కస్తూరి రంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు
అల్లూరి వేంకటాద్రిస్వామి
డా. జి. వి. పూర్ణచందు
‘అమరము నాంధ్రము కావ్యము’ అంటూ, ఆంధ్ర భాష కూడా దేవభాషేనన్న వాగ్గేయకారుడు శ్రీమాన్ అల్లూరు వేంకటాద్రిస్వామి- తిరువరసుగానూ, శ్రీమత్ పరమహంస తిరువేంగడ రామానుజ జియరుగానూ వైష్ణవ భక్తకోటిలో ప్రసిద్ధుడు. హరికథాగానానికి విశిష్టత తెచ్చినవాడు. భద్రాచల రామదాసు పరంపరకు చెందిన కవి ఆయన.
“యేమయ్యా రామయ్యా” అని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిలా సంభావించిన వాడాయన. శ్రీరంగం రంగనాథస్వామిని కస్తూరి రంగయ్యగా తెలుగింట నిలిపాడు. ‘కస్తూరిరంగయ్య, కరుణింపవయ్య, సుస్థిరముగ నమ్మితి నయ్య’ అనే హరికీర్తన వీరిదే!
“పరాకు సేయుట, పాడిగాదురా పరమపురుష వరదా” పాట హరిదాసుల నోట వినిపిస్తూనే అంటుంది.
‘బిరాన బ్రోవక నిరాకరించుట బిరుదు నీకు దగురా-వరదా’ అని ప్రశ్నిస్తాడు ప్రభువును.
వేంకటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు సిద్ధాంతం నంబి, ఆ నంబి గారి శిష్యుడు బుక్కపట్టణం తిరువేంగడదాసు...ఇలా వీరి శిష్యపరంపర తమిళనాట కొనసాగుతోంది. పెరంబూరులో ‘అల్లూరి వెంకటాద్రి స్వామి భక్తజనసభ’ పనిచేస్తోంది. ‘శ్రీమాన్ అల్లూరి వెంకటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి సంఘం’ శ్రీరంగంలో ఏటా వెంకటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది.
1955లో గానకళాప్రపూర్ణ శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్ పాడిన వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదు కేంద్రాల నుంచి భక్తి రంజని రేడియో కార్యక్రమంలో ప్రసారం అయ్యేవి. విజయవాడ రేడియో కేంద్రంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినపాటల సి డి దొరుకుతోంది.
క్రీస్తు శకం 1807లో అక్షయనామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సోమవారాన ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజాం రాజ్యంలోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహారంలో ఈయన జన్మించారు. శ్రీవత్స గోత్రీకుడు. తండ్రి వేంకయ, తల్లి వేంకమ. ప్రక్కనే ఉన్న జుజ్జూరు గ్రామం లోని నృసింహ దేవాలయంలో ఈయన తపోదీక్షలో ఉండేవాడు. భద్రాచలం నుంచి తిరిగి వస్తూ దారిలో ఆగిన తూము నరసింహ దాసు ఈయనకు తన తంబురా, గజ్జెలు, కరతాళాలు మెచ్చిఇచ్చి ఆశీర్వదించాడు.
ఈ సంఘటన తరువాత వెంకటాద్రి స్వామి పరమ వైష్ణవుడిగా మారిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళి, అక్కడి నుంచి భక్తజనంతో కలిసి కంచి చేరి అక్కడే స్థిరపడిపోయాడు.
ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా కంచికే చేరేవి.
‘శ్రీ వేంకటాద్రిస్వామి హరినామ కీర్తనలు’ పేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తకం వెలువడింది. 170కి పైగా కీర్తనలు ఇందులో ఉన్నాయి. అందులో ఆయన జీవిత చరిత్ర కూడా సంక్షిప్తంగా ఉంది. 1972లో ఆర్ వెంకటేశ్వర్ సంకలనం చేసిన ‘శ్రీ వేంకటాద్రిస్వామి కీర్తనలు’ పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం 2009లో డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్ ఓపెన్ లైబ్రరిలో (ఓఎల్.5402127M) ఉంచింది. 1930 లలో ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా తమిళంలో వెలువడింది.
శ్రీ పి సాంబమూర్తి ‘సౌత్ ఇండియన్ మ్యూజిక్’ పరిశోథనాగ్రంథంలో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువందల సంవత్సరాల జ్ఞాపక సంచికలో ఈయన నివాసం ట్రిప్లికేన్ అని అంది.
ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ‘ఆంధ్రయోగులు’ గ్రంథంలో ప్రచురించిన వ్యాసంలో వేంకటాద్రిస్వామికి పాము పడగ పట్టటం, సీతారాములు కలలో కనిపించటం లాంటి కథలున్నాయి, కృష్ణాజిల్లా జుజ్జూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈయన బాల్యం అంతా గడిచినట్టు కనిపిస్తుంది.
జుజ్జూరులో కొండపైన విగ్రహం స్వయంభువుకాగా, దానికి కొంచెం దిగువున యోగానంద నరసింహస్వామి గుడి అంది. 14-07-1818న పదేళ్ళ వయసులో ఉన్న వేంకటాద్రి స్వామికి తూము నరసింహదాసు తన తంబురా, కరతాళాలు అందించాడు. ఈ తాళాలు, తంబూర... చెన్నై ముత్యాలపేట గజేంద్రవరద మందిరంలో భద్రంగా ఉన్నాయని రామరాజుగారు పేర్కొన్నారు.
29-1-1820 న తన 13 వ ఏట ఎవ్వరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళపాటు అక్కడ రామనామ సంకీర్తన చేస్తూ, తూము వారిచ్చిన తంబురా, కరతాళాలకు అదనంగా కాళ్ళకు గజ్జెలు కట్టి ఆడి పాడటం అలవాటు చేసుకొన్నాడు.
“తంబురు తాళము చేత ధరియించి వేడుక మీఱ గంభీరముగా కాళ్ళగజ్జలు ఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జె0దుచు” అంటూ తన హరికథాగాన విధానం గురించి చెప్పుకున్నాడు.
వరదరాజ స్వామి పుష్ప కైంకర్యానికి పూలతోట పెంచటం కోసం తన ఆటని, పాటని ఉపయోగించుకొని డబ్బు సంపాదించటానికి వీధులలో బిచ్చమెత్తడంతో కంచిలో ఆయన జీవితం ప్రారంభమయ్యింది. ఇది 1828 నాటి సంగతి. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్ళు!
పది రూపాయలైనా కళ్ళచూడనిదే భోజనం చేయకూడదనే నియమం పెట్టు కొన్నాడు. కంచిలో ఇంటింటికి తిరిగి తాను రచించిన కృతులు పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ ప్రాచుర్యాన్ని పొందాడు.
దేశ సంచారం ప్రారంభించి, అనేక వేల రూపాయలు భగవంతుని పేర సేకరించి కాంచీపురంలో దేవీ దేవులకు రెండు పుష్పవనాలు, శ్రీచందనం, శయ్యాగృహంలో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియం మొదలయిన కైంకర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మంటపాన్నీ, ఇంకా కంచి నగరంలో వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేయించాడు. మహాబలిపురం లోని గుడిని కూడా బాగుచేయించాడు.
ఆరాధనాది కార్యక్రమాల కోసం, రూ. 5,000 పెట్టి మామండూరిలో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పించాడు. కంచి వరదరాజ స్వామి కోసం రత్నాలు పొదిగిన వైరముడిని చేయించి, గరుడోత్సవ సమయంలో అలంకరించే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయించాడు.
శ్రీరంగం రంగనాథ స్వామి పాండియకుండె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయించమని కలలో చెప్పగా, నిద్ర లేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బంగారాన్ని, రత్నాలనూ సేకరించటంలో పడ్డాడు. మరకతం ఒక్కటీ దొరకక చింతాక్రాంతుడై ఉంటే మళ్ళీ స్వామి కలలో కనిపించి, బంగ్లాదేశంలో మాధవదాసు అనే ఆయన ఇంట మరకతం తన కోసమే అందనటంతో మాధవదాసుని కలుసుకొని మరకతం తెచ్చి కిరీటం పూర్తి చేయించాడు. రంగనాథుడికి రెండు కిరీటాలు, ఒక మకరకంఠి కూడా చేయించాడు. తిరుప్పళాతురై ఊరుని కొని, దానిని స్వామివారికి నిత్య నైవేద్యాలకోసం సమర్పించాడు.
ఆముక్తమాల్యద కావ్యంలొ ప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవికి అలంకరించే కిరీటం అమ్మవారి కోరిక మీద వీరు చేయించినదేనట! మాన్య మిత్రులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి, అల్లూరి వారు చేయించిన అమ్మవారి వైరముడి కిరీటం చూపించమని అడిగితే పురోహితులు అమ్మవారికి అలంకరించినది అదేనని చెప్పారు.
మదురై దగ్గర ‘తిరుమాలిరుంశోలై’ అనే గ్రామంలో సుందరరాజ స్వామిగుడి విమానాన్ని ఆ స్వామి కోరికమీద నిర్మింప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తోంది.
బహుశా ఒక సంస్థానాధీశుని యావదాస్తీ చాలనంత పెద్ద మొత్తాన్ని వైష్ణవ దేవాలయాల కోసం ఖర్చుచేశాడు. వీరి శిష్యుడు అన్నలూరి నారాయణదాసు ‘రత్నఖచిత మకుటాది విభూషణ రంగనాథ కై0కర్య ధురీణ’ అని గురువుని కీర్తించాడు. ఒక అతిసామాన్యుడు తన నిజాయితీతో ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించ గలడని నిరూపించగలిగాడు వేంకటాద్రిస్వామి. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఆయన వ్యవహరించ గలగటం వలనే ఈ విజయాలు సాధ్యం అయినాయి.
ఆచార్య బిరుదురాజు వారు వేంకటాద్రిస్వామి గురించి ఒక మహిమను చెప్పారు. ఒక రోజు కేవలం 5 రూపాయలే వచ్చిందని భోజనం చెయకుండా అండిపోతే, అప్పస్వామిరాజు అనే ఆంతరంగికుడు గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి ఇంకొక ఐదు రూపాయలు సంపాదించాక స్వామిని ఇంటి దగ్గర దిగవిడిచి అప్పస్వామిరాజు వెళ్ళిపోయాడట. ఆ సాయంకాలం అప్పస్వామి రాజు గారింట్లో భజన కోసం వెంకటాద్రి స్వామి వేడితే అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు మంచాన ఉన్నాడని తెలిసింది. మరి ఆ వేంకటాద్రి స్వామికి గొడుగు పట్టిందెవరు... ?ఊరంతా చూసిన దృశ్యం కదా అది?
ఆయన సంపాదించిన ధనం అంతా ఇలా యాచనద్వారానే అయినా ‘ధనమదాంధుల ద్వారము దూరక కడు ధన్యుడనై నే నుండెదను’ అనటంలోని లోతయిన భావాన్ని అర్థం చేసుకో గలగాలి.
“జాలిజెంది జనుల-బేలనైయాచించి, చాల నలసి సొలసితి-నీవేగతి” అని చెప్పుకుంటాడు.
“కాసు చేయని ఖలులకెల్ల, దోసిలొగ్గి వేసారితి” నంటాడు.
“కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను/అచ్యుతుని దాస్యసుఖమనుభవించెదను” అని ప్రకటించుకున్నాడు.
తన జీవిత చరమాంకంలో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన తంబూర, గజ్జెలు, కరతాళాలు బహూకరించి తన కృషిని కొనసాగించవలసిందిగా కొరాడట . శ్రీ రంగనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసించి, తిరువేంగడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొందారు. కొళ్ళడం గట్టున శ్రీ ‘అళవందార్ పడుత్తురై’ అనే సన్నిథి స్థలంలో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగింది.
శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి కీర్తనలు పేరుతో ఆయన శిష్యపరంపరకు చెందిన శ్రీ పుష్పాలరామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో వావిళ్ళవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని కందపద్యాలు కూడా ఉన్నాయి. అందులో వేంకటాద్రిస్వామి రేఖా చిత్రం కూడా అంది. శ్రీమదాంధ్ర భక్త విజయము అనే గ్రంథంలో వేంకటాద్రిస్వామి జీవిత చరిత్ర కొంత ఉంది. వావిళ్ళ ప్రతికి అదనంగా ఆయన ప్రదర్శించిన కొన్ని మహిమలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఆయనే పంపించారు. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఒంగోలు దగ్గర నూనెవారి పాలెంలో గుడికి రథం చేయించటం కోసం ఇనుప ఊచలు, కర్ర దుంగలను ఖరీదు చేసి, మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషనుకు స్వయంగా ఆయనే తెచ్చారట. కానీ, సమయం లేదని దుంగలు ఎక్కించుకోకుండానే రైలు బయలు దేరితే, వేంకటాద్రిస్వామి ఎలా వెళ్ళగలవన్నట్టు చూశారని, రైలు అకారణంగా ఆగిపోయి, దుంగలన్నీ ఎక్కించుకౌన్నాకే కదిలిందనీ, కానీ, ఆలశ్యం కాకుండా, సరిగ్గా సమయానికే గమ్యస్థానానికి చేరిందని ఒక కథ ఇందులో అంది..
‘ఇంచుకైన దయరాద-యిభరాజవరద’,
‘సజల జలదగాత్రా-సరసిజ నేత్రా-నిజమని నీపదభజన జేసెదు వరద’,
‘ఇంత పంత మేల నాతో నిందిరా రమణా’,
‘నామస్మరణ సేయుడీ జనులార-హరినామ స్మరణ’ ఇలాంటి వీరి కీర్తనలు చదువుకోవటానిక్కూడా మనోహరంగా ఉన్నాయి.
‘దుద్దుపెట్టి నీవు దూరాన యుండక –పద్దులీడేర్చు నీపాల బడితినిక’ ‘ముద్దుపదములందు మువ్వలు గదలగ’ లాంటి చరణాలు ఆయన సాహితీ వైదుష్యాన్ని తెలియచేస్తాయి.
‘ధనమదాంధుల చేరువ జేరక కడు ధన్యుడ నయ్యేదెన్నటికో....” లాంటి పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కొసం ఆయన ఎన్ని అవమానాలు భరించి ఉంటాడో ననిపిస్తుంది.
‘ఇంచుకైన యాది లేదా?’అనే ప్రయోగాన్ని 150 ఏళ్ళక్రితం తమిళ దేశంలోనే జీవితం అంతా గడిపిన వ్యక్తి చేయటం విశేషమే!
“నె0జిలిపడనేల, నిరతము శ్రీపతి మంజులమగు దివ్య మంత్రరాజముగల్గ” అనే అనుపల్లవిలో ‘నె0జిలి’ అంటే ఆందోళన. నీల జీమూతవర్ణ0 అనేది రంగుల్లొ తేడాలను గుర్తి0చటానికి ఉపయోగపడే ప్రయోగం.
‘గట్టి మనసు’ ‘మోడిచేయటం’, ‘వలరాజుకాక’ లాంటి చక్కనితెలుగు పదప్రయోగాలు ఈయన కీర్తనల్లో కనిపిస్తాయి.
“చందురుగేరుమోమందముతో నీ మందహాసము గనుగొ0దు రారా” “దండిపాతకముల నెల్ల మెండుగాను జేసినట్టి దుండగీడనైన నా నెండ యెవరు లెరు తండ్రి”
“నీకే మరులుకుంటిరా నిగమగోచరా”
“ఘోర భవాంబుధి గొబ్బున దాటెడు నెరుపు గని మనవే ఓ మనసా!” “రంగుగ దాసుల రక్షించెడు శ్రీ రంగని మఱచిన దొంగ జనములు”
“దుద్దుబెట్టి నీవు దూరాన యుండక పద్దులీడేర్చు నీ పాల బడితినిక”
“కుదురుగ గూర్చుండి-గోవింద యనగనే”
“ఒప్పులకుప్ప రారా, నే జెసిన తప్పులెన్నకు ధీరా”
“పా0చాలి పరులచే బాధల బడగానె అంచితముగ నీ వక్షయమనలెద?”
“అంతరంగ భక్తమానసంతరంగమందు నేకాంతుడై యున్నవాడు-రంతులేలపోరే మీరు” ఇలాంటి జాను తెనుగు పదాలు చదువుతుంటే మనసు పులకరిస్తుంది.
“అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న, యారగింతువు రంగ మెలుకో” అనే చరణంలో. ఆనబాలు అంటే, నీళ్ళు ఇగిరేంత చిక్కగా కాచిన పాలు అని అర్థం. అవ్వ, చద్ది, రొట్టే అనేవి మూడు వేర్వేరు వంటకాలు. అవ్వ అంటే అవ్వం అనే ప్రసాదం. చద్ది అంటే చలిది అన్నం. తాలింపు పెట్టకుండా చల్ల కలిపిన అన్నం. రొట్టె అంటే పెద్ద పరిమాణంలో వేసిన దిబ్బరొట్టే లాంటి ప్రసాదం. ఈ మూడింటినీ కలిపి అవ్వచద్దిరొట్టెగా ఆయన వ్యవహరించి ఉండవచ్చు.
భావకవులకు పదలాలిత్యం నేర్పిన కవి అల్లూరి వేంకటాద్రిస్వామి. ఆయనను కేవల మహా భక్తుడిగానే చూడటం వలన ఆయన సంగీత సాహిత్య జీవితాలు మరుగున పడిపోయాయి.
ఆయన 1877 వరకూ జీవించే ఉన్నారు. అంతకు రెండుమూడేళ్ళ వరకూ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన్ని తెలుగు సాహితీ వేత్తలు అంత త్వరగా ఎలా మరిచిపోయారో ఆశ్చర్యమే!
సంగీతవేత్తలు సరేసరి. అకాశవాణి, వావిళ్ళ వారు పూనుకొనక పోయి అంటే, అల్లూరి వారి కీర్తనలు, అన్నమయ్య కీర్తనల్లాగే అనేక శతాబ్దాలు మూలపడి ఉండేవి. అంతటి వాగ్గేయకారుని మరిచిపోగలగటం విశ్వాంతరాళంలో ఒక్క తెలుగువారికే సాధ్యమని మరోసారి ఋజువయ్యింది.