గోంగూర-గోనుసంచీ
డా. జి వి పూర్ణచందు
గోను కూరని గోనుగూర, గోంగూర, గో(గూర అంటారు. గో(గూర నిచ్చే మొక్కని గో(గు
మొక్క అని పిలిచారు.
గోంగూరను అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, కెనాఫ్ అని పిలుస్తారు. Deckanee hemp అనే పేరుతో కూడా కొన్ని దేశాల్లో పిలుస్తారు.
తెలుగు ప్రజలతో ఈ మొక్కకు అనుబంధం ఉందన్న సంగతి ప్రపంచాని కంతటికీ తెలుసు. మనం
గోంగూర పచ్చడి చేసుకుంటే యూరోపియన్లు kenaf pesto తయారు చేసుకుంటారు. ఇంచుమించు రెండూ ఒకటే!
దీనికి అంబరి, లాలంబరీ, నలి, అమ్లపీలు, కంటక పీలు లాంటి సంస్కృత పేర్లు చెపుతారు గానీ, అవి నిఘంటువులలో కనిపించవు. శాకాంబరీ దేవి ప్రసాదం అని
గోంగూర పచ్చడిని కీర్తించటం కవుల చమత్కారం. గోంగూరకు అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే సంస్కృత పర్యాయ నామాలున్నాయి. కర్ణికార
పుష్పము అంటే కుండగోంగూర పువ్వు. అభిమన్యుడి రథ౦ మీద ఎగిరే జె౦డా ఈ గుర్తు గలిగి
ఉంటుందట! మూలభారతం భీష్మపర్వం (6.26,27)లో శివుడు కర్ణికార పుష్పమాలను పాదాలదాకా
ధరించాడని ఉంది. కర్ణికార వనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు కూడా మూలభారతంలో
ఉంది. వసుచరిత్ర(3.146)లోనూ, హంసవింశతి(4.11)లోనూ గోంగూర ప్రస్తావన కనిపిస్తుంది.
గోగులమ్మ అనే గ్రామదేవత గురించి”కోమలార్థేందుధరుకొమ్మ గోగులమ్మ(ఆ.౧ప.౯౯) అంటూ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు.
గోంగూరపువ్వు పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబంలాగా, పద్మ౦లో కేసరాలు౦డే కర్ణికలాగా ఉంటుంది. అందుకని దీనికా
పేరు వచ్చి ఉంటుంది. మందారం, బె౦డ, తుత్తురబె౦డ, గోంగూర ఇవన్నీ ఒకే కుటుంబానికి చె౦దిన మొక్కలు.
గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను అలంకరించటం సాంప్రదాయం.
గోంగూరని ఎంత ఇష్ట పడతారో చాలామంది, దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దాని అతి పులుపే అందుకు కారణం! మనం రోజువారీ ఆహార
పదార్థాలలో అతిగా చింతపండునో లేకపోతే ఆమ్ చూర్‘నో వాడటం వలన కడుపులో యాసిడ్ నిండిపోతోంది.
గోంగూర తింటే మరింత యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో, ’పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకొన్నాను, అంతే... కాళ్ళూ చేతులూ పట్టేశాయి’ అంటుంటారు చాలామంది. ఇతర పులుపు పదార్థాల వాడకాన్ని పరిమితం
చేసుకోగలిగితే గోంగూరని రోజూ తిన్నా ఏమీ కాదు. మన పూర్వీకులు గానీ, ఇతర రాష్ట్రాల వారుగానీ మనం తింటున్నంత వెర్రిపులుపు తినరు.
ముఖ్య౦గా చింతపండు వంటి౦టికి రారాజు అయిపోయింది. దాన్ని వెళ్ళగొట్ట గలిగితే
గోంగూరను ఎవరైనా చక్కగా వాడుకోవచ్చు. వైద్య శాస్త్ర ప్రకారం గోంగూరలో అపాయకారకమైన
రసాయనాలు ఏమీ లేవు. పడకపోవటం దాని స్వభావం కాదు. దాన్ని వండటంలోనే మనం మరికొన్ని
జాగ్రత్తలు తీసుకోవాలసి ఉంది. మొదటగా గోంగూరని నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి
తయారు చేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకగంగా ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలివంచని వాటితో మాత్రమే గోంగూరను తయారు చేసుకోవాలి.
తగినంత మిరియాల పొడి, ధనియాల పొడి కలిపితే ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ఉంటుంది.
రుచిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. గోంగూర పువ్వులూ వంజల్ని కూడా
కలుపు కోవచ్చు. రుచిగా ఉంటాయి.
గోంగూర చక్కని ఆకలిని కలిగిస్తుంది. లివర్ వ్యాధుల్లో
మేలు చేస్తుంది. రేజీకటి రోగంతో బాధపడే వారికి తరచూ వండి పెడితే చూపు పెరుగుతుంది.
మలబద్ధత పోగొడుతుంది. వీర్యవృధ్ధీ, లైంగిక శక్తీ, లైంగిక ఆసక్తీ పెంపొ౦దింప చేస్తుంది. ఉడికించిన
గోంగూర ఆకు ముద్దని కడితే సెగగడ్డలు మెత్తపడి త్వరగా పక్వానికొస్తాయి. రక్తం గూడు
కట్టిన కౌకుదెబ్బలు తగిలినచోట దీనితో కట్టు గడితే వాపు
అణిగిపోతుంది. దేశవాళీ గోంగూర ఆకుల్లో ఉండే ఇనుము, అలాగే, కుండగోగు వేళ్ళలో ఉండే చలవ దనమూ, రెండూ వైద్య పరంగా ప్రసిధ్ధాలే. కుండగోగు మొక్కల్ని
వ్రేళ్ళతో సహా పీక్కొచ్చి అమ్ముతారు. మనం ఆకుల్ని వలుచుకొని మొక్కని అవతల
పారేస్తా౦. దాని వేళ్ళను దంచి, చిక్కని కషాయం కాచుకొని పంచదార
కలుపుకొనితాగవచ్చు. వేసవికాలంలో వడదెబ్బ కొట్టనీయని పానీయం ఇది.
గోంగూర మౌలికంగా నారనిచ్చే మొక్క. గోంగూర, జనుము లాంటి మొక్కల్లో౦చి వచ్చే నారని గ్రీన్ ఫైబర్ అంటారు. తెల్లకాగితం తయారీకి పనికొచ్చే 500 మొక్కలతో పోల్చినప్పుడు అమెరికన్లు గోంగూర
అన్ని౦టికన్నా ఉత్తమ మైన మొక్కగా తేల్చారు. ఇవ్వాళ అమెరికావారి కాగితం అవసరాలను
గోంగూర మొక్కలే తీరుస్తున్నాయట! ఆ౦ధ్రమాతగా గోంగూరను గౌరవించే తెలుగుప్రజలు ఈ
రహస్యాన్ని త్వరగా గుర్తించటం మంచిది. విదేశాలలో పైన్ లాంటి కొన్ని మహా వృక్షాలను, మన దేశంలో ముఖ్య౦గా సరుగుడు మొక్కల్ని పేపరు తయారీకోసం కూల్చి వెస్తున్నారు. అడవులను నరికి, పర్యావరణానికి హాని చేయటాన్ని ఈ “గోంగూర కాగితం” ద్వారా నివారించవచ్చు. పాండురంగ మహాత్మ్య౦లో
సుశర్మ పాపాలను లెక్క రాసే కళితం లేదా కడితం అనే కాగితాల కట్ట గురించి ప్రస్తావన
ఉంది. ఆ౦ధ్రుల సాంఘిక చరిత్రలో కడితం అంటే “మసి పూసి గట్టన చేసిన చదరపు
గోనెపట్టతో(గోగునారతో) చేసిన లెక్కపుస్తకం” అని అర్థాన్ని ఇచ్చారు. 15వ శతాబ్ది నాటికి
గొగునార కాగితం తయారీ మన వాళ్ళకు తెలుసు నన్నమాట! దీని ఆకుల్ని ఆహార అవసరాలకు వలుచుకుంటూ, మొక్కని నిటారుగా పెరగనిస్తే, 150 రోజుల్లో 12-18 అడుగులు పెరుగుతుంది. ఈ మొక్కల్ని నీళ్ళలో
నానబెడితే నార తేలికగా ఊడివస్తుంది. ఎకరానికి 5-10 టన్నులు గోగునార లేక గోనునార ఉత్పత్తి వస్తుందని అంచనా! ఈ గోనునారని పురిపెట్టి పురికొస తీస్తారు. దానితో నేసిన
పట్టాని “గోనుపట్టా” అనీ, సంచీని “గోను సంచీ” అనీ పిలుస్తారు. గోతాము పదం కూడా గోనుకు సంబంధించినదే
కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, ఎద్దుల బండి మీద అడ్డ౦గా వేస్తారు కాబట్టి
గొతాము అని అర్థాలు చెప్పారు గానీ, మౌలికంగా ఇది గోను శబ్దానికి సంబధించిన పదం.
గోవు ఎంత ముఖ్యమో, గోను కూడా అంతే ముఖ్య౦---సద్వినియోగపరచుకొనే తెలివి ఉండాలి,
గోంగూరకు నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది.
ఆఫ్రికా దీని పుట్టిల్లు. భారత దేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. చరక సుశ్రుతాది
ఆయుర్వేద గ్ర౦థాల్లో గానీ, ధన్వంతరి నిఘంటువులోగానీ, గోంగూర గురించి వివరాలు లేకపోవటాన, దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిధ్ధి కాకపోవటాన అమరకోశంలో
చెప్పిన కర్ణికారం అంటే, కుందరు పండితులు “రేల” మొక్కగా భావించారు. ఈ కారణంగా మధ్య యుగాలలో ఈ
గోంగూర భారత దేశంలోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ అనుమానాలను
పటాపంచలు చేసే సమాచారం బసవ పురాణంలో ఉంది. శివ పూజ చేయనిదే ముద్ద ముట్ట కూడదనే
నియమం కలిగిన ఒక వర్తకుడు బోర్లించిన కుంచాన్ని శివలింగంగా భావించి కుండగోగు పూలతో
పూజ చేసినట్టు “కుంచంబు గొ౦డగోగుల( బూజసేసి” అనే వర్ణన వెయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రజలకు
గోంగూర పవిత్రమైనది, పూజనీయార్హమైనదీ అనటానికి తిరుగులేని సాక్ష్య౦గా కనిపిస్తుంది.
జానపదగేయాలలో కూడా కుండగోగు ప్రస్తావన కనిపిస్తుంది. శైవులకు ఇది ప్రముఖమైనదంటే, తెలుగు నేలమీద దాని ప్రాచీనత గొప్పదనే మనం నమ్మవచ్చు.
No comments:
Post a Comment