది యుద్ధ నీతి. రాముడు దాన్ని పాటించాడు. భారతదేశంతో నాలుగుసార్లు యుద్ధంచేసిన పాకిస్తాన్ ప్రతి యుద్ధం లోనూ ఓడిపోయింది. అయినా, దానికి దివ్యాస్త్రాలతో పాటు జవసత్వాలను సమకూరుస్తున్న దేశాలు దాన్ని టెర్రరిజ స్థావరంగా మార్చేశాయి. టెర్రరిజం తాకిడికి గాయపడిన దేశాలు కూడా తమ రాజకీయ ప్రయోజనం కోసం పాకిస్థాన్‘కి సాయపడ్తున్నాయి. తమ మీద కాకుండా తమ శత్రువు మీద ప్రయోగిస్తే టెర్రరిజం మంచిదేననే భావన ప్రపంచ దేశాధినేతల్లో బలంగా ఉంది. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే అంశం.
“రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్” అనే పాఠాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ నేర్చుకోదని అనేక సార్లు ఋజువయ్యింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నిన్న జరిగిన భారత ప్రతీకార దాడి- చూసి రమ్మంటే హనుమంతుడు కాల్చి రావటం లాంటిది. మచ్చుకి ఒకటిగా జరిగిన సంఘటన మాత్రమే! అసలు యుద్ధం ముందుముందుంది. పాకిస్తాన్ అలిసిపోయి నిస్సహాయంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ‘ఆపరేషన్ రావణ’ ఆఖరి టెర్రరిష్టు అంతమయ్యే దాకా ఆగకూడదు.

Monday, 26 September 2016

కొవ్వులో కేలరీలు.. ఊబకాయం :: డా. జి వి పూర్ణచందు

కొవ్వులో కేలరీలు.. ఊబకాయం (మీకు మీరే డాక్టర్)
Published Tuesday, 13 September 2016 Andhrabhoomi daily
ఆహారం ద్వారా శరీరానికి కేలరీలు అందుతాయి. ఆ కేలరీలను ఖర్చుపెట్టడం ద్వారా శరీరం శక్తిని పొంది తన పనులు తాను సమకూర్చుకుంటుంది. వచ్చిన కేలరీల ఆదాయంలోంచి చేసిన కేలరీల ఖర్చుని తీసేయగా మిగిలిన కేలరీల సంపద లెక్కల్లో చూపని నల్లడబ్బు లాంటిది. దాన్ని దాచుకోవటానికి రహస్య స్థావరాలు కావాలి. శరీరంలో బాగా వదులుగా ఉండే కొవ్వు కణాలలో ఈ అదనపు కేలరీలను శరీరం దాచిపెడుతుంది. వదులుగా ఉండే కొవ్వు కణాలలో కేలరీలు దాగడంతో ఆ కొవ్వు కణాలు వాటి పరిమాణాన్ని మించి ఉబ్బుతాయి. అందువలన వదులుగా ఉండే కొవ్వు పొరలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ లావుగా తయారౌతాయి. ఊబకాయం ఏర్పడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకుల్లో ఒకరైన చరకుడు ‘బహ్వబద్ధా మేదాః’ అంటూ ఒక సూత్రంలో ఈ కేలరీల కథనంతా వివరించాడు. బద్ధం అంటే బాగా బిగుతుగా ఉండటం. అబద్ధం అంటే వదులుగా ఉండటం. ‘బహు అబద్ధం’ అంటే, బాగా లూజుగా వుండే కొవ్వు (లూజు ఎడిపోసె టిష్యూ)లో చేరి స్థూలకాయాన్ని తెస్తున్నాయని చెప్పాడు.
చర్మం అడుగున వుండే కొవ్వు పొరల్ని ఎడిపోజ్ పొరలంటారు. ఇవి అదనపు కేలరీలను దాచుకోవడానికి నేలమాళిగల్లాంటివి. శరీరంలో పొట్ట, పిరుదులు, డొక్కలు, రొమ్ములు, పిర్రలు ఈ ప్రాంతాల్లో ఉండే ఎడిపోజ్ పొరలు బహు అబద్ధంగా అంటే బాగా లూజ్‌గా ఉండి, అక్కడ ఆ కేలరీలు ఎక్కువగా చేరేందుకు అవకాశాలుంటాయి. కేలరీల ఖర్చు తగ్గి, ఆహారం ద్వారా కేలరీల ఆదాయం పెరుగుతూన్న కొద్దీ అదనపు కేలరీలన్నీ ఈ పొట్ట, పిరుదుల్లో చేరి, అవి ఉబ్బి ఊబకాయం ఏర్పడుతుంది.
కేలరీలన్నింటినీ లాకరులో పెట్టినట్లు ఈ కొవ్వులో దాచటంవలన, శరీర వినియోగానికి చాలా పరిమితంగా కేలరీలు అందుతాయి. దాంతో అదనపు కేలరీల కోసం మెదడులోని నాడీ కేంద్రాలు ఆకలిని ప్రేరేపిస్తాయి. తిండి ధ్యాస విపరీతంగా పెరిగిపోతుంది. వెర్రి ఆకలి పుడుతుంది. ఎంత తిన్నా ఈ నీరసం తగ్గటం లేదనిపిస్తుంది. అటు ఊబ శరీరమూ, ఇటు ఆకలీ రెండూ ఒకదాన్నొకటి పెంచుకుంటూ పోతాయి. మెటబాలిజం అంటే, శరీర నిర్మాణ క్రియలు దానివలన నిలిచిపోతాయి.
ఇలా కొవ్వులో కేలరీలు బందీ కావటానికి జీవరసాయన కారణాలు, జెనెటిక్ కారణాలు చాలా ఉన్నాయి. శరీర శ్రమ, భోజనం చెయ్యగానే నిద్ర, మానసిక ఆందోళనలు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగకపోవటం వాటికి తోడౌతాయి. షుగరు రోగులకు ఇన్సులిన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు బరువు పెరగటాన్ని, ఇన్సులిన్ తగినంత లేనప్పుడు బరువు తగ్గటాన్నీ మనం గమనించవచ్చు. ఇన్సులిన్ ఇస్తున్నకొద్దీ కేలరీలు ఖర్చయిపోయి ఆకలి డిమాండ్ ఏర్పడుతుంది.
తినకుండా పూర్తి పస్తు ఉంటే కొవ్వులో దాగున్న కేలరీలు బయటకొస్తాయనేది పూర్తి వాస్తవం కాదని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ఉపవాసాలు స్థూలకాయానికి విరుగుడు కాదు.
శరీరానికి ఎంత శ్రమ ఉన్నదో అంతకు తగిన కేలరీలను మాత్రమే తీసుకోగలగటం ఊబకాయానికి నివారణా సూత్రం. ఆకల్ని బట్టి కాకుండా శరీర శ్రమను బట్టి ఆహారాన్ని తీసుకోవటానికి పథక రచన చేసుకోవాలి. శరీర పరిశ్రమ లేకుండానూ, కొవ్వు పదార్థాలను ఆపకుండాను, కేవలం డైటింగ్ చేస్తే ఊబకాయం తగ్గకపోకా పెరిగిపోతుంది.
టిఫిన్లకు అల్పాహారం అనే పేరు పెట్టడంవలనే కొన్ని అపోహలు కలుగుతున్నాయి. గట్టిగా పోలిస్తే, మన టిఫిన్లు అన్నం కన్నా ఎక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. మినప్పప్పు, ఉప్పుడు రవ్వ కలిపి వేసిన ఇడ్లీలలో గానీ, మినప్పప్పు బియ్యం కలిపి రుబ్బి వేసిన అట్లలో గానీ ఉండే కేలరీలకన్నా, ఉదయాన్నో రాత్రిపూటో కొద్దిగా తినే పెరుగున్నం లేదా చల్లన్నంలో తక్కువ కేలరీలే ఉంటాయి. టిఫిన్లలో అదనంగా శనగచట్నీ, అల్లప్పచ్చడి, నెయ్యి, కారప్పొడి, సాంబారు కూడా ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా చల్లన్నం కన్నా చాలా ఎక్కువ కేలరీలను శరీరానికి అందిస్తాయి. అన్నం మానేసి ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా, బజ్జి, పునుగులు తింటూ చాలా లైట్‌ఫుడ్ తింటున్నామనుకోవడం ఒక అపోహ. ఇవి కాకపోతే బట్టర్‌నానూ, రుమాల్ రోటీ లాంటి వాటిని రకరకాల కర్రీలతో తింటూ అవి కూడా లైట్ ఫుడ్ అనే అనుకుంటుంటారు చాలామంది.
జంకుఫుడ్స్ అనేవి పిజ్జాలు, బర్గర్లు చైనా నూడుల్స్- ఇవి మాత్రమే అనుకోవద్దు. ఇంట్లో మనం తినే టిఫిన్లన్నీ జంకు ఫుడ్స్ కేటగిరీల్లోకే వస్తాయి. ఏవి ఎటువంటి పోషకాలూ ఇవ్వకుండా, కేవలం అమితమైన కేలరీలను శరీరానికి అందిస్తాయో అవన్నీ జంకు ఫుడ్సే అవుతాయి. తింటున్నది ఫుడ్డో.. జంకుఫుడ్డో ఎవరికివారే నిర్ణయించుకోవాలి. అదనపు కొవ్వు నిచ్చే ఆహారాలపట్ల అప్రమత్తతగా ఉండే స్థూలకాయం సమస్య తగ్గటానికి సావకాశం వుంటుంది.
కేలరీలు దాక్కునేందుకు శరీరంలో కొవ్వు లేకుండా చేస్తేనే ఊబకాయం తగ్గుతుంది. కొవ్వును పెంచుకుంటూ, కేవలం వరి అన్నాన్ని మానేయటంవలన ఒరిగేదేమీ ఉండదు. అదే నిజమైతే గోధుమ రొట్టెల్ని మాత్రమే తినే ఉత్తరాదివారిలో స్థూలకాయం ఉండకూడదు కదా! దక్షిణాది వారిలో వారికన్నా ఔత్తరాహికుల్లోనే స్థూలకాయులు ఎక్కువగా ఉన్నారు కూడా! వరి, గోధుమల్లాంటి ధాన్యాలకన్నా వాటితోపాటు తినే నూనె పదార్థాలు ఎక్కువ హానికారకం అని అర్థం చేసుకోవాలి.
కొవ్వులో దాగున్నాక ఆ కేలరీలను తగ్గించటం కష్టం అవుతుంది కాబట్టి, కేలరీల సంఖ్యను కొవ్వు కణాల సంఖ్యను, సమానంగా తగ్గించే విధంగా ఆహార ప్రణాళిక రచించుకోవటం అవసరం. నూనెలో వేసి వేయించిన కూరలు, ఊరగాయలు, అత్యంత స్పైసీ కూరలు, నూనె వరద కట్టే వంటకాలూ ఊబకాయ ప్రదాతలని గుర్తించాలి.
సిగరెట్ల పెట్టెమీద పుర్రె బొమ్మ వేసి డేంజర్ అపాయం అని వ్రాసినట్టు, స్థూలకాయానికి కారణం అవుతున్న ఆహార పదార్థాల ప్యాకింగ్ మీద కూడా ఇది కొవ్వుని పెంచుతుంది అనే హెచ్చరిక వ్రాయటం అవసరం. హెచ్చరిక అనేది అవగాహన కలిగించే ఒక ప్రయత్నం. తెలియక తప్పులు అనేకం చేస్తుంటాం. తెలిశాక కూడా తప్పులు చేస్తే బాధ్యత ఎవరికి వారిదే కదా!
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

Friday, 9 September 2016

‘కట్టు’ గుట్టు :: డా. జి వి పూర్ణచందు

‘కట్టు’ గుట్టు :: డా. జి వి పూర్ణచందు
“నిను రప్పింపకమున్న వేడ్కపడి పూనెన్ శారఙ్గ కౌమోదకీ
వనమాలాంబుజ జక్ర భూమికలుఁ గైవారంబు జేయించె నే
లిన నాగారులచేత యాదవుల నోలిం గొల్చి కూర్చుండఁగాఁ
బనిచెన్ గేశవుఁడైంద్రజాలికు గతిం బ్రాతయ్యె నీకంతటన్”
పెళ్ళి చూపుల్లో ఆడపిల్లలు అరువు నగల్ని, మగ పిల్లలు అరువు కళ్లజోళ్ళనీ, వాచీల్నీ పెట్టుకోవటం సర్వ సాధారణం. మన దర్పాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి అరువు అలంకారాలు, కృత్రిమ వేషధారణలు అవసరమౌతాయి. సముద్రుడు చర్మాంబర ధారి శివుడికి గరళాన్ని, పట్టు పీతాంబరధారి విష్ణువుకు కూతురినీ ఇచ్చాడు. అన్ని సందర్భాల్లోనూ గాంధీగారిలా బిళ్లగోచీ పెట్టుకుంటే పనులు కాగలవనే ధీమా ఏమీ లేదు.
పరాయి వాళ్ళూ, శత్రువులూ వచ్చినప్పుడు పూర్వం రాజులు కూడా ఇలానే తెచ్చిపెట్టుకున్న అలంకారాలతో కొలువు దీరి కూర్చునే వాళ్ళట. నాచన సోమన ఉత్తర హరివంశంలో అలాంటి కృత్రిమ అలంకారాలు ఎలా ఉంటాయో చక్కని వివరణ ఇచ్చాడీ పద్యంలో. ఆయన్ని చూస్తూనే అవతలివాడు డంగై పోవాలని అలా చేస్తారట.
హంస, డిభకులనే రాక్షసులకీ కృష్ణుడికీ మధ్య యుద్ధాలు సాగుతున్నై. ఒకసందర్భంలో జనార్దనుడనే పెద్దమనిషిని కృష్ణుడి దగ్గరకి రాయబారం పంపారు. జనార్దనుడు కృష్ణుణ్ణి కలిసొచ్చి, ఆయన వైభవాన్నీ, ఆయన మాటల్నీ పూసగుచ్చినట్టు వర్ణించి చెప్తాడు. జనార్దనుడి మాటలకు పెద్దగా నవ్వారు హంస, డిభక సోదరులు.
“వరాలు ఉన్నాయి...అవి కాపాడతాయి అనుకుంటున్నారేమో... మీ ఇద్దరినీ వదలను. వదల కూడదు. మీకు వరా లిచ్చిన ఆ శివుడే దిగొచ్చినా లోకమంతా తెలిసే లాగా పారద్రోలి మీ ఇద్దర్నీ చంపేస్తా! యుద్ధం ఎక్కడ కావాలి? మధురలోనా? ప్రయాగలోనా? పుష్కర స్థలంలోనా? ఎక్కడంటే అక్కడే! ద్వంద్వ యుద్ధమా? ఆయుధాల్తోనా? ఏ ఆయుధంతో మిమ్మల్ని చంపాలో... మీరే నిర్ణయించుకోండి... వస్తున్నా! చూసుకొందాం! వస్తున్నా” ఇలా కృష్ణుడితో అనిపిస్తాడీ సందర్భంలో కవి నాచన సోమన. క్రీ.శ. 14వ శతాబ్దిలో సోమన పేల్చిన గొప్ప పంచ్ డైలాగ్ ఇది!
రాయబారిగా వెళ్ళిన జనార్దనుడు కృష్ణుణ్ణి చూసి నిజంగానే అదిరిపోయాడు. అతను తిరిగొచ్చి చేసిన కృష్ణస్తుతి విని నవ్వి, హంస డిభకులు హేళనగా ఇలా అన్నారు: “ఓరి పిచ్చివాడా! కృష్ణుడు భగవంతుడూ కాదు గిగవంతుడూ కాదు, ఆ శారంగ(విల్లు), కౌమోదకీ (గద)వనమాల(వైజయంతి అనే పూలమాల) చేత్తో పట్టుకున్న కలువపువ్వు(అంబుజం), సుదర్శన చక్రం, ఇవన్నీ నిజం అనుకుంటూన్నావా...ఎబ్బే ఉత్తుత్తివే! సభలో వీటిని అలంకరించుకుని కూర్చుంటాడు. నీ బోటి వాళ్ళు హడలి చావటానికి ఇలా లేని హంగూ ఆర్భాటాలు ప్రదర్శించాడు. నిన్ను ఫలానా రోజు రమ్మన్నాడు. నువ్వొచ్చే సమయానికి వేగంగా అలంకరించుకుని వచ్చి కూర్చున్నాడు. వందిమాగధుల్ని నిలబెట్టి పొగడ్తలతో హోరెత్తించాడు. నిన్ను అదరగొట్టాడు. అదంతా నిజమేనని, కృష్ణుడు భగవంతుడనీ నువ్వు భ్రమలో పడ్డావు. ఇలా చేయటం కృష్ణుడి కొక సరదా”అని!
ఇక్కడ “నా ‘గారు’ల చేత” అని ఒక పదాన్ని ప్రయోగించాడు సోమన. పైకి చూస్తే నాగ+అరి=గరుత్మంతుడు అని అర్ధం వస్తుంది. కానీ, నా ‘గారు’లు అంటూ, ‘గారు’ అనే తెలుగు పదాన్ని వ్యంగ్యంగా తాబేదారనే అర్ధంలో ప్రయోగించాడు. బ్యూరోక్రాట్లను ఇంగ్లీషులో “బాబు”లని పిలవటం లాంటిదే ఇది. “తన చంకల్లో మనుషుల్ని, చెంచాగాళ్లనీ పేరుపేరునా పిలిచి కూర్చోబెట్టాడు ...అవునా? ఇది కనికట్టు విద్య. కృష్ణుడు ఇందులో దిట్ట. లేనివన్నీ ఉన్నట్టు భ్రమింప చేస్తాడు. పెద్ద మాయావి. ఆ మాయలో పడి అందులో కిటుకు తెలుసుకోలేక పోయావు....” అని హేళన చేశారా రాక్షస సోదరులు.
కయ్యానికైనా వియ్యానికైనా అలంకారమే ప్రాణం. కృత్రిమ అలంకారాలు పెద్ద ప్రయోజనాల్నే తెస్తాయి. పంచె కట్టి, లాల్చీ వేసుకుంటే దేశభక్తుడైపోతాడు. కాషాయం కట్టి, నామాలు పెట్టుకుంటే మహాభక్తుడై పోతాడు. సూటూబూటూ వేసుకొంటే ఎక్కడలేని అరిష్టోక్రసీ కొట్టొస్తుంది. గాంధీ టోపీకి ఇప్పటికీ కొన్ని చోట్ల పనులు సమకూర్చే శక్తి ఉంది. కాళోజీ ‘నాగొడవ’ లో అంటాడు... “పెట్టుకున్న టోపీలు కాదు, పెట్టిన టోపీలు చూడా”లని! ఏది సహజాలంకారమో, ఏది కృత్రిమాలంకారమో తేల్చుకో గలిగే విచక్షణ మనకుండాలి. లోకఙ్ఞానం అంటే అది!

Sunday, 4 September 2016

వినాయక వ్రతంలో ప్రపంచ శాంతిసందేశం :: డా. జి వి పూర్ణచందు

వినాయక వ్రతంలో ప్రపంచ శాంతిసందేశం
డా. జి వి పూర్ణచందు
తెలుగు వారిలో గణపతి ఆరాధన ఎక్కువ. ప్రపంచ శాంతిని కోరే భారతీయుల ఏకైక పండుగ వినాయక చవితి.
శివుడు, విష్ణువు ప్రధాన దేవతలైనప్పటికీ, దుర్గ, లలిత, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన పరివార దేవతలకూ తెలుగు వాళ్ళు నిత్య దీప ధూప నైవేద్యాలు అందిస్తూనే ఉంటారు. పూజామందిరంలో ముక్కోటి దేవతల బొమ్మలకూ ఒకేసారి పూజచేస్తారు. కాబట్టి, తెలుగువారిలో ఫలానా దేవుడికి భక్తు లెక్కువ అని తేల్చటం కష్టం.
తమిళుల విషయాని కొస్తే అక్కడ ఏకదేవతారాధన ఎక్కువ 50% మంది సుబ్రహ్మణ్య స్వామి (మురుగ)ని నిత్యం కొలుస్తారు. 15% మంది వినాయకుణ్ణి కొలుస్తారని ఒక సర్వే చెప్తోంది. ఈ తేడా స్పష్టమైనదే!
వివిధ జాతులు, భాషలు, సంస్కృతులూ కలగలసిన సంలీన సంస్కృతి తెలుగు వారిది. తమ పూర్వదేవతలందరిని సమానంగా కొలుచుకునే అలవాటు తెలుగువారికి సంక్రమించటానికి కారణం ఇదే!
“గణానాంత్వా గణపతిగ్౦ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా నశ్శృణ్యన్నూతిభి స్సీదసాదనం” ఋగ్వేదం రెండవ మండలంలో (23.01) కనిపించే గణపతి స్తుతి ఇది. ఈ ఋక్కు క్రీ. పూ. 2,500-1800 నాటిదిగా మాక్స్‘ముల్లర్ భావిస్తే, క్రీ.పూ. 6,000 నాటిదని తిలక్ మహాశయుడు భావించాడు. ఇతరులు క్రీ. పూ ౩,౦౦౦ నాటిది కావచ్చునన్నారు.
గణాలకు పతి, మేథావుల్లో కెల్లా మేథావి, బాగా వినేందుకు ఉన్నతమైన చెవులు కలవాడు (మొరాలకించేవాడు), వికాసం కలిగించిన తొలి పరిపాలకుడు, మరింత వికాసం పొందేలా చేయగలవాడు, నూతన ఆలోచనలకు వేదికైన వాడూ అయిన ఓ గణపతి... హవామహే= మా హవిస్సులు గైకొను” అంటూ వేడికోలు ఇందులో కనిపిస్తోంది. గణపతి జలాధిదేవత! అందుకనే గణేశ ఉత్సవాలను నిమజ్జనంతో ముగిస్తారు.
నారాయణోపనిషత్తు (క్రీ, శ. 550)వినాయకుని ఉద్ధేశించి “తత్పురుషాయ విద్మహే/వక్రతుండాయ ధీమహి/తన్నో దన్తి ప్రచోదయాత్” అనే మంత్రం చెప్పింది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల వక్రగతిని చెప్పటానికి ఉపయోగించే ‘వక్ర’ శబ్దాన్నీ గజాననుడి వక్రతుండానికి అన్వయించారు పండితులు. వక్ర అంటే moving backwards అని! జపాన్‘లో దొరికిన ఒక గణేశ విగ్రహంలో వెనకవైపున కూడా ముఖం ఉంటుంది. వెనక నుంచి కూడా చూడగల రక్షకుడిగా ఈ ద్విముఖగణపతి కనిపిస్తాడు. బహుశా తర్వాతి కాలంలో పంచముఖాల గణపతిని కూడా రూపొందించుకుని ఉంటారు
గణాలంటే దేవగణాలు.
గణేశ అంటే వేద మంత్రాది స్తోత్రాలతో స్తుతించే గణాల నాయకుడని అర్థం. ఈ విశేషణాలన్నీ ఋగ్వేద కాలంలో ఇంద్రుడిని ఉద్దేశించినవి! బహుశా ఇంద్రుడే గణపతిగా ఆరోజుల్లో ప్రసిద్ధుడు కావచ్చు. గణపతిని రుద్రుడి రూపంగా యజుర్వేదం భావించింది. నమకం చమకంలో “దేవగణాలకు పతివైన నీకు నమస్కారం” అని రుద్రుణ్ణి స్తుతించటం కనిపిస్తుంది. ఋగ్వేద కాలంలో ఇంద్రుడూ, తరువాతి యుగంలో రుద్రుడూ గణపతులుగా వ్యవహరించి ఉంటారు. “బోధాయన ధర్మ శాస్త్రం” లో విఘ్న, వినాయక, వీర, స్థూల, వరద, హస్తిముఖ, వక్రతుండి, ఏకదంత, లంబోదర, మొదలైన పేర్లతో వేర్వేరు దేవతలు కనిపిస్తారు. బహుశా తరువాతి కాలంలో వీళ్ళందరినీ సంలీనం చేసి, ఒక మహాగణపతిని ప్రతిష్టించుకుని ఉండాలి.
హేరంబ, గణనాయక, గణేశ, ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, డుంఠి (పద్మపురాణం), పిళ్ళారి, చింతామణి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర, అంబాసుత, సిద్ధి వినాయక (సంగీత శాస్త్రాల్లో), సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప,ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ ఇలాంటి అనేక పేర్లతో, వాటికి తగిన లక్షణాలతో గణేశుడు వివిధ కాలాలలో కనిపిస్తాడు. స్కంద (మురుగ, సుబ్రహ్మణ్యస్వామి) కన్నా పూర్వుడు అనడం చారిత్రకంగా ముఖ్యమైన విషయం. 6వ శతాబ్ది నుండీ ఆర్యసంస్కృతి విస్తరణలో భాగంగా జరిగిన పరిణామ క్రమం ఇది కావచ్చునని ప్రఖ్యాత చరిత్రవేత్త డి. చటోపాధ్యాయ అన్నారు. గుప్తులు ఇందుకు ముఖ్య కారకులు కావచ్చు. కాణే మహాశయుడు “the well known characteristics of Ganesa and his worship had become fixed before the fifth or sixth century of the Christian era…” అని వ్రాసారు. అనేకవిధాల పరిణామాలు చెందిన గణేశరూపం, గణేశ ఆరాధనా విధానం పదిహేను వందల యేళ్ళ క్రితం ఒక రూపానికి వచ్చాయని కాణే ప్రభృతులు తేల్చి చెప్పారు.
మనుస్మృతిలో, “విప్రానాం దైవతం శమ్భుః క్షత్రియాణాం తు మాధవాః అనే సూత్రం ప్రకారం, బ్రాహ్మణులు సాంబుని, క్షత్రియులు విష్ణువుని, వైశ్యులు బ్రహ్మని, శూద్రులు గణనాయకుణ్ణి దేవతలుగా కొలవటం గురించి ఉంది. అంటే, ఋగ్వేద కాలంలో దేవగణాధిపతి అయిన గణపతి మనువు కాలానికి శూద్రుల దేవుడిగా మారిపోయాడు. ఈ మార్పుకు దారితీసిన సామాజిక పరిణామాల అధ్యయనం జరగాలి.
ఒకప్పుడు పంచాయతన పూజ ఉండేది. ‘ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం మహేశ్వరం’ - అంటూ సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు ఈ ఐదు దేవతల అర్చననీ పంచాయతన పూజ అన్నారు. శంకరాచార్యుడు (క్రీ. శ. 9వ శతాబ్ది) ఈ ఐదుగురు దేవతలకూ కుమారస్వామిని అదనంగా చేర్చి ‘షణ్మత స్థాపనాచార్యుడు’గా ప్రసిద్ధుడయ్యాడు. జంతుబలి మాన్పించే లక్ష్యంతో శంకరాచార్యులు షణ్మతాన్ని తెచ్చి, ఈ ఉగ్రదేవతలను శాంతి దూతలుగా మార్చారు, గ్రామదేవతగా ఉన్న బెజవాడ దుర్గమ్మ విగ్రహం దగ్గర శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి అమ్మవారిని శాంతమూర్తిగా చేసిన కథ ప్రసిద్ధమే!
జంతుబలి స్థానే కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వటం, రక్తమాంసాల స్థానంలో మోదకాలు-తీపి వంటకాలు నైవేద్యం పెట్టటం, షడ్రసోపేతమైన భోజనాన్ని మహానివేదన పెట్టటం, కల్లు సారాయికి బదులుగా పాయసాలు, పానకాలు తాగటం లాంటి పద్దతులు అమలుకు తెచ్చాడు. అందువలన ఆరాధనా విధానం అహింసాత్మకం అయ్యింది. శాంతికోసం ఆరాధన అనేది ఒక అలవాటయ్యింది. ఆ విధంగా విఘ్నాలు కలిగించే ఉగ్రదేవుడు గణపతి శాంతి పొంది, విఘ్నాలు నివారించే దేవుడయ్యాడు. విజయాన్ని, మేథా సంపత్తినీ, ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ ఇచ్చే శక్తిగా మార్పు పొందాడు.
“ప్రేతన్భూతగణాన్శ్చన్యేయజన్తే తామస జనాః” అంటే భూతప్రేతాది తామస జనులకు నాయకుడిగా ఒకప్పుడు వినాయకుణ్ణి కొలిచిన సందర్భాలు ఉన్నాయి. బహుశా దిష్టిబొమ్మగా వినాయకుడి కీర్తిముఖాలను గుమ్మాలమీద తగిలించటానికి ఇదొక కారణం కావచ్చు.
లింగపురాణం శివుడి అంశతో గణపతి పుట్టినట్టు చెప్తుంది. మత్స్యపురాణంలో పార్వతి నలుగుబొమ్మ కథ కనిపిస్తుంది. ఇంకో కథ కూడా ఉంది. పార్వతి నలుగు పెట్టుకుని ఆ మాలిన్యాన్ని నీటిలో కలిపిందనీ, ఆ నీటిని తాగిన మాలిని అనే రాక్షసి వెంటనే గర్భం దాల్చి గణపతిని ప్రసవించిందనీ, పార్వతి ఆ బిడ్డను తీసుకువచ్చి పెంచిందనీ ఈ కథ చెప్తుంది.
మోదః అంటే ఆనందం. తిన్నవారిని ఆనందింప చేస్తాయి కాబట్టి వీటిని మోదకాలు అన్నారు. తీపి ఉండ్రాళ్ళే కాదు, లడ్డూలవంటి స్వీట్లన్నీ మోదకాలే! వినాయకుడికి వాటిని పెట్టి ఆయనను మంచి చేసుకోవాలనే భావన కూడా చాలామందిలో ఉంది. వినాయకుడంటే బుద్ధి దేవర, వినాయకుణ్ణి పంటల దేవుడుగా కూడా మొక్కుతారు. ఆయనకు మొక్కలయ్య అనే పేరు కూడా ఉంది. పెద్ద చెవులు ఆయనకొక ప్రత్యేకత కలిగించాయి. జనంగోడుని, మొత్తుకోళ్ళని చక్కగా ఆలకించే వాడని చేటంత చెవులు ఆయనకి. మట్టితో వినాయక ప్రతిమను చేసి, పసుపు పట్టిస్తారు. కాబట్టి పచ్చని రంగులో కనిపిస్తూ,లోకాన పచ్చదనాన్ని నింపేవాడుగా ఆయన ప్రసిద్ధుడు. ధాన్యరాశిని ఆసనంగా చేసుకున్నవాడు. అంతేకాదు, నిరాఘాటంగా వ్రాయగల వ్రాయసకాడు కూడా! వ్యాసభగవానుడు ధారగా భారతకథను ఒక కావ్యంగా చెప్తుంటే గంటం ఆగకుండా వ్రాసిన వాడు. వినాయకుణ్ణి పర్యావరణ పరిరక్షకుడిగా కొలుచుకుంటారు. లోకాని కొక శాంతి సందేశం వినాయకుడు. ప్రపంచం కోసం, ప్రకృతికోసం, పర్యావరణం కోసం, సర్వజన హితం కోసం మనం జీవించాలనే సందేశం వినాయకుడి కథలో కనిపిస్తోంది. ఆయన పుట్టినరోజున మనం నేటి పర్యావరణం గురించి, రేపటి మన మనుగడ గురించి ఆలోచించుకునే అవకాశం కలిగించుకోవాలి!