ఏ దేశమేగినా...ఎందు కాలిడినా...
న్యూజెర్సీ (అమెరికా) రాష్ట్ర మంత్రిగా ఎదిగినతొలి తెలుగు తేజం
శ్రీ ఉపేంద్ర చివుకుల గారికి
విజయవాడలో అభినందన
అమెరికన్ సామాజిక వ్యవస్థలో ఉన్నత రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న తొలి తెలుగు బిడ్డ శ్రీ చివుకుల ఉపేంద్ర! న్యూజెర్సీ రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన మొదటి తెలుగువాడు, నాల్గవ భారతీయుడు కూడా! న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యుడిగా (అసెంబ్లీ మాన్) నాలుగు సార్లు ఎన్నికై, ఇటీవలే న్యూజెర్సీ రాష్ట్ర ప్రజావసరాల శాఖ మంత్రి గా(బి.పి.ఓ), న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీ బోర్డు కమీషనర్‘గా బాధ్యతలు స్వీకరించి ఆ దేశంలో తెలుగువారి ఉనికికి ఒక ఉన్నతిని తెచ్చారు!
నెల్లూరు నవాబుపేట అగ్రహారంలో 1950 అక్టోబర్ 8న జన్మించి,కటిక పేదరికంలోపెరిగారాయన. దాతల సహకారంతో మద్రాసు వివేకానందా కాలేజీలో పీ.యూ.సీ, గిండీ కాలేజీలో ఎలెక్ట్రికల్ ఉన్నత శ్రేణిమార్కులతో ఇంజనీరింగ్ చేశారు. గోపాల్ భాయ్ దేశాయి (గుజరాత్) అండతో న్యూయార్క్ సిటీ యూనివర్శిటీలో మాష్టర్ డిగ్రీ పొందారు.
క్యూబా అమ్మాయి ‘డేసీ’ని ప్రేమ వివాహంచేసుకున్నారు.డైసీ కూడా తెలుగు నేర్చుకుంది. చక్కగా మాట్లాడుతుంది. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ సూరజ్, దమయంతి అని పేర్లు పెట్టుకున్నారు. సూరజ్ ‘వాషింగ్టన్ డిసీ’లో అటార్నీగా ఉన్నాడు. దమయంతి గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో శిక్షణపూర్తి చేసుకొంది.
2002-2014 మధ్య కాలంలో శ్రీ చివుకుల న్యూ జెర్సీ జెనరల్ అసెంబ్లీ సభ్యుడిగా, 17వ లెజిస్లేటివ్ డిస్ట్రిక్ట్ నుండి ఏడు సార్లు ఎన్నికయ్యారు. డెప్యూటీ స్పీకర్‘గా పనిచేశారు. 2014 సెప్టెంబరులో న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డుకి కమిషనర్‘గా అమెరికన్ సెనేట్ ఆయన్ని 35-1 ఓట్ల తేడాతో ఎంపిక చేసిందంటే ఆ పదవికి అక్కడున్న ప్రాధాన్యత అంతటిది.
కార్మికులకు కనీసవేతనాలు, మధ్యతరగతి సంక్శ్హేమం సామాజిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, వాళ్ళ పిల్లల చదువులు లాంటి అంశాల పైన శ్రీ ఉపేంద్ర చివుకుల మొదటి నుండీ పోరాటాలు చేయటం ద్వారా డెమొక్రటిక్ పార్టీలో ప్రముఖుడిగా ఎదిగా రాయన. 1994లో అప్పటి న్యూజెర్సీ గవర్నర్ శ్రీ చివుకులను న్యూజెర్సీ రాష్ట్ర సామాజిక సేవా పరిశీలకుల బోర్డులో పౌర (పబ్లిక్) సభ్యుడిగా నామినేట్ చేయటంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ఫ్రాంక్లిన్ పట్టణ కౌన్సిల్ 5వ వార్డు నుండి 1997లోనూ 2001లోనూ రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1998లో డెప్యూటీ మేయర్ గానూ, 2000లో మేయరుగా కూడా పనిచేశారు. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర వహించే ఎలెక్టోరల్ కాలేజీ (ఎన్నికల కూటమి)లో ఆయనది కీలక పాత్ర. అమెరికన్ సెనేట్‘కు (అత్యుత్తమ పార్లమెంటరీ వ్యవస్థ) ఎన్నిక కావటానికి తన పార్టీ అభ్యర్ధిగా ఆయన విఫల యత్నం చేయాల్సి వచ్చింది. అయినా దీక్ష సడల లేదు. సెనెటర్ గా ఎన్నికవ్వాలన్నది ఆయన లక్ష్యం.
ప్రభావ శీలత, స్ఫూర్తి దాయకమైన వ్యక్తిత్వం, వినమ్రత, కలబోసిన అసాధారణ ప్రతిభావంతుడు శ్రీ ఉపేంద్ర చివుకుల. అమెరికన్ సామాజిక వ్యవస్థలో రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఒక సామాన్యుడైన తెలుగువాడు ఎదగటం కష్టం కావచ్చు నేమో గానీ అసాధ్యం కాదు. శ్రీ ఉపేంద్ర చివుకుల లక్ష్య సాధకుడు కావాలని ఆశిద్దాం.
కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం
No comments:
Post a Comment