అరటితో పెరటి వైద్యం
డా. జి వి పూర్ణచందు
అరటి మొక్క చెట్టులా కనిపించే ఒక పొద. తాటి
చెట్టులాగే దీనికి తలభాగం పెరిగి పెద్ద చెట్టులా కనిపిస్తుంది. దాని పొడవుకు
తగ్గట్టే దాని ఆకులూ రెండు నుండి మూడు మీటర్లు పొడుగున పెరిగి ఉంటాయి. కాయలన్నీ ఒక
పొడవైన గెలగా కాస్తాయి. పది పన్నెండు కాయల్ని ఒక హస్తం లేదా అత్తం అంటారు
ఇవి సమశీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాల్లోనే
పెరుగుతాయి. ఎందుకంటే దీని కాయలు తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర పాలిపోతాయి, అందుకనే, వీటిని ఇళ్ళల్లో ఫ్రిజ్జుల్లో పెట్టరు, అలాగే అతి వేడిగా ఉన్న కాలంలో కూడా మరుసటి
రోజుకే మగ్గి పోయి పాడై పోతాయి.
దీని ఆకులు పొడవైన గొట్టంలా చుట్టుకుని పెరిగి, విచ్చుకుంటాయి
అందుకని దాని మధ్య ఈనెకు ఒక పక్క లేతగానూ, రెండో పక్క ముదురుగానూ ఉంటుంది. వడ్డించేప్పుడు ఆకు
కొస భాగం ఎడన వైపు ఉండేలా వేసుకుంటే లేత భాగం వేపు అన్నం కలుపుకునుఇ తింటానికి
అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ కుటుంబాలలో అరిటాకు విస్తరి
వేసేప్పుడు కొనభాగం ఎడమ వైపు ఉండే ఆఅచారాన్ని తప్పక పాటిస్తారు.
అరటి చెట్టు నుండి గెలను కోసిన తర్వాత అరటి
చెట్టు కాండాన్ని నరికి దాని పిలకలను తరువాతి పంటగా వాడుకొంటారు. ఇలా నరికిన కాండం
బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది. అరటి బోదేను విడదీస్తే అది అర్ద
చంద్రాకరంగల పొడవాటి దళసరిగా వున్న పట్టలు వస్తాయి. వాటినుండి సన్నని
పట్టు దారం లాంటి దారాన్ని తీసి దాంట్లో అందమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. పట్టలన్నీ వలిచాక
లోపల అరటి చెట్టులోని సారభాగం ఉంటుంది దాన్ని ఊచ లేదా దూట అంటారు. ఇది కూడా ఆహార
పదార్ధంగా వండుకో దగినదే!
అలెగ్జాండరుతొలిసారిగా భారత దేశంలో మొదటి
సారిగా అరటి పళ్లని రుచి చూశాడట. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం ప్రారంభం అయినట్టు
చెప్తారు. క్రీస్తు శకం 650లో అరటి పాలస్తీనాప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందిందని
చరిత్ర కారుల అభిప్రాయం. పోర్చుగీసులు అరటి పెంపకాన్ని కరేబియను, మధ్య అమెరికా ప్రాంతాలకు తీసుకువెళ్ళి పరిచయం
చేశారట.
పచ్చబొంత, బూడిద బొంత, పచ్చబొంత బత్తీసా, బూడిద బొంత
బత్తీసా, పచ్చగుబ్బబొంత, పలకల బొంత, నూకల బొంత, సపోటా బొంత, నేంద్రం, సిరుమల అరటి, వామనకేళి, చక్కెరకేళి, ఇలా అరటిలో చాలా
రకాలు పండుతున్నాయి.
వందగ్రాముల అరటిపళ్లలో నీరు - 70.1 గ్రా.,ప్రోటీన్
- 1.2 గ్రా, కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా., పిండి పదార్థాలు - 27.2 గ్రా.. కాల్షియం
- 17 మి.గ్రా. ఇనుము - 0.4మి.గ్రా. సోడియం
- 37 మి.గ్రా., పొటాషియం - 88 మి.గ్రా.,
ఇంకా రాగి , జింకు లాంటి ఖనిజాలు, లవణాలు, విటమిన్లూ ఇందులో ఉన్నాయి. 23% ఉన్న కార్బోహైడ్రేట్లవలన 7౦% నీళ్ళు
ఉన్నప్పటికీ, వీటినుండి రసం వేరు కాదు. మిక్సీ పట్టినా అది గుజ్జుగా మారిపోతుందే తప్ప
రసంగా రాదు. భాభా ఆటామిక్ పరిశోధనా సంస్థ వారు ఓ ప్రతేకమైన
పద్ధతిలో అరటి పళ్ళ రసాలు తయారు చేసి పేటెంటు పొందారు.
అధిక కార్బోహైడ్రేట్లవలన షుగరు వ్యాధి, స్థూలకాయం ఉన్నవారికి ఇవి వ్యాధిని
పెంచేదిగానే ఉంటాయి
‘నపథ్యమ్ కదళీ ఫలమ్’ అన్నారు. అరటి
పండును అన్ని జబ్బుల్లోనూ పెట్టవచ్చని దీని భావం.
·
శరీరంలోని
విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
·
రాత్రిపూట పాలు, అరటిపండు
తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
·
అరటిపండులోని
పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
·
జబ్బుపడినవాళ్ళకి
అరటి పళ్ళు శక్తిదాయకంగా ఉంటాయి.
·
పచ్చి అరటి కాయలు
విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి. కడుపులో) యాసిడ్‘ని తగ్గిస్తాయి. పేగుపూత ఉన్నవారికి ఇది మంచి
ఆహారం
·
అరటిలో పొటాషియం
ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని
కాపాడుతుంది. పొటాషియం
·
అరటిపండులో పీచు
పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల
ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
No comments:
Post a Comment