Saturday 8 August 2015

ఆరొందల యేళ్ళనాటి డ్రస్ కోడ్ :: డా. జి వి పూర్ణచందు

ఆరొందల యేళ్ళనాటి డ్రస్ కోడ్

డా. జి వి పూర్ణచందు

“పట్టే తిరుమణులును పట్టుకుళ్ళాయిలు
పట్టుదుప్పటు లఱచట్టలు మెఱయ
దిట్టలౌ విద్వాంసులు ధీరులౌ కవులు
పట్టభద్రుని కొలువుకు వచ్చిరావేళ”

దక్షిణాది రాజ్యాలలో ఎక్కువ విదేశీ యాత్రికులు, దేశంలోనే ఇతర రాజ్యాలకు చెందిన వర్తకులు, కవి పండిత కళాకారులూ ఎక్కువగా సందర్శించింది విజయనగర సామ్రాజ్యాన్నే! వాణిజ్యం పెంచుకునేలా రాజు పాలన చేయాలని కృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యదలో చెప్పుకున్నాడు కూడా! అందుకని, కొన్ని ఆధునిక సాంప్రదాయాలను తప్పనిసరిగా పాటించవలసి వచ్చింది. రాజాస్థాన సందర్శకులకు డ్రస్‘కోడ్ వాటిలో ఒకటి.

“కుళ్ళావెట్టితి కోకసుట్టితి మహా కూర్పాసముం దొడ్గితిన్” అని శ్రీనాథుడు ప్రౌఢదేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్య సందర్శనం చేసినప్పుడు తానుకూడా డ్రస్ కోడ్ పాటించినట్టు చెప్పుకున్నాడు. దాన్నిబట్టి, రాజ సందర్శనం కోరేవాడు ప్రత్యేకంగా నిర్దేశించిన వేషధారణలోనే రావాలని అర్ధం అవుతోంది.
తరువాతి కాలంలో తంజావూరు మధుర రాజ్యాల లోని తెలుగు పాలకులు ఈ వేషధారణ విధానాన్ని కొనసాగించారు, నాయకరాజులు తాము స్వయంగా వ్రాసిన రచనల్లో వీటి వివరాలు కొన్ని మనకు తెలుస్తాయి. ఈ పద్యం’విజయరాఘవ కళ్యాణము’ లోది.

పట్టే తిరుమణులు: తిరుమణి అంటే తెల్లటి నాము, తిరుచూర్ణం అంటే పసుపు, బియ్యప్పిండి కలిపిన పొడి. ఈ రెండింటినీ వైష్ణవులు నొసట బొట్టులా పెట్టుకుంటారు. రాజు వైష్ణవు డైనప్పుడు ఆయన మెప్పుకోరి వచ్చిన వాడు ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని విధిగా పాటిస్తాడు. నుదుట బొట్టు లేని శూన్యలలాటాన్ని రాజు ఆదరించక పోవచ్చు కూడా! ఈ బొట్టుని పట్టె(పలకలా)లాగా పెడతారు. రాజు పట్టాభిషిక్తుడయ్యేప్పుడు పెట్టేబొట్టు ఈ ‘పట్టె’ 

పట్టుకుళ్ళాయిలు: కుళ్ళా-య, కుళ్ళాయి అంటే పటరచిత మకుటం. పట్టుబట్టతో చేసిన తలపాగా. వీటిని మొదట్లో కుళ్ళాయిలనే అనేవారు. ఇది దొరల టోపీ కాదు. ముట్నూరి కృష్ణారావుగారి తలపాగా కూడా కాకపోవచ్చు. గాంధీటోపీ లాంటిది, పట్టుబట్టతో చేసింది కావచ్చు. తరువాతి కాలంలో పాగా అనేది వ్యాప్తిలోకి వచ్చినట్టు నిడుదవోలు వేంకటరావుగారు వ్రాశారు. తమ కవితా ప్రతిభతోనో, కళా ప్రతిభతోనో రాజుగారి  మెప్పుపొందిన వాళ్లకి రెండు శాలువాలు బహూకరించే సాంప్రదాయం ఉండేది. ఒకటి పైన కప్పి, రెండోది తలపాగాలాగా చుట్టి, గౌరవించే వాళ్లన్నమాట! శాలువాల జతని దౌశాలువా లేక దుశ్శాలువా అన్నారని పండితులు చెప్తారు. తలపాగా పెట్టుకొని కోటకెళ్ళటం, కోటలో తలపాగా పెట్టించుకు రావటం అనేవి రెండూ గొప్ప విషయాలే ఆ రోజుల్లో! కోటలో పాగా వేయటం అనే మాట ఇలానే పుట్టింది.

పట్టుదుప్పటులు: దుప్పటం అంటే వెలగల సన్నపాటి వెడల్పు వస్త్రం, కవచం, ఉత్తరీయం, నిచోళం అని నిఘంటు అర్థాలు. వెడల్పు తక్కువ, పొడవు ఎక్కువగా ఉండే శాలువాని దుప్పటం అన్నారు. అది పట్టుదైనప్పుడు ఖరీదైనదౌతుంది. పక్కమీద వేసుకోవటానికి, ఒళ్ళంతా కప్పుకోవటానికీ వాడుకునే ఇప్పటి దుప్పటిని కూడా దుప్పటం అనే అంటారు. దానికీ దీనికీ చేతలో తేడా ఉంటుంది. లేకపోతే దుప్పటి కప్పినట్టే ఉంటుంది గానీ, శాలువా లాగా ఉండదు.

అఱచట్టలు మెఱయ: అఱచట్ట అంటే ‘నేటి వెయిస్టు కోటు వంటిది’ అన్నారు నిడుదవోలు వేంకటరావుగారు
శ్రీనాథుడు తాను ప్రౌఢదేవరాయల సంస్థానానికి వెళ్ళినప్పుడు కోక చుట్టుకుని, మహాకూర్పాసం తొడుక్కున్నట్టు వ్రాసుకున్నాడు. మహాకూర్పాసకం అంటే బాగా ఖరీదైన జరీ అంచులున్న ఈ అఱచట్టే! ఱవిక లాంటిదన్నమాట. అది సాధారణంగా ఉంటే బనీను (లోగుడ్డ) లా ఉంటుంది. రాజదర్శనానికి వచ్చేవాళ్ళు అర్థనగ్నంగా నడుం నుండి పైభాగం కనిపించే విధంగా ఉండకుండా, ఇలా అఱచట్ట లేదా కూర్పాసం తొడుక్కుని పైన పట్టు దుప్పటం (ఉత్తరీయం) కప్పుకునేవాళ్ళు. ఇదే జనవ్యవహారంలో అంగరకా లేదా అంగరఖా అంటే చొక్కాగా మారింది. క్రమేణా పై ఉత్తరీయం లేచిపోయింది.

పంచె కట్టుకుని, దాని మీద కోక చుట్టేవాళ్ళు. పంచెమీద బెల్టులాగా నడుము చుట్టూ బిగించి కట్టే వస్త్రాన్ని కోక అంటారు. యఙ్ఞ యాగాది క్రతువుల్లో నడుము బట్ట కట్టుకోవటం అంటే దీక్షకు ఉపక్రమించటం అని అర్థం. కోకచుట్టటానికి అంత ప్రాముఖ్యం ఉంది. మిగతా వస్త్రధారణలు పాటించగలిగినా లేకున్నా, నడుముకు వస్త్రం కట్టటం వరకూ చేస్తే, గొప్ప గౌరవం ఇచ్చినట్టే భావించేవాళ్ళు. ఇవన్నీ దేవాలయాలకు వెళ్ళేప్పుడు కూడా సహజంగా పాటించే నియమాలే! రాజాస్థానాలక్కూడా వీటిని వర్తింప చేయటం ద్వారా గౌరవం ఆపాదించే ప్రయత్నంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.  

సందర్భవశాత్తూ ఇక్కడొక సరదా సంగతి చెప్పాలి.

తంజావూరు నాయకరాజుల కాలంలో “తీరైన కనకపు కళ్ళజోడు దీపింపగా" రాజదర్శనానికి తరలి వచ్చినట్టు ఒక పద్యాన్ని నిడుదవోలు వారు ఉదహరించారు.

కళ్లకు అద్దాల గురించిన పరిఙ్ఞానం మనకు 18వ శతాబ్దికి గానీ అందుబాటులోకి రాలేదుకాబట్టి బంగారపు కట్లున్న కళ్లజోడు వాడకం కంటి దోషాలకోసం (refraction errors) ఇప్పుడు మనం వాడే కళ్ళజోడు లాంటిది కాదనిరేబాన్ కళ్లజోడు లాగా విలాసవంతమైన ఒక అలంకారం అనీ అర్థం అవుతోందిఇది అద్దాలున్న జోడా లేక ఉత్తుత్తి ఫ్రేము మాత్రమే ఉన్నదాదాని ఆకారం ఎలా ఉండేది అనేవి మనకు తెలీవుఎక్కడైనా ఏ దేవతా విగ్రహానికోరాజుగారి విగ్రహానికో కళ్ళజోడు ఉన్నదేమో తెలీదుఅప్పటి సాంఘిక చరిత్ర తెలుసుకోవటానికి ఇవన్నీ ముఖ్య పరిశోధనాంశాలే!

No comments:

Post a Comment