Sunday, 4 September 2016

వినాయక వ్రతంలో ప్రపంచ శాంతిసందేశం :: డా. జి వి పూర్ణచందు

వినాయక వ్రతంలో ప్రపంచ శాంతిసందేశం
డా. జి వి పూర్ణచందు
తెలుగు వారిలో గణపతి ఆరాధన ఎక్కువ. ప్రపంచ శాంతిని కోరే భారతీయుల ఏకైక పండుగ వినాయక చవితి.
శివుడు, విష్ణువు ప్రధాన దేవతలైనప్పటికీ, దుర్గ, లలిత, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన పరివార దేవతలకూ తెలుగు వాళ్ళు నిత్య దీప ధూప నైవేద్యాలు అందిస్తూనే ఉంటారు. పూజామందిరంలో ముక్కోటి దేవతల బొమ్మలకూ ఒకేసారి పూజచేస్తారు. కాబట్టి, తెలుగువారిలో ఫలానా దేవుడికి భక్తు లెక్కువ అని తేల్చటం కష్టం.
తమిళుల విషయాని కొస్తే అక్కడ ఏకదేవతారాధన ఎక్కువ 50% మంది సుబ్రహ్మణ్య స్వామి (మురుగ)ని నిత్యం కొలుస్తారు. 15% మంది వినాయకుణ్ణి కొలుస్తారని ఒక సర్వే చెప్తోంది. ఈ తేడా స్పష్టమైనదే!
వివిధ జాతులు, భాషలు, సంస్కృతులూ కలగలసిన సంలీన సంస్కృతి తెలుగు వారిది. తమ పూర్వదేవతలందరిని సమానంగా కొలుచుకునే అలవాటు తెలుగువారికి సంక్రమించటానికి కారణం ఇదే!
“గణానాంత్వా గణపతిగ్౦ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా నశ్శృణ్యన్నూతిభి స్సీదసాదనం” ఋగ్వేదం రెండవ మండలంలో (23.01) కనిపించే గణపతి స్తుతి ఇది. ఈ ఋక్కు క్రీ. పూ. 2,500-1800 నాటిదిగా మాక్స్‘ముల్లర్ భావిస్తే, క్రీ.పూ. 6,000 నాటిదని తిలక్ మహాశయుడు భావించాడు. ఇతరులు క్రీ. పూ ౩,౦౦౦ నాటిది కావచ్చునన్నారు.
గణాలకు పతి, మేథావుల్లో కెల్లా మేథావి, బాగా వినేందుకు ఉన్నతమైన చెవులు కలవాడు (మొరాలకించేవాడు), వికాసం కలిగించిన తొలి పరిపాలకుడు, మరింత వికాసం పొందేలా చేయగలవాడు, నూతన ఆలోచనలకు వేదికైన వాడూ అయిన ఓ గణపతి... హవామహే= మా హవిస్సులు గైకొను” అంటూ వేడికోలు ఇందులో కనిపిస్తోంది. గణపతి జలాధిదేవత! అందుకనే గణేశ ఉత్సవాలను నిమజ్జనంతో ముగిస్తారు.
నారాయణోపనిషత్తు (క్రీ, శ. 550)వినాయకుని ఉద్ధేశించి “తత్పురుషాయ విద్మహే/వక్రతుండాయ ధీమహి/తన్నో దన్తి ప్రచోదయాత్” అనే మంత్రం చెప్పింది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల వక్రగతిని చెప్పటానికి ఉపయోగించే ‘వక్ర’ శబ్దాన్నీ గజాననుడి వక్రతుండానికి అన్వయించారు పండితులు. వక్ర అంటే moving backwards అని! జపాన్‘లో దొరికిన ఒక గణేశ విగ్రహంలో వెనకవైపున కూడా ముఖం ఉంటుంది. వెనక నుంచి కూడా చూడగల రక్షకుడిగా ఈ ద్విముఖగణపతి కనిపిస్తాడు. బహుశా తర్వాతి కాలంలో పంచముఖాల గణపతిని కూడా రూపొందించుకుని ఉంటారు
గణాలంటే దేవగణాలు.
గణేశ అంటే వేద మంత్రాది స్తోత్రాలతో స్తుతించే గణాల నాయకుడని అర్థం. ఈ విశేషణాలన్నీ ఋగ్వేద కాలంలో ఇంద్రుడిని ఉద్దేశించినవి! బహుశా ఇంద్రుడే గణపతిగా ఆరోజుల్లో ప్రసిద్ధుడు కావచ్చు. గణపతిని రుద్రుడి రూపంగా యజుర్వేదం భావించింది. నమకం చమకంలో “దేవగణాలకు పతివైన నీకు నమస్కారం” అని రుద్రుణ్ణి స్తుతించటం కనిపిస్తుంది. ఋగ్వేద కాలంలో ఇంద్రుడూ, తరువాతి యుగంలో రుద్రుడూ గణపతులుగా వ్యవహరించి ఉంటారు. “బోధాయన ధర్మ శాస్త్రం” లో విఘ్న, వినాయక, వీర, స్థూల, వరద, హస్తిముఖ, వక్రతుండి, ఏకదంత, లంబోదర, మొదలైన పేర్లతో వేర్వేరు దేవతలు కనిపిస్తారు. బహుశా తరువాతి కాలంలో వీళ్ళందరినీ సంలీనం చేసి, ఒక మహాగణపతిని ప్రతిష్టించుకుని ఉండాలి.
హేరంబ, గణనాయక, గణేశ, ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, డుంఠి (పద్మపురాణం), పిళ్ళారి, చింతామణి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర, అంబాసుత, సిద్ధి వినాయక (సంగీత శాస్త్రాల్లో), సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప,ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ ఇలాంటి అనేక పేర్లతో, వాటికి తగిన లక్షణాలతో గణేశుడు వివిధ కాలాలలో కనిపిస్తాడు. స్కంద (మురుగ, సుబ్రహ్మణ్యస్వామి) కన్నా పూర్వుడు అనడం చారిత్రకంగా ముఖ్యమైన విషయం. 6వ శతాబ్ది నుండీ ఆర్యసంస్కృతి విస్తరణలో భాగంగా జరిగిన పరిణామ క్రమం ఇది కావచ్చునని ప్రఖ్యాత చరిత్రవేత్త డి. చటోపాధ్యాయ అన్నారు. గుప్తులు ఇందుకు ముఖ్య కారకులు కావచ్చు. కాణే మహాశయుడు “the well known characteristics of Ganesa and his worship had become fixed before the fifth or sixth century of the Christian era…” అని వ్రాసారు. అనేకవిధాల పరిణామాలు చెందిన గణేశరూపం, గణేశ ఆరాధనా విధానం పదిహేను వందల యేళ్ళ క్రితం ఒక రూపానికి వచ్చాయని కాణే ప్రభృతులు తేల్చి చెప్పారు.
మనుస్మృతిలో, “విప్రానాం దైవతం శమ్భుః క్షత్రియాణాం తు మాధవాః అనే సూత్రం ప్రకారం, బ్రాహ్మణులు సాంబుని, క్షత్రియులు విష్ణువుని, వైశ్యులు బ్రహ్మని, శూద్రులు గణనాయకుణ్ణి దేవతలుగా కొలవటం గురించి ఉంది. అంటే, ఋగ్వేద కాలంలో దేవగణాధిపతి అయిన గణపతి మనువు కాలానికి శూద్రుల దేవుడిగా మారిపోయాడు. ఈ మార్పుకు దారితీసిన సామాజిక పరిణామాల అధ్యయనం జరగాలి.
ఒకప్పుడు పంచాయతన పూజ ఉండేది. ‘ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం మహేశ్వరం’ - అంటూ సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు ఈ ఐదు దేవతల అర్చననీ పంచాయతన పూజ అన్నారు. శంకరాచార్యుడు (క్రీ. శ. 9వ శతాబ్ది) ఈ ఐదుగురు దేవతలకూ కుమారస్వామిని అదనంగా చేర్చి ‘షణ్మత స్థాపనాచార్యుడు’గా ప్రసిద్ధుడయ్యాడు. జంతుబలి మాన్పించే లక్ష్యంతో శంకరాచార్యులు షణ్మతాన్ని తెచ్చి, ఈ ఉగ్రదేవతలను శాంతి దూతలుగా మార్చారు, గ్రామదేవతగా ఉన్న బెజవాడ దుర్గమ్మ విగ్రహం దగ్గర శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి అమ్మవారిని శాంతమూర్తిగా చేసిన కథ ప్రసిద్ధమే!
జంతుబలి స్థానే కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వటం, రక్తమాంసాల స్థానంలో మోదకాలు-తీపి వంటకాలు నైవేద్యం పెట్టటం, షడ్రసోపేతమైన భోజనాన్ని మహానివేదన పెట్టటం, కల్లు సారాయికి బదులుగా పాయసాలు, పానకాలు తాగటం లాంటి పద్దతులు అమలుకు తెచ్చాడు. అందువలన ఆరాధనా విధానం అహింసాత్మకం అయ్యింది. శాంతికోసం ఆరాధన అనేది ఒక అలవాటయ్యింది. ఆ విధంగా విఘ్నాలు కలిగించే ఉగ్రదేవుడు గణపతి శాంతి పొంది, విఘ్నాలు నివారించే దేవుడయ్యాడు. విజయాన్ని, మేథా సంపత్తినీ, ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ ఇచ్చే శక్తిగా మార్పు పొందాడు.
“ప్రేతన్భూతగణాన్శ్చన్యేయజన్తే తామస జనాః” అంటే భూతప్రేతాది తామస జనులకు నాయకుడిగా ఒకప్పుడు వినాయకుణ్ణి కొలిచిన సందర్భాలు ఉన్నాయి. బహుశా దిష్టిబొమ్మగా వినాయకుడి కీర్తిముఖాలను గుమ్మాలమీద తగిలించటానికి ఇదొక కారణం కావచ్చు.
లింగపురాణం శివుడి అంశతో గణపతి పుట్టినట్టు చెప్తుంది. మత్స్యపురాణంలో పార్వతి నలుగుబొమ్మ కథ కనిపిస్తుంది. ఇంకో కథ కూడా ఉంది. పార్వతి నలుగు పెట్టుకుని ఆ మాలిన్యాన్ని నీటిలో కలిపిందనీ, ఆ నీటిని తాగిన మాలిని అనే రాక్షసి వెంటనే గర్భం దాల్చి గణపతిని ప్రసవించిందనీ, పార్వతి ఆ బిడ్డను తీసుకువచ్చి పెంచిందనీ ఈ కథ చెప్తుంది.
మోదః అంటే ఆనందం. తిన్నవారిని ఆనందింప చేస్తాయి కాబట్టి వీటిని మోదకాలు అన్నారు. తీపి ఉండ్రాళ్ళే కాదు, లడ్డూలవంటి స్వీట్లన్నీ మోదకాలే! వినాయకుడికి వాటిని పెట్టి ఆయనను మంచి చేసుకోవాలనే భావన కూడా చాలామందిలో ఉంది. వినాయకుడంటే బుద్ధి దేవర, వినాయకుణ్ణి పంటల దేవుడుగా కూడా మొక్కుతారు. ఆయనకు మొక్కలయ్య అనే పేరు కూడా ఉంది. పెద్ద చెవులు ఆయనకొక ప్రత్యేకత కలిగించాయి. జనంగోడుని, మొత్తుకోళ్ళని చక్కగా ఆలకించే వాడని చేటంత చెవులు ఆయనకి. మట్టితో వినాయక ప్రతిమను చేసి, పసుపు పట్టిస్తారు. కాబట్టి పచ్చని రంగులో కనిపిస్తూ,లోకాన పచ్చదనాన్ని నింపేవాడుగా ఆయన ప్రసిద్ధుడు. ధాన్యరాశిని ఆసనంగా చేసుకున్నవాడు. అంతేకాదు, నిరాఘాటంగా వ్రాయగల వ్రాయసకాడు కూడా! వ్యాసభగవానుడు ధారగా భారతకథను ఒక కావ్యంగా చెప్తుంటే గంటం ఆగకుండా వ్రాసిన వాడు. వినాయకుణ్ణి పర్యావరణ పరిరక్షకుడిగా కొలుచుకుంటారు. లోకాని కొక శాంతి సందేశం వినాయకుడు. ప్రపంచం కోసం, ప్రకృతికోసం, పర్యావరణం కోసం, సర్వజన హితం కోసం మనం జీవించాలనే సందేశం వినాయకుడి కథలో కనిపిస్తోంది. ఆయన పుట్టినరోజున మనం నేటి పర్యావరణం గురించి, రేపటి మన మనుగడ గురించి ఆలోచించుకునే అవకాశం కలిగించుకోవాలి!

No comments:

Post a Comment