Monday, 10 February 2020

సౌధాల ఆశలు :: డా!! జి. వి. పూర్ణచందు

సౌధాల ఆశలు
డా!! జి. వి. పూర్ణచందు
రాత్రిర్గమిష్యతి, భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ:
ఇత్థమ్ విచింతయతి కోశ గతే ద్విరేఫే
హా హంత హంత నళినీం గజ ఉజ్జహార
కువలయానందంలో అప్పయ్య దీక్షితులవారి ప్రసిద్ధ శ్లోకం ఇది. ఎంతైనా ఆయన తెలుగు బిడ్డ కదా! ఆంధ్రత్వం, ఆంధ్రభాష అనేవి అనల్పమైనవని నమ్మిన వాడు. తెలుగువాడిగా పుట్టడం ఎన్నో జన్మల తపఃఫలం అని సగర్వంగా ప్రకటించిన వాడు కూడా! “ఆంధ్రజాతి ప్రసిద్ధ లోకవాదానుకారాః” అంటూ తెలుగువారిలో బాగా వ్యాప్తిలో ఉన్న అనేక అంశాలను ఈ కువలయానందంలో ఉదహరించాడు కూడా! అప్పయ్య దీక్షితులు దార్శనికుడైన కవి. వ్యాకర్త కూడా! ఆయన  చెప్పిన చాలా విషయాలు సార్వకాలీనంగా ఉంటాయి. అర్థం చెసుకుని అన్వయం చెప్పుకోగలగాలి అంతే!
అంతవరకూ పండు పొలాలుగా ఎండు బీళ్లుగా ఉన్న ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద తామరకొలను ఏర్పడింది. తెల్లవారే సరికి రాజ్యాన్నేలే రాజుగారు దాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. అంతే! చుట్టు పక్కల భూములన్నీ ఆకాశాన్నంటేంత ఎత్తున ధరల్లో పెరిగి, సైకిలు మీద వెళ్లేవాళ్లంతా విదేశీ కార్లలో కుయ్యి...కుయ్యి... అంటూ తిరిగినట్టు,  తామరల్లోని తేనె కోసం తుమ్మెదలు రయ్యిరయ్యిన అక్కడకు చేరిపోసాగాయి. కొలనులో తామరలు తుమ్మెదల సహజీవనంతో ఆ కొత్త నేలకు కొత్త శోభలు చేకూరాయి. ఇంక తమకు తిరుగే లేదనుకున్నాయి తుమ్మెదలు! కడుపులో నీళ్లు కదలకుండా, గుండెలమీద చేతులు వేసుకుని నిర్భయంగా పడుకోవచ్చనుకున్నాయి.
చాలా తుమ్మెదల్లాగానే ఒక తుమ్మెద తామర పువ్వు మీద వాలింది. మకరందాన్ని ఆస్వాదిస్తూ అక్కడే వుండి పోయింది. ఇంతలో సాయంత్రం అయ్యింది. తామర పువ్వు ముడుచుకొని పోయి తుమ్మెద అందులోనే చిక్కుకు పోయింది. రేపు ఎలాగూ ఆనందంగా తెల్లవారుతుంది, సూర్యోదయంతోనే తామర పూవు విచ్చుకుంటుంది.  అప్పుడు హాయిగా ఎగిరి పోవచ్చు అనుకుని, మకరందం సేవిస్తూ మెత్తని పరుపు మీద పవళించినంత సంబరంగా విశ్రమించింది. కానీ, ఇంతలో ఒక ఏనుగు వచ్చి తామర తూడును తన తొండంతో పీకి అవతల పారేసింది. అంతే తామర పని అయిపోయింది. ఇంక అది  వికసించదు! పువ్వులోపల లాకయిన తుమ్మెద అక్కడే చనిపోయింది.
మనం అనుకున్న వన్నీఆనుకున్నట్టే జరుగుతాయనుకోవటం మన భ్రమ. రాత్రి చీకటి పడటం తెల్లవారి సూర్యుడు రావటం రెండూ నిజాలే! కానీ తుమ్మెద విముక్తి అబద్ధం అయ్యింది. తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తుందని కదా సామెత! మధ్యలో మరొకడొచ్చి తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండనవచ్చు. ‘నా మాటే శాసనం’ అన్నట్టు ఎవరైనా వ్యవహరించనూ వచ్చు.
ఇన్నాళ్లూ రాజధాని నాదనుకున్న తుమ్మెదలు తెల్లముఖం వేశాయి. రేపటి నుండీ ఈ తామరలూ ఉండవు, ఈ కొలనూ ఉండదు. రాజధాని వేరే చోటికి మారిపోతుంది... అని ఘీంకరించింది ఏనుగు. అంతే! తామరపూవులో నిర్భయంగా, భద్రంగా ఉన్నామనుకున్న తుమ్మెదలకు తెల్లవారలేదు.
అందుకని ఆశాసౌధాలు కట్టవద్దని కవి హెచ్చరిస్తున్నాడు జనాన్ని. ముఖ్యంగా అంధ్రుల్ని!
“---- కృతక వి/ద్యుద్ధీపముల్ నమ్మి యా/శాసౌధంబును గట్టికొంటి నది ని/స్సారంపుటాకాసమై/ నా సర్వస్వమును దొంగలించి నరకా/నం గూల్చిపోయెన్ వృథా/యాసప్రాప్తిగ నిల్చినాఁడ నొక దుఃఖాక్రాంతలోకంబున
అంటూ, ఫిరదౌసి కావ్యంలో ఫిరదౌసి కవి బాధపడ్డ జాషువాగారి పద్యం ఎవరికైనా ఇక్కడ గుర్తుకొస్తుంది. ఘజనీ మహమ్మదు ఫిరదౌసి కవికి ఆశలు పెట్టి కొండంత నమ్మకం కలిగించి, అవసరం తీరాక చీదరించినప్పుడు ఆ కవి విద్యుద్దీపాన్ని(మెరుపుల్ని) నమ్మి ఆశాసౌధాలు కట్టుకున్నానని, అది  నిస్సారపు ఆకాశం అని తెలిసి నరకాన కూలిపోయినట్టయ్యానని, వృధాయాస ప్రాప్తిగా నిలిచానని విలపిస్తాడు.
నిన్న మనది కాదు. నేడు మనది అంతకన్నా కాదు. రేపటి సంగతి గురించి మనం మాట్లాడకూడదు. రేపు ఏదైనా జరగవచ్చు. ఏ ఏనుగో వచ్చి తామరతూడుల్ని పెకలించి పారేయనూ వచ్చు. ఉన్న కొలనుని ఎండబెట్టి ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని కొలనులు కడతానని ప్రకటించనూ వచ్చు. అందుకని, అనాయాసంగా వచ్చే వాటికన్నా, మనిషి స్వశక్తిని మాత్రమే నమ్ముకోవాలని తాత్పర్యం.
పెద్దలు ఇలాంటిదే మరో కథ చెప్తారు. వెనకటికి ఒక ఓడ మునిగిపోయి, అందులో ప్రయణిస్తున్న వారంతా మునిగిపోగా, ఒక యువకుడి చేతికి చిన్న తెప్ప దొరికింది. దాని ఆసరాగా అలలమీద తేలుతూ నరసంచారం లేని ఒక దీవికి చేరుకున్నాడు. ఆకులూ అలములూ ఏరుకొచ్చుకుని ఒక గుడిసె కట్టుకుని అందులో జీవిస్తూ,  ఎవరైనా తనకు సాయంగా వస్తారేమోనని ఎదురు చూడసాగాడు. చూస్తుండగానే ఒక రోజు ఆ గుడిసె కూడా తగలబడి పోయింది. తన ఆశల సౌధం కూలిపోయిందని కుమిలిపోయాడా యువకుడు.
అంతలో ఓ పడవలో కొందరు మనుషులు అతన్ని వెదుకుతూ వచ్చారు.
ఈ దీవిలో చిక్కుకున్నానని మీకెలా తెలిసిందని వాళ్లని అడిగాడతను. “నువ్వేగా పెద్ద మంటలు వేసి, కాపాడమని కేకలు పెట్టావు. అది చూసి వచ్చాం” అన్నారు పడవవాళ్లు. ఒక్కోసారి ప్రమాదమూ మంచిదే. ఆశలసౌధం కూలినా మనోధైర్యం కూడుకోగలిగింది కదా!
మనోబలమే మనల్ని రక్షిస్తుందని నమ్మాలి. ఆ నమ్మకంతోనే బతకాలి! 

No comments:

Post a Comment