Friday, 13 June 2014

ఆడవాళ్ళలో మలబద్ధత డా. జి వి పూర్ణచందు


ఆడవాళ్ళలో మలబద్ధత
డా. జి వి పూర్ణచందు
జబ్బులకూ ఆడామగా తేడాలుంటాయి. మలబద్ధత విషయంలో ఇది మరీ నిజం. సగటు మధ్య తరగతి మహిళల జీవన విధానం వలనే ఈ తేడా లేర్పడుతున్నాయి. ముప్పయ్యేళ్ల లోపు ఆడవాళ్లలో మలబద్ధత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు వంటింటి విధుల్లో తీరిక దొరక్క శరీర ధర్మాలను వాయిదా వేయటమే ముఖ్య కారణం.
ఇంట్లో అందరికన్నా ము౦దే నిద్ర లేవటం, కసవులు చిమ్ముకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, పొయ్యి వెలిగించి కాన్వెంట్లకు పోయే పిల్లల కోసం క్యారీయరు కట్టే పనిని పూర్తి చేయటం, పిల్లల్ని తయారు చేసి, వాళ్లను స్కూలు బస్సు ఎక్కించటం, అంట్లూ, బట్టలూ, ఆ వెంటనే మధ్యాన్న భోజనం కోసం ప్రయత్నాలు, వంటలు, వడ్డనలూ, అంతలోనే సాయంత్రం కాఫీలు, రాత్రి అందరూ పడుకునే వరకూ ఎవరి సేవలు వారికి చేయటం, వంటిల్లు కడుక్కోవటం... ఇంత పని రంథిలో పడటం వలనే టాయిలెట్లోకి వెళ్ళి ప్రకృతి పిలుపును పట్టి౦చుకొనేంత సావకాశ౦ ఆడవాళ్లకు ఉండటంలేదు.
సగటు మధ్య తరగతి మహిళకున్నంత బిజీ షెడ్యూలు బహుశా ఈ దేశ ప్రధాన మ౦త్రి క్కూడా ఉండదేమో! ఎప్పటి కప్పుడు కొచె౦ సేపాగాక వెడదాం అనో, ఈ పని పూర్తయ్యాక వెడదాం అనో అనుకోవటం, అదే పరిస్థితి ప్రతి రోజూ కొనసాగటం వలన చివరికి అదే అలవాటుగా మారి, మోషన్ వస్తే మోక్ష౦ వచ్చినంత సంబరం అవుతుంది. ఇది ఆడవారికి వారి జీవన విధానం తెచ్చే ఒక సమస్య. ఇలా జీవి౦చే మగవారికీ ఇది సమస్యే!
గడియారం రోజూ సరిగ్గా సమయానికి గ౦ట కొట్టినంత ఠ౦చనుగా విరేచనం ప్రతిరోజూ అదే సమయానికి అయ్యే స్వభావం మానవ శరీరాల కుంటుంది. కాలానికి అవుతుంది కాబట్టే, దాన్ని కాలవిరేచనం అన్నారు. అది సకాలంలో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని తప్పించేందుకు ప్రయత్నించకుండా ఉండాలి. ఏ కారణం చేతయినా ఆ టైము మారితే, మర్నాడు మారిన సమయానికే విరేచనం అవుతుంటుంది. రోజూ ఒకే కాలానికి విరేచనానికి వెళ్ళే  అలవాటు ఉన్నవారికి మలబద్ధత రాదు. 
సమస్త రోగాలకూ మూలకారణం మలబద్ధతేనని మొదట గ్రహి౦చాలి. నిద్రలేచాక దినచర్యలో మొదటి అంశ౦గా విరేచనానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. తరువాతఅనే మాటని విరేచనం విషయంలో పొరబాటున కూడా వాడకూడదు. మలబద్ధక౦ వలనే మలబద్ధత ఏర్పడుతుంది. క్యా౦పులు తిరిగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆదరాబాదరా ప్రొద్దునే లేచి దూర ప్రయాణం చేసి ఆఫీసులకు వెళ్ళేవారికి, క్షణం తీరిక లేనంతగా పనుల్లో మునిగి వు౦డేవారికి మలబద్ధత ఈ కారణం
వలనే ఏర్పడుతుంటుంది.
విరేచనం అయ్యే తీరునుబట్టి జీర్ణాశయ వ్యవస్థలు మృదు, మధ్య, కఠిన (క్రూర) అని మూడు రకాలుగా ఉంటాయని చెప్తు౦ది ఆయుర్వేద శాస్త్ర౦. గ్లాసు పాలు తాగితే రె౦డు విరేచనాలు కావటం మృదు తత్వ౦. విరేచనాల బిళ్లలు డబ్బాడు మి౦గినా కడుపు కదలక పోవటం కఠిన(క్రూర)తత్వ౦. ఒక చిన్న విరేచనం మాత్ర వేసుకొ౦టే విరేచనం కావటం మధ్య తత్వ౦. ఈ మూడు రకాల తత్వాలలో ఎవ్వరికి వారు తాము ఏవిధమైన శరీర తత్వ౦ కలిగి ఉన్నారో మొదట అంచనా వేసుకోవాలి. దానికి తగట్టుగా ఆహార విహారాలనూ జీవన విధానాన్నీ మార్చుకోవటం అవసరం. అన్ని ఇతర పనులూ మాని విరేచనానికి వెళ్ళి రావాలనేది ఆయుర్వేద సూక్తి.
నిద్రలేస్తూనే విరేచనానికి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. టాయిలెట్లోకి వెళ్లగానే వెంటనే విరేచనం అయిపోవాలి. గు౦డె లవిసిపోయేలా ముక్కీ ముక్కీ విరేచనానికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. నీరు తక్కువ తాగేవారికి విరేచనం పిట్టం కట్టి ఎంత ముక్కినా బయటకు రాదు. స్థూలకాయం ఉన్నవారు, నడుంనొప్పి, మోకాళ్ళనొప్పులున్న వారు గొంతుక్కూర్చునే దేశవాళీ మరుగుదొడ్లో విరేచనానికి వెళ్లటాన్ని పెద్ద శిక్షగా భావిస్తారు. నొప్పులకు భయపడి చాలామ౦ది విరేచనాన్ని వాయిదా వేయాలని చూస్తారు. కొ౦దరికి టాయిలెట్లో ఎ౦తసేపు కుర్చున్నా ఇంకా అవలేదన్నట్టు, పెద్ద విరేచనం కదిలి వచ్చేస్తోందన్నట్టు అనిపి౦చి, గ౦టల తరబడీ అక్కడే గడపాల్సి వస్తు౦టుంది. ఇవన్నీ వాత వ్యాధులకు దారి తీస్ఏ అంశాలుగా పరిణమిస్తాయి.
కొ౦దరు మగవాళ్లకి కాఫీ తాగక పోతేనో. సిగరెట్టు కాల్చక పోతేనో, దినపత్రిక చదవకపోతేనో విరేచనం కాదనే అపోహలు ఉంటాయి. వాటికోసం విరేచనాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి కాఫీ,సిగరెట్లలో విరేచనం చేసే గుణాలేవీ లేవు. కానీ, విరేచనాని క్కూడా సె౦టిమె౦టుని లి౦కు పెడుతుంటారు. ఇవన్నీ విరేచనాన్ని ఎగగొట్టేందుకు  ఎత్తుగడలే!
ఆరోగ్యకరమైన మలానికి కొన్ని ప్రత్యేల లక్షణాలుంటాయి. దొడ్లోకి వెళ్లగానే విరేచనం అయిపోవాలి. మలం మృదువుగా ఉండాలి, కాసిని నీళ్ళు కొట్టగానే లెట్రిన్ ప్లేటుకు అంటుకోకుండా జారి పోవాలి. నిన్ననో మొన్ననో తిన్న ఆహర పదార్థాలు విరేచనంలో కనిపి౦చినా, నీళ్లతో కడుక్కుంటే చేతికి ఇంకా జిడ్డుగా అనిపి౦చినా, లెట్రిన్ ప్లేటులో అంటుకొని ఎ౦త నీరు కొట్టినా వదలక అంటుకొని ఉంటున్నా, ఆ వ్యక్తి పొట్ట చెడిందని అర్థం.
మొలలు, లూఠీలు, విరేచనమార్గంలో అవరోధాలు, పుళ్ళు, వాపులు, కొన్ని రకాల మందులు, కొన్నిరకాల ఆహార పదార్థాలు, మలబద్ధకానికి కారణం కావచ్చు. కేన్సరు లా౦టి వ్యాధుల క్కూడా మలబద్ధత తొలి హెచ్చరిక అవుతుంది. విరేచనంలో తుమ్మజిగురు బంక లాగా తెల్లని జిగురు గానీ, రక్తపు చారలు గానీ ఉంటే అమీబియాసిస్ లా౦టి వ్యాధులు ఉన్నాయేమో చూపించుకొవాలి. విరేచనం పుల్లని యాసిడ్ వాసన వస్తు౦టే కడుపులో అమ్లరసాలు పెరిగి పోతున్నాయని అర్థ౦. కుళ్లిన దుర్మాంసం వాసన వేస్తుంటే లోపల చీము ఏర్పడుతోందేమో చూపి౦చుకోవటం అవసరం. రిబ్బను లాగా సన్నగా విరేచనం అవుతుంటే పేగుల్లో అవరోధ౦ కారణం కావచ్చు. మేకపె౦టికల మాదిరి ఉండలు ఉండలుగా అవుతుంటే ఇరిటబులు బవుల్ సి౦డ్రోమ్ లా౦టి మానసిక వ్యాధులు కారణం కావచ్చు.
జీర్ణశక్తిని బలంగా కాపాడుకొ౦టూ, మలబద్ధత ఏర్పడకుండా జాగ్రత్త పడేవారికి వ్యాధులు చాలా దూరంగా ఉంటాయి. ముఖ్య౦గా ఆడవారు కేలం మలబద్ధత కారణంగా అకారణమైన నడుంనొప్పి, కీళ్లనొప్పులు, ఎలెర్జీ వ్యాధులు, గ్యాసుట్రబులు, పేగుపూత  లాంటి వ్యాధులకు ఎక్కువగా గురి అవుతున్నారు. ఇందుకు మలబద్ధత, మలం విషయంలో బద్ధకమే ముఖ్య కారణం కావచ్చు.


No comments:

Post a Comment