వంటింటి నుండి మింటింటిదాకా... మహిళాభిరామం!
డా. జి వి పూర్ణచందు
లేచింది, నిద్రలేచింది మహిళాలోకం అంటూ వ్యంగ్య భాణాలు ఎన్ని తగిలినా మహిళా శక్తి ఒక నిర్ణాయకమైనదిగానే రాణిస్తోంది. వంటింటినుండి మింటింటిదాకా,
గగనసీమలు దాటగలిగిన మహిళా శక్తిని ఆపగలిగే శక్తి మగాళ్ళకు లేదిప్పుడు.
మహిళ అంటే చదువుల తల్లి. మహిళ అంటే ఐశ్వర్య లక్శ్మి.మహిళ అంటే ఆదిశక్తి. మహిళ
అంటే విఙ్ఞానగని. ‘విఙ్ఞానఘని’ కూడా! కలాలూ పడుతున్నారు, హలాలూ పడ్తున్నారు,
వస్తాదులకన్నా మిన్నగా కుస్తీలూ పడుతున్నారు. పాలిస్తున్నారు, శాసిస్తున్నారు. భవిష్యత్తును
శ్వాసిస్తున్నారు.
మణిపూర్‌లోని మారుమూల పల్లెలో ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ‘మేరీకోమ్’
ఎన్నో అవాంతరాలను దాటి అంతర్జాతీయ బాక్సర్‌గా పేరు తెచ్చుకో గలిగింది. తల్లిగా బాధ్యతలు
నిర్వహిస్తూనే ఐదుసార్లు అంతర్జాతీయ బాక్సర్‌గా నిలిచింది. ఆమె జీవితం ఎంతోమంది
యువతులకు స్ఫూర్తిదాయకమైంది. కష్టాలు వెన్నాడినా కఠోర శ్రమ చేస్తే అద్భుతాలను
సాధించవచ్చని మేరీకోమ్ నిరూపించింది, శారీరక, మానసిక వికాసానికి,
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి బాక్సింగ్‌కు మించిన
క్రీడ మరొకటి లేదని ఇప్పుడు చాలామంది యువతులు భావిస్తున్నారు.
ప్రపంచాన్ని మహిళలు నడిపిస్తే
ఆయుధాల ఖర్చు సైనిక వ్యయాలూ తగ్గిపోతాయనీ, ప్రపంచంలో మానవులంతా తన
కన్నబిడ్డల్లాంటివాళ్ళే ననుకోగలిగే మనసు మహిళలకే ఉంటుంది కాబట్టి స్త్రీలకు
ప్రపంచనాయకత్వం అప్పగిస్తే యుద్ధాల పీడ తగ్గిపోయి, విశ్వశాంతి సుసాధ్యం అవుతుందనీ
మహిళాభ్యుదయ నాయకులంటారు.
ఆడవాళ్ళ ఆలోచనా తీరు మాగాళ్ళు రూపొందించే పాలనా వ్యవస్థకు అందదు. అందుకునే
దృష్టికూడా వాళ్ళకు లేదు. అందుకే మహిళాభ్యుదయం మనదేశంలో కొంచెం ఆలస్యంగా
నడుస్తుంది.
అరవై యేళ్ళ ముసిలోడికి ఏడేళ్ళ బాలికనివ్వటానికి తాంబూలా లిచ్చేసి, తన్నుకు చావమంటాడుకన్యాశుల్కంలో
అగ్నిహోత్రావధానులు. మాట మాత్రం అయినా చెప్పలేదేమని భార్య అడిగితే ఆడముం..లతోనా
వ్యవహారాలు?”.అని ఈసడిస్తాడు. అది అప్పటి మాట. ఈ రోజున అలా అనగలిగే ధైర్యం
మగాళ్ళకు లేదు. “మా అమ్మాయి ఓకే చేస్తే మీకు కబురు పెడతాను” అంటున్నాడు
పిల్లతండ్రి. అది మహిళాభ్యుదయం సాధించిన ఒక ముందడుగు.
భారతదేశంలో ఇలాంటి ముందడుగులు వేగంగా పడాలంటే కొంచెం కష్టమే! పురుషుడి చుట్టూ
అల్లుకున్న సామాజిక వ్యవస్థ మహిళల నిర్ణాయక శక్తిని అడ్డుకుంటుంది. కంప్యూటర్ యుగం
అని చెప్పుకుంటున్నా రకాల అణచివేతలు తప్పటం లేదు. అన్ని అవరోధాలూ అధిగమించి సమాజంలో
ఉన్నత స్థానాలకు పోటీ పడుతూ ఆడవాళ్ళు బయటికొస్తున్న కొద్దీ, లింగ వివక్ష, లైంగిక
వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాలలో పనిభారం, శారీరక మానసిక ఒత్తిడి ఇంటా బయటా బరువు బాధ్యతలు అన్నీ భరిస్తున్నా ఇంట్లో
మామూలు గృహిణి బాధ్యతల విషయంలో మగాళ్ల ఈసడింపులు మామూలుగానే ఉంటున్నాయి. బయట తన ఆఫీసులో బాసే అయినా ఇంట్లో బానిసే
అన్నట్టుంది చాలా మంది ఉద్యోగినుల పరిస్థితి. అందువలన, స్త్రీశక్తి తాబేలు నడక నడుస్తోంది.
మహిళాభ్యుదయ లక్ష్యం లూపులైనులో నిలబడిపోతోంది.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచిన రోజుల్లో
ముత్తాత నుండి మునిమనవరాలిదాకా అనేకమంది ఉండేవారు కాబట్టి, ఆ రొజుల్లో మానవ
సంబంధాల గురించి, స్త్రీ పురుషుల పరస్పర గౌరవ సంబంధాల గురించి
పౌష్టిక ఆహారం గురించి, పిల్లలకు గ్రహింపు ఎక్కువగా ఉండేది.
మనం పరిమిత కుటుంబంలోకీ, ఇంకా అత్యంత పరిమిత కుటుంబ వ్యవస్థలోకీ మారాక ఈనాటి
తరానికి సామాజిక జీవన వ్యవస్థ గురించి ప్రతీదీ వివరించి చెప్పవలసిన పరిస్థితి ఉంది.
హాస్టళ్లలో చదువులు, ర్యాంకుల వేట, అమెరికా ఉద్యోగాల కారణంగా
తల్లిదండ్రులతో కూడా పిల్లలకు బలమైన బంధాలు ఏర్పడటం రానురానూ తగ్గిపోతోంది.
అందువలన ఆరోగ్యవంతమైన కుటుంబవ్యవస్థ గురించిన అవగాహన ఈ తరానికి అంతగా ఉండటంలేదు.
‘మహిళాభిరామం’ అంటే మహిళలకు సముచితస్థానం కల్పించడానికి, సమాజ వైఖరిలో మార్పు తేవడం అని! మన విద్యా విధానం మహిళా
సాధికారత పరంగా ఉండాలి. తమ హక్కులగురించి ఆడపిల్లలు తెలుసుకునేలాగానూ, స్త్రీల
సమాన హక్కులను గౌరవించే బాధ్యతని మగపిల్లలు గ్రహించేలాగానూ పాఠ్యాంశాలు ఉండాలి. సెక్సు
ఎడ్యుకేషన్ కాదు. ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఈ తరానికి అవసరం. మహిళా సాధాకారికత గురించి ‘అపోహలు లేని అవగాహన’ని ఆడ మగ ఇద్దరికీ సమానంగా
కలిగించే చదువులు స్త్రీ పురుషుల మధ్య పరస్పర గౌరవం గురించి బోధించే చదువులు
కావాలిప్పుడు!
ఏ దేశంలో మహిళలు జాగృతంగా ఉంటారో ఆ దేశంలో శాంతి వర్థిల్లుతుంది. ఆడవాళ్ల
చదువుని వ్యతిరేకించే ఉగ్రవాదులతో పోరాడిన ‘మలాలా’ అత్యంత పిన్న వయసులో
నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న
వ్యక్తిగానూ, తొలి పాకిస్తానీ మహిళగానూ
ఆదర్శప్రాయంగా నిలబడింది. పోరాట పటిమను అలవాటు చేసుకుంటే పోయేదేమీ లేదు...
అశాంతి, అఙ్ఞానం, అవిద్య, అవమానాలు తప్ప!
మహిళా చైతన్యానికి కంకణధారిగా, మరో
‘మరియా మాంటిస్సోరీ’గా ఙ్ఞానదాత డా. కోటేశ్వరమ్మగారు నేర్పించే చదువులు ఇలా ‘మహిళాభిరామభావన’ చుట్టూ పరిభ్రమిస్తూ
ఉంటాయి. మహిళలకు
తమ హక్కులు తెలిసేలా వాళ్ళ ఙ్ఞానం పెరిగేందుకు ‘మాంటిస్సోరీ మాత
నిర్వహించే కార్యక్రమాలు గొప్పవి. ఎందరో ప్రముఖ మహిళల జీవిత చరిత్రల్ని
ఆమె వ్రాశారు. సమాజ అభ్యున్నతిలో మహిళల భాగస్వామ్యం పైన అత్యధిక రచనలు చేసిన వ్యక్తిగా
ఆమె కీర్తి గడించారు.తమ విద్యార్థినుల్లో ఆత్మగౌరవం పెంపొందింపచేయటం,
మనోబలాన్ని నూరిపోయటం, మార్గదర్శనం చేయటం ఆమె బోధనావిధానంగా
ఉంటుంది.
బెజవాడ మాంటిస్సోరీ విద్యాసంస్థలు ఈ రోజున వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాయి.
ఇంచుమించు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి తెలుగు మహిళా జాగృతికే అంకితమైన డా.
వేగే కోటేశ్వరమ్మగారి చదువుల గుడి ‘మహిళాభిరామాలయం’గా నిలిచింది. ఆ చదువులతల్లికి
ప్రణామాలు.
No comments:
Post a Comment