Thursday 18 July 2019

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు


ఆహ్వానం
కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో
పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ-
సమాచార పత్రం-1
తెలుగు నేలపైన మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ లక్ష్యంగా
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
నమస్కారం!
తెలుగు భాషతోపాటు తెలుగు నేలపైన అనేక మాతృభాషలు ఉన్నాయి. కోలమి, కోయ, గోండి, కువి, కుయి, యెరుకల, సవర, పర్జి, కుపియా, బంజారా ఇంకా ఇతర భాషలు మాతృభాషలుగా కలిగిన ప్రజలు, అలాగే ఉర్దూ మాట్లాడే ప్రజలు మనతోనే తెలుగువారు గానే జీవిస్తున్నారు. తెలుగుతోపాటుగా ఈ మాతృభాషలన్నీ ప్రపంచీకరణం కోరల్లో చిక్కుకుని విలవిల లాడ్తున్నాయి.
మాతృభాష అనేది వ్యక్తి ఉనికిని, సాంస్కృతిక అస్తిత్వాన్ని, వారసత్వాన్ని నిరూపిస్తుంది. మానవ మనుగడకు మాతృభాష అత్యంత ముఖ్యమైన అంశం. అది కేవలం సమాచారం, వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాల కోసం, విద్య కోసం, సామాజిక సంబంధాల కోసం మాత్రమే ననే భావన ప్రబలటం వలన ఈ పరిస్థితి వచ్చింది.
కొన్ని మాతృభాషల్ని మాట్లాడే వ్యక్తుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీరి తరువాత ఆ భాష మాట్లాడే వారు లేక తన ఉనికిని కోల్పోయే ప్రమాదం దాపురిస్తోంది. ఇప్పటికే మాతృభాష లెన్నో అంతరించి పోయాయి. జాగ్రత్త పడకపోతే మరికొన్ని మాతృభాషలు కనుమరుగై పోతాయి.
మాతృభాషలన్నింటినీ ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి అనుసంధానం చేసి, భాషావేత్తలు, పండితులు, విద్యా వేత్తలు, సాంకేతిక నిపుణుల సహకారంతో వాటిని పదిలపరిచే ప్రయత్నాలు ప్రారంభం కావాలి.
ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో 2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ వైపు దృష్టి సారించ వలసిందిగా తెలుగు ప్రభుత్వాలు మరియు తెలుగు ప్రజల గుండె తలుపులు తట్టే లక్ష్యంతో 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి.
మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ ఈ మహాసభల ప్రధాన లక్ష్యం. ప్రాంతాల కతీతంగా ప్రపంచంలో ఎల్లెడలా విస్తరించి, ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న తెలుగు భాషాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాం. అనుకూలంగా స్పందించ వలసిందిగా ప్రతీ ఒక్కరినీ కోరుతున్నాం.
ఎవరో వచ్చి ఆహ్వానించా లనుకోకుండా, మాతృభాషాభిమానంతో స్వచ్ఛందంగా స్పందించాలని ప్రార్థన.
ఈ మహాసభలలో ముఖ్య చర్చనీయాంశాలు:
• తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్రం మరియు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి...
• అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష విషయంలోనూ అనుసరింప చేయటానికి అవకాశాల గురించి...
• రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల గురించి...
• రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పన, ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి, తెలుగు విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రోత్సాహకాలు, ఆచరణకు నోచుకోని ఇంకా అనేక అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళటం గురించి...
• యేళ్ల తరబడీ నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యస్థను పటిష్ఠ పరచి, సాహితీ విలువలు కలిగిన గ్రంథాలను కొనుగోళ్ల గురించి...
• తెలుగు నేలపైన అన్ని విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న వివిధ జాతుల మాతృభాషల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా “మాతృభాషల పీఠాలు ఏర్పరచటం గురించి…
• తమిళనాడు, ఒడిసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగు నేర్చుకోవటానికి కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాల అందజేత, భాషాపరంగా అక్కడి సమస్యల గురించి...
ఇంకా ఇతర సాహిత్య, సామాజిక అంశాల గురించి చర్చలు జరుగుతాయి.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో 2007లో తెలుగు భాషోద్యమ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. 2011లో ‘ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు’ అనే అంశంపై రెండవ తెలుగు రచయితల మహాసభలు, 2015లో ‘తెలుగు భాషాభివృద్ధి-యువత’ అంశంపై 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవంతంగా జరిగాయి. దేశ, విదేశాల నుండి ఎందరో తెలుగు ప్రముఖులు ఈ మహాసభలలో పాల్గొన్నారు.
2007 ప్రధమ మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన ఒక తెలుగు రచయితల సంఘాన్ని నిర్మించి, నిర్వహించే బాధ్యతలను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పడింది. 2011 రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 2015లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడి విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో రిజిష్టర్ చేయించే బాధ్యత కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు.
2019లో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో విజయవాడలో రిజిష్ట్రేషన్ చేయించటం జరిగింది. రేపటి మహాసభల నాటికి ప్రపంచ తెలుగు రచయితలసంఘం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గంతో అంతర్జాతీయ సంస్థగా రూపు దిద్దుకోగలదని ఆకాంక్షిస్తున్నాము.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, తెలుగు భాషాభిమానులను సమైక్యపరచటం ద్వారా తెలుగు భాషాసంస్కృతులను, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేయటం “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” లక్ష్యం. తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించటం, తాజా పరిశోధనలను తెలుగు ప్రజలకు అందించటం ద్వారా తెలుగుపట్ల జనానురక్తిని పెంపుచేసే కృషిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది.
ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులైన తెలుగువారి సంస్థగా నిలవాలని మా కోరిక. అన్ని తెలుగు సాహిత్య ప్రక్రియలకూ ఈ సంస్థ సమప్రాధాన్యం ఇస్తుంది. తెలుగును ప్రపంచ తెలుగుగా తీర్చి దిద్దే కృషిలో అందరం భాగస్వాములం కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీకు స్వాగతం పలుకుతున్నాం.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవిత సభ్యత్వం
“ప్రపంచ తెలుగు రచయితల సంఘం”లో రూ. 2000/-(విదేశాలలోని తెలుగు వారికి US 50$) చెల్లించి, జీవిత సభ్యులుగా చేరటం ద్వారా ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన. రచయితలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యాభిమానులైన ప్రతీ ఒక్కరూ ఈ సంస్థలో జీవిత సభ్యులుగా చేరవచ్చు.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం వివరాల కోసం http://www.prapanchatelugu.com వెబ్‘సైట్ చూడగలరు. ఈ వెబ్‘సైట్లో సభ్యత్వ నమోదు దగ్గర క్లిక్ చేసి, నమోదు ఫారాన్ని పూర్తి చేసి, సబ్‘మిట్ చేయగలరు. పూర్తిచేసిన ఈ ఫారం అందగానే మీ సభ్యత్వం అంగీకరించ బడిన వైనం మీకు తెలియజేయగలం. మీ సెల్‘ఫోను లోంచి కూడా సభ్యత్వ నమోదు చేయవచ్చు. అందుకు అవకాశం లేనివారు లిఖిత పూర్వకంగానూ పంపవచ్చు.
జీవిత సభ్యులుగా చేరినవారు విడిగా ప్రతినిథి రుసుము చెల్లించ నవసరం లేదని మనవి. 
జాతీయ తెలుగు ప్రముఖులు, వివిథ భాషలలో ఙ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, ప్రసిద్ధ సాహితీవేత్తలు, పాత్రికేయ ప్రముఖులు ఇంకా అనేక మందిని ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నాం. ఇది మన కార్యక్రమం, అందరం కలిసి ఒక గురుతర బాధ్యత వహిస్తున్నామని భావించి స్వచ్ఛందంగా 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ప్రతినిథిగా నమోదు కావలసిందని విఙ్ఞప్తి. సానుకూలంగా స్పందించ ప్రార్థన.
ప్రతినిథులకు సూచనలు
·         ప్రతినిధులుగా పాల్గొనేవారు ఈ మహాసభల కోసం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.
·         ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవితసభ్యు లందరూ ఈ మహాసభల ప్రతినిధులే!
·         ప్రతినిధి రుసుమునుగానీ, జీవిత సభ్యత్వాన్ని గానీ డి.డి. లైతే PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగాను, చెక్కులైతే  ప్రపంచ తెలుగు రచయితల సంఘం పేరున వ్రాయాలి. యం.ఓ.లు మాత్రం చేయకండి.
·         మీ సమాచారాన్ని పోష్టుద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారా పంపండి. వాట్సాప్, ఫేస్‘బుక్, మొదలైన ఇతర సామాజిక మాధ్యమాల్లో పంపవద్దని మనవి.
·         డిడిలను, చెక్కులను పంపవలసిన చిరునామా:
కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితలసంఘం
1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా,
గవర్నర్ పేట, విజయవాడ-520002.
·         ప్రతినిధులు తమ వసతి ఏర్పాట్లు తామే చేసుకోవలసి ఉంటుంది. మీరు కోరితే, సభాస్థలికి దగ్గరగా ఉన్న హోటళ్ల టెలిఫోన్ నెంబర్ల పట్టికను పంపగలం.
·         ప్రతినిధులు, జీవిత సభ్యులకు మాత్రమే ఈ మహాసభల ప్రాంగణంలో భోజన, ఉపాహారాలుంటాయి.
·         ప్రతినిధులుగా నమోదు కావటానికి చివరి తేదీ 2019 అక్టోబరు 31.
·         సభల సమయంలో స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవు. సభాస్థలి పరిమితిని మించి ప్రతినిధులను నమోదు చేసుకోలేము కాబట్టి గడువుదాకా ఆగకుండా సాధ్యమైనంత ముందుగానే ప్రతినిధిగా నమోదు కావాలని విన్నపం. గత అనుభవాల రీత్యా అప్పటికప్పుడు వచ్చి పేర్లు నమోదు కోసం, ఙ్ఞాపికలు, ఇతర సౌకర్యాల కోసం నిర్వాహకుల పైన వత్తిడి చేయవద్దని ప్రార్థిస్తున్నాము.
·         జీవిత సభ్యులుగానూ, ప్రతినిధులుగా నమోదయిన వారికి కవిసమ్మేళనాలు, ప్రసంగాలు, పత్ర సమర్పణలలో ప్రధమ ప్రాధాన్యం ఉంటుంది.
ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ‘ప్రపంచతెలుగు’ వ్యాస సంపుటి వెలువరిస్తున్నాం. ఇందులో తెలుగు భాష, తెలుగుతో ముడిపడి జీవిస్తున్న ఇతర మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణలతో పాటు ఈ మిలీనియం 20 యేళ్ల కాలంలో భాష పరంగా జరిగిన కృషి గురించీ, తెలుగు సాహిత్యం తీరుతెన్నుల గురించీ పరిశోధనా వ్యాసాలుంటాయి.
సభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ రచనలను ఆవిష్కరింప చేసుకునే అవకాశం ఉంటుంది.
మహాసభల సమాచారాన్ని మీ సాహితీ మిత్రులకూ తెలుపండి. రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి.
మీ అమూల్యమైన సలహాలను, సూచనలను అందించగలరు.
మాతో కలిసి నడుస్తూ తోడ్పాటు నందించిన సాహితీ మిత్రుల్ని ఈ మహాసభలలో సముచిత రీతిని గుర్తించి, గౌరవించగలమని మనవి. సంప్రదింపులకోసం:

ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యాలయం,
1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా,
గవర్నర్ పేట, విజయవాడ-520002
వెబ్ సైట్: http://www.prapanchatelugu.com
ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com
సెల్: 9440167697, 9440172642


ప్రపంచ తెలుగు రచయితలసంఘం వ్యవస్థాపక కార్యవర్గం
గౌరవాధ్యక్షులు: డా. మండలి బుద్ధప్రసాద్
గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
అధ్యక్షులు: శ్రీ గుత్తికొండ సుబ్బారావు: 9440167697
ఉపాధ్యక్షులు: శ్రీ గోళ్ల నారాయణ రావు:9246476686
కార్యదర్శి: డా. జి వి పూర్ణచందు9440172642
సహాయకార్యదర్శి: డా. గుమ్మా సాంబశివరావు: 9849265025
కోశాధికారి: శ్రీ టి శోభనాద్రి: 9515461626
కార్యనిర్వాహకవర్గ సభ్యులు:
డా. ఈమని శివనాగిరెడ్డి: 9848598446
డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్: 8639380968
డా. వెన్నా వల్లభరావు: 9490337978
శ్రీ పంతుల వెంకటేశ్వర రావు: 7386338119
శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి: 9440174797
శ్రీమతి పుట్టి నాగలక్ష్మి:9849454660

No comments:

Post a Comment