పరిశోధనల్లో
అగస్త్యుడి తమ్ముళ్ళు
డా. జి వి పూర్ణచందు
కంటికి
నిద్ర వచ్చునె? సుఖం బగునె రతికేళి? జిహ్వకున్
వంటక
మించునే? యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె?
మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
గంటకుఁ
డైనశాత్రవుఁ డొకండు దనంతటి వాడు గల్గినన్
వింధ్యపర్వతానికి తనకన్నా ఎత్తైన వాడు ఎవడూ లేడని గర్వం. నారదు
డొచ్చి, “హిమాలయాలు నీకన్నా ఎత్తైనవి” అన్నాడు. తనకన్నా ఎత్తైన వాడు ఒకడున్నాడనేసరికి వింధ్యుడికి
హిమవంతుడంటే విపరీతమైన ద్వేషం కలిగింది. మద మాత్సర్యాలకు లోనయ్యాడు. ఆ సందర్భంలో
శ్రీనాథుడు చెప్పిన పద్యం ఇది. కాశీఖండం కావ్యంలోది ఈ సన్నివేశం.
“కంటకంలాంటి శత్రువు ఒకడున్నాడని తెలిశాక ఎవరికైనా కంటికి నిద్ర
వస్తుందా? రతికేళి సుఖంగా అనిపిస్తుందా? తిండి సహిస్తుందా? వైభవాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయా?”
అంటాడు వింధ్యుడు. కోపంతో విపరీతంగా పెరగటం
మొదలు పెట్టాడు. ఎవరెష్టుని మించి ఆకాశం హద్దులు దాటి సూర్యగమనానికి అడ్డుగా
పెరిగాడు. దాంతో జనం అగస్త్యుడితో మొరపెట్టు కున్నారు. అగస్త్యుడు వింధ్య దగ్గరకు
వచ్చాడు. వింధ్యుడు వంగి తన శిరసు వంచి అగస్త్యుడి కాళ్లకు మొక్కాడు. “నేను దక్షిణాపథానికి వెడ్తున్నాను, తిరిగి వచ్చేవరకూ ఇలాగే వంగి ఉండు” అని ఆదేశించి వెళ్ళి పోయాడు అగస్త్యుడు.అలా వెళ్ళిన వాడు
దక్షిణాదిలోనే స్థిరపడిపోయాడు. వింధ్యుడు అలాగే వంగి ఉండిపోయాడు. ఇదీ వింధ్యను
వంచిన అగస్త్యుడి కథ.
దక్షిణాపథాన వింధ్య దాటగానే ఆంధ్ర నగరాలు వస్తాయి. ఆంధ్రలో
అగస్త్యుడు వైదికధర్మాలు ఎక్కువగా ప్రచారం చేశాడు. తెలుగు వారితో అగస్త్యుడి
అనుబంధానికి చాలా సాక్ష్యాలున్నాయి. అగస్త్యుడి పేరుతోనే తెలుగు తల్లులు బిడ్డలకు
పాలిచ్చి, కాళ్ళూ చేతులూ తారంగం ఆడించి, పొట్టమీద రాస్తూ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అంటారు.
వాతాపిని మేకలా మార్చి అగస్త్యుడికి వండి పెట్టాడు ఇల్వలుడు. సంజీవని
మంత్రంతో ఆవాతాపిని బతికించటానికి ముందే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అనేస్తాడు. వాతాపి జీర్ణం అయిపోయాడు. అందుకే తెలుగుతల్లులు “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం/గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై/ఏనుగు
తిన్న వెలక్కాయ జీర్ణమై/భీముడు తిన్న పిండివంటలు జీర్ణమై/ అర్జునుడు తిన్న అప్పాలు
జీర్ణమై/అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై/కుంది లాగా కూర్చొని/నంది లాగా
లేచి/తాంబేలు లాగా తాళి/ చల్లగా ఉండాలి/శ్రీరామ రక్ష/నూరేళ్ళాయుస్సు” అని పాడుతుంది తెలుగుతల్లి.
వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని సందర్శించారు.
“ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది,
అక్కడేగోదావరి ప్రవహిస్తూంది. అక్కడ ఆశ్రమాన్ని
నిర్మించుకో” అని రాముడికి సూచించింది అగస్త్యుడే! “సీతను భద్రంగా కాపాడుకో”, అని ముందస్తు
హెచ్చరిక చేసిందీ ఆయనే! అగస్త్యుడు సప్త మహర్షుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు.
సముద్రాన్ని అపోశనం పట్టాడని ఆయన గురించి చెప్తారు. అగ(నగ) అంటే పర్వతం, అస్తి అంటే తోసేయటం, పర్వతాల్ని తోసేయ గలవాడని అర్ధం.
మొత్తంమీద మహాశక్తిమంతుడు అగస్త్యుడు. వేదాలలో కొన్ని ఋక్కులు కూడా వ్రాశాడు.
అగస్త్యుడు తిరుపతి దగ్గర కళ్యాణి, భీమ, సువర్ణముఖి నదులు కలిసే చోట నిత్య
పూజలకు శివలింగాన్ని ప్రతిష్ఠించి నివాసం ఉండేవాడనీ, ఆకాశరాజ పుత్రిక పద్మావతిని పెళ్ళాడిన శ్రీనివాసుడు వచ్చి ఆయన
ఆశ్రమంలోకొన్నాళ్ళు న్నారనీ ఐతిహ్యం. అగస్తీశ్వర క్షేత్రంగా ఇది ప్రసిద్ధి.
తెలుగు నేలమీద అగస్త్యుడి కార్యక్రమాలు వైదిక సంస్కృతిని పరిచయం
చేయటానికి ఉద్ధేశించినవిగా కనిపిస్తాయి. ఇక్కడి నుండి తమిళనాడుకు చేరిన అగస్త్యుడు
తన వైదిక ప్రచారానికి స్థానిక భాషను కూడా ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. తమ
భాషకు వ్యాకరణ కర్తగా తమిళులు అగస్త్యుణ్ణి గౌరవిస్తారు. సిద్ధ వైద్య సాంప్రదాయంలో
అగస్త్యుణ్ణి సాంప్రదాయ ప్రవర్తకుడిగా చెప్పుకుంటారు. మొత్తం మీద అగస్త్యుడి
కార్యక్రమాలు తెలుగు, తమిళ, మళయాళ ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకరించి జరిగాయి.
అగస్త్యుణ్ణి తమిళులు స్వంతం చేసుకున్నారు. స్వంతం చేసుకోగలగటం
గొప్ప. కానీ, అది అతిశయోక్తులకు, అభుత కల్పనలకు దారి తీయకూడదు. తమిళ ప్రాచీన భాషాకేంద్రంలో కేవలం సంగమ
సాహిత్యం మీద అనేక పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు.
ఒక ప్రియుడు తన ప్రియురాలికి కట్టుకునేందుకు ఆకులు ఇచ్చిన కథను బట్టి, సంగమ సాహిత్యం ఆకులు కట్టుకుని తిరిగే ఆదిమ కాలం నుండీ ఉన్నదని ఆయన
చెప్తుంటే ఆశ్చర్యం వేసింది.
జైన బౌద్ధ సాహిత్యాలలో ఆంధ్రుల గురించి ఉన్న ఆధారాలను కూడా మనం
పట్టించుకోవట్లేదు. లేని ఆధారాల మీద అక్కడ కోట్ల రూపాయల పరిశోధనలు సాగుతున్నాయి.
‘అగస్త్యభ్రాత’ అంటే అగస్త్యుడి తమ్ముడు అని ఒక జాతీయం
ఉంది. అగస్త్యుడు కలశం లోంచి పుట్టాడు. ఆయనకు అన్నదమ్ములెవ్వరూ లేరు. లేని వాటిని
ఉన్నట్టుగా చెప్పటాన్ని ‘అగస్త్యభ్రాత’ అంటారు. అగస్త్యుడి తమ్ముళ్లపైన పరిశోధనలు సాగితే వింధ్య పర్వతం
తిరిగి లేచి నిల్చునే ప్రమాదం ఉంది.
No comments:
Post a Comment