Monday, 10 February 2020

‘స్థితి’కి ‘దుస్థితి’ డా. జి వి పూర్ణచందు

‘స్థితి’కి ‘దుస్థితి’
డా. జి వి పూర్ణచందు
పట్టంబుగట్టిన ప్రథమంబు నేణ్డు
బల గర్వంబొప్పంగ బైలేచి సేన
పట్టంబు గటిఞ్చి ప్రభుబణ్డరంగు
బఞ్చిన సమత్త పడువతో బోయ
కొట్టంబు ల్వణ్ఱెణ్డు గొఱి వేంగి నాణ్టిం
గొళల్చి యాత్రి భువనాంకుశ బణనిల్పి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కణ్డుకూ ర్బెజవాడ గావిఞ్చె మెచ్చి
ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామంలో ఒక పొలంలో రాతిమీద చెక్కిన ఈ శాసనంలో ఈ పద్యం ఉంది. ‘పండరంగని అద్దంకి శాసనం’ అంటారు దీన్ని. ఆదికవి నన్నయకు పూర్వం ఉన్న పద్యకవిత్వానికి ఈ శాసనం ఒక ప్రముఖ ఆధారం. బెజవాడ రాజధానిగా పాలించే గుణగ విజయాదిత్యుడి సేనాని పండరంగడు క్రీ..848లో బోయవీరులకు చెందిన 12 కొట్టాలను (మండలాలు) జయించి, బోయరాజ్యపు ప్రధాన కొట్టమైన, కట్టెపుదుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడలాగా చేశాడనేది ఈ పద్యంలోని సారాంశం. ఈ పద్యశాసనానికి 300 యేళ్ళ తరువాతి వాడు నన్నయగారు.
తెలుగు భాషోద్యమానికి ఆద్యుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ఈ శాసనాన్ని పరిష్కరించి, బటర్వర్తు ముద్రించిన నెల్లూరు శాసనములుగ్రంథంలో దీన్ని ప్రకటించారు. మొత్తం శాసనంలో తరువోజ సీస ఛందస్సుకు చెందిన ఈ పద్యం మాత్రమే ధ్వంసం కాకుండా లభిస్తోంది. తెలుగు అక్షరాభిమానులైన ప్రజలు ఈ శిలాశాసనానికీ అద్దంకిలో గొడుగు పట్టి పూజిస్తున్నారు. సృజన అనే సాహితీ సంస్థ వారు, ప్రకాశంజిల్లా రచయితల సంఘం వారు నాగభైరవ కోటేశ్వరరావు ప్రభృతులు ఈ శానం కాపీని ఊరు ముఖద్వారం వద్ద ప్రతిష్ఠించి దానికి గౌరవం కలిగించారు.
తెలుగు భాషా సంస్కృతుల పట్ల ప్రజల్లో గౌరవం పెరగాలంటే ఇలాంటి కార్యాలు ఊరూరా జరగాలి. ఇలాంటివి ప్రభుత్వాలు గానీ, ప్రభుత్వ శాఖలు గానీ చేస్తాయని ఆశించకుండా ప్రజలే పూనుకోవాలి. ప్రజలక్కూడా బాధ్యత ఉంది కదా...! ప్రాచీన దేవాలయాలన్నింట్లోనూ ఏదో ఒక కాలానికి చెందిన శాసనాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని సున్నం, సిమెంటు తాపడాలతో కప్పిపెట్టేస్తున్నారు. గుడి పూజారులకు గాని, రాజకీయాల నుండి వచ్చి గుడిపాలకవర్గంలో చేరే వ్యక్తులకు గానీ వీటి గురించి ఏమీ తెలియకపోవటాన విలువైన చారిత్రక సంపద అన్యాయంగా కరిగిపోయో, విరిగి పోయో, రోడ్డురోలర్ల కింద నలిగిపోయో, బట్టలుతుక్కునే రాళ్లుగా మారిపోయో నశించి పోతున్నాయి.
వాటిని ఎవరైనా మహానుభావుడు పరిరక్షిస్తే  ఆయన గురించి చరిత్రకారులు ఇలా నాలుగు మంచిమాటలు చెప్పుకుంటారు. ఏమీ చేయని వాడి గురించి అదనంగా చెప్పేదేముందీఏమీ చేయలేదు అనటం తప్ప.
ఆ మధ్య తిరుపతి దేవాలయ గోడలకు బంగారురేకుల తాపడం చేయాలని పాలకవర్గంవారు ప్రయత్నిస్తే, చరిత్ర వేత్తలు భాషాభిమానులు, “అయ్యా! ఈ దేవాలయం గోడల్లో ప్రతీ రాయి పైన ఏదో ఒక శాసనం ఉంది. అవి చరిత్రకు ఆధారాలు. దయచేసి వాటి నకళ్ళు తీసి పరిరక్షించి, అప్పుడు బంగారు తాపడం చేయించండని ప్రాధేయపడి అడిగారు. అవన్నీ దాన శాసనాలేననీ, వాటిలో చరిత్ర వుండదనీ పాలకులు వాదించారు. ఎందులో ఎంత చరిత్ర ఉంటుందో చరిత్రకారులకు గదా తెలిసేది...?
శతృరాజ్యాన్ని జయించిన తరువాత  గొప్పగొప్ప రాజులంతా ఆ రాజ్యాల్ని తగలబెట్టేవాళ్లు.  పరశురాముడు శతృ రాజ్యాల్ని సమూలంగా దహనం చేసి సంతృప్తి చెందాడు. అందుకే భారీగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ‘పరశురామ ప్రీతి’ అంటారు. కానీ, పండరంగడు తాను జయించిన కందుకూరుని అభివృద్ధి చేశాడు. ఎంత అభివృద్ధి చేశాడంటే తన రాజధాని అయిన బెజవాడ అంత అభివృద్ధి చేసినట్టు ఈ శాసనంలో చెప్పుకున్నాడు.
స్వయం సమృద్ధి సమకూర్చటం ద్వారా అభివృద్ధి జరగాలి. పండరంగడు అదే చేశాడు. అభివృద్ధి చెందిన మరొక రాజధానిని ఆదర్శంగా చూపించి, అలా చేశానన్నాడు. స్థితికి దుస్థితి తేకూడదు కదా! కందుకూరుని బెజవాడగా మార్చటం కోసం బెజవాడలో అభివృద్ధిని కందుకూరుకు తరలించకుండా కందుకూరునే అన్నిసౌకర్యాలతో అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకున్నాడు. సాధారణంగా జయశాసనంలో ‘గెలిచా’...అని మాత్రమే ఉంటుంది. కానీ, పండరంగడి శానంలో గెలిచాక ‘అభివృద్ధి చేశా’ అనే ప్రకటన కనిపిస్తుంది. 1200 ఏళ్ల క్రితం నాటి ఒక విజేత ఆదర్శం ఇది!
 “దేశాలను ఏలారు ఎందరో రాజులు. చివరికి మిగిల్చిందెవరు కులసతులకు గాజులు?” అని గోపి అనే సినీకవి గొప్ప పాట వ్రాశాడు. కులసతులకు గాజులు మిగల్చటం అంటే దేశానికి సౌభాగ్యం సమకూర్చటం అని!  చరిత్ర దండగ అని పలికిన పాలకులు, అసలు తెలుగే దండగ అని శాసించిన పాలకులు చరిత్రలో స్థానాన్ని ఆశించలేరు కదా!


         

సౌధాల ఆశలు :: డా!! జి. వి. పూర్ణచందు

సౌధాల ఆశలు
డా!! జి. వి. పూర్ణచందు
రాత్రిర్గమిష్యతి, భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ:
ఇత్థమ్ విచింతయతి కోశ గతే ద్విరేఫే
హా హంత హంత నళినీం గజ ఉజ్జహార
కువలయానందంలో అప్పయ్య దీక్షితులవారి ప్రసిద్ధ శ్లోకం ఇది. ఎంతైనా ఆయన తెలుగు బిడ్డ కదా! ఆంధ్రత్వం, ఆంధ్రభాష అనేవి అనల్పమైనవని నమ్మిన వాడు. తెలుగువాడిగా పుట్టడం ఎన్నో జన్మల తపఃఫలం అని సగర్వంగా ప్రకటించిన వాడు కూడా! “ఆంధ్రజాతి ప్రసిద్ధ లోకవాదానుకారాః” అంటూ తెలుగువారిలో బాగా వ్యాప్తిలో ఉన్న అనేక అంశాలను ఈ కువలయానందంలో ఉదహరించాడు కూడా! అప్పయ్య దీక్షితులు దార్శనికుడైన కవి. వ్యాకర్త కూడా! ఆయన  చెప్పిన చాలా విషయాలు సార్వకాలీనంగా ఉంటాయి. అర్థం చెసుకుని అన్వయం చెప్పుకోగలగాలి అంతే!
అంతవరకూ పండు పొలాలుగా ఎండు బీళ్లుగా ఉన్న ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద తామరకొలను ఏర్పడింది. తెల్లవారే సరికి రాజ్యాన్నేలే రాజుగారు దాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. అంతే! చుట్టు పక్కల భూములన్నీ ఆకాశాన్నంటేంత ఎత్తున ధరల్లో పెరిగి, సైకిలు మీద వెళ్లేవాళ్లంతా విదేశీ కార్లలో కుయ్యి...కుయ్యి... అంటూ తిరిగినట్టు,  తామరల్లోని తేనె కోసం తుమ్మెదలు రయ్యిరయ్యిన అక్కడకు చేరిపోసాగాయి. కొలనులో తామరలు తుమ్మెదల సహజీవనంతో ఆ కొత్త నేలకు కొత్త శోభలు చేకూరాయి. ఇంక తమకు తిరుగే లేదనుకున్నాయి తుమ్మెదలు! కడుపులో నీళ్లు కదలకుండా, గుండెలమీద చేతులు వేసుకుని నిర్భయంగా పడుకోవచ్చనుకున్నాయి.
చాలా తుమ్మెదల్లాగానే ఒక తుమ్మెద తామర పువ్వు మీద వాలింది. మకరందాన్ని ఆస్వాదిస్తూ అక్కడే వుండి పోయింది. ఇంతలో సాయంత్రం అయ్యింది. తామర పువ్వు ముడుచుకొని పోయి తుమ్మెద అందులోనే చిక్కుకు పోయింది. రేపు ఎలాగూ ఆనందంగా తెల్లవారుతుంది, సూర్యోదయంతోనే తామర పూవు విచ్చుకుంటుంది.  అప్పుడు హాయిగా ఎగిరి పోవచ్చు అనుకుని, మకరందం సేవిస్తూ మెత్తని పరుపు మీద పవళించినంత సంబరంగా విశ్రమించింది. కానీ, ఇంతలో ఒక ఏనుగు వచ్చి తామర తూడును తన తొండంతో పీకి అవతల పారేసింది. అంతే తామర పని అయిపోయింది. ఇంక అది  వికసించదు! పువ్వులోపల లాకయిన తుమ్మెద అక్కడే చనిపోయింది.
మనం అనుకున్న వన్నీఆనుకున్నట్టే జరుగుతాయనుకోవటం మన భ్రమ. రాత్రి చీకటి పడటం తెల్లవారి సూర్యుడు రావటం రెండూ నిజాలే! కానీ తుమ్మెద విముక్తి అబద్ధం అయ్యింది. తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తుందని కదా సామెత! మధ్యలో మరొకడొచ్చి తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండనవచ్చు. ‘నా మాటే శాసనం’ అన్నట్టు ఎవరైనా వ్యవహరించనూ వచ్చు.
ఇన్నాళ్లూ రాజధాని నాదనుకున్న తుమ్మెదలు తెల్లముఖం వేశాయి. రేపటి నుండీ ఈ తామరలూ ఉండవు, ఈ కొలనూ ఉండదు. రాజధాని వేరే చోటికి మారిపోతుంది... అని ఘీంకరించింది ఏనుగు. అంతే! తామరపూవులో నిర్భయంగా, భద్రంగా ఉన్నామనుకున్న తుమ్మెదలకు తెల్లవారలేదు.
అందుకని ఆశాసౌధాలు కట్టవద్దని కవి హెచ్చరిస్తున్నాడు జనాన్ని. ముఖ్యంగా అంధ్రుల్ని!
“---- కృతక వి/ద్యుద్ధీపముల్ నమ్మి యా/శాసౌధంబును గట్టికొంటి నది ని/స్సారంపుటాకాసమై/ నా సర్వస్వమును దొంగలించి నరకా/నం గూల్చిపోయెన్ వృథా/యాసప్రాప్తిగ నిల్చినాఁడ నొక దుఃఖాక్రాంతలోకంబున
అంటూ, ఫిరదౌసి కావ్యంలో ఫిరదౌసి కవి బాధపడ్డ జాషువాగారి పద్యం ఎవరికైనా ఇక్కడ గుర్తుకొస్తుంది. ఘజనీ మహమ్మదు ఫిరదౌసి కవికి ఆశలు పెట్టి కొండంత నమ్మకం కలిగించి, అవసరం తీరాక చీదరించినప్పుడు ఆ కవి విద్యుద్దీపాన్ని(మెరుపుల్ని) నమ్మి ఆశాసౌధాలు కట్టుకున్నానని, అది  నిస్సారపు ఆకాశం అని తెలిసి నరకాన కూలిపోయినట్టయ్యానని, వృధాయాస ప్రాప్తిగా నిలిచానని విలపిస్తాడు.
నిన్న మనది కాదు. నేడు మనది అంతకన్నా కాదు. రేపటి సంగతి గురించి మనం మాట్లాడకూడదు. రేపు ఏదైనా జరగవచ్చు. ఏ ఏనుగో వచ్చి తామరతూడుల్ని పెకలించి పారేయనూ వచ్చు. ఉన్న కొలనుని ఎండబెట్టి ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని కొలనులు కడతానని ప్రకటించనూ వచ్చు. అందుకని, అనాయాసంగా వచ్చే వాటికన్నా, మనిషి స్వశక్తిని మాత్రమే నమ్ముకోవాలని తాత్పర్యం.
పెద్దలు ఇలాంటిదే మరో కథ చెప్తారు. వెనకటికి ఒక ఓడ మునిగిపోయి, అందులో ప్రయణిస్తున్న వారంతా మునిగిపోగా, ఒక యువకుడి చేతికి చిన్న తెప్ప దొరికింది. దాని ఆసరాగా అలలమీద తేలుతూ నరసంచారం లేని ఒక దీవికి చేరుకున్నాడు. ఆకులూ అలములూ ఏరుకొచ్చుకుని ఒక గుడిసె కట్టుకుని అందులో జీవిస్తూ,  ఎవరైనా తనకు సాయంగా వస్తారేమోనని ఎదురు చూడసాగాడు. చూస్తుండగానే ఒక రోజు ఆ గుడిసె కూడా తగలబడి పోయింది. తన ఆశల సౌధం కూలిపోయిందని కుమిలిపోయాడా యువకుడు.
అంతలో ఓ పడవలో కొందరు మనుషులు అతన్ని వెదుకుతూ వచ్చారు.
ఈ దీవిలో చిక్కుకున్నానని మీకెలా తెలిసిందని వాళ్లని అడిగాడతను. “నువ్వేగా పెద్ద మంటలు వేసి, కాపాడమని కేకలు పెట్టావు. అది చూసి వచ్చాం” అన్నారు పడవవాళ్లు. ఒక్కోసారి ప్రమాదమూ మంచిదే. ఆశలసౌధం కూలినా మనోధైర్యం కూడుకోగలిగింది కదా!
మనోబలమే మనల్ని రక్షిస్తుందని నమ్మాలి. ఆ నమ్మకంతోనే బతకాలి!