Thursday, 20 November 2014

ఇచ్చే చేతులతో పాలన! డా. జి వి పూర్ణచందు

ఇచ్చే చేతులతో పాలన!
డా. జి వి పూర్ణచందు

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై(
బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
కాలంలో అంటూ కాలంలోనే కాలం గురించి పోతనగారు చెప్పిన గొప్ప పద్యాలలో ఇదొకటి. అన్నీ ప్రశ్నలే! సమాధానాలను మనం కాలం లోంచి వెదుక్కోవాలి. కాలంలో రాజులెక్కడున్నారయ్యా అనుకోనవసరం లేదు, కాలం పాలకుల్లో తామే రాజులం అనీ, తమదే రాజ్యం అనే భావన గూడు కట్టుకుని ఉంది కాబట్టి! రాచరికం పోయిందిగానీ రాజాధిరాజ భావన పోలేదు రాజ్యం చేస్తున్న వారిలో! అన్ని పార్టీల వాళ్ళలోనూ ఇదే ధోరణి నేటి ప్రజాస్వ్యామ్యంలో ప్రముఖం అయ్యింది,
దుర్యోధనుడికి తట్టలేదు గానీ ప్రజాస్వామ్యంలో పాలిస్తానని ఒక్క మాట అని ఉంటే, ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు. తనూ, తన సోదరులు కలిసి దుర్యోధనుడికి వంద వోట్లు పడతాయి. పాండవులకు ఐదు వోట్లతో డిపాజిట్ గల్లంతై ఉండేది. ఇలాంటి ప్రజాస్వామ్య ప్రమాదాన్ని శంకించే కాబోలు, ధర్మరాజు ముందు జాగ్రత్తగా `మేం నూటైదుగురంఅంటూ ఉండేవాడు
దుర్యోధనుడు కూడా పాండవులు అఙ్ఞాతవాసం నుండి తిరిగొచ్చే సమయానికి విపరీతంగా దాన ధర్మాలు చేసి, ప్రజాభిమానం పెంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నాడట! కానీ ఒక ప్రపంచ యుద్ధాన్ని తలపించే యుద్ధం జరగటాన, ఎన్నికలప్రహసనం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా విషయాంతరం.
దానం అడగటానికి వచ్చినవాడు మారువేషంలో ఉన్న విష్ణువే! జాగ్రత్తగా ఉండకపోతే ఓడతావుఅని గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని హెచ్చరించినప్పుడు బలి చెప్పిన సమాధానం పద్యం! ఇది నాటి రాచరికానికీ, నేటి దొంగ ప్రజాస్వామానిక్కూడా వర్తించే సమాధానం.
కారే రాజులు?: కాలంలో ఎవరైనా,ఎలాంటి వాడైనా రాజు కావటం లేదా?
రాజ్యముల్ గలుగవే?: వాళ్ళకి రాజ్యాలు దక్కటం లేదా?
గర్వోన్నతిం బొందరే?: వొళ్ళు పొగరెక్కి వ్యవహరించట్లేదా?
వారేరీ?: అలాంటి రాజకీయ దురంధరులుగా తమని చిత్రించుకున్న వాళ్ళు ఏవయ్యారు? లోకంలోంచే పోయారు
సిరి మూటగట్టుకుని పోవంజాలిరే?: అధికారంలో ఉన్న కాలంలో మూటగట్టుకున్న సిరినంతా పోయేటప్పుడు పట్టుకు పోగలిగారా?
భూమిపై పేరైనంగలదే?: నేలపైన వాళ్ళ పేరైనా ఉందా? కనీసం వాళ్లను తలుచుకునే వాడున్నాడా?
శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై: శిబిచక్రవర్తి లాంటివాళ్ళు ప్రజాదరణ పొంది కీర్తిమంతులై నిలిచారు.
యీరే కోర్కులు: ఎందుకంటే మనఃస్ఫూర్తిగా అడిగింది అడిగినంతగా ఇచ్చారు కాబట్టి! ప్రజలకోసం ఎంతో కొంత చేశారు కాబట్టి.
వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా?: ఇంత కాలం తరువాత కూడా అలాంటి వాళ్ళని ప్రజలు మరిచారా గురుదేవా?  
రాజుమరణిస్తే శిల్పంలో జీవిస్తాడు, సుకవి మరణిస్తే జనం నాలుకలమీద జీవిస్తాడన్న జాషువా మాటలు ఇక్కడ గుర్తుకొస్తాయి. రోడ్లను ఆక్రమించి శిల్పాలు నిలబెట్టేవాళ్ళకిది చురక! లోకోపకారి చిరంజీవి అవుతాడనేది దీని సారాంశం.
వామనుడు సత్యలోకం కంటే ఎత్తికు పెరిగి బ్రహ్మాండం అంతా నిండి, ఇదంతా తనకు దానంగా కావాలని అడిగాడంటే అదంతా బలి చక్రవర్తి ఆధీనంలోని రాజ్యం అన్నట్టే కదా! వామనుడు అడిగింది భూమికి పైన ఉన్న రాజ్యాన్నే! ఇంకా అంత రాజ్యం బలి చక్రవర్తికి భూమికి అడుగున పాతాళాది లోకాల్లో ఉంది. తనవి ఇచ్చే చేతులని చాటటమే తనకు నిజమైన ఆస్తి, కీర్తి అని గుర్తించిన రాజు కాబట్టి, తనను తాను బలి చేసుకోవటానికే సిద్ధపడ్డాడు బలి చక్రవర్తి.

మచ్చుకు ఒక్క ప్రధాని, ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి అలాంటి వాడు ఉంటాడేమోనని ప్రజలు ఒక్క ఆశతో ప్రతిసారీ తమ ఓటుని బలి ఇచ్చుకుంటూ ఉంటారు... ప్రజాబలిస్వామ్యంలో!

No comments:

Post a Comment