ప్రణయ
స్నేహాలు
డా. జి వి పూర్ణచందు
ప్రేమించే తీరాలి! కాలేజీలో చదువుకోవటం అంటే ప్రేమించటమే అనేది వాడుకలో ఉన్న అర్థం! కనీసం చదువు పూర్తయ్యే వరకూ అయినా ప్రేమిస్తూ ఉండాలి. ఆ తరువాత రెండో అడుగు మొదలౌతుంది. దాని పేరు లేచిపోవటం. లేచి పోకుండా ఇంట్లో పడి ఉండే బతుకు వ్యర్థం అని ‘లోకంకోడి’ కూస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం... ‘లేచిపోవటం కూడా చేతకాని వాళ్ళు స్వతంత్రంగా జీవించటం తెలియని దద్దమ్మలు.
ఎవరికి వాళ్ళు పునర్మూల్యాంకనం చేసుకుంటే ఇది కామమో, మోహమో, ప్రేమో తేల్తుంది. అది ‘ప్రేమే’నంటుంది పెమిక
హృదయం ప్రేమించటం తెలియని వాడివి పిల్లల్ని ఎందుకు కన్నావయ్యా అని కన్నబిడ్డ తండ్రిని నిలదీసి అడిగితే నోరు మూసుకోవటానికి ఆ తండ్రికి రెండు చేతులూ చాలవు.
ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఆత్మతో కూడి ఉన్న మనసూ కలిసి, వ్యక్త పరిచేది ప్రేమ. ఐదు కర్మేంద్రియాలతో భావప్రాప్తి పొందాలని కోరుకునేది కామం అని వాత్స్యాయనం స్పష్టంగా నిర్వచనం
ఇచింది. వీటిలో కామప్రవృత్తి సర్వప్రాణికీ సామాన్య
మైన విషయం. ప్రేమ ప్రవృత్తి కొందరికి మాత్రమే విశేషంగా ఉండేది. కాబట్టి దీన్ని‘విశేషకామం’గా చెప్పటం జరిగింది. కాముకు
లంతా ప్రేమికులు కాలేరు! ప్రేమని కామంలో రంగరించాక అది కామమే
అవుతుంది గానీ ప్రేమ ఎంతమాత్రమూ కాదు. కామంతో ముడి పడేది
ప్రేమ అంటే, అది అనుకునేవాళ్ళ దౌర్బల్యమే తప్ప నిజం కాదు.
కామంలో ఉత్తమ మధ్యమ అథమ స్థాయిలున్నాయి.
1.
ఉత్తమ కామం: సత్సంతానం కోసం మాత్రమే జరిపేది ఉత్తమ కామం. స్త్రీకి నెలలో ఒక రోజున మాత్రమే స్త్రీబీజం విడుదల అవుతుంది. విడుదలై కొద్ది గంటల్లో నశించిపోతుంది. ఆ కొద్ది సేపట్లో పురుషబీజ కణాలు ఆమె గర్భాశయానికి చేరి, స్త్రీ బీజాన్ని కలియ గలిగితేనే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆ ఒక్క రోజున
చట్టబద్ధమైన సంతానం కావాలని కోరుకుంటూ, దంపతుల మధ్య జరిగే రతిని
ప్రేమ, కామాల చట్రంలో బిగించకూడదు. అది జాతి మనుగడనీ,
సమాజ శ్రేయస్సునీ కోరి జరిపేది కాబట్టి, ఉత్తమ కామం.
2.
మధ్యమ కామం: సంతాన కోరికతో నిమిత్తం లేకుండా చట్టబద్ధమైన దంపతుల మధ్య, వారు ప్రేమికులు అయినా కాకపోయినా ఇష్టపూర్తిగా జరిగే లైంగిక వ్యవహారాన్ని మధ్యమ కామం అంటారు.
3. అథమ కామం: ఇది రెండు రకాలుగా ఉంటుంది.
(అ) కేవలం కుతి తీర్చుకునేందుకు జరిపే
చట్టవ్యతిరేక క్రీడ.
(ఆ) ప్రేమ ముసుగులో జరుపుకునే చట్ట వ్యతిరేక క్రీడ.
ఈ రెండో అంశమే ఇప్పుడు చర్చనీయాంశం. పరమ అసభ్యకరమైన భంగిమల్లో యువతీ యువకుల్ని చూపిస్తూ ఇదే ప్రేమంటే
అని మనల్ని నమ్మమంటాయి తెలుగు సినిమాలు. యువతీ యువకులు నమ్మక పోతేనే కదా ఆశ్చర్యం.
“శాస్త్రాణాం
విషయ స్తావత్ యావన్మందరసా నరః, రతిచక్రే ప్రవృత్తేతు నైవ శాస్త్రం నచ క్రమః- శాస్త్రప్రకారం హేతుబద్ధంగా శీలవంతంగా జీవించాలని
అనుకుంటారు గానీ, వాత్స్యాయనుడు చెప్తాడు- ఒక సారి రతిచక్రం
తిరగటం మొదలెడితే శాస్త్రాలూ, క్రమాలూ ఏవీ ఉండవని! “వైద్యుడు కుక్కమాంసం రసగుణవీర్య విపాకాలన్నీ శాస్త్రంలో
చెప్తాడు. శాస్త్రంలో ఉంది కదా అని దాన్ని తినాలని కాదు. అలాగే సెక్సు విషయంలో పరమ
అసహ్యమైన, ఏహ్యమైన, ఛండాలమైన వాటిని కూడా కామశాస్త్రంలో నేను చెప్పాను. చెప్పినంత మాత్రాన
అవన్నీ చెయ్యాలని కాదు...” అని
తేలికగా తప్పించుకున్నాడు వాత్స్యాయనుడు. దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ తప్పు మనదే!
కేవల కామంతో మాత్రమే మనసు పారేసుకుని ప్రేమించానని
భ్రమించి, మోసపోయి అష్టకష్టాలు పడ్డ శకుంతల కథ,
ఇంద్రుడు మోసగించి అనుభవించిన అహల్య కథలు ఈనాటి యాసిడ్ కథలకూ అభయ కథలకూ
భిన్నమైన వేమీ కాదు. కామానికీ ప్రేమకూ మధ్య హద్దుగా ఉన్న సన్నని గీతని చేరిపేస్తే వ్యథలే
కథ లౌతున్నాయి.
పారిశ్రామికీకరణం లోంచి ప్రపంచీకరణం లోకి వ్యవస్థ
మారుతున్నకాలంలో ఫేసుబుక్ ప్రేమలు సహజం అవుతాయి. ముక్కూ ముఖం తెలీని వాణ్ణి ఎలా
ప్రేమించావే... అనడుగుతారు ఫేసుబుక్ ప్రేమికురాల్ని. ముక్కూ ముఖ తెలిసి ప్రేమించిన
వాళ్లంతా సరైన నిర్ణయాలే తీసుకున్నారన గలమా...? అలాగని తల్లిదండ్రులు కుదిర్చిన
సంబాంధాలన్నీ నిలకడగా ఉన్నాయా? విఫల దాంపత్యాలు ప్రేమ పెళ్ళిళ్లలో ఎన్ని ఉన్నాయో,
పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ల లోనూ అన్నీ ఉన్నాయి. కాబట్టి, కుటుంబాలు కూలటానికి,
ప్రేమ వివాహాలకీ లంకె లేదు. రెండూ వేర్వేరు విషయాలు రెండింటికీ దేని కారణాలు
దానివి.
ప్రేమ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గురించి మాత్రమే
మనం ఆలోచించాలి. ఇది సమాజానికి ఏవిధంగా
హాని చేస్తుందో గమనించాలి. “భద్రం ప్రేమ సు మానుషస్య కథ
మప్యేకం హి తత్ప్రాప్యతే!” అంటుంది శాస్త్రం. ప్రణయ
స్నేహం అనేది మాత్రమే మంచి మనుషుల్ని సృష్టిస్తుంది. తమది కామం కాదు, ప్రేమే అని
వాదించే వాళ్ళు జీవితాన్ని సుఖమంతం చేసుకోవాలనే కదా ప్రేమిస్తున్నారు...! అందుకు
మరింత ప్రణాళికా బద్ధంగా, హేతు బద్ధంగా, సర్వ జనామోదంగా, బాధ్యతాయుతంగా
ఆలోచించాలి. తల్లి దండ్రుల బాధ్యతని కాదని తమ ప్రేమ దారిన తాము పోతున్నప్పుడు
బాధ్యత తామే తీసుకోవాలి కదా!
No comments:
Post a Comment