Thursday, 23 April 2015

వరి కూడు:: డా. జి వి పూర్ణచందు

వరి కూడు
డా. జి వి పూర్ణచందు
ఫుల్ల సరోజ నేత్ర అల పూతన చన్నుల చేదు ద్రావి నా / దల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో / మెల్లగ నొక్క ముద్ద దిగ మ్రింగుమ నీ పస కాననయ్యెడిన్
ఇది శ్రీనాథుడి చాటు పద్యం. దాదాపు ఏడు వందల యేళ్ళ నాటి వాడు శ్రీనాథుడు. అప్పటికే తెల్లన్నం(తెల్లగా పాలిష్ పట్టిన వరిబియ్యంతో వండిన అన్నం) మీద వ్యామోహం జనాల్లో బాగా వచ్చేసింది. శ్రీనాథుడు నెల్లూరు, కృష్ణా మండలాల్లో ఎక్కువగా జీవించిన వాడు కాబట్టి, చివరి రోజుల్లో కృష్ణ ఒడ్డున బొడ్డుపల్లిలో గొడ్డేరి మోసపోయినప్పటికీ వ్యవసాయం కారణంగా ప్రాణాలు అర్పించుకున్న తొలి తెలుగు రైతు కాబట్టి, తెల్లన్నానికి బాగా అలవాటు పడి, జొన్నన్నాన్ని ఈసడించాడు.
అదేం పాపమో, ఇతర ధాన్యాలు ప్రధాన ఆహారంగా తీసుకునే వాళ్ళు తెల్లన్నం తినాలంటే పెద్ద ఇబ్బంది పడరు. కానీ, వరిబియ్యం తినే వాళ్ళు మాత్రం మరో ధాన్యం తినాలంటే ప్రాణం మీద కొస్తుంది.
నాలుగు రోజులు ఉత్తర భారతదేశానికి వెళ్ళినవాడు ఇంటికి వెళ్ళి వరి అన్నం, ఆవకాయ కోసం మొహవాచిపోతాడు. శ్రీనాథుడి పరిస్థితి కూడా అదే! ఆయన పలనాడు వెళ్ళి జొన్నకూడుని, కర్ణాటక వెళ్ళి రాగి సంకటినీ తినటానికి నానా తంటాలు పడ్డాడు. తన అవస్థని అనేక చాటు పద్యాల్లో చెప్పుకున్నాడు కూడా! ఈ పద్యం వాటిల్లో ఒకటి!
బహుశా శ్రీనాథుడు ఉత్తరాదికి వెళ్ళీ ఉంటే, చపాతీలూ, పుల్కాలూ బాగానే తిని ఉంటాడనుకుంటాను. ఆయన తన కావ్యాలలో అనేక వంటకాలను పేర్కొన్నాడు. వాటిల్లో, ‘అంగారపోలిక’ అనే వంటకం ఉంది. ‘పోలి’ అంటే ఉండలా చేసిందని! పోలిని పలుచగా వత్తి, నిప్పుల మీద కాలిస్తే అది ‘పోలిక’ (పుల్కా). దీన్నిబట్టి, తెలుగువారికి గత 700 యేళ్ళ నుండీ పుల్కాలు బాగా తెలుసనీ, అవి ఉత్తరాది నుండో, అరబ్బు దేశాల నుండో దిగుమతి అయినవి కావనీ, తెలుగువారి ప్రాచీన వంటకం అనీ అర్ధం అవుతోంది. .
వరి బాగా పండే ప్రాంతాల్లో ఉండే వారికి తెల్లన్నం రాజబోజనం అనీ, జొన్నన్నాన్ని జొన్న కూడు అనీ పిలవటం ఒక అలవాటు. గొప్పవాడు కనిపిస్తే భోజనం చేశావా అనీ, సామాన్యుడు కనిపిస్తే కూడు తిన్నావా అనీ అడుగుతుంటారు. ఇది తరతరాలుగా వచ్చిన అలవాటే గానీ, కూడు అనేది నీచమైన పదం ఏమీ కాదు. కూడు కుడిచేది కుడిచెయ్యి కదా! మనం ‘కుడిచెయ్యే’ అంటున్నాం. శ్రీనాథుడికి జొన్నన్నాన్ని తినటం ఎంత ఇబ్బంది అయ్యిందో ‘జొన్నకూడు’ అనటంలోనే ధ్వనిస్తుంది.
“బాగా వికసించిన తామర పూవుల వంటి కన్నులూ, అందమైన రూపమూ ఉన్న ఓ కృష్ణుడా! చిన్ననాట పూతన రొమ్ముపాలలో చేదుని తాగేసాననీ, పెద్ద దావాగ్నిని మింగేశాననీ విర్రవీగుతున్నావేమో, తింత్రిణీ పల్లవాలు అంటే లేత చింత చిగురు కలిపి వండిన బచ్చలాకు పులుసుకూరని ఈ జొన్నకూట్లో కలుపుకుని ఒక్క ముద్ద దిగమింగు, నీ పస ఏమిటో తెలుస్తుంది…”అంటూ దేవుణ్ణి నిలేస్తాడు శ్రీనాథుడు.
ఆ రోజుల్లో తెల్లన్నం రాజభోజనం. జొన్నకూడు సామాన్యులు తినేది.
రోజులు మారిపోయాయి. మనుషుల్లో మానసిక శ్రమ పెరిగి, శారీరక శ్రమ తగ్గి పోయింది. షుగరువ్యాధీ, స్థూలకాయం, బీపీ వ్యాధులు ఎక్కువయ్యాయి. ఇవి కష్ట జీవులకూ రావచ్చు. అది వేరే సంగతి. కానీ, మౌలికంగా పనీ పాటా లేని వాళ్ళకి మాత్రం ఎక్కువగా వస్తుంటాయి. అంటే, కూటికి ఉన్నవాళ్ళకు వచ్చే వ్యాధులన్నమాట! కూడు ఎక్కువై వచ్చే వ్యాధులని కూడా చెప్పవచ్చు. వీటి బారినుండి బయట పడాలంటే, జొన్నకూడే రాజభోజనం!
ఇప్పుడే గనక శ్రీనాథుడే ఉంటే షుగరో బీపీయో తప్పకుండా తెచ్చుకునే వాడే! ఎలుగెత్తి ఆ గోపాల కృష్ణుణ్ణి పిలిచి,”ఓ కృష్ణా! చిన్ననాడు పూతన రొమ్ముపాలలో చేదు మింగాననీ, దవాగ్ని అమాంతం మింగేశాననీ విర్రవీగకు! చేతనైతే, చేవ వుంటే ఈ తెల్లన్నంలో తీపిని తిని బతికి బట్టకట్టు చూద్దాం! నీ పస ఏపాటిదో తెలుస్తుందీ…” అని మొత్తుకుని ఉండేవాడు.
ఇక్కడో గమ్మత్తయిన విషయం ఉంది. బోయ ఎవడో వేసిన బాణం ములుకు గుచ్చుకుని కాలు సెప్టిక్ అయి కృష్ణుడు అవతారం చాలించాడట! ఈ రోజుల్లో షుగరు వ్యాధికి ఎన్నో పరిక్షలొచ్చాయి. అప్పట్లో కృష్ణుదు మధుమేహాన్ని బహుశా పసిగట్ట లేకపోయి ఉండొచ్చు. పసిగడితే జొన్నకూడు తిని ప్రాణాలు నిలుపుకునే వాడు కదా!
ఉత్తర భారత దేశం వారికి గోధుమలూ, దక్షిణాది వారికి బియ్యం మాత్రమే తెలుసని మనం అనుకుంటాం. కానీ, ఉత్తరాదివారు వరినే ముందు పండించారు. ఆ సమయంలో మన తెలుగునేలమీద గోదుమలు పండించారు. ఉమ అంటే ధాన్యం. గోద్ అంటే ఒక విధమైన ఎరుపు రంగు. గోదుమలు అని ‘దు’కి వత్తు లేకుండా పలికితే అది తెలుగు పదం. ‘గోధుమ’ అని వత్తుతో సంస్కృతంలో పలుకుతారు.
ఇప్పుడంటే శనగపిండిది పెత్తనం అయ్యింది గాని. అరవై డెబ్బై ఏళ్ళ క్రితం వరకూ పిండి వంటలంటే గోదుమ పిండితోనే చేసేవారు. ఒంటి పొరమీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద దౌపాతి, మూడు పొరల మీద త్రీపాతి, నాలుగు పొరల మీద చపాతీ అంటారని ఒక పండితుడు విశ్లేషించాడు. సత్యనారాయణస్వామి ప్రసాదం గోధుమ రవ్వతో చేయటంలో పరాయితనం ఏమీ లేదు. అప్పట్లో జొన్నలతో చక్కిలాలు, సజ్జలతో సజ్జప్పాలు చేసుకునే వాళ్ళు. శనగపిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ వాడకం దాదాపు లేదనే చెప్పాలి.
కాబట్టి, వరి కూడు కన్నా జొన్నన్నమే మిన్న! తల్లీ తెలుగు రాజ్యలక్ష్మీ! నేను శ్రీనాథుణ్ణీ, తెల్లన్నం, సన్నన్నం వద్దు. జొన్నన్నం పెట్టి కాపాడు…” అని శ్రీనాథుడే అడగాల్సిన పరిస్థితి... ఈనాటిది.

No comments:

Post a Comment