Monday, 22 December 2014

ప్రయోజనం సాధించిన తిట్టు కవిత్వం :: డా. జి వి పూర్ణచందు

ప్రయోజనం సాధించిన తిట్టు కవిత్వం
డా. జి వి పూర్ణచందు
 
   సీ. అందలంబెక్కుట నవని బ్రశస్తమా, మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులు దొడుగుట దొడ్డ సౌభాగ్యమా, కడుసొమ్ము లూనదే గంగిరెద్దు
విత్తంబు గూర్చుట విమల ప్రచారమా, బహు నిధుల్ గావడే భైరవుండు
ప్రజల దండించుట పరమ సంతోషమా, ప్రాణులనెల్ల నేపడె జముండు
    గీ. దొరతనంబున కివిగావు వరుసలరయ, సాహసౌదార్య ఘన పౌరుషములుగాని,
భూతను విలాస! పీఠికాపుర నివాస! కుముత హితకోటి సంకాశ! కుక్కుటేశ!
18వ శతాబ్ది నాటి కూచిమంచి తిమ్మకవి బహుగ్రంథ కర్త. రసికజన మనోభిరామం, వేణుగోపాల సతకం, కుక్కుటేశ్వర శతకం లంటి గ్రథాలు వ్రాశాడు పిఠాపుఅరం దగ్గర కందరాడ గ్రామం ఈయన ఊరు. భక్తిఙ్ఞాన వైరాగ్యాలతో పాటు, సున్నితమైన నిందా హాశ్యాన్ని వ్రాసేవాడు. సాంఘిక దురాచారాల మీద విశేష రచనలు చేశాడు.
          రాజకీయ నాయకుల మీద సూటిగా తగిలే వ్యంగ్యబాణాలెన్నో ఈయన తన రచనలలో ప్రయోగించాడు. కొన్ని చదువు తుంటే ఇది ఈనాటి ఫలానా నాయకుడికి వర్తిస్తుందని పాఠకులకు తప్పక అనిపిస్తుంది. భూస్వామ్య యుగం నుండి కుహనా ప్రజాస్వామ్య యుగం దాకా రాజకీయ నాయకుల్లో ఎంచి చూడగ మంచి కొంచెమే కావటం అందుకు కారణం. మేం ఫలానా రూలింగు పార్టీ వాళ్ళం అనే రుబాబు బాబులు తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. అందుకే తిమ్మకవి గారు ఈ పద్యం చెప్పాడు.
          అందలంబెక్కుట నవని బ్రశస్తమా, మ్రానెక్కి నిక్కదే మర్కటంబు: అందలం ఎక్కటంలో గొప్పతనం ఏముందీ...అంతకన్నా పెద్ద చెట్టెక్కి ఫోజులివ్వగలదు కోతి.
తొడవులు దొడుగుట దొడ్డ సౌభాగ్యమా, కడుసొమ్ము లూనదే గంగిరెద్దు: తొడవులు అంటే భుజకీర్తులు, భూషణాలు వీటిని తొడగటంలో గొప్ప సౌభాగ్యం ఏవుందీ...గంగిరెద్దు కూడా అలంకరించుకుని తిరుగుతుంది.
          విత్తంబు గూర్చుట విమల ప్రచారమా, బహు నిధుల్ గావడే భైరవుండు: ప్రచారం అంటే వ్యవహారం. డబ్బు దాచి పెట్టటమే గొప్ప వ్యవహారమా? కుక్కకూడా ఇంతకంటే ఎక్కువ డబ్బుకి కాపలా కాస్తుంది.
ప్రజల దండించుట పరమ సంతోషమా, ప్రాణులనెల్ల నేపడె జముండు: ప్రజల్ని హింసపెట్టమే పరమ సంతోషం అనుకోవద్దు. అన్ని ప్రాణుల్నీ హింసపెట్టే యముడు నీకన్న గొప్పవాడు.
దొరతనంబున కివిగావు వరుసలరయ సాహసౌదార్య ఘన పౌరుషములుగాని: నిజమైన దొరతనం చెలాయించటం అంటే ఇది కాదు, పాలించటానికి సాహసం కావాలి, ఔదార్యం కావాలి,  ఘన పౌరుషం ఉండాలి. దమ్ములుండాలి అంటామే అది కావాలంటాడు తిమ్మకవి గారు.
దమ్మున్నవాడు జనం నాలుకలమీద నిలుస్తాడు. తక్కినవాళ్ళంతా కాళనాళికల్లో కలిసి పోతారు. కబళించిన ఆస్తులు, కబ్జా చేసిన భూములు దొరతనానికి చేదుగుర్తులు ఒక పద్యంలో తిమ్మకవి నిక్కి మిక్కుటమైన యాదొక్కి బొక్కి, టక్కరి నృపాలకుల కీర్తి దక్కునొక్కొ అని అడుగుతాడు. నిక్కులూ టెక్కులూ బొక్కులే పరమావధిగా ఉండే టక్కరి నాయకులకు కీర్తి దక్కుతుందా...అని!
కుక్కుటేశ్వర శతకాన్ని నూనూగు మీసాల నవయవ్వన కాలంలోనే వ్రాశాడు తిమ్మకవి. ఇతని తమ్ముడు కూచిమంచి జగ్గకవి (1700-65) కూడా తిట్టుకవిత్వంలో ప్రసిద్ధుడే! ఇప్పటి వాళ్ళకు రుచించేలా తన రచనను సవరించి ప్రకటించ వలసిందిగా కాళ్ళకూరి గోపాలరావు గారికి కలలో కన్పించి చెప్పాడని రావుగారు తన పీఠికలో చెప్పుకున్నాడు. ఇప్పటి కాలంలో ఇప్పటి ఇతివృత్తాలను ఇప్పటి వాళ్ళకోసం వ్రాయాలను కోవటం సాహిత్యం అసలు ప్రయోజనం.
తిమ్మకవి, జగ్గకవి ఇద్దరూ గ్రామ్యభాషని తిట్టుకవిత్వానికే ఎక్కువ ఉపయోగించుకున్నారు. వెనకటికి ఒక్ సినిమాలో చెప్పినట్టు ఒరే అడ్డగాడిదా అంటే జనానికి అర్థం అయినట్టు ఓరీ గార్థభా అని తిడితే తిట్లు తిన్నవాడిక్కూడా అర్థం కాదు అందుకని పగలబడి తిట్టటానికి గ్రామ్యభాష అనువుగా ఉంటుంది. ఎవణ్ణి తిడుతున్నామో వాడికి అర్థం అయినప్పుడు సాహిత్య ప్రయోజనం నెరవేర్తుంది.
తిడితేనే కొన్ని చర్మాల వాళ్ళకి బుర్రకెక్కుతుందని చౌడప్ప సహా చాలా మంది తిట్టు కవులు తిట్టుదారుల్ని ఎంచుకున్నారు. ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు అని రామదాసుగారు కూడా బాగానే తిట్టాడు. తిట్టుకవులు తిట్టిన తిట్లన్నింటినీ ఒక చోట చేరిస్తే చక్కని తెలుగు తిట్టు పదబంధ కోశం తయారౌతుంది.

No comments:

Post a Comment