Thursday, 25 February 2016

చరిత్ర రచనా చక్రవర్తి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ::డా. జి వి పూర్ణచందు,

చరిత్ర రచనా చక్రవర్తి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య
డా. జి వి పూర్ణచందు,
ఫిబ్రవరి 2016 ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురించిన నా వ్యాసం
“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అని ప్రశ్నించటంలో నిరాశావాదం కూడా ఉంది. నా దేశచరిత్రలో ‘ఇదీ గర్వ కారణం’ అని సగర్వంగా ప్రకటించటంలో జాతీయతా భావం వుంది. అసలైన అభ్యుదయ తత్త్వం వుంది. నిజమైన దేశభక్తి ఉంది.
దేశ చరిత్రల రచన కత్తిమీది సాము. దాన్ని సుసాధ్యం చేసిన ‘చరిత్ర రచనా చక్రవర్తి’ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య దేశచరిత్ర రచనలకు కొత్త వొరవడి దిద్దారు. దేశీయులు చేయెత్తి జైకొట్టేలా వారిలో దేశభక్తిని నింపగలిగారు. గతమెంతో ఘనకీర్తిని చాటి చెప్పగలిగారు.
1898 జూలై 1న రత్నమాంబ, వెంకన్నలకు ఘంటసాలలోనే జన్మించిన పండిత వెంకట సుబ్బయ్య జీవిత చరిత్రల బహుగ్రంథ కర్తగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితుడు. జాతీయ వాది. ఉప్పు సత్యాగ్రహ కాలంలో 9 నెలల కారాగారవాస శిక్ష అనుభవించారు. జాతీయోద్యమ కార్యకర్తగా ఖద్దరు ప్రచారం చేశారు. 1933లో కృష్ణాజిల్లాబోర్డు సభ్యులుగా జమీందారీ రద్దుకు పాటపడ్డారు. ‘గ్రంథాలయ సర్వస్వము’ పత్రికా సంపాదకవర్గంలో ఒకరుగా గ్రంథాలయోద్యమానికి పాటు పడ్డారు. జీవిత చరిత్రల రచనకు కొత్త ఒరవడి తెచ్చారు. జీవిత చరిత్రలు వ్రాస్తే వెంకట సుబ్బయ్య గారే వ్రాయాలి అన్నంత ప్రసిద్ధిని పొందారు.
తతిమ్మా కృష్ణాజిల్లా గ్రామాలతో పోలిస్తే ఘంటసాల గ్రామంలో ప్రజల ఆలోచనా తీరులో కొంత భిన్నత్వం కనిపిస్తుంది. అది, అలనాటి ప్రాచీన నౌకా కేంద్రం కావటంతో యోధులూ, సాహసికులు, ఙ్ఞాన సంపన్నులైన నావికుల వారసత్వం ఈ నాటికీ ఘంటసాల స్థానికులలో తొణికిస లాడుతూనే ఉంటుంది. గొర్రెపాటి వారు, గొట్టిపాటి వారూ, వేమూరి వారూ ఘంటసాలకు వన్నెతెచ్చిన ప్రసిద్ధ వంశీకులు. అక్కడపుట్టిన చివురు కొమ్మైనా చేవ...అన్నట్టు అస్పృశ్యతా నివారణకు కృషి చేసిన అగ్రహారికుడు ఘంటసాల సీతారామయ్య లాంటి అభ్యుదయవాదులు పుట్టిన నేల అది!
ఘంటసాలలో రైతు పెద్ద, స్వాతంత్ర్య సమరయోధుడూ మరో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. అందుకని, ఆయనను కిసాన్ వెంకట సుబ్బయ్య అనీ, వీరిని పండిత వెంకట సుబ్బయ్య అనీ జన వ్యవహారం. పండిత వెంకట సుబ్బయ్య గారు ఎర్రగా దానిమ్మ పండు రంగులో వుండేవారు. అందుకని ‘తెల్ల వెంకట సుబ్బయ్య’ అనికూడా అనేవారు. ‘గొ వెం సు’ ఆయన పొట్టిపేరు.
ఎందరి జీవితాలనో చరిత్రగా మలచిన వెంకట సుబ్బయ్యగారు స్వీయచరిత్ర కూడా వ్రాసుకున్నారు. కానీ, అందులో తన చుట్టూ ఉన్న లోకం గురించి తప్ప, తన గురించి చెప్పుకున్నది తక్కువ. “స్వీయచరిత్రలో కుటుంబ విషయాలు తగ్గించి, సమకాలీన విషయాలను పేర్కొంటూ, దేశాభివృద్ధికి బలియయిన వారు ఘనకార్యాలు చేసిన వారు వ్రాసుకుంటే లోకం హర్షిస్తుంది” అంటారాయన. అందుకే, అడపా దడపా ఆయన ప్రస్తావించిన విషయాల్లోంచే ఆయన వ్యక్తిగత వివరాలు ఏరుకోవాలి.
“మొదటి నుండి నేను నోరులేని వాడినే! క్రియా రహితుడను, ఉపేక్షా శీలిని, ముప్ఫై యేళ్ళు వచ్చాక కూడా సన్యసించాలని అనుకునే వాడిని”, “నేను నిరీశ్వరవాదిని గాను, ఈశ్వర భక్తునీ గాను! దేవుడు ఈ నరక కూపంలో పడేశాడని ఆయన్ని స్మరించితే గానీ, ముక్తి లేదని నేను నమ్మలేను” అని రాసుకున్నా రొకచోట. ‘నా సాహిత్య కృషి’ పుస్తకంలో ఆయన కౌతా శ్రీరామశాస్త్రి ఆయన కుమారులు రామమోహనశాస్త్రి, ఆనందమోహన శాస్త్రి, చెరుకువాడ వేంకట నరసింహం, ఇలా ఎందరో ప్రముఖుల సాహిత్య కృషినీ వివరిస్తారు జీవిత చరిత్రలను చిత్రించటం అంటే ఆయనకు ప్రాణం. బహుశా ఆ విద్యలో ఎవరైనా వెంకట సుబ్బయ్య గారి తరువాతే!
“అయిదుగురు ఆడపిల్లల తర్వాత రాళ్లకు రప్పలకు, చెట్లకు, పుట్టలకు మొక్కి నిన్ను కన్నాను. నిన్ను విడిచి ఉండలేను. నీవు బందరు చదువు కోసం వెళ్ళవద్దని మా అమ్మ రత్తమ్మ కంటతడి పెడుతూ కూర్చుంది. తల్లి తరువాత తల్లి వంటిది మా పెద్దక్క సీతమ్మ. ఘంటసాలపాలెంలో వున్న ఆమె వద్దకు వెళ్ళి నా చదువు గొడవ చెప్పాను. ఆమె దయామయి. భక్తురాలు. వివేకవతి కూడా! ఆ అక్క ఇంటి వద్ద కొంతకాలం పెరిగాను. ఆమెకు పిల్లలు పుట్టి పోయారు. ఆమెకు నాయందు అమిత ప్రేమ. ‘ఇంటి గోడమీద 25 రూపాయలుపెట్టి కుండ బోర్లించానని చెప్పి ఆ మూట ఇచ్చి, ‘నాయనా! నువ్వన్నా చదువుకుని బాగు పడు’మని దీవించింది. అలా చదువు మొదలెట్టారు.
బందరు నోబుల్ కళాశాల హైస్కూల్ శాఖలో గొట్టిపాటి బ్రహ్మయ్యగారు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారూ ఒకే గదిలో వుంటూ చదువుకున్నారు. ఆయన ఫోర్తు ఫారం, వెంకట సుబ్బయ్య గారు థర్డ్ ఫారం. ఫోర్త్ ఫారంలో ఉండగా వందేమాతరం ఉద్యమ ప్రభావంతో, బెంగాలీ నేర్చుకోవాలని పించిందాయనకు. బందరులో శ్రీ కౌతా శ్రీరామశాస్త్రి గారిని ఆశ్రయించి బెంగాలీ నేర్చుకున్నారు. బెంగాలీ రావటం వలన శరత్ సాహిత్యాన్ని మూలభాషలో చదివే అవకాశం కలిగింది. స్కూల్ ఫైనల్ చదివేందుకు కలకత్తా వెళ్ళారు. కానీ, సీటు దొరకలేదు. ఇంటర్మీడియట్ చదవాలని, నాగపూర్‘ వెళ్ళారు. కానీ, ఆరోగ్యం దెబ్బతినటంతో తిరిగివచ్చి, ఇంట్లోనే అధ్యయనం ప్రారంభించారు.
“ఆదికవి వాల్మీకి శోకంతో రామాయణ రచన ప్రారంభమైనట్టు,1915లో పెద్దక్క సీతమ్మ స్వర్గస్థురాలైన దుఃఖంలో ‘సీతాచరితం’ పేరుతో ఆమె చరిత్ర వ్రాశాను...” అని చెప్పుకున్నారు. ఆయన రచనలన్నీ ఇంచుమించుగా జీవిత చరిత్రలే! రాజారామ్మోహన రాయ్, కేశవ చంద్రసేన్, ఇలా చాలామంది జీవితాలమీద వ్యాసాలు వ్రాశారు.
“నా వృత్తి వ్యవసాయము. నేను వృత్తిగా రచన ప్రారంభించలేదు. నా ప్రవృత్తి నన్ను రచయితగా చేసింది”. “నాలో రేగిన ఆలోచనలే నన్ను రచయితగా చేశాయి” అంటారాయన. తెలుగు భాషాసమితి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లాంటివి ఆయనను వరించినా వెంకట సుబ్బయ్యగారు ఏనాడూ పదవులు, పురస్కారాల జోలికి పోయిన వారు కాదు. తన రచనల వలన మాత్రమే తనకు గౌరవం రావాలని కోరుకున్నారాయన.
“శరత్ చెప్పినట్టు, ‘యౌవనదశలో కవిత్వం వ్రాయి, వృద్ధాప్యంలో విమర్శ వ్రాయి’ అనేది నాకు బాగా నచ్చింది.” అంటారాయన్. తొలి రచనల్లో పద్య కవిత్వం ఉన్నప్పటికీ ఆయన సాహితీ వ్యాసంగం అంతా పరిశోధనాత్మక వచనంగానే సాగింది.
1922లో గాంధీమహాత్ముని నిర్భంధం,1936లో గీతాభూమిక, 1940లో “భట్టుమూర్తి రామరాజ భూషణుడా?” పుస్తకాలు ప్రచురించారు. 1942లో పిల్లల పుస్తకం “నవ్వులు-పువ్వులు” పేరుతో పాతపాటలు, కొత్తపాటలు అనే రెండు విభాగాలు వ్రాసి, తెలుగు బిడ్డలకు అంకితం ఇచ్చారు.1961లో ‘ప్రహ్లాద చరిత్రము’ వ్రాశారు. 1944లో ‘మన జమీందారీలు’, 1946లో ‘ప్రజానాయకుడు ప్రకాశం’, “హంపీ పిలుపు” గ్రంథాలు వ్రాశారు. 1947ఘంటశాల చరిత్ర వ్రాసి, 1966లో పెంపు చేసి మళ్ళీ వ్రాశారు.
1946లో ‘ప్రజానాయకుడు ప్రకాశం’, 1948లో ఆచార్య రంగా (జీవిత చరిత్ర)నీ, ‘మన రైతుపెద్ద’ పేరుతో గొట్టిపాటీ బ్రహ్మయ్య గారి జీవిత చరిత్రనీ వ్రాశారు. పిల్లల పుస్తకం “గాంధీ తాత” కూడా అదే సంవత్సరంలో వ్రాశారు. 1949లో బాల సాహిత్య బహుమతి పొందిన “సరోజినీ దేవి” గ్రంథం. 1951లో వల్లబాయి పటేల్ జీవిత చరిత్ర, 1967లో “పంజాబు కేసరి లాలాలజపతిరాయి”, 1969లో “కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు గారి జీవితము-సాహిత్యము “, 1971లో “కిసాన్ వెంకట సుబ్బయ్య” పుస్తకాలు వ్రాసి ప్రచురించారు.
1952లో అక్షరాభిషేకం, “శరత్ జీవితం” గ్రంథాలు వెలువరించారు. శరత్ జీవితం గ్రంథాన్ని గదర్ వీరుడు దరిశి చెంచయ్య గారికి అంకితం ఇచ్చారు.1955లో ‘శరత్ జీవితం’, ‘శరత్ సాహిత్యమూ’ కలిపి శరద్దర్శనం పేరుతో పెద్దపుస్తకంగా తెచ్చారు. వెంకట సుబ్బయ్య గారి కుమార్తె శకుంతల, అల్లుడు శివరామకృష్ణలు నెలకొల్పిన ’దేశి కవితామండలి’ సంస్థ శరత్ సంపూర్ణ సాహిత్యాన్ని ప్రచురించింది. ’దేశి కవితామండలి’ అంటే శరత్ సాహిత్యం, శరత్ సాహిత్య మంటే దేశికవితా మండలి అనే నానుడి పుట్టింది....” అని ఆ సంస్థ పట్ల వెంకట సుబ్బయ్య గారు తన సంతృప్తిని వ్రాసుకున్నారు.
“1958లో ‘చలం జీవితం-సాహిత్యం’ గ్రంథాన్ని చలం జీవితంలో అనేక మార్పులకు కారణమైన చింతా దీక్షితులకు అంకిత మిచ్చాను. “చలం గొప్ప శిల్పి ఆయన జీవితానికీ రచనలకు సంబంధమున్నట్టే, ఆయన కళలకు, జీవితానికీ సంబంధమున్నది. There is no such thing as a moral or an immoral book, Books are well written or badly written. That`s all” అనే ఆస్కార్ వైల్డ్ మాటలు చలం రచనలకు వర్తిస్తాయి” అంటారాయన. చలం పుస్తకాన్ని ప్రచురించి నప్పుడు. “శరత్‘ని వ్రాసిన చేత్తో చలాన్ని వ్రాస్తారా...?” అన్న వారు కూడా లేకపోలేదని వ్రాసుకున్నారు.
1959లో రెండో అమ్మాయి సుగుణ పోయినప్పుడు ‘వేదన’ అనే కావ్యం వ్రాసిన తరువాత తనకు హృదయ భారం తగ్గిందని వ్రాసుకున్నారాయన. ఆ సంవత్సరమే “మాట-మన్నన” పుస్తకాన్ని తెచ్చారు. “మాటంటే మనసు, మనసంటే మాట, మనసులు కలిసేటట్టు నేర్పు గలిగి మాట్లాడాలి” అంటారాయన. సంజీవదేవ్ గారికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు.
1962లో ‘మధురజీవనం’ ఆరోగ్య శాస్త్ర గ్రంథం, ఆరోగ్యపరంగా వ్యక్తి జీవనం, గృహజీవనం, సాంఘిక జీవనం, ఆధ్యాత్మిక జీవనాల గురించి విశ్లేషణ చేశారు. 1963లో “తెలుగు సాహిత్యం తీరుతెన్నులూ” విమర్శనా వ్యాసగ్రంథం తెచ్చారు. నార్ల, అడవి బాపిరాజు,యన్. జి. ఆచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, బసవరాజు అప్పారావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రభృతుల గురించి వ్రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
1965లో “కవిరాజ జీవితము, సాహిత్యము” పుస్తకం వ్రాశారు. “ఏవో కొన్ని ప్రాచీన వ్రాతప్రతుల్లో ఉన్నంత మాత్రాన అది నిజం అని నమ్మకండి. సంప్రదాయంగా వస్తున్నవన్నీ వాస్తవం అనుకోకండి. దేశాచారం అయినంత మాత్రాన యదార్ధం అని నమ్మకండి. పెద్దలు మిమ్మల్ని ఇలా నమ్మిస్తున్నారని గ్రహించండి. సంపూర్ణంగా విమర్శించుకుని అది లోకోప కారకం అనిపించాకే నమ్మండి...” అనే బుద్ధుడి వాక్యాలను ఉదహరిస్తూ త్రిపురనేని వారి జీవిత చరిత్రను వ్రాశారాయన. కవిరాజు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించటానికి ఇంతకన్నా వివరణ అనవసరం. అది వెంకట సుబ్బయ్యగారి శైలి.
“ఇతరుల దోషాలను విస్మరించి మంచిని గ్రహించండి. మానవుడంటే శ్రమ గుణాలు గలవాడు. నీవు మంచిగా వుండి మంచి గ్రహించు” అనే నమ్మకంతో తన మిత్రుల సామాజిక కృషిని విశ్లేషిస్తూ 1970లో ’మిత్రులూ-నేనూ” గ్రంథాన్ని వ్రాశారు.
సి. ఆర్. రెడ్డి సాహిత్య జీవితం గురించి వ్రాస్తూ ఇలా వ్రాశారు: “రెడ్డి ఒక పర్యాయం ఇట్లా అంటాడు- ఆంధ్ర దేశంలో ముగ్గురు ప్రతిభావంతులున్నారు.. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యప్రధమ శ్రేణి ప్రతిభావంతుడు. కాని, ఆయన జీవితంలో తితీయ శ్రేణిలో విజయం పొందాడు. నేను ద్వితీయ శ్రేణి పండితుణ్ణి, అందువల్ల నా జీవితము సగము జయము-సగము అపజయము. రాధాకృష్ణన్ తృతీయ శ్రేణి ప్రతిభావంతుడు, అందువల్లనే ఆయన జీవితంలో ప్రధమ శ్రేణిలో విజయం గావించాడు..” అని!.
ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఆయన సాహిత్యాన్ని గురించి విశదీకరించి చెబుతూ వుంటే ఎంత సేపైనా వినాలనిపిస్తుంది...” అని ఆచార్య యన్. జి. రంగా అన్నారు.
శరత్‘బాబు, చలం, కవిరాజు(త్రిపురనేని రామస్వామి చౌదరి) ఈ ముగ్గురినీ ఆయన ‘ఆధునిక కవిత్రయం’ అంటారు. “నాకు తెలిసినంత వరకూ మన తెలుగులో మొట్టమొదటి స్వీయ చరిత్రను వ్రాసుకున్నది ఏలూరు వాస్తవ్యులు ప్రథమ ఆంధ్ర చరిత్రకారుడు కావలి బుర్రయ్య. అనంతరం ఇంగ్లీషు పద్ధతిలో తెలుగులో స్వీయచరిత్రను 1910లో చక్కగా వ్రాసుకున్నది వీరేశలింగం. ముదిగొండ జగ్గన్నశాస్త్రి వ్రాసిన “వీర సావర్కరు” ఒక గొప్ప కావ్యము. దాని ప్రభావము పెక్కురు పైన బడినది. కోమాండూరు శఠగోపాలాచార్యులు వ్రాసిన జీవిత చరిత్రలలో తాతాచార్య చరిత్రము గొప్పది. రమణారెడ్డి గారి కవికోకిల చరిత్ర ఒక కావ్యముగా వెలసినది...” ఇలాంటి సమాచారం నూతన పరిశోధకులకు గొప్ప సహాయకారి.
ముట్నూరి కృష్ణారావు గారి గురించి వెంకట సుబ్బయ్యగారు చేసిన వర్ణన ముమ్మూర్తులా ఆయన్ని సాక్షాత్కరిస్తుంది: “కృష్ణరాయనిది గుండ్రని ముఖం, విశాలమయిన కాటుక కండ్లు, కోటేరు వంటి ముక్కు, విశాలమయిన వక్షస్థలం, దీర్ఘ బాహువులు, పండువంటి శరీర ఛ్ఛాయ... ఆ దివ్య సుందర విగ్రహానికి తగిన తెల్లని పారాడే పంచెకట్టు, చీలమండల వరకూ వ్యాపించిన బారు లాల్చీ, రాజఠీవిని ధిక్కరిస్తూ కోణాలు తీరిన ధవళ శిరో వేష్టనమూ, నల్లని ఆకు చెప్పులు, చేతికర్రను ధరించిన ఆ నిండైన విగ్రహాన్ని చూచి, ఆయనను “ఎవరు ఈ మహానుభావుడు” అనుకునేవారు. ఆయన ఈ లోకపు మనిషి కాడు. దివ్య లోకమునుండి అవతరించిన మహానుభావుడు” ఇలా సాగుతుందా వర్ణన.
యన్ జి రంగా జీవిత చరిత్ర చదువుతుంటే ఆయన గురించి మాత్రమే కాదు, ఆయన సమకాలికులతో పాటు, జమీందారీ ఉద్యమాన్ని, విద్యార్ధి ఉద్యమాన్నీ స్వాతంత్ర్యోద్యమాల గురించి తెలుస్తుంది. అలాగే ఆయన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు చరిత్ర చదువుతుంటే, ఆంధ్రదేశపు చరిత్ర, ఆంధ్రోద్యమం, స్వాతంత్రోద్యమం తొలి నాళ్ళ సంగతులెన్నో గ్రహిస్తాం. “మిత్రులూ-నేనూ” గ్రంథంలో సాహితీ సామాజిక మిత్రుల్ని వరుసగా పరిచయంచేస్తూ, తన భార్యను కూడా మిత్రుల జాబితాలో ఒకరుగా పరిచయం చేస్తారు.
“మా ఆవిడ పేరు కుటుంబమ్మ. ఈమె పుట్టిల్లు మా గ్రామానికి నాలుగు మైళ్లలో వున్న లంకపల్లి. ఈమెకు ఒక సోదరుడు లక్ష్మీనారాయణ, సోదరి కాశీ అన్నపూర్ణ. వీరి తండ్రి గ్రామ మునసబు వీరమాచనేని భూషయ్య గారు, తల్లి పున్నమ్మగారు. మా వివాహం నా 19వ యేట 10-06-1917న జరిగింది. ఆమె వయసు 14సంవత్సరాలు. 1918లో కాపురానికి వచ్చింది”
“ఇంక మా దాంపత్యం సంగతి, ‘పూర్వం మీ గొడవలో మీ చదువులో మీరుండేవారు. మీరు పలకరించడం లేదని బాధ పడే దానను కాను. ఒకప్పుడు పలకరించక పోతే బాధ. ఎప్పుడూ ఒక మాదిరిగా వుంటే ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు తరచూ పలకరిస్తుంటే వయసు మళ్లిన తరువాత పవిత్రమైన ప్రేమ కలుగుతుంది కాబోలునని అనుకుంటున్నా!”
“నిజం చెప్పు! వయసులో నిన్నేమైనా అన్నానా?” అన్నాను ఒకసారి. “అసలు మన ఇంట్లో ఒకరి నొకరు చెడుగా అనుకోవడ మనేది లేనే లేదు...నేనెప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి వెళ్ళే దాన్ని. ఏమి చేసైనా మీరేమీ అనేవారు కారు”
“ఇది వరకు నా రచనలన్నీ మా అల్లుడే అచ్చు వేసుకునేవాడు. అతను లేడు యిప్పుడు. ‘ఘంటశాల చరిత్ర రెండవ ముద్రణ అచ్చు వేయడం సమస్య అయ్యింది. ఈ సంగతి కనిపెట్టిన నా సతి, “ఆలోచిస్తారెందుకు? వారిని వీరిని అడుగుతారా? ఒక యకరం అమ్మి అచ్చు వేయించండి.. అంది”
పండిత వెంకట సుబ్బయ్య గారి చరమ ఘడియల్లో విషాద సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. తుమ్మల కృష్ణాబాయిగారు ఆయనను నాన్నగారూ అని పిలిచేవారు. ఆనాటి పరిస్థితిని ఆమె ఇలా వ్రాశారు: “చదువుతూ చదువుతూ సుగుణ పోయింది. ఎంతో కృషితో పైకి వస్తున్న అల్లుడు శివరామకృష్ణ అనుకోకుండా నడి వయసులో కన్ను మూశారు. తనకు పక్షవాతం వచ్చింది. అయినా కన్నీరు వత్తుకుంటూ సహధర్మచారిణిని ఓదార్చారు. మిత్రదర్శనం రచనా వ్యాసంగం ఎప్పటిలాగానే ...రాను రానూ మాట గొణుగుపడినా నవ్వు చెరగలేదు. అవయవాలు అశక్తత ప్రకటించినా తపన తీరలేదు. పురమాయింపులు ఆగలేదు. ...”, “అనారోగ్యం బాగా కృంగ దీస్తున్నప్పుడు “ఇంక విశ్రాంతి తీసుకోవచ్చుగదా అంటే, రాయగలిగినంత వరకూ రాయనీయమ్మా... నాకు అదే తృప్తి...”
కష్టాలొచ్చినప్పుడు కూడా తొణకని స్థిత ప్రఙ్ఞతతో ఎనబై నాలుగేళ్ళపాటు వెలిగిన ఆ సాహితీ జ్యోతి 1982జూలై 1న ఆరిపోయింది.

Tuesday, 23 February 2016

దారపు పగ్గాలు:: జి. వి. పూర్ణచందు

దారపు పగ్గాలు

 జి. వి. పూర్ణచందు

ఆలు నిర్వాహకురాలు భూదేవియై/ యఖిలభారకుడన్న యాఖ్య దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై/ కామితార్థము డన్న ఘనత దెచ్చె
గమలగర్భుడు సృష్టికర్త తనూజుడై/ బహుకుటుంబికు డన్న బలిమి దెచ్చె
గలుషవిద్వంసిని గంగ కుమారియై/ పతితపావనుడన్న ప్రతిభ దెచ్చె
ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతి గానీ/మొదటి నుండియు నీవు దామోదరుడవె
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్య భావ/హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!
కాసుల పురుషోత్తమ కవి చేసిన వ్యాజస్తుతి ఇది.
అయ్యగారి ఘనత అంతా అమ్మగారిదే నంటూ ఆంధ్రవిష్ణువును ఎత్తిపొడుస్తూనే స్తుతించిన ఒక చక్కని పద్యం ఇది. “ఈ భూలోకాన్ని మొత్తాన్నీనిర్వహించే భూదేవి ఆయన భార్య కాబట్టి, అఖిల భారకుడనేప్రతిష్ట దక్కింది. ధనవంతురాలైన ఇందిర(లక్ష్మి) ఇష్టసఖి కాబట్టి, అయ్యగారికి కామితార్ధాలు తీర్చేవాడన్న ఘనత వచ్చింది. సాక్షాత్తూ సృష్టికర్త కమలగర్భుడైన బ్రహ్మగారి కొడుకు కాబట్టి బహు కుటుంబీకుడనే బలిమి వచ్చింది. కాలుష్యాలన్నీ కడిగేసే గంగ ఆయన కూతురు కాబట్టి, పతితపావను డన్న ప్రతిభ దక్కింది. నీ ప్రఖ్యాతి అంతా ఆడవాళ్ళ వలనో, మరెవరి వలనో దక్కుతున్నదే నంటాడు కవి. అయినా మొదటి నుండీ నువ్వు దామోదరుడివే నంటాడు.
“దామాని ఉదరే యశ్యాశాః దామోదరః” పొట్టకు తాడుతో కట్టబడ్డవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. దామం అంటే తాడు, యశోదమ్మ బాలకృష్ణుడి పొట్టకి ఒకతాడు కట్టి, దాని రెండో కొసని రోలుకు కట్టింది కదా! మొత్తం మీద, కలెక్టరమ్మ మొగుడు, బ్యాంకు మేనేజరమ్మ మొగుడు, పొల్యూషన్ కంట్రోలరమ్మ తండ్రి ఇలా టైటిల్స్ పెట్టి తీసే సినిమాల్లో హీరోలాగా విష్ణుమూర్తి ప్రసిద్ధు డయ్యాడన్నమాట.
మనుషులకే ఇంత లౌక్యం ఉంటే వాళ్లని సృష్టించిన వాడికి ఇంకెంత ఉండాలి…! తాడుతో కట్టించుకుని మరీ, దామోదరుడు అని పేరు పెట్టుకున్నాడంటే గొప్ప లౌక్యుడనే అనాలి. తన మెడలో తాడు కట్టిన వాడి పొట్టకు ఆమె తాడు కట్టగలగా లంటే ఆమెకు స్వంతంగా భూదేవిలా భూములుండాలి. లేదా లచ్చిందేవిలా డబ్బుండాలి. పేరుకి దామోదరుడైనా పురుషుడు గానీ, పురుషోత్తముడు గానీ, సాదాసీదా భార్యలకు కట్టుబడతారా అనేది కాసుల పురుషోత్తమకవికి వచ్చిన సందేహం.
మగాడు మగువకు కట్టినా, మగువ మగాడికి కట్టినా ఆ దారపు పగ్గాల్లోనే ఉంది బంధమైనా, బాంధవ్యమైనా! కానీ, మెడలో కట్టిన దారపు పగ్గాలతో భార్యను కట్టుకొనే భర్తని తనకు కట్టుబడేలా చెయ్యాలంటే సౌందర్యాదులు కూడా కొంత తోడ్పడ వచ్చేమో గానీ, వాటికి నికరం లేదు. డబ్బొక్కటే శాశ్వతం అనుకుంటాం కదా!
భార్యను కట్టుకొని, అంటే వెంటబెట్టుకుని వెడితే అదనపు గౌరవం దక్కుతుంది. పెళ్ళికి మగా డొక్కడే వెళ్ళాడనుకోండి, బయట గేట్లోనే, వచ్చిన వీణ్ణి పక్కన బెట్టి రాని ఆవిడ రాలేదేమండీ అనడుగుతారు. కలిసి వెడితే ఆతిధ్యం ఇచ్చే వాళ్ళు దంపతీ సమేతంగా వచ్చి పలకరించి సాదరంగా ఆహ్వానిస్తారు. సినిమా హాల్లోనో, బష్టాండులోనో, రైల్వే స్టేషన్లోనో పక్కన లేడీ ఉంటే టిక్కెట్టు తేలిగ్గా దొరుకుతుంది. వెనకాల భార్యను ఎక్కింఛుకుని స్కూటరు మీద వెడితే సాధారణంగా మనసున్న పోలీసులు ఆపి, లైసెన్సు అడగరు. ప్రమోషన్లో కాంట్రాక్టులో అడగ టానికి ఆఫీసరు గారి దగ్గరకు భార్యతో కలిసి వెడితే వచ్చే సమాధానం సానుకూలంగా ఉంటుంది.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,రూపేషు లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మయుక్తా కులధర్మపత్నీ అన్నాడు ఓ మగరచయిత. “పర్త్యమ్ వ్రాతే తిష్టతి ఇతి పత్ని” అంటే మగాడి పక్కన నిలబడి అతని పనుల్లో సహకరించేది పత్ని అనే మగాడి నిర్వచనం కూడా ఉంది. ఆ సహకరించటం కూడా దాసిగానూ, మంత్రిగానూ, పెట్టే కష్టాలను భరించే భూదేవిగానూ, వండి వడ్డించేప్పుడు తల్లిగానూ, పడగ్గదిలో రంభగానూ ఉండాలనటమే “మగాడిద” మనస్తత్వం.
‘మా ఇంటికి నేనే యజమానిని అని మా ఆవిడ అంగీకరించింది’ లాంటి సరదా ఇంగ్లీషు వాక్యాలు ఆడవాళ్లని సంతోష పెట్టడానికే గానీ, మన సామాజిక వ్యవస్థలో ఇమిడేవి కావు. ఇక్కడ ఏ మగాడూ తానే యజమానినని ప్రత్యేకంగా చాటుకోవాల్సిన అవసరం లేదు. కలెక్టరు గారి మొగుడు కూడా తన భార్య కలెక్టరని చెప్పుకోడు. దారపు పగ్గాల దామోదరత్వం అనేది ఒక బూటకం. అదొక వశీకరణ నాటకం.

Monday, 8 February 2016

అనన్య ప్రతిభామూర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి :: డా. జి. వి పూర్ణచందు

అనన్య ప్రతిభామూర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి
డా. జి. వి పూర్ణచందు 9440172642
“ఆంధ్ర భాష పుట్టుకయే గానాత్మకం” అని నిరూపించిన ఒక గొప్ప సారస్వత మూర్తి, తెలుగు సాహితీ పరిశోధనా పితామహుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఫిబ్రవరి 7, 1888, కృష్ణాజిల్లా పెద్దకళ్ళేపల్లిలో జన్మించారు. నిజాలను వెల్లడించటమే సాహిత్యానికి పరమావధి. పరిశోధనే అందుకు సరయిన మార్గ౦గా భావించారు. నూనూగు మీసాల నాడే సంపాదించుకున్న ‘శతావధాని వేటూరి ప్రభాకరశాస్త్రి’ అనే గొప్ప పేరును త్యాగ౦ చేసి, పరిశోధన వైపు నడక సాగించారు..
సాహిత్య పరిశోధనే నిజమైన సాహిత్య సేవ అనేది ఆయన తీర్పు. “వచన రచనలో ఏ మోసమూ లేని భావ ప్రసారం ఉంటు౦ది. ప్రశస్త రచన రసోల్బణమైన ప్రతిభా వికాసము గల సహృదయ వర్గమే చేసేదిగా ఉంటు౦ది.” అనే ఈ మాటల్లో ఒక పరిశోధకుడి మనోగతం ఆవిష్కృతం అవుతుంది. ‘భాష అడవి వంటిది- కవిత ఉద్యానవనం వంటిది. ఉద్యాన పె౦పు సొ౦పు లకు అరణ్య పరిశోధన అవసరమైనట్టే సుకవితకి భాషా పరిశోధన అవసరం’ అని గట్టిగా నమ్మారు. “జనులలో ఎన్ని అంతరములున్నవో భాషా రీతులకు నన్ని అంతరము లున్నవి. భూములకు వలె బాషలకును సర్వే జరగవలెను” (బాలభాష-పీఠిక) అంటారాయన!
ఒక కొత్త బాట వేసిన వారినీ, తన బాటలో అనేకమందిని నడుపుకు పోగలిగినవారినీ ‘సాహితీ శాస్త్రవేత్తలు’గా సంభావించాలని, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు అలాంటి సాహితీ శాస్త్రవేత్త అనీ శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు నా వాఙ్ఞ్మయ మిత్రులు గ్రంథంలో ప్రభాకరశాస్త్రి గారి గురించి వ్రాశారు. చెల్లపిళ్ళ వారి దగ్గర శిష్యరికం ప్రభాకర శాస్త్రిగారి శాస్త్రీయతా దృష్టికి మూలం.“తెలుగున నాకేమేని యెఱుక యేర్పడె నన్నచో నది శ్రీ వే౦కట శాస్త్రి గారి గురుతానుగ్రహ ప్రాప్తమే! వారి దగ్గర పుస్తకం పట్టి చదివిన దానికంటే, వారి ముఖతః వినోద గోష్ఠిలో విని నేర్చుకొన్నదే ఎక్కువ” అని స్వయ౦గా చెప్పుకొన్నారు. (వేటూరి ఆనందమూర్తి ‘మా నాన్న గారు’- డా. ద్వా.నా. శాస్త్రి సంకలనం)
వారి పరిశోధనా తృష్ణతీరేందుకు మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలో కొలువు తోడ్పడింది. అక్కడ తెలుగు క్యాటలాగులు వ్రాసే ఉద్యోగి సెలవు పెడితే, ఆ స్థానంలో వేటూరివారు తాత్కాలిక ఉద్యోగిగా నియమితులయ్యారు. మానవల్లి రామకృష్ణ కవి ఆయనలో పరిశోధకుణ్ణి తట్టి లేపారు. “మానవల్లి వారు పూర్వకాలపు సంకలన గ్రంథమైన ప్రబంథ మణిభూషణాన్ని బైటపెట్టగా ప్రభాకర శాస్త్రిగారు దాని విలువను తెలిసినవారై, చాటు పద్య మణిమంజరి రె౦డు భాగాలను, ప్రబంథ రత్నావళిని వలవేసి బైటికి లాగేరు. రామకృష్ణకవి క్రీడాభిరామాన్ని తెలుగువారికి అందజేయగా, శాస్త్రిగారు ఆ పుస్తకాన్నే ముచ్చట లొలికే పండిత కూర్పును, చక్కని పీఠికతో విందు జేసేరు... మానవల్లి వారి దోవ ప్రభాకర శాస్త్రిగారికి
ఘ౦టాపథ మయి౦ది..” (నా వాఙ్ఞ్మయమిత్రులు).
కందుకూరు వీరేశలి౦గ౦ గారు ఆంధ్రకవుల చరిత్ర ప్రథమ భాగం సంస్కరణ చేసేప్పుడు శాస్త్రిగారే ఏ ఏ విషయాలు
ఎలా ఉండాలో సూచనలు, సంస్కరణ విధానాలు వ్రాసి ఒక పెద్దకట్ట సమాచారాన్ని పంపారట! పాల్కురికి సోమనాథ ‘శివతత్త్వ
సారం’ గ్రంథాన్ని కొమర్రాజు వారికి పరిష్కరించి ఇవ్వగా ఆయన 1922లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాన ప్రచురించారు. (వేటూరి ఆనందమూర్తి)
తెలుగు లిపి ప్రాచీనతకు ఆధారంగా దొరుకుతున్న మొట్టమొదటి తెలుగు పదం ‘నాగబు’ గురించి వెల్లడించి౦ది కూడా ప్రభాకర శాస్త్రి గారే! ఆ తరువాత కాలంలో అది ‘నాగబుద్ధి’ అనే పేరులో చివరి అక్షరం విరిగి పోగా ‘నాగబు’ మాత్రమే ప్రబాకర శాస్త్రిగారికి దొరికిందని పండితులు తేల్చారు. పదం ఏదయినా మన లిపి ప్రాచీనతను వెదకటానికి అది గొప్పగా తోడ్పడింది. కోరాడ మహదేవశాస్త్రి తన ‘హిష్టారికల్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్’ గ్రంథంలో ఈ పదాన్ని విశ్లేషిస్తూ, శాతవాహనుల కాలం నాటి తెలుగులో “నాగ౦బు” అనే పదం మద్య సున్నా లోపి౦చి ‘నాగబు’ గా మారి ఉండవచ్చునని అనుమాని౦చారు. వివాహంబు అన్నట్టుగా పదం చివర- ‘౦బు’ పెట్టి పలికే ఆచారం తెలుగులో ఉంది. ఇది చదివిన ఐరావతం మహదేవన్ అనే తమిళ చరిత్ర పరిశోధకుడు సిందు నాగరికత లిపిలో కొన్ని పదాలకు చివర బాణం గుర్తు కనిపిస్తో౦దని, ‘౦బు’ ప్రయోగానికి సంకేతంగా ఈ అంబు(బాణం) గుర్తుని ప్రయోగించి ఉంటారని ఒక నిర్మాణాత్మక ఊహను అందించారు. ఈ ఊహ సింధూ నాగరికతలో తెలుగు వారి ఉనికి గురించి పరిశోధనలు సాగించేందుకు ఊతం ఇచ్చి౦ది. ప్రభాకర శాస్త్రిగారి ‘నాగబు’ తెలుగువారి చరిత్ర గురించిన కొత్త ఆలోచనలకు ఆ విధంగా దోహదపడింది.
తొలిసారిగా అన్నమయ్య ఉనికిని లోకానికి చాటి చెప్పింది కూడా ప్రభాకరులే! కనీసం 500 యేళ్ళపాటు మరుగున పడిన ఆ పదకవితా పితామహుడి గురించి ఏమీ తెలియని పరిస్థితుల్లో అన్నమయ్య జీవితం గురించి, ఆయన రచనల గురించీ ఎన్నో విశేషాలను శాస్త్రిగారు వెలుగులోకి తెచ్చారు. క్రీ.శ 1945 సం.లో `వె౦కటేశ్వర వచనా’లకు పీఠిక వ్రాస్తూ అన్నమయ్య జననం క్రీ.శ. 1408 గానూ, తాళ్ళపాక చిన తిరువే౦గళనాథుడి “శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర” గ్రంథానికి వ్రాసిన పీఠికలో క్రీ.శ. 1424 ను౦డీ 1503దాకా సంకీర్తనా రచనలు చేసినట్టు పేర్కొన్నారు(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర, డా. కేసర్ల వాణి).
తాళ్ళపాక చిన్నన్న వ్రాసిన “అన్నమాచార్య చరిత్ర”ను పరిష్కరించి ప్రచురించారు. అన్నమాచార్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, ఆయన వ్రాసిన పదాలకు ప్రాచుర్యం కల్పి౦చారు. సి.పి. బ్రౌను గురించి, తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్కను గురించీ ఈ తరానికి తెలియ జేసింది ప్రభాకర శాస్త్రిగారే! తిరుమల కొండపైన ఒక పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటు కోసం అడవులు, వాగులూ, వంకలూ అన్నీ తిరిగి ఎన్నో అపురూప శిల్ప సంపదను సేకరించి తెచ్చి భద్రపరచారు.
1914లో తంజావూరి ఆంధ్రరాజుల చరిత్రను ప్రకటించారు. బాసుని సంస్కృత నాటకాలు కొత్తగా వెలుగులోకి వచ్చిన కాలం అది! ప్రభాకర శాస్త్రిగారు ‘ప్రతిమా నాటకం’, ‘కర్ణభారం’, ‘మధ్యమ వ్యాయోగ౦’ మొదలైన వాటిని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. 1913లో ‘కనకాభిషేకం’ అనే చిన్న పుస్తకం ద్వారా శ్రీనాథ మహాకవి జీవితాన్నితెలియచెప్పారు. ఆ తరువాత 1923లో “శృంగార శ్రీనాథం” అనే మరో ప్రామాణిక రచన చేశారు. వెంకటేశ్వర వచనములు, శృంగారామరుకము, సుభద్రాకళ్యాణం గ్రంథాలను ప్రకటించారు. 1914లో చాటుపద్యమణిమంజరిలో “నవరత్నములు” పేరుతో “గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అన్న మకుటంతో ఉన్న పద్నాలుగు పద్యాలను – ప్రచురించారు. వీటి కర్త ఎవరో తెలియదు. “గ్రంథకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు కాదగును” (పు. 39) అని అభిప్రాయ పడ్డారు. 1918లో ప్రబంధ రత్నావళి ప్రకటించారు.
అయితే సృజనాత్మక రచనలను ఆయన వ్యతిరేకించలేదు. “నేటి నవ్యసాహిత్య విశారదుల నవ నవోజృంభణములన్నీ, నాకు పరమానంద ప్రదములే! మన పరిపూర్ణత రేపటి రోజుల్లో ఉన్నదిగానీ, నిన్నటి రోజుల్లో లేదు” సాహిత్యం ఏ ఒక్కరికో కాక అన్నివర్గాలవారికి అనుభవింపదగినదిగా ఉండాలంటారాయన. లోకోపకారక భావాలు కలగాలంటే, రచయిత మనసు గొప్ప పరిపాకం కలిగి ఉండాలనీ, ఆ పరిపాకపు టంతరవుల్ని అనుసరించి భావప్రజ్వలనం ఉంటుందనీ ఆయన సూత్రీకరిస్తారు.
‘పావులూరి మల్లన్న’ శాస్త్రిగారి మొదటి వచన రచన. 1910లో శశిరేఖ పత్రికలో వచ్చింది. ‘శతావధాని వేటూరి ప్రబాకర శాస్త్రి’ అని అప్పట్లో వ్రాసుకున్నారు. ఆ తరువాత పరిశోధన వైపు మొగ్గు చూపి అవధానాలు మానుకున్నారని శాస్త్రిగారి కుమారులు శ్రీ ఆనంద మూర్తి వ్రాశారు. అయినా, సృజనాత్మక సాహిత్య సేవను వదులుకో లేదు. ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనము’, ‘మూణ్ణాళ్ల ముచ్చట’, ‘కపోతకథ’ సాక్ష్యం లాంటి కావ్యాల ద్వారా ఖండకృతుల ప్రక్రియకు నాందీ పలికారు. ‘కలికి చిలుక’, ‘కరుణకము’ లాంటి కథలు కూడా అనేకం వ్రాశారు.
ప్రభాకరశాస్త్రి గారు మాష్టర్ సి.వి.వి. అనుగ్రహి౦చిన యోగ విద్యను ఉపయోగించి ఎ౦దరికో స్వస్థత చేకూర్చారు. ఆయుర్వేద వైద్యుడి పుత్రుడు కావటం వల ఈ వ్యాధి నివారక యోగ౦ బహుశా ఆయనకు జన్యుపరంగా సమకూరిన వరం కావచ్చు. మాష్టర్ వి.పి.యస్.అని శిష్యులు ఆయన్ని గౌరవంగా పిలుస్తారు. తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం వెళ్ళి, తూర్పు గోదావరి జిల్లాలో ఒక బ్రాహ్మణుని ఇ౦ట్లో బస చేసినప్పుడు ఆ బ్రాహ్మణుడి విధవా కుమార్తెకు పట్టిన దయ్యాన్ని మాష్టర్ సివివి యోగవిద్య ద్వారా నయం చేసిన సంఘటనను తిరుమలరామచంద్ర ఉదహరించారు:
ప్రభాకరశాస్త్రిగారు ఆ యింటికి వెళ్ళినప్పుడు ఆమెకు దెయ్యం పూనింది. వెంటనే మాష్టరు సివివిని ధ్యాని౦చి, ‘ఇలాటిది ఇక రాకూడదు, ఈ ఏష్ట్రల్ బోడీ ఆమెను వదిలిపోవాలి’ అన్నారు. బక్కపల్చని ఏష్ట్రల్ బోడీ ఆమె శరీరం ను౦చి బైటికి వచ్చి, ‘నేను ఈవిడ భర్తను, కొత్తవారు వచ్చినప్పుడు ఏమయినా అకార్య౦ చెస్తారేమోనని నా సందేహం-’ అన్నాడు. “ఇక ఆమెను పీక్కొని తినక. వేరే జన్మ చూసుకో, ఆమె మంచి వంశ౦లో పుట్టి౦ది. అపమార్గ౦ తొక్కదు” అన్నారు శాస్త్రిగారు. అతడు వదిలి పోతానన్నాడు. మళ్ళీ ఎప్పుడూ ఆమెకు దయ్యం సోకలేదట. ఈ కథని తిరుమల రామచ౦ద్రగారికి శాస్త్రి గారే స్వయంగా చెప్పారట. చెప్పి, “ఇదంతా ఏమిటని అనుమానిస్తావు గదూ? మరణి౦చిన వ్యక్తి సూక్ష్మశరీరం, అతని ఆశాపాశాన్ని బట్టి, చనిపోయిన పరిసరాలలో తిరుగుతూ ఉంటుంది” అని వివరణ ఇచ్చారట.
ఆయనకు కుల, మత వివక్ష ఉండేది కాదు. ఒక హరిజనుడు, ఒక మహమ్మదీయుడు ఆయన ఇ౦ట్లో ఉండి చదువు కున్నారు. (పోచిరాజు శేషగిరిరావు-మణిమంజరి 9వ భాగం) తిరుపతి గుడికి తొలిసారిగా హరిజనుల్ని వె౦ట తీసుకు వెళ్ళారు.
నిడదవోలు వె౦కట రావు గారి పెళ్ళి చేయి౦చి౦ది ప్రభాకరశాస్త్రి గారే! ఆయనకు ఉత్తరం వ్రాస్తే, “నీ అంతఃపురిక క్షేమమా?” అని అడిగే వారట. చెరుకువాడ నరసింహం గారి అమ్మాయి తన కుమారుడికి ప్రబాకరశాస్త్రి అని పేరు పెట్టుకోవటం లాంటి సన్నివేశాలు ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తాయి.
తిరుమలలో ప్రాచీన కన్నడ సాహిత్య పీఠం కూడా నెలకొల్పటం కోసం ఆయన ఎ౦తగానో కృషి చేసారు. నన్నెచోడుని కుమార సంభవంలో కన్నడ సా౦ప్రదాయాలు ఎన్నో ఉన్నాయని వాటిని అర్ధం చేసుకొంటే గానీ పరిశోధన పూర్తి కాదని ఆయన అనే వారని తిరుమల రామచ౦ద్ర వ్రాశారు.
ఆయన సామాన్యం ఎత్తుకంటే కొంచె౦ తక్కువేనని, కుదురైన మొహం. పచ్చని చాయ. పూర్వకాలపు లక్షణాలన్నీ
ప్రకటించే తలకట్టు ఉండేదనీ, ఆఫీసుకు వెళ్ళేప్పుడు పంచ, కోటు ధరించేవారనీ ఆయనకు అత్యంత సన్నిహితులైన టేకుమళ్ల కామేశ్వరరావు వ్రాశారు.
ప్రభాకరశాస్త్రిగారు వాడుక భాషా వాది. “ప్రఖ్యాత సంకీర్తనాచార్యుల పాటలన్నీ వాడుక భాషలోనే యున్నవి. వాడుక భాషలో ఉన్న పాటలను పదాలను ప్రౌఢవ్యాకరణం ప్రకారం తీర్చి దిద్దటం పువ్వును నలిపి వాసన చూడటం లాంటిది(భారతి-1941 ఫిబ్రవరి) అంటారాయన. విద్యాశాలలో విద్యాబోధన దేశ భాషలలో సాగించడం, ప్రజాపాలన తంత్రమంతా దేశ భాషలలో సాగించటం ఎ౦త శీఘ్రంగా సాగుతుందో అంత శీఘ్ర౦గా దేశ భాషా వికాసం కలుగుతుంది (మద్రాసు ఆకాశవాణి ప్రసంగ౦-తెలుగు వ్యాసమండలి కృ. జి.ర.సం ప్రచురణ) అనేది భావన. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఎ౦తో ముందుగా ఆయన ఈ మాటలు అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఆరున్నర దశాబ్దాలయ్యింది. ఇ౦కా దేశభాష అమలుకాలేదు. ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పట్లో అలాంటిది జరుగుతుందని అనిపించట్లేదు.
08-02-2016 ఆంధ్రభూమి సాహితీ పేజిలో ప్రచురితం

Tuesday, 2 February 2016

వేసవిలో ‘‘చల్ల’’న :: డా. జి వి పూర్ణచందు

వేసవిలో ‘‘చల్ల’’న 

డా. జి వి పూర్ణచందు

శివరాత్రికి శివ శివా అని చలి వెళ్ళిపోతుందంటారు గానీ తెలుగు నేలమీద అప్పుడే ఎండ ధాటి మొదలై పోయింది. పగలు ఉక్క పోతలు, రాత్రుళ్ళు దోమలు ముట్టడిస్తున్నాయి. సమశీతలంగా ఉండాల్సిన ఈ సీజను విచిత్రంగా మారిపోతోంది.
ఉగాది నాటికి భుగభుగ మండుతూ ఎండ లొచ్చేస్తాయి. అసలే ఆంధ్రుల్లో వేడి శరీరతత్త్వం ఎక్కువ. అంతలోనే వేడెక్కే ఆరంభ శూరత్వం మనకి ఇందుకే!
పైగా మనది వేడి వాతావరణం! అది చాల దన్నట్టు, వేసవి ఎండల్లో కొత్తావకాయ పెట్టుకుని ప్రతిరోజూ రుచి చూసుకోవటంతోనే వేసవి సరిపోతుంది.
ఇన్ని రకాలుగా వేడి మన శరీరం మీద ప్రసరిస్తున్నప్పుడు ఆ దెబ్బకు తట్టుకోలేనంటూ శరీరం చేసే ‘వేడుకో్లే ‘వడదెబ్బ’ అంటే! వడని లేదా వేడిని తగ్గించే బ్రహ్మాస్త్రమే ‘చల్ల’(మజ్జిగ)! అమ్మకడుపు చల్లగా, అయ్య కడుపు చల్లగా, అందరి కడుపూ చల్లగా చేసేది ‘చల్ల’. వేసవిలో చల్లగా జీవించాలంటుంది ‘చల్ల’!
తెలుగులో ‘చల్ల’ అనేది అత్య౦త ప్రాచీన పద౦ మనకి. మూలద్రావిడ పద౦ ‘సల్’ లోంచి ‘చల్ల’(మజ్జిగ Buttermilk), ‘చల్’ లోంచి ‘చల్ల’ (‘చల్ల’నైన-cold, cold morning ) ఏర్పడ్డాయి.
‘‘చల్ల’’ని ఇతరులకన్నా తెలుగు వారే ఎక్కువగా తాగుతారు. తెలుగు కృష్ణుడు ‘చల్ల’లమ్మటానికి వెళ్ళే భామల్నే అడ్డగించాడని తెలుగు కవులు వ్రాశారు. ఈ రోజుల్లో అతిథులకు కాఫీ టీలు ఇస్తున్నాం గానీ, పూర్వం గ్లాసు ‘చల్ల’ తెచ్చి ఇచ్చేవాళ్ళు.
చలివేంద్రాలంటే ‘చల్ల’ నింపిన కుండలు ౙ్ఉండేవి! చలిప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦దల, చలివే౦ద్రము ... ఈ పదాలన్నింటికీ ‘చల్ల’ అ౦ది౦చే ప౦దిరి అనే అర్థం. ‘చల్ల’ ఇచ్చి, ‘కాస్త దాహం పుచ్చుకోండి’ అనేవాళ్ళు. దాహం అనేది ‘చల్ల’కు అలా పర్యాయ పదం అయ్యింది.

చలవ నిచ్చేది ‘చల్ల’


“మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు లేదా చల్ల దొరికే అవకాశాల్లేక కైలాస వాసి శివుడికి, ‘చల్ల’ తాగే అలవాటు లేకుండా పోయింది. అందుకని ఆయన నీలకంఠుడయ్యాడు.
పాలసముద్రం మీద పవళించే విష్ణుమూర్తికి ‘చల్ల’ దుర్లభం. కాబట్టి, ఆయన నల్లని వాడయ్యాడు.
స్వర్గంలో ‘సుర’ తప్ప ‘చల్ల’ దొరక్కపోవటంతో ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు.
‘చల్ల’ పుచ్చుకునే అలవాటే ఉంటే, చ౦ద్రుడుకి క్షయవ్యాధి, వినాయకుడికి స్థూలకాయం, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణ౦ వచ్చేవే కాదు” అని, ‘యోగరత్నాకరం’ వైద్యగ్ర౦థ౦లో చమత్కారంగా చెప్పారు.
‘చల్ల’ త్రాగే వాడికి ఏ జబ్బులూ రావనీ, వ్యాధులు త్వరగా తగ్గుతాయనీ, తిరిగి రాకు౦డా వు౦టాయనీ, విషదోషాలు, దుర్బలత్వ౦, చర్మరోగాలు, క్షయ, స్థూలకాయం, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి రంగు కలుగుతు౦దనీ దీని భావ౦. దేవతల కోస౦ అమృతాన్నీ, మానవుల కోస౦ ‘చల్ల’నీ భగవ౦తుడు సృష్టి౦చాడట! చలవ నిచ్చేందుకే ‘చల్ల’!

వేసవిలో చల్లబడాలంటే ‘చల్ల’ తాగాలి!


“తక్ర౦ త్రిదోష శమనం రుచి దీపనీయ౦” అని ఆయుర్వేద సూత్రం. వ్యాధులకు కారణమయ్యే దోషాలను ఉపశమి౦ప చేసే గుణ౦ ‘చల్ల’కు౦ది. అన్న హితవు కలిగిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహార౦ చక్కగా అరిగేలా చేస్తుంది. శరీరానికి సుఖాన్నీ, మనసుకు స౦తృప్తినీ కలిగిస్తుంది. కానీ, రానురానూ మనలో కూడా ‘చల్ల’ తాగే అలవాటు తగ్గిపోతోంది.
పెరుగుని చాలామంది చిలకటం మానేశారు. ‘చల్లకవ్వ౦’, ‘చల్లబుడ్డి’(‘చల్లగిన్నె), ‘చల్లపులుసు’, ‘చల్లచారు’, పెరుగుపచ్చడి లాంటివి ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి. అంతేకాదు, ఫ్రిజ్జులో పెట్టిన అతి చల్లని ‘పెరుగు’ తింటే షుగరు వ్యాధి పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం హెచ్చరించింది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం.
కొద్దిగా ‘చల్ల’ కలిపితే, పాలు తోడుకుని పెరుగు అవుతోంది. పాలలో ఉన్న పోషకాలన్నీ పెరుగులోనూ ఉంటాయి.
అదనంగా మన శరీరానికి ఉపయోగపడే ‘లాక్టోబాసిల్లై’ అనే బాక్టీరియా కూడా ఉంటుంది. పెరుగుని చిలికితే దానికి తేలిగ్గా అరిగే స్వభావం(లఘుత్వం) కలుగుతుంది. అందుకని, పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా ‘చల్ల’ ఉత్తమోత్తమంగా ఉంటాయి.
చల్లన్నం రోజూ తింటే ఎ౦తటి శ్రమనైనా తట్టుకునే శక్తి శరీరానికి కలుగుతు౦ది. వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది. ‘చల్ల’తాగితే, కడుపులో ఆమ్లాలు పలచబడి, గ్యాసు, ఉబ్బర౦, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్ధత, పేగుల్లో వచ్చే వ్యాధులు త్వరగా తగ్గుతాయి. ఆపరేషన్లు అయినవారూ, మానని వ్రణాలతో బాధపడేవారూ, చీము పోస్తుందని ‘‘చల్ల’’ వాడకూడ దనుకోవటం అపోహ. పుండు త్వరగా మానుపడాలంటే ‘చల్ల’ తాగాలి!

వేసవిలో ప్రొద్దున్నే చల్దన్నం


‘చల్ల’ కలిపిన అన్నాన్ని చల్ది అన్నం, చల్దన్నం, చద్దన్నం అంటారు. ప్రొద్దున్నే చద్దన్నం తినేవారికి భోగం ఎక్కువ. టిఫిన్లు తినేవారికి రోగం ఎక్కువ.
పిల్లలకు చద్ది పెట్టట౦ మానేసి టిఫిన్లు అలవాటు చేస్తే బల౦గా ఎదగ లేరు! నాగరకులైన తల్లిద౦డ్రులకు చద్దన్నం అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తింటారనే చిన్నచూపు ఉంది. చద్దన్నానికి తెలుగు నిఘ౦టువులు పర్యుషితాన్నం(stale food-పాచిన అన్నం) అనే అర్థం ఇచ్చాయి. ఇది అన్యాయం. గోపబాలురు బాలగోపాలుడి చుట్టూ పద్మంలో రేకుల్లా కూర్చుని చద్దన్నం తిన్నారని పోతనగారు వర్ణి౦చాడు. “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత మొనయ నునిచి/చెలరేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి” “నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వ్రేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు మేళవించిన చల్దిముద్దలో నంజుకు తిన్నా”రట! చద్దన్నం అంటే ఇది! పోతన మహాకవి చెప్పిన ఈ పద్ధతిలో ‘చల్ద’న్నం లేదా పెరుగన్నం పెట్టి పెంచండి. నుంగిటముత్యాలు దేశానికి ఉపయోగ పడేవాళ్ళుగా ఎదుగుతారు.
గ్రామ దేవతలకూ, దసరా నవరాత్రులలో అమ్మవారికీ, ఇతర ఉగ్ర దేవతలకు చద్దినివేదన అంటే వేడి అన్నంలో చిక్కని ‘చల్ల’ కలిపిన అన్నాన్ని నైవేద్యం పెడ్తారు. ఉగ్రత్వ౦ శా౦తి౦చటానికే ఈ చద్ది నివేదన పెడతారు. ఇది చల్లన్నం. వైష్ణవాలయాల్లో దధ్యోదనం అ౦టే పెరుగన్నంలో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేసిన పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడతారు. చద్దన్నంలో ఈ తాలింపులుండవు. ఇదీ ఈ రెండింటికీ తేడా!
“అయ్యా! మీరు చల్దివణ్నం తి౦చారా...?” అనడుగుతుంది కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ. చల్దివణ్ణ౦ అ౦టే, చల్ల కలిపిన అన్నం. ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానా లయ్యాక ఉదయ౦ ఉపాహార౦గా చల్ది తినేవారు. అందువలన కడుపులో చల్లగా ఉంటుంది. దండిగా ఉంటుంది. వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. రక్తపుష్టినిస్తుంది. ఇడ్లీ అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ పునుగు ల్లాంటివి తినాల్సిన అగత్యం తప్పుతుంది. అమీబియాసిస్, పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధుల్ని తగ్గిస్తుంది. బలకర౦. రక్తాన్ని, జీర్ణశక్తినీ పె౦చుతు౦ది! బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వరం సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగిందిగా ఉంటు౦ది! షుగరు రోగులూ, స్థూలకాయులూ బియ్యానికి బదులుగా రాగి, జొన్న, సజ్జల్ని చల్లన్నంలా తీసుకోవచ్చు!

ఈ ‘చల్ల’న్నాన్ని: 

1. వేడి అన్నంలో ‘చల్ల’ పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ ‘చల్ల’లో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు ‘చల్ల’ చుక్కలు వేసి, తోడు పెట్టి ఉదయాన్నే తినవచ్చు. 
4. తాలి౦పు పెట్టి, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లాంటివి కూడా కలుపుకుని తినవచ్చు.
’చల్ల’లో నానబెట్టిన అన్నం అన్నింటికన్నా తేలికగా అరుగుతుంది. అన్నంలో ‘చల్ల’ కలిపినదానికన్నా రాత్ర౦తా ‘చల్ల’లో నానిన అన్నంలో సుగుణా లెక్కువ! బక్కచిక్కిపోతున్న వారికి తోడన్నాన్నీ, స్థూలకాయులకు ‘చల్ల’లో నానిన అన్నాన్ని పెట్టడ౦ మ౦చిది. రక్తపుష్టికి మెరుగైన ఆహారం ఇది! జీలకర్ర ధనియాలూ, శొ౦ఠి సమానంగా తీసుకొని మెత్తగా ద౦చి, తగినంత ఉప్పు కలిపిన పొడిని ఈ తోడన్నం లేదా ‘చల్ల’న్నంలో నంజుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉంటాయి. తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

వేసవి పానీయం ‘రసాల’


శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన వి౦దు పట్టికలో రసాల అనే పానీయం ఉంది. అరణ్య వాస౦లో ఉన్నరోజుల్లో, పా౦డవుల దగ్గరకి ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఎండన పడి వచ్చాడని భీముడు స్వయ౦గా ఈ రసాల పానీయం తయారు చేసి ఇచ్చాడట! ఇది దప్పికని పోగొట్టి, వడ దెబ్బ తగల కు౦డా చేస్తుందని ఆ సమయంలో దీన్ని అందించారు. వెల్‘కం డ్రింక్ లాంటిదన్నమాట ఇది!
భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేయాలో వివరాలు ఇలా ఉన్నాయి:
1. బాగా కడిగిన ఒక చిన్న ము౦త తీసుకోండి.
2. పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరలు వేసి, ఆ ముంత మూతికి వాసెన కట్ట౦డి.
3. పలుచని పెరుగులో సగభాగం ప౦చదార కలిపి, ఈ మిశ్రమాన్ని ‘చల్ల’కవ్వ౦తో బాగా చిలికి, ఆ వాసెన మీద పోయండి.
4. పెరుగు నీరంతా కుండలోకి దిగుతుంది. ఈ పెరుగు నీటిని ‘ద్రప్య౦’ అ౦టారు. ఈ ‘ద్రప్య౦’ ని౦డా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉంటాయి. అవి పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్నం చేస్తాయి. వాసెన మీద మిగిలిన పెరుగు ముద్దని విడిగా అన్నంలో పెరుగులా వాడుకోవచ్చు! చిలికి మజ్జిగ చేసుకోవచ్చు.
5. ఈ ‘ద్రప్యా’నికి రెట్టి౦పు కొలతలో కాచిన పాలు కలిపి, ‘చల్ల’కవ్వ౦తో మళ్ళీ చిలకండి.
6. మిరియాల పొడి, ఏలకుల పొడి, లవ౦గాల పొడి తగు పాళ్లలో కలప౦డి. కొద్దిగా పచ్చకర్పూర౦ కూడా కలపవచ్చు. ఈ రసాల పానీయం శరీరంలో వేడిని తగ్గించి, వడదెబ్బ తగలనీయకుండా చేస్తుంది. తక్షణశక్తి నిస్తుంది. కామెర్లలో తీసుకో దగినదిగా ఉంటుంది. అమీబియాసిస్, పేగుపూత, రక్త విరేచనాలు, కలరా వ్యాధులున్న వారిక్కూడా ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూల౦గా ఉంటు౦ది.
పెరుగు మీద తేరిన తేటకు వినికిడి శక్తి పెంచే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), తలతిరుగుడు (వెర్టిగో) లాంటి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తుంది.

ఇంకో వేసవి పానీయ౦ ‘కూర్చిక’

రసాల లాంటిదే ఇంకో పానీయం ‘కూర్చిక’. ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రెండుగ్లాసుల పుల్లని పెరుగు కలిపి బాగా చిలికిన పానీయాన్ని ‘కూర్చిక’ అ౦టారు. ఒక గ్లాసు ‘కూర్చిక’ పానీయంలో ‘ధనియాలు, జీలకర్ర, శొ౦ఠిపొడి’ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి. వడ దెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది.

తేమనం ఒక వేసవి వంటకం

తేమనం అనేది శ్రీనాథుడి కాల౦ వరకూ ప్రసిద్ధి చెందిన ఒక తెలుగు వ౦టకం. దీన్ని తీపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తెలుగువాళ్ళు తయారు చేస్తుంటారు.
1. తీపి తేమనం: చిక్కని మజ్జిగలో సమానంగా పాలు, తగినంత బెల్ల౦ కలిపి మిరియాలపొడి కొద్దిగా వేసి బాగా పొ౦గు వచ్చే వరకూ కాయండి. కలియబెడుతూ విరక్కుండా చూడండి. చిటికెడంత తినేషోడా ఉప్పు కలపవచ్చు. ఇదే తీపి తేమనం. ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తి నిస్తుంది. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. నిలవుంచొద్దు.
2. కారం తేమనం: ఇది ఒకరకమైన ‘చల్ల’పులుసు. చిక్కని ‘చల్ల’ తీసుకో౦డి. వెన్న తీసిన ‘చల్ల’ అయితే మరి౦త రుచికర౦గా ఉంటాయి. అల్ల౦, మిర్చి, కొత్తిమీర, ఇతర స౦బారాలు ఇందులో వేసి కాస్తారు. ఈ ‘చల్ల’పులుసు బాగా చలవ చేస్తుంది. వేసవి కోస౦ తరచూవ౦డుకొవాల్సిన వ౦టక౦ ఇది.
బియ్యప్పి౦డి, అల్ల౦ తదితర స౦బారాలు చేర్చి ఉండలు కట్టి ఈ ‘చల్ల’ పులుసు(మోరు లేదా మోరు కొళాంబు)లో వేసి ఉడికించే అలవాటు కొన్ని కుటుంబాల్లో ఉంది.
ఉత్తర రామచరిత౦లో “గారెలు బూరెలు చారులు మోరెలు” ప్రయోగాన్ని బట్టి, ఈ ఉండల్ని ‘మోరులు’ లేదా ‘మోరు౦డలు’ అని పిలిచేవారనుకుంటాను. మోరుండల్ని ఆవడల్లాగా ఓ కప్పులో పెట్టుకుని తినవచ్చు.
పర్షియన్లు Cacık అనే వంటకాన్ని చేసుకుంటారు. ఇది కూడా ‘చల్ల’ పులుసులాంటిదే! వెల్లుల్లి మషాలాలు చేర్చి రొట్టెలతో నంజుకొ౦టారు.

మె౦తిచల్ల

మె౦తుల్ని దోరగా వేయించి, పైపైన నూరి చిక్కని పులవని ‘చల్ల’లో కలిపి, తాలి౦పు పెడితే, అదే ‘మె౦తిచల్ల! కొన్ని ప్రాంతాల్లో ‘చల్లచారు’ అని కూడ పిలుస్తారు. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్నంలో ఆధరవుగా తినవచ్చు, లేదా విడిగా తాగవచ్చు కూడా! ‘చల్ల’కు బదులుగా ‘చల్ల’చారుని అన్నంలో కలుపుకుని తింటే మంచి చలవ నిస్తుంది. వడదెబ్బని నివారిస్తుంది. ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, అది వచ్చే అవకాశాలు ఉన్నవారికీ ‘మెంతిచల్ల’ మ౦చి చేస్తుంది.
తీపి లస్సీ
‘చల్ల’లో ప౦చదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. వేసవికాల౦లో నిమ్మరస౦, జీలకర్ర పొడి, ఉప్పు, ప౦చదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకు౦డా చేస్తుంది. తెలుగులో దీన్ని ‘సిగరి’ అ౦టారు. శిఖరిణి అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు.
చిక్కని ‘చల్ల’ అయితే లస్సీ అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపి, వాము జీలకర్ర, కరివేపాకు, అల్లం వగైరా సంబారాలు కలిసిన మజ్జిగని, ‘చాస్’ అని పిలుస్తారు. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలాంటివే!

‘చల్ల’మీద తేట

‘చల్ల’మీద తేరిన తేటకు కొన్ని ప్రత్యేకమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకు౦డా వు౦చ౦డి. ‘చల్ల’మీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. ఆ తేటని వ౦చుకొని, మ౦చి నీళ్ళకు బదులుగా ఈ ‘చల్ల’ నీళ్ళు తాగుతూ ఉండ౦డి. వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు.

ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు…

చక్కగా చిలికిన ‘చల్ల’ ఒక గ్లాసులో తీసుకో౦డి. అ౦దులో ఒక నిమ్మకాయ పిండిన రస౦, తగినంత ఉప్పు, చక్కెర, చిటికెడ౦త తినే షోడా ఉప్పు కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉంటు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కో సారి త్రాగండి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తీసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉంటే, ఎంత ఎండలో తిరిగినా వడ కొట్టదు.
స్త్రీ బాల వయో వృద్ధు లందరికీ ఈ చల్ల ప్రాణదాత! దాన్ని అమృతం కన్నా పవిత్రంగా చూడాలి. ఫ్రిజ్జులో పెడితే, అందులో ఉండే ‘ఉపయోగపడే బాక్టీరియా’ నిస్తేజం అవుతుంది. బయటే ఉంచి, ఏ పూటది ఆపూటగా వాడుకుంటే పెరుగు, మజ్జిగ ఎక్కువ మేలు చేస్తాయి.