Tuesday, 28 July 2015

ధగిడీ రాజ్యంలో మేలిమి రచనలు :: డా. జి వి పూర్ణచందు

ధగిడీ రాజ్యంలో మేలిమి రచనలు
డా. జి వి పూర్ణచందు

జగలోభుల్ మలభాండ విగ్రిహులు గంజాతిండి జండీలు మొం
డి గులాముల్ మగలంజె లాగడపు టెడ్డేల్ ఘోర క్రూరాథముల్
ధగిడీలుండగ నేమి యర్థుల గృతార్ధత్వంబు నొందింతురే
జగదేవక్షితి పాల రాజకుల తేజా! దీనకల్పద్రుమా!

ఇన్నిన్ని తిట్లు తిన్నాక ఎవడైనా బతికుంటే వాడికన్నా గాడిద నయం అన్నమాట! ‘గాడిద కొడకా’ అని తిడితే, ‘వీడా నా కొడుక’ని గాడిద కూడా ఏడ్వగలదు కాబట్టి గాడిదే నయం!!

ఇంతకీ, ఇన్ని తిట్లు తిన్న ఆ ‘అడ్డగాడిద’ ఎవరు? ఒకడేమిటీ ఈ కవిగారికి పెట్టని వాళ్ళందరినీ కలిపే తిట్టాడు. పెట్టిన వాణ్ణి పొగడటానికి బదులుగా పెట్టనివాళ్ళను తిట్టటం ఓ టెక్నిక్. ‘నువ్వలాంటి వాడివి కాదు నాయనా’ అనటమూ పొగడటమే! పద్య కవి ఎవరో తెలియదు. చాటు పద్యంగా చెలామణిలో ఉంది. తాను తిట్టిన వాళ్ళ పేర్లు చెప్పకుండా సాధారణీకరించి వదిలేశాడు కవి. ఆ కవిగారిని గౌరవిస్తానన్నన్నవాడు ఇమ్మడి జగదేవరాయుడనే ప్రభువని ఇందులో ఉంది.

జగదేవరాయుడు ఒక గొప్ప సంస్థానాధీశుడేమీ కాదు. బెంగుళూరు దగ్గర చెన్నపట్టణం అనే ఒకమండల స్థాయి చిన్న రాజ్యానికి పాలకుడు. షుమారుగా 1620 నాటివాడు కావచ్చని నిడదవోలు వెంకట్రావుగారు ‘దక్షిణదేశీయాంధ్రవాఙ్ఞ్మయం’లో ఇతని గురించి వ్రాస్తూ, ఈ చాటు పద్యాన్ని ఉదహరించారు. 

‘అర్థుల కృతార్థత్వంబు నొందింపని’, సత్కవి పండితులను గౌరవించి ప్రోత్సహించటం తెలియని ధనమదాంధుల్ని జగలోభులు, మలభాండవిగ్రిహులు, గంజాతిండి లండీలు, మొండి గులాములు, మగలంజెలు, ఆగడపు ఎడ్డెలు, ఘోర క్రూరాథములు, ధగిడీలు ఇలా తిట్టి పోశాడు. ధగిడీ అంటే పచ్చి నీచమైన స్త్రీ. లండీలంటే కుత్సితులు. జగదేవరాయ అలాంటివాడు కాదనీ, అతను దీనకల్పద్రుమం అనీ ఈ పద్యంలో పొగిడాడు.

సాహితీ సేవ అనేది ఈరోజుల్లో చాలామందికి ఒక హాబీ! సినిమా రచయితలకు వచ్చినట్టు ఇతరులకు సాహిత్యాదాయం ఉండదు. పోతన ఐదువేళ్ళూ నోట్లోకి పోయే పరిస్థితి ఉన్నవాడు కాబట్టి కూళలకు తన కృతిని ఇవ్వనని కరాఖండిగా చెప్పేయ గలిగాడు. నిత్యపేదరికంలో జీవించిన త్యాగరాజు కూడా రాముడికి తప్ప మరొకరికి తలవొంచ నన్నాడు. విశేషం ఏమంటే, రాజులకు కృతినివ్వని కావ్యాలు ఎన్నో నేటికీ నిలిచి ఉండగా, రాజాదరణ పొందిన కావ్యాలలో కవి ఎవడో తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయినవే ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి, సాహిత్య పోషకులు మంచి సాహిత్యం రావటానికి ప్రేరకులేగానీ, కారకులు కాదన్నమాట.

రచయిత రవ్వంత గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని మాత్రమే కోరుకుంటాడు. నేటికాలంలొ అదే తగ్గిపోతోంది! ప్రభుత్వ పురస్కారాలు, విశ్వవిద్యాలయ పురస్కారాలు, అకాడెమీ పురస్కారాలు అత్యధికంగా నవ్వుల పాలౌతున్నాయి.
తెలుగు పుస్తకాలకు అంతర్జాతీయ ఖ్యాతి రావటం లేదని అంటారు గానీ, అంతర్జాతీయ స్థాయిలో పుస్తక ప్రచురణ చేసేంత స్థితి మన ప్రచురణ రంగానికి లేదు. అయినా చాలామంది ప్రచురణకర్తలకు రచయితలంటే చిన్నచూపు.
అప్పో సొప్పో చేసి, రచయితే స్వంతంగా ప్రచురించుకుంటే, ఉచితంగా పంచుకోవటం తప్ప ఆ పుస్తకాలు ఏం చేసుకోవాలో తెలీదు. ఇరుకు కొంపలో ఈ పనికిమాలిన పుస్తకాల కట్టలు అడ్డంగా ఉన్నాయని ఇంట్లోవాళ్ళ తిట్లు నిత్య నైవేద్యా లౌతాయి. అత్యున్నత సాహితీ విలువలున్న పుస్తకాలకు మార్కెట్ ఉండదనే ఒక అపనమ్మకం పుస్తక విక్రేతల్లో ఉంది కాబట్టి, స్వీయ రచనలను షోరూములో ఉంచటానిక్కూడా చాలామంది అంగీకరించటం లేదు. జిల్లాగ్రంథాలయాలు స్వీయప్రచురణ కర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ప్రచురణ తనకు వృత్తి కాదు కాబట్టి, గ్రంథాలయ సంస్థల చుట్టు తిరిగే అవకాశం రచయితల కుండదు.  

వ్రాసిందంతా అచ్చు కావాలనే దుగ్ధలోంచి మొదట రచయిత బయటకు రావాలి. “మొక్కుబడి ముందుమాట”లతో పేజీలు నింపటం కన్నా, ఆ రంగంలో నిపుణుడి చేత తన పుస్తకాన్ని ఎడిట్ చేయించి, నిర్దుష్టంగా అచ్చు వేస్తే, మంచి  పుస్తకాలకు తప్పకుండా మార్కెట్టు ఉంటుంది. పబ్లిషర్లు కూడా ఎడిటర్లను నియమించి, ప్రతి అక్షరాన్నీ  పరిశీలించాకే పుస్తకం అచ్చు వేయటం  మంచి అలవాటు. నిగ్గు తేలిన మేలిమి రచన ఒక పేజీడైన చాలు.

చుట్టూ ధగిడీల కారణంగా నేటికాలపు రచయితలు రాయని భాస్కరులుగా మారిపోతున్నారు. ఒకరిని నిందించి ఉపయోగం లేదు.

     

No comments:

Post a Comment