Tuesday, 17 June 2014

సుఖ సంసారంలో చిచ్చు ‘స్ట్రెస్సు’ డా. జి వి పూర్ణచందు


సుఖ సంసారంలో చిచ్చు ‘స్ట్రెస్సు’

డా. జి వి పూర్ణచందు


లైంగిక సుఖాన్ని పొందాలనే కోరిక ఎంత బలంగా ఉంటే లైంగిక కార్యం అంత బలంగా జరుగుతుంది. జీవితంలో అన్ని విషయాలకూ వర్తించే వ్యక్తిత్వవికాస సూత్రాలన్నీ లైంగిక శక్తిని పెంచుకునేందుకూ వర్తిస్తాయి.

ఏకాగ్రత (సి = కాన్‘సన్‘ట్రేషన్), ఇష్టత ( ఐ = ఇంట్రెష్ట్), దీక్ష, పట్టుదల ( డి = డెడికేషన్), ఈ సి ఐ డీలు సక్రమంగా ఉంటే, పరీక్షల్లో డిష్టింక్షన్ సాధించ గలిగినట్టు, సెక్సు కార్యంలో కూడా స్త్రీ పురుషులు డిష్టింక్షన్ పొందటానికి ఈ సి. ఐ. డీ.ల అవసరం ఉంటుంది. నిజానికి సెక్సులో విజయం అనేది ఒక పరీక్షే! ఇందులో ఉత్తీర్ణత పొందితే, అన్నింటా జయమే!

ఎలాంటి ఆందోళనలూ లేకుండా అనుకూల భావావేశంతో (పోజిటివ్ యాటిట్యూడ్) మనసు నిండి ఉన్నప్పుడు సుఖ సంసారం సాధ్యమౌతుంది. చింతా శోక భయ దుఃఖాదులన్నీ లైంగిక శక్తిని చంపేస్తాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతే, లైంగిక శక్తీ, ఆసక్తీ అంతరించి పోతాయి. ఆత్మవిశ్వాసంతో రతిక్రీడకు తలపడినప్పుడు జీవిత బాగస్వామితో అనేక రెట్లు సుఖానుభవాన్ని పంచుకోవచ్చు!  

వేలల్లో జీతాలు తీసుకునే చాలామంది స్త్రీ పురుషులు వృత్తి పరమైన మానసికవత్తిడికి (స్ట్రెస్స్) లోనవటం వలన నిజమైన లైంగిక సుఖానుభవానికి దూరం అయిపోతున్నారు. వాళ్ళలో వివాహ బంధాల విఛ్ఛిన్నతా శాతం ఎక్కువగా ఉంటోంది. ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోయి, ధనమదాంధతతో వాళ్ళు సంసారాలను నాశనం చేసుకుంటూ న్నారని అనుకోవటం పూర్తి వాస్తవం కాదు. దీర్ఘకాలం పాటు వృత్తిపరమైన, సామాజిక పరమైన, కుటుంబ పరమైన ‘స్త్రెస్సు’ లో నిరంతరంగా జీవించటం వలన మనుషులు లైంగిక అసమర్ధతకు లోనౌతుంటారు. సంసారాలు విఛ్ఛిన్నం కావటానికి ఇది ప్రధాన కారణం. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చుగానీ, సెక్సు సమర్ధతని కొనలేరు కదా!  

నిజానికి లైంగిక కార్యం వలన మనసులోంచి వత్తిడి అనే దయ్యం పారిపోవాలి. ప్రియురాలి ఒడిలో ఒక్క క్షణం సేద తీరితే ఎంతవత్తిడి నుంచైనా బయట పడగలుగుతారు మనుషులు. కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. స్ట్రెస్సు లేని సమయాన్ని చూసుకుని సుఖంగా గడుపుదాం అనుకునేంతలో ఆఫీసునుండి సెల్లు పిలుపు వస్తుంది. అంతే! వెంటనే ల్యాప్‘టాప్ తెరిచి దానికి అంకితం కావతం ఎక్కువసార్లు జరిగిపోతుంది. తనను ఒడిలోకి తీసు కోవాల్సిన తన జీవిత భాగస్వామి ఆ ల్యాప్‘టాప్‘ని ఒడిలోకి తీసుకోవటాన్ని ఎవరికైనా భరించలేని విషయమే! అది మానసిక వత్తిడికి దారి తీస్తుంది. ఫలితంగా విసుగులూ, కోప తాపాలు, చీదరింపులూ, మూతి విరుపులూ సహజంగా పెరిగి పోయి భార్యా భర్తలు తమ విధ్యుక్త ధర్మాలను నెరవేర్చుకో గలిగే సమయం చిక్కక, సతమతమౌతూ ఉంటారు. చివరికి మనసు విప్పి మాట్లాడుకునే సావకాశం కూడా వారికి చిక్కదు.  సంసారాల్లో స్ట్రెస్స్ వలన సుఖజీవనం నాశనం అవుతోంది. క్రమేణా అది దాంపత్యాన్ని చీల్చే దాకా దారి తీస్తోంది.

ఇలాంటి పరిస్థితిని నివారించు కోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దీన్ని సరి చేసుకోకుండా, లైంగిక శక్తిని పెంచే మందులను ఆశ్రయించటం వలన ధన మాన ప్రాణాల దోపిడీ తప్ప ఒరిగేదేమీ ఉండదు. చిట్కా చికిత్సలు మన ప్రయత్నానికి ఉడత సాయం చేస్తాయే గానీ, అవే ప్రధానం ఎంతమాత్రం కాదని గ్రహించాలి. మనో బలం లేనివాడి దగ్గర వజ్రాయుధం ఉంటే మాత్రం ఒరిగేదేం ఉంటుంది...? సెక్సు విషయంలో ఈ సూక్తి ముఖ్యంగా వర్తిస్తుంది.

మొదట మనసుని చక్కగా అలంకరించుకోవాలి. అందులో స్ట్రెస్సు లాంటి అడ్డుభావనలేవీ లేకుండా చూసుకోవాలి.

తరువాత శరీరాన్ని అలంకరించుకోవాలి. అందులో ఎలాంటి వికారాలూ కలగకుండా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు మీ జీవిత భాగస్వామికి వెల్లుల్లి సరిపడదనుకోండి, మీ శరీరంలోంచి వెల్లుల్లి గవులు కంపు కొడుతుంటే అవతలి వ్యక్తి పూర్తిగా సెక్సు విముఖతకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది! తాగి ఇంటికి వచ్చి సారాకంపుకొట్టే మొగుడితో భార్య పొందేది లైంగిక సుఖం కాబోదు కదా! యాంత్రికంగా ఆ తాగుబోతుకు ఒళ్ళప్పగించి అయిందన్నాక అటు తిరిగి పడుకునే భార్యలే ఎక్కువ మంది ఉన్నారని ఒక సర్వే చెప్తోంది.

ఇద్దరికీ లైంగికోత్తేజ కరంగా ఉండేలా పడక గది అలంకారం ఉండాలి. అందులో మంచం కింద ఆరబోసిన ఉల్లిపాయలూ, మంచం పక్కన మురికి గుడ్డలూ, చుట్టూ వ్యాపించిన బూజు, ఎక్కడో ఎలిక చచ్చిన వాసన...ఇలాంటి పడక గదిలో జరిగేది కక్కుర్తి వ్యవహారమే గానీ, అది నిజమైన దాంపత్య సుఖ ప్రేరకం ఎంతమాత్రమూ కాదు.

సెక్సనేది ఇచ్చి పుచ్చుకునే ఒక భావావేశం. అది, గది నాలుగు గోడలమధ్య ఇద్దరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గెలుపోటములు నిర్ణయించే అంపైర్లెవరూ ఉండని ఒక రహస్య క్రీడ. దానికి నియమ నిబంధనలేవీ ఉండవు. ఇద్దరి అంగీకారంతో జరిగే ఒక ‘రాగుంజు పోగుంజు’లాట. ఇందులో చేయటం చేయబడటం అనే రెండు వ్యవహారాలు అసలే ఉండవు. ఆడది సుఖపెట్టేది, మగాడు సుఖపడేవాడు అనే అభిప్రాయం తప్పు. సుఖ సంతోషాలను ఇచ్చి పుచ్చుకునే సమస్థితి ఉన్నప్పుడే అది ఆరోగ్యదాయక మైన దాంపత్య సుఖానుభూతి నిస్తుంది.

ఏవి ఎలా ఉన్నా మనసు అనేది సెక్సు విజయాన్ని ప్రసాదించే గొప్ప ఔషధం. అది నిర్మలంగా ఉండాలి. అన్నింటికన్నా ముందు మనిషికి సెక్సు పరమైన నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేని వ్యక్తి సెక్సుకు తలపడినప్పుడు గిల్టీ కాన్షస్ అంటామే... . అపరాధ భావన... అది ఆ సమయంలో ప్రభావం చూపిస్తే ఆ వ్యక్తి సెక్సు పరమైన అపజయాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇవన్నీ స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా వర్తించే విషయాలే! మానసిక వత్తిడి (స్త్రెస్సు)ని తెచ్చే వాటిలో అపరాధ బావన కూడా ముఖ్యమైందే!  పవిత్రమైన దాంపత్య సుఖానికి స్ట్రెస్సు అనేది చిచ్చు పెట్టేదేనని గుర్తించాలి.


No comments:

Post a Comment