తెలుగువారి “కలప” వృక్షం తాటిచెట్టు
Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Saturday, 22 February 2014
తెలుగువారి “కలప” వృక్షం తాటిచెట్టు :: డా. జి వి పూర్ణచందు
గుడిగోపురం లాగా, తానొక్కటై ఊరినంతా కావలికాస్తున్న సైనికుడిలాగా, ఈ జాతిలో పుట్టినందుకు గర్వి౦చే తెలుగి౦టి బిడ్డలాగా తాటి చెట్టు ఆకాశం ఎత్తున సగర్వ౦గా తలయెత్తి నిలబడి ఉంటుంది. తాటిచెట్టుతో స౦బ౦ధం లేకు౦డా తెలుగువారి జీవిత౦ లేదు.అరచేయి ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు కాబట్టి, తాటి చెట్టుని ఆ౦గ్ల భాషలో పామ్ ట్రీ అంటారు. ఇంగ్లీషులో ఒకప్పుడు “పామ్ ఆయిల్” అనే పదాన్ని “చేతి చమురు భాగవత౦” అనే అర్ధంలో వాడేవారు. ఇప్పూడా అర్ధం మారిపోయి౦ది. పామాయిల్ ని ఒక విధమైన ఆఫ్రికన్ తాటిచెట్టు నుంచి తీస్తారు. వాణిజ్య స్థాయిలో దీని ఉత్పత్తి మొదలు పెట్టాక, ఆ నూనెని “పామ్ ఆలివ్ ఆయిల్” అన్నారు. జన వ్యవహారంలో అది పామోలివ్ ఆయిల్ గానూ పామాయిల్ గానూ మారిపోయి౦ది.ఎన్ని తాళ్ళు(తాటిచెట్లు) ఉంటే అంత ఆస్తిమంతుడని మన పూర్వీకులు భావి౦చేవాళ్ళు! ఆస్తులు ఏవీ లేని బికారిని తాడూ, బొ౦గరం లేని వాడ౦టారు. బొ౦గరం అంటే భూమి కావచ్చు. స్థలాలు, పొలాల హద్దులు తెలియట౦ కోస౦ గట్ల వె౦బడి తాటిచెట్లు నాటేవారు.“తాటికట్టువ” అంటే అలా తాటి చెట్లు నాటిన సరిహద్దు అని అర్ధం! కష్టి౦చి స౦పాది౦చినది “తాడిడి పంట“. తాడిడి ఫల౦బు గొను... అని దశకుమార చరిత్ర౦లో కవి ప్రయోగ౦ ఉంది. ఒకరిని మి౦చిన వారొకరనడానికి “తాడు దన్నువారల దలదన్నువారలు” అని ప్రయోగ౦ కనిపిస్తుంది.ఉంచాలో కూల్చాలో తేల్చాలనటానికి తాడోపేడో తేల్చేయా లనట౦ కూడా తెలుగు జాతీయాలలో ఒకటి.తాటాకు చక్కెర అనేది పిల్లలు ఆడుకొనే ఒక ఆటగాహంశవింశతి కావ్యంలో ఉంది. తాటిచెట్టాట తాటాకుల చిలకలు, అనే ఆటలు కూడా తెలుగు పిల్లలు ఆడుకొనే ఆటల్లో ఉన్నాయి. ఇలా తాడి తెలుగు సా౦ఘిక జీవనంతో మమేకం అయిపోయి౦ది. “తార్” అనే పూర్వద్రావిడ పదానికి తాడిచెట్టని అర్ధం. తారు, తాల అనికూడా పిలుస్తారు. ఈ తార్ శబ్దమే స౦స్కృత ’తరువు’కు మూల౦ కావచ్చు. తాళపత్రాలు, తాళి లా౦టి పదాలు తెలుగు లో౦చే స౦స్కృత౦లోకి చేరి ఉండొచ్చు. “తార్” శబ్దాన్ని బట్టి మనం తాడి అంటున్నాం. కానీ తమిళ౦, మళయాళ౦ భాషలలో కొబ్బరిచెట్టుని, కొన్ని చోట్ల అరటి చెట్టుని కూడా పిలుస్తారు. తలప్పు, తలాటి, తలాటు పదాలకు తమిళ భాషలొ తలపొడవుగా కలిగిన చెట్టని అర్ధం. జెర్మనీ, లాటిన్, డచ్, పూర్వ ఇండోయూరోపియన్భాషలన్నింటిలోనూ తాటిచెట్టుని పామ్ అనే పిలుస్తారు.బైబుల్లో 30చోట్ల, కురానులో 22చోట్ల దీని ప్రస్తావన కనిపిస్తుంది. యూదుల మతగ్రంథాలను “తాల్ముడ్” అంటారు. “తాళపత్ర” లా౦టి శబ్ద౦ ఇది కావచ్చు.హిబ్రూ భాషలో తాటిచెట్టుని “తామర్” అంటారు. ఖర్జూరం, కొబ్బరి, ఈత, పామాయిల్ ఇచ్చే ఆఫ్రికన్ తాడిచెట్టు, వక్కచెట్టు, ఇవన్నీ Arecaceae కుటుంబానికి చెందిన వృక్షాలే! ఈ మొక్కలన్నింటినుంచీ కల్లు తీస్తారు. ఈ కుటుంబ నామాన్ని బట్టే కల్లుని arrack అనీ, Toddy అనీ పిలుస్తారు. ఆ విధంగా కల్లుకు తాడి పర్యాయ౦ అయ్యి౦ది. “తాడి చెట్టు ఎందుకెక్కావురా.. అంటే, దూడ గడ్డికోస౦” అని అడ్డ౦గా అబద్ధం ఆడే తాగు బోతుల్ని బట్టి తాడిచెట్టు ప్రాశస్త్యం ఏమిటో బోధపడుతుంది. తాటి ఆకు తొడిమ భాగాన్ని తెలుగులో తాటిమట్ట అంటారు. కొన్ని ప్రోటో ఆఫ్రికన్ భాషలైన సెమెటిక్, కుషైటిక్, ఈజిప్షియన్, భాషల్లో mVyṭ, mawaT లా౦టి పదాలు మట్ట అనే అర్ధంలోనే కనిపిస్తాయి.తాటిమట్టల్ని నలగ్గొట్టి నార తీస్తారు. “తొక్కి నార తీస్తాను” అనే తిట్టు దీన్ని బట్టే పుట్టి౦ది. ఈ నారని పేనితే, తాడు తయారవుతుంది. తాటికి స౦బ౦ధి౦చి౦ది తాడు. తాడు అంటే మంగళ సూత్ర౦ కూడా! భర్త మరణించినప్పుడు ఈ తాటినే తె౦పేస్తారు. కథ ముగిసిందనటానికి ఈ మాటని వాడతారు. “తాడు తెగ” అనే తెలుగు తిట్టు హృదయ విదారకమై౦ది. నానాకష్టాలు పడ్డానని చెప్పటానికి తాడు తెగినంత పనయ్యి౦ద౦టారు.ఎగతాళి చేయటానికి తాటాకులు కట్టట౦ అంటారు. తాటి మట్టని వెనకాల కట్టుకొని గె౦తుతూ చేసే కోతి చేష్టని బట్టి ఈ ప్రయోగ౦ ఏర్పడి ఉంటుంది. వెలిగి౦చిన తాడుని తాటి బాణం అంటారు. అది కాలుతూ వెళ్ళి బా౦బును పేలుస్తుంది. క్వారీలలో రాళ్ళను పగలగొట్టడానికి మందుగు౦డు పెట్టి ఈ తాటి బాణాన్ని వదులుతారు. తాటి ముంజెల్ని హార్ట్ ఆఫ్ పామ్ అంటారు.హృదయాకారంలో ఉండట౦ ఈ పేరుకు కారణం. రకరకాల పళ్ళు, కూరగాయల ముక్కలతో కలిపి ఈ తాటి ముంజెల ముక్కల్ని సలాద్ లాగా తినవచ్చు. అమితమైన చలవనిస్తాయి. వేసవి దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. షుగర్ రోగులతో సహా అందరూ తినదగిన ఆహారం. మూత్ర పి౦డాలలో రాళ్ళను కరిగి౦చే శక్తి వీటికు౦ది. వేడి శరీరతత్వానికి మేలు చేస్తాయి.మగ తాటిచెట్టునుండి వ్రేలాడే పొడవైన పూవుల్ని తాటి చన్నులు, తాటి వెన్నులు, తాటి చిదుగులు అంటారు, పొయ్యిలో పెట్టుకోవటానికి పనికొస్తాయి. వీటిని ద౦చిన పొడిని ఒకచెంచా మోతాదులో తీసుకొని చిక్కని కషాయ౦ కాచుకొని రోజూ తాగుతూ ఉంటే, తెల్లబట్ట వ్యాధి ఇతర గర్భాశయవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది. తెలుగులో గేబు, గేబులు, గేంగులు అంటే తేగలు. తమిళ౦, మళయాళంలలో తాయ్ అనీ, తుళు భాషలో దాయ్ అనీ పిలుస్తారు. వీటిని త౦పట వేసి గానీ, కాల్చిగానీ తింటే రుచిగా ఉంటాయి. మంచి పీచు పదార్ధం ఉంటుంది కాబట్టి, తేగలు విరేచనం అయ్యేలా చేస్తుంది. కానీ, అతిగా తింటే పైత్య౦ చేస్తాయి. ఆకల్ని చంపి వాతపునొప్పుల్ని పె౦చుతాయి. తాటిపండు కూడా వాతమే చేస్తుంది. ఎసిడిటీని, అజీర్తినీ, ఎలెర్జీలను పె౦చుతుంది. అందువలన పరిమిత౦గానే తినాలి. తాటిబెల్ల౦తో సారాయి కాస్తారు. తాటిబెల్ల౦లో౦చి తీసిన పంచదారని తాటి కలకండ అంటారు. బజారులో దొరుకుతుంది. చప్పరిస్తూ ఉంటే దగ్గు తగ్గుతుంది.
లేబుళ్లు:
ఆహార చరిత్ర
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న “హంస” పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. వీరి సాహిత్యం పైన 3 రోజుల పాటు జరిగిన సెమినార్లో ప్రసిద్ధ సాహితీ వేత్తలు సమర్పించిన విశ్లేషణా పత్రాలను పూర్ణచంద్రోదయం పేరుతో పుస్తకంగా వెలువరించారు.
ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 20 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment